సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మణిపురి చిత్రం ఆండ్రో డ్రీమ్స్ ప్రదర్శనతో 54వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రారంభమైన నాన్-ఫీచర్ ఫిల్మ్ ఇండియన్ పనోరమా
చిత్రంలో నటించడం సంతోషంగా, గౌరవంగా ఉంది: నటుడు లైబీ ఫంజౌబమ్
ఇతర ప్రసార మాధ్యమాల్లో గుర్తింపు,ప్రాతినిధ్యం లభించని మణిపూర్ ప్రజల జీవితాలు చూపించే విధంగా ఆండ్రో డ్రీమ్స్ నిర్మాణం... చిత్ర దర్శకురాలు మీనా లాంగ్‌జామ్
60 ఏళ్ల శ్రీమతి లైబీ ఫంజౌబం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్న ఆండ్రో అనే మారుమూల గ్రామంలో చేనేత ,హస్తకళల దుకాణాన్ని నడుపుతున్నారు. చూస్తుంటే ఇది మామూలు కథలా అన్పిస్తుంది. అయితే శ్రీమతి లైబీ ఫంజౌబమ్ సాధారణ మహిళ కాదు. పురాతన గ్రామంలో పాతుకుపోయిన పితృస్వామ్యానికి, ఆర్థిక కష్టాలు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఒక వైపు పోరాడుతూనే మరోవైపు శ్రీమతి లైబీ ఫంజౌబంపూర్తి మహిళా ఫుట్‌బాల్ క్లబ్‌ను నడుపుతోంది.
ఒక చిన్న వార్తాపత్రికలో శ్రీమతి లైబీ ఫంజౌబం కి సంబంధించి ప్రచురితం అయిన వార్త జాతీయ అవార్డు గ్రహీత దర్శకురాలు శ్రీమతి మీనా లాంగ్‌జామ్ దృష్టిని ఆకర్షించింది, ఈ రోజు అదే వార్త ఆండ్రో డ్రీమ్స్‌గా వెండితెరపైకి ఎక్కింది. పోరాట పటిమ కలిగిన లైబీ అనే వృద్ధురాలు,బాలికలు మాత్రమే సభ్యులుగా ఉంటూ మూడు దశాబ్దాల చరిత్ర గల ఫుట్‌బాల్ క్లబ్ ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ (AMMA-FC) చుట్టూ చిత్ర కథ నడుస్తోంది. యువ ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిర్మల ఎదుర్కొన్న సవాళ్లు, సవాళ్లు ఎదుర్కోవడానికి ఆమె చేసిన కృషిని చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా నిర్మించారు.
63 నిమిషాల నిడివితో ఆండ్రో డ్రీమ్స్ని మణిపురి భాషలో నిర్మించారు.ఆండ్రో డ్రీమ్స్ ప్రదర్శనతో 54వ ఐఎఫ్ఎఫ్ఐలోనాన్-ఫీచర్ ఫిల్మ్ ఇండియన్ పనోరమా ప్రారంభమయింది. ఒక మహిళ కథ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీకి ఒక మహిళ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా మరో మహిళా నిర్మాత గా వ్యవహరించారు.
స్ఫూర్తిదాయకమైన లైబీ ఫంజౌబాన్ కథ వివరించిన దర్శకురాలు లాంగ్‌జామ్ తన కుటుంబంలో తానూ నాల్గవ ఆడపిల్ల అని తెలిపారు.తన కుటుంబం తనను తరచూ విస్మరించిందని అన్నారు. అసమానతలు ఉన్నప్పటికీ ఆమె తన గ్రామంలో మెట్రిక్యులేట్ డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరి తన గ్రామంలో చేనేత, చేతి వృత్తుల దుకాణం నెలకొల్పుతుంది. .
డాక్యుమెంటరీ నిర్మాణం పట్ల చిత్ర కథానాయిక లైబీ ఫంజౌబమ్ సంతోషం వ్యక్తం చేశారు. నిజ జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు ఈ చిత్రంద్వారా బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. .
గోవాలో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పిఐబి ఆధ్వర్యంలో మీడియాతో జరిగిన చర్చాగోష్టిలో లాంగ్‌జామ్ పాల్గొన్నారు.
"ఇది మా ప్రజల కథ. ఇంతవరకు మీడియాలో కనిపించని, వినిపించని మా ప్రజల కథ." అని లాంగ్‌జామ్ అన్నారు. "ఊహించని విధంగా చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించే అవకాశం లభించింది. దీంతో ప్రధాన మీడియాలో అస్పష్టంగా ఉన్న మణిపూర్ ప్రజల జీవితాలను చూపించే ప్రయత్నం చేయడానికి అవకాశం లభించింది." అని ఆమె తెలిపారు. " ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో లైబీ, ఆమె ఫుట్‌బాల్ క్లబ్‌లోని అమ్మాయిలు నిజ జీవితంలో చేసిన కృషి ఆండ్రో డ్రీమ్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది"" అని చిత్ర దర్శకుడు పేర్కొన్నారు.
డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలను లాంగ్‌జామ్ వివరించారు. "డాక్యుమెంటరీ నిర్మించడానికి కధాంశంపై అవగాహన పొందడానికి ఎక్కువ కాలం వెచ్చించాల్సి ఉంటుంది. వెంటనే పని ప్రారంభించడానికి వీలుండదు " అని లాంగ్‌జామ్ వివరించాఋ. చిత్ర నిర్మాణ రంగంలో మీనా లాంగ్‌జామ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో లాంగ్‌జామ్ నిర్మించిన “ఆటో డ్రైవర్” చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి మణిపురి మహిళ మీనా లాంగ్‌జామ్.
“మహిళలు సమాజానికి “నిశ్శబ్ద స్థంభాలు” . వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకురావాలని నేను భావిస్తున్నాను.అవసరమైన అవకాశాలను అందించాలని నేను కోరుకుంటున్నాను. నైపుణ్యాలు ఉన్నప్పటికీ నిధుల కొరత తో నైపుణ్యాలు వెలుగు చూడటం లేదు. అద్భుతమైన ప్రతిభను ప్రోత్సహించాలని, సహకారం అందించాల్సిన అవసరం ఉంది." అని ఆండ్రో డ్రీమ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానీ విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. మహిళలకు అవకాశం కల్పించాలి అన్న స్పూర్తితో ఆండ్రో డ్రీమ్స్ వంటి చిత్రాలకు నిధులు అందించానని అన్నారు.
చలనచిత్ర-ప్రియులకు అద్భుతమైన అనుభూతి అందించడానికి ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ పనోరమా విభాగం నిన్న ప్రారంభమైంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మలయాళ చిత్రం ఆటమ్,నాన్-ఫీచర్ విభాగంలో మణిపురి చిత్రం ఆండ్రో డ్రీమ్స్‌తో నిన్న ఇండియన్ పనోరమా విభాగం ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2023 నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 54వ ఐఎఫ్ఎఫ్ఐ లో 25 ఫీచర్ చిత్రాలు , 20 నాన్-ఫీచర్ చిత్రాలను ప్రదర్శిస్తారు.
సినిమా రంగం సహకారంతో భారతదేశ సంస్కృతి,వారసత్వం తో పాటు భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి 1978లో ఐఎఫ్ఎఫ్ఐ లో ఇండియన్ పనోరమా ఏర్పాటు అయ్యింది. ప్రారంభమైనప్పటి నుంచి ఇండియన్ పనోరమాలో ఆ సంవత్సరపు అత్యుత్తమ భారతీయ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.
చర్చాగోష్టి కోసం : https://www.youtube.com/watch?v=l_l_hm3kQz0 చూడవచ్చు.
(Release ID: 1979373)
Visitor Counter : 108