మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యశాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 నవంబర్ 21, 22 తేదీల్లో అహ్మదాబాద్ లో గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా - 2023


కాన్ఫరెన్స్ పై ఈ రోజు న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా

Posted On: 16 NOV 2023 3:10PM by PIB Hyderabad

మత్స్యకారులు , చేపల పెంపకందారులు,  ఇతర భాగస్వాముల సహకారం,  విజయాలను వేడుకగా జరుపుకోవడానికి,  మత్స్య రంగ స్థిరమైన , సమానమైన అభివృద్ధికి నిబద్ధతను బలోపేతం చేయడానికి, భారత మత్స్య శాఖ  ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా - 2023 ను నిర్వహిస్తోంది. అహ్మదాబాద్ లోని గుజరాత్ సైన్స్ సిటీలో 2023 నవంబర్ 21, 22 తేదీల్లో 'చేపల పెంపకం, ఆక్వాకల్చర్ సంపదను సెలబ్రేట్ చేసుకోండి' అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ కూడా పాల్గొన్నారు.

ఈ సదస్సుకు విదేశీ మిషన్లు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు, మేధావులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఇతర ముఖ్య భాగస్వాములను మత్స్యశాఖఆహ్వానించిందని కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా తెలిపారు. ప్రపంచ బ్యాంకు, ఎఫ్ ఎ ఒ , దేశాలు వంటి కీలక సంస్థలు ఈ సదస్సు కు హాజరవుతున్నట్లు ధృవీకరించాయని, వాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని రూపాలా తెలిపారు.

రొయ్యల పెంపకం, మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సమ్మిళితం, దేశీయ చేపల వినియోగాన్ని ప్రోత్సహించడం, చేపల సుస్థిర అభివృద్ధికి మార్గం గురించి కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల విలేకరుల  ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శ్రీ పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ, ఇన్లాండ్ చేపల ఉత్పత్తి, ఎగుమతి, ఆక్వాకల్చర్ ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రంగాలలో లబ్ధిదారుల సమిష్టి కృషితో చేపల ఉత్పత్తిలో 70% పైగా ఉన్న ఇన్ లాండ్ ఫిషరీస్ లో భారత మత్స్య రంగం వృద్ధిని చూపించిందని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మత్స్య రంగానికి ప్రాముఖ్యత లభించిందని, చేపల ఉత్పత్తి, ఆక్వాకల్చర్ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర మంత్రి చెప్పారు.

సుస్థిర వృద్ధి, గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023పై మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని, ఇది మత్స్యకారులు, రైతులు, పరిశ్రమలు, తీరప్రాంత కమ్యూనిటీలు, ఎగుమతిదారులు, పరిశోధన సంస్థలు, పెట్టుబడిదారులు, ఎగ్జిబిటర్లు వంటి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి , ఆలోచనలను, సంబంధిత సాంకేతికతలపై సమాచారం,  మార్కెట్ లింకేజీ అవకాశాలపై అనుసంధానించడానికి ఒక వేదికను అందిస్తుందని డాక్టర్ ఎల్ మురుగన్ తెలియజేశారు. సాగర్ పరిక్రమ, పిఎంఎంఎస్ వై, ఫిషరీస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్యరంగంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు.

భారత మత్స్య రంగం ప్రపంచవ్యాప్తంగా కొత్త శిఖరాలను సాధిస్తోందని, దేశ నిర్మాణంలో మత్స్యకారులు, మత్స్యకార సంఘాలు చేస్తున్న గణనీయమైన కృషికి ప్రతీకగా నిలిచే ఈవెంట్ లోగోను కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఆవిష్కరించారు.

మత్స్య రంగాన్ని సూర్యోదయ  రంగంగా  పరిగణిస్తారు.  సమాజంలోని బలహీన వర్గాల ఆర్థిక సాధికారత ద్వారా సమానమైన, సమ్మిళిత వృద్ధిని తీసుకురావడానికి ఈ రంగం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో, భారతదేశం 3 వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు, 2 వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు, అతిపెద్ద రొయ్యల ఉత్పత్తిదారు మరియు 4 వ అతిపెద్ద సీఫుడ్ ఎగుమతిదారుగా ఉంది.

భారతీయ మత్స్య రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతోంది.  పిఎంఎంఎస్ వై నిర్దేశిత l22 ఎంఎంటి చేపల ఉత్పత్తి లక్ష్యాలను సాధించడమే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ లక్ష కోట్ల ఎగుమతులను సాధించడానికి మత్స్య శాఖ , కేంద్ర మత్స్య , పశుసంవర్ధక,  పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. దేశంలోని మూడు  కోట్ల మంది మత్స్యకారులు, చేపల రైతులకు స్థిరమైన ఆదాయాలు, జీవనోపాధి కల్పించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషించింది.

***



(Release ID: 1977549) Visitor Counter : 56