ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవ సభలో ప్రధాని ప్రసంగం


దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ స్మారక తపాలా బిళ్ల ఆవిష్కరణ;

“చిత్రకూట్‌కి రావడం నాకెంతో సంతోషం కలిగించింది”;

“చిత్రకూట్ వైభవం.. ప్రాముఖ్యం సాధువుల కృషితో సదా నిలిచి ఉంటాయి”;

“మన దేశం ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు.. వారు తమ
ఉన్నత వ్యక్తిత్వంతో సమాజ శ్రేయస్సుకు సదా పాటుపడతారు”;

“మన విజయం లేదా సంపద పరిరక్షణకు త్యాగమే అత్యంత ప్రభావశీల మార్గం”;

“అరవింద్ భాయ్ కృషి.. వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాక
ఆయన ఆశయాలతో భావోద్వేగ సంబంధం పెంచుకున్నాను”;

“నేడు దేశం గిరిజన వర్గాల అభ్యున్నతికి సమగ్ర కార్యక్రమాలు చేపడుతోంది”

Posted On: 27 OCT 2023 4:10PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవ సభలో ప్రసంగించారు. ఇక్కడ శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్టును 1968లో పరమ పూజనీయ రణ్‌ఛోడ్‌ దాస్‌ మహరాజ్ స్థాపించారు. ఆయన స్ఫూర్తితో శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ ఈ ట్రస్టు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతర భారతంలోని  ప్రముఖ పారిశ్రామికవేత్తలలో శ్రీ అరవింద్ భాయ్ కూడా ఒకరు. దేశం ప్రగతి స్వప్నాల సాకారంలో ఒక భాగస్వామిగా ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

   అంతటి ఔన్నత్యంగల ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- చిత్ర‌కూట్ అనే ఈ పవిత్ర భూమిని సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఆవాసంగా సాధువులు పరిగణించేవారని పేర్కొన్నారు. రఘువీర్‌ ఆలయంతోపాటు శ్రీరామజానకీ ఆలయంలోనూ తాను దైవదర్శనం, పూజలు చేయడం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. అలాగే హెలికాప్టర్‌లో చిత్రకూట్‌ వెళ్తూ కామత్‌గిరి పర్వతానికి పూజలు చేయడం గురించి కూడా మాట్లాడారు. పరమ పూజనీయ రణ్‌ఛోడ్‌ దాస్‌ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించానని గుర్తుచేశారు. శ్రీరాముడు, జానకీదేవి దర్శనంతోపాటు సాధువుల మార్గదర్శకత్వం, శ్రీరామ సంస్కృత మహా విద్యాలయ విద్యార్థుల అద్భుత ప్రదర్శన తనకు ఎనలేని సంతోషం కలిగించాయని, దాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణగారిన, వెనుకబడిన, ఆదివాసీ, పేద వర్గాలన్నిటి తరఫునా స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జానకీ కుండ్‌ చికిత్సాలయంలో కొత్తగా ప్రారంభించిన విభాగం లక్షలాది పేదలకు కొత్త జీవితాన్ని ఇవ్వగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేసే సంప్రదాయం భవిష్యత్తులో మరింత విస్తృతం కాగలదన్న విశ్వాసం వెలిబుచ్చారు. దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించే గర్వించదగిన అవకాశం లభించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.

   ఈ ట్రస్టు పరిధిలో శ్రీ అర‌వింద్ మ‌ఫ‌త్‌లాల్ కృషిని ఆయన కుటుంబం ముందుకు తీసుకెళ్లడంపై ప్ర‌ధానమంత్రి హర్షం వ్య‌క్తం చేశారు. శతజయంతి ఉత్సవాల నిర్వహణకు ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నా చిత్రకూట్‌ను ప్రత్యేకంగా ఎంచుకోవడంపై ప్రధాని అభినందనలు తెలిపారు. చిత్రకూట్ వైభవం, ప్రాముఖ్యాలకు సాధువుల కృషితో శాశ్వతత్వం సిద్ధించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పరమ పూజనీయ రణ్‌ఛోడ్‌ దాస్‌ మహారాజ్‌కు ఆయన నివాళి అర్పించారు. ఆయన వ్యక్తిగత జీవితం తనలో ఎంతో స్ఫూర్తి రగిలించిందని తెలిపారు. పరమ పూజనీయ రణ్‌ఛోడ్‌ దాస్‌ మహారాజ్ ఆదర్శప్రాయ జీవన గమనాన్ని కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఏడు దశాబ్దాల కిందట ఈ ప్రాంతం కీకారణ్యానికి నెలవుగా ఉండేదని, అలాంటి సమయంలోనూ ఆయన సామాజిక సేవ చేయడంలోని ఔన్నత్యాన్ని ప్రస్తావించి ప్రశంసించారు. ఆ మహనీయుడి చేతులమీదుగా ప్రారంభమైన ఎన్నో సంస్థలు నేటికీ మానవాళికి సేవలందిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆపన్నులను ఆయన ఆదుకున్న తీరు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు “మన దేశానికిగల విశిష్ట లక్షణం ఇదే! ఇక్కడ జన్మించిన మహానుభావులు తమ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రపంచ శ్రేయస్సుకు సదా పాటుపడతారు” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

   పరమ పూజనీయ రణ్‌ఛోడ్‌ దాస్‌ మహారాజ్ మార్గదర్శకత్వంలో సమాజ సేవకు అంకితమై, సేవా సంకల్పంతో తన జీవితాన్ని పునీతం చేసుకున్న మఫత్‌లాల్‌ ఉదంతమే సాధు సాంగత్యానికి గల మహిమకు నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అర‌వింద్ భాయ్ స్ఫూర్తిని మ‌నం కూడా  అల‌వరచుకోవాల‌ని ప్ర‌ధానమంత్రి పిలుపునిచ్చారు. అరవింద్ భాయ్ అంకితభావం, ప్రతిభను గుర్తుచేస్తూ- దేశంలో తొలి పెట్రో-రసాయనాల ప్రాజెక్టు వ్యవస్థాపకుడు ఆయనేనని పేర్కొన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ప్రగతి కోసం ఆయన చేసిన కృషిని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. సంప్రదాయ వస్త్ర పరిశ్రమ వైభవ పునరుద్ధరణలో దివంగత శ్రీ మఫత్‌లాల్ కీలక పాత్ర పోషించారని, ఆయన కృషికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా లభించిందని పేర్కొన్నారు.

   ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ- “మన విజయం లేదా సంపద పరిరక్షణకు త్యాగమే అత్యంత ప్రభావశీల మార్గం” అని ఉద్ఘాటించారు. ఆ మేరకు అరవింద్ భాయ్ మఫత్‌లాల్ దీన్నొక ఉద్యమంగా మార్చుకుని, జీవితాంతం దానికి కట్టుబడి ఉన్నారని ప్రధాని నొక్కిచెప్పారు. ఇదే బాటలో “శ్రీ సద్గురు సేవా ట్రస్ట్, మఫత్‌లాల్ ఫౌండేషన్, రఘువీర్ మందిర్ ట్రస్ట్, శ్రీ రామదాస్ హనుమాన్ జీ ట్రస్ట్, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, బ్లైండ్ పీపుల్ అసోసియేషన్, చారు తారా ఆరోగ్య మండల్” వగైరా అనేకానేక సంస్థలు ఇదే స్ఫూర్తితో సేవ, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీ రఘువీర్‌ మందిర్‌ లక్షలాది ప్రజలు, సాధువులకు ప్రతినెలా ఆహార ధాన్యాలు అందిస్తున్నదని తెలిపారు. జానకీ చికిత్సాలయలో లక్షలాది పౌరులకు వైద్యం, వేలాది చిన్నారులకు విద్యనందించే దిశగా చేస్తున్న కృషిని ఆయన వివరించారు. “అలుపుసొలుపు లేకుండా నిరంతర పనిచేయగల శక్తినిచ్చే భారత సామర్థ్యానికి ఇది నిదర్శనం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గ్రామీణ పరిశ్రమల రంగంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం గురించి కూడా సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

   దేశదేశాల్లోని అగ్రశ్రేణి కంటి ఆసుపత్రులలో సద్గురు నేత్ర చికిత్సలను చేర్చడంపట్ల ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 12 పడకల స్థాయి నుంచి నేడు ఏటా 15 లక్షల మందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి పురోగమనాన్ని ప్రధాని ప్రముఖంగా వివరించారు. కాశీలో సంస్థ నిర్వహిస్తున్న ‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’ కార్యక్రమం గురించి ప్రధాని మాట్లాడుతూ- వారణాసి సహా ఆ పరిసరాల్లోని 6 లక్షల మందికిపైగా ప్రజలకు శస్త్రచికిత్సలు చేయడంతోపాటు నేత్రపరీక్ష శిబిరాల ద్వారా ఇంటింటికీ వెళ్లి, 6 లక్షల మందికిపైగా ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. చికిత్స పొందిన వారందరి తరపున సద్గురు నేత్ర చికిత్సాలయకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

   సేవ చేయాలంటే వనరులు ముఖ్యమే అయినా, అంకితభావం అంతకన్నా ప్రధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం కృషిచేసే శ్రీ అరవింద్ స్వభావాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భిలోడా-దహోద్ గిరిజన వలయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మానవాళికి సేవ చేయడంలో వినయంతో కూడిన ఆయన ఉత్సాహం గురించి కూడా శ్రీ మోదీ వివరించారు. ఈ మేరకు “అరవింద్ భాయ్ కృషి, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఆశయాలతో భావోద్వేగ సంబంధం పెనవేసుకుంది” అని శ్రీ మోదీ అన్నారు.

   ప్రముఖ సమాజ సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్‌ చిత్రకూట్‌ను తన కార్యస్థానం చేసుకున్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. గిరిజన సమాజానికి సేవలందించడంలో ఆయన కృషి అందరికీ ఆదర్శప్రాయమని నొక్కిచెప్పారు. ఆయన బాటలో నడుస్తూ గిరిజన సమాజ సంక్షేమం కోసం దేశం సమగ్ర కృషిని కొనసాగిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా భగవాన్‌ బిర్సా ముండా జయంతిని ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రగతిలో గిరిజన సమాజ సహకారం-వారసత్వాలను చాటేలా గిరిజన ప్రదర్శనశాలల నిర్మాణం, గిరిజన బాలల విద్య కోసం ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, వన సంపద చట్టం వగైరా విధాన నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా ప్రధాని వివరించారు. “గిరిజన సమాజాన్ని ఆదరించిన శ్రీరాముని ఆశీస్సులు కూడా మా కృషితో ముడిపడి ఉన్నాయి. సామరస్యపూర్వక, వికసిత భారతం లక్ష్యం వైపు మనల్ని నడిపించేది ఇదే”నంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విషాద్ పి.మఫత్‌లాల్, శ్రీ రఘువీర్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్త శ్రీ రూపల్ మఫత్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.



(Release ID: 1972445) Visitor Counter : 84