ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ మిస్టర్‌ రఫేల్‌ మారియానో గ్రాసీ సమావేశం


శాంతి-ప్రగతి కోసం నిరపాయ.. సురక్షిత రీతిలో అణుశక్తి
వినియోగంపై భారత నిబద్ధతను నొక్కిచెప్పిన ప్రధాని;

బాధ్యతాయుత అణుశక్తిగా భారత నిష్కళంక చరిత్రను.. సమాజ హితం దిశగా
పౌర అణు అనువర్తనంలో ప్రపంచ నేతృత్వ పాత్రను ప్రశంసించిన మిస్టర్‌ గ్రాసీ;

దక్షిణార్థ గోళంలో అణు సాంకేతికత అనువర్తన
విస్తరణలో సహకారంపై భారత్‌-ఐఎఇఎ అంగీకారం

Posted On: 23 OCT 2023 4:30PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్ జనరల్ మిస్టర్‌ రఫేల్‌ మారియానో గ్రాసీ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- శాంతి-ప్రగతి కోసం నిరపాయ, సురక్షిత రీతిలో అణుశక్తి వినియోగంపై భారత్‌ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే దేశ విద్యుదుత్పాదన సమ్మేళనంలో పర్యావరణ హిత అణు విద్యుత్తు వాటా పెంపుపై భారత్‌ నిర్దేశించుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాల గురించి ప్రధానమంత్రి ఆయనకు వివరించారు.

   డైరెక్టర్‌ జనరల్‌ గ్రాసీ మాట్లాడుతూ- బాధ్యతాయుత అణుశక్తిగా భారత నిష్కళంక చరిత్రను ప్రశంసించారు. అణు విజ్ఞానం, సాంకేతికతపరంగా భారత్‌ పురోగతిని ఆయన కొనియాడారు. ప్రత్యేకించి స్వదేశీ అణు విద్యుత్తు కేంద్రాల రూపకల్పన-విస్తరణను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే సమాజ హితం లక్ష్యంగా పౌర అణు అనువర్తనంలో భారత్‌ పోషిస్తున్న ప్రపంచ నేతృత్వ పాత్రను కూడా గ్రాసీ ప్రశంసించారు. అంతేకాకుండా ఆరోగ్యం, ఆహారం, జలశుద్ధి, ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణ మార్పుసహా వివిధ రంగాల్లో మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ల  పరిష్కారంలో అణు సాంకేతికత వినియోగంపై భారత్‌ అద్భుత ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు.

   చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, సూక్ష్మ రియాక్టర్లు సహా నికర శూన్య ఉద్గార హామీలను నెరవెర్చే దిశగా అణుశక్తి పాత్ర విస్తరణపై వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

   భారత్‌-‘ఐఎఇఎ’ల మధ్యగల అత్యుత్తమ భాగస్వామ్యాన్ని డైరెక్టర్‌ జనరల్‌ గ్రాసీ ప్రశంసించారు. శిక్షణ, సామర్థ్య వికాసం విషయంలో ప్రపంచంలోని పలు దేశాలకు భారత్‌ తోడ్పాటును ఆయన కొనియాడారు. దక్షిణార్థ గోళంలో పౌర అణు సాంకేతికత అనువర్తన విస్తరణకుగల మార్గాల అన్వేషణలో సహకారంపై భారత్‌-ఐఎఇఎ పక్షాలు రెండూ ఒక  అంగీకారానికి వచ్చాయి.

***



(Release ID: 1970862) Visitor Counter : 60