ప్రధాన మంత్రి కార్యాలయం

యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 17 SEP 2023 5:34PM by PIB Hyderabad

భారత్ మాతాకీ – జై

భారత్ మాతాకీ - జై

భారత్ మాతాకీ – జై

నా కేబినెట్  సహచరులు, ఈ సుందర భవనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోదర సోదరీమణులు, 70 పైగా నగరాల నుంచి  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తోటి పౌరులు, సుప్రతిష్ఠులైన అతిథులు, నా కుటుంబ సభ్యులారా!

నేడు భగవాన్  విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను.  దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.

మిత్రులారా,

భగవాన్ విశ్వకర్మ ఆశీస్సులతో నేడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించుకుంటున్న శుభతరుణం ఇది. హస్తకళలు, పనిముట్లు, సాంప్రదాయపూర్వకమైన నైపుణ్యాలతో పని చేసే కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా పిఎం విశ్వకర్మ యోజన మన ముందుకు వస్తోంది.

నా కుటుంబ సభ్యులారా,

ఈ స్కీమ్  ప్రారంభించుకోవడంతో పాటు నేడు యశోభూమి పేరుతో అంతర్జాతీయ ఎగ్జిబిషన్  సెంటర్  కూడా ప్రారంభమవుతోంది. ఇక్కడ జరిగిన పని నా కార్మిక సోదర సోదరీమణులు, విశ్వకర్మ  సహచరుల కఠిన శ్రమ, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తోంది. నేడు ఈ యశోభూమిని దేశ కార్మిక సోదరుల్లో ప్రతీ ఒక్కరికీ, విశ్వకర్మ సహచరులందరికీ అంకితం చేస్తున్నాను. వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేలాది మంది విశ్వకర్మ సహచరులకు కూడా  ఈ సందేశం ప్రత్యేకంగా తెలియచేయాలనుకుంటున్నాను.  గ్రామాల్లో మీరు తయారుచేసే వస్తువులు, మీరు సృష్టించే చిత్రాలు, కళాఖండాలు ప్రపంచం అంతటికీ ప్రదర్శించుకునేందుకు ఈ కేంద్రం ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉంటుందని భావిస్తున్నాను. అది మీ కళలను, మీ నైపుణ్యాన్ని, మీలోని కళా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెబుతుంది. భారతదేశంలో తయారయ్యే  స్థానిక వస్తువులు ప్రపంచానికి చేర్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

నా కుటుంబ సభ్యులారా,

ఏ వ్యక్తి అయితే ప్రపంచం అంతటినీ సృష్టిస్తాడో, నిర్మాణ పనిలో ఉన్నాడో అతన్ని ‘‘విశ్మకర్మ’’ అని పిలుస్తారు అని   మన ప్రాచీన ప్రతులు ఇలా  చెబుతున్నాయి. వేలాది సంవత్సరాలుగా ఏ సహచరులు భారతదేశ సుసంపన్నతకు పునాదిగా ఉన్నారో వారే విశ్వకర్మలు. మన శరీరం అంతటికీ వెన్నెముక ఎంత కీలకంగా నిలుస్తుందో విశ్వకర్మ  సహచరులు కూడా మన సామాజిక జీవనంలో అంతే కీలక పాత్ర పోషిస్తారు. మన విశ్మకర్మ సహచరులు అలాంటి పని, నైపుణ్యాలతో అనుసంధానమై ఉన్నారు. వారి పాత్ర లేకపోతే రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఊహించలేం. మన వ్యవసాయ వ్యవస్థనే తీసుకుంటే కమ్మరులు లేకుండా వ్యవసాయం సాధ్యమయ్యేదా; కాదు. గ్రామాల్లో పాదరక్షలు తయారుచేసే వారు, శిరోజాలు కత్తిరించే వారు, దుస్తులు కుట్టే వారు...ఇలా ఎవరి పాత్ర తగ్గదు. రిఫ్రిజిరేటర్ల శకంలో కూడా ప్రజలు మట్టికుండల్లో నీరు తాగడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచం ఎంతగా పురోగమించింది, టెక్నాలజీ ఎంతగా ప్రతీ ఒక్క ప్రాంతానికి చేరింది అనే అంశంతో సంబంధం లేకుండా  వారి ప్రాధాన్యం, పాత్ర ఎప్పటికీ నిలిచి ఉంటాయి.  అందుకే మన విశ్వకర్మ సహచరుల పాత్రను గుర్తించి వారికి అన్ని విధాలా మద్దతు ఇవ్వడం నేటి అవసరం.

మిత్రులారా,

మన విశ్వకర్మ సోదర సోదరీమణుల ఆత్మగౌరవం, సామర్థ్యం,  సుసంపన్నతను పెంచడంలో భాగస్వామి అయ్యేందుకు మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకం మన విశ్వకర్మ సహచరులు చేపట్టే 18 రకాల పనులపై దృష్టి సారిస్తుంది. వారు నివశించేది గ్రామాల్లోనే అయినా ఈ 18 కార్యకలాపాల్లో పాల్గొనని వారు వారిలో ఏ ఒక్కరూ ఉండరు. కలపతో పని చేసే వడ్రంగులు, ఇనప పని చేసే కమ్మరులు, ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారులు, మట్టి కుండలు తయారుచేసే వారు, శిల్పకారులు, పాదరక్షలు తయారుచేసే వారు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ పని వారు, చేనేతకారులు; పూలదండలు, చేపల వలలు తయారుచేసే వారు, పడవలు నిర్మించే వారు, ఇంకా ఎన్నో పనులు చేపట్టేవారందరూ ఈ కోవలోకే వస్తారు. పిఎం విశ్వకర్మ యోజన కింద ప్రభుత్వం రూ.13,000 కోట్లు ఖర్చు పెడుతుంది.

నా కుటుంబ  సభ్యులారా,

30-35 సంవత్సరాల క్రితం నేను ఒక సారి యూరప్  లోని బ్రసెల్స్  సందర్శించాను. ఆ సమయంలో నాకు ఆతిథ్యం ఇచ్చిన వారు ఒక ఆభరణాల ప్రదర్శనకు తీసుకువెళ్లారు. అలాంటి వస్తువులకు అక్కడ గల మార్కెట్ గురించి, అక్కడ పరిస్థితి గురించి వారిని అడిగాను. యంత్రాలతో తయారుచేసే ఆభరణాలకు డిమాండు తక్కువ అని, ధర ఎక్కువ అయినా చేతితో తయారుచేసే ఆభరణాలే ప్రజలు కొంటారని వారు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మీరు అద్భుత నైపుణ్యంతో తయారుచేసే వస్తువులకు ప్రపంచంలో డిమాండు పెరుగుతోంది. పెద్ద కంపెనీలు కూడా చిన్న కంపెనీల నుంచి ఉత్పత్తులను ఔట్  సోర్సింగ్  చేసుకుంటున్న వాస్తవం మనం నేడు చూస్తున్నాం. ఇదే నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పరిశ్రమ. ఔట్ సోర్సింగ్  పని అధికంగా మన విశ్వకర్మ సహచరులకే వచ్చే దిశగా వారు సరఫరా వ్యవస్థలో భాగస్వాములయ్యే దిశగా మనం సాగుతున్నాం. ప్రధాన అంతర్జాతీయ కంపెనీలు నైపుణ్యాల కోసం మీ తలుపులు తట్టే స్థితి రావాలని మేం కోరుతున్నాం. అందుకే మన విశ్వకర్మ సహచరులను ఆధునిక తరంలోకి నడిపించే, వారి సామర్థ్యాలను పెంచేదే ఈ పథకం.

మిత్రులారా,

మారుతున్న నేటి కాలానికి అనుగుణమైన శిక్షణ, టెక్నాలజీ, పనిముట్లు మన విశ్మకర్మ సోదర సోదరీమణులకు అవసరం. విశ్మకర్మ యోజన ద్వారా మీ అందరికీ అవసరమైన శిక్షణ ఇవ్వడంపై దేశం దృష్టి సారిస్తోంది. మీరంతా కష్టపడి పని చేస్తూ జీవనం సాగించే వారు కావడం వల్ల శిక్షణ సమయంలో కూడా మీకు రూ.500 రోజువారీ అలవెన్స్ లభిస్తుంది. ఆధునిక పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి మీకు రూ.15,000 టూల్  కిట్ వోచర్ లభిస్తుంది. మీరు తయారుచేసే వస్తువులన్నింటికీ బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల మద్దతు ఈ పథకం ద్వారా లభిస్తుంది. అందుకు బదులుగా జిఎస్  టి రిజిస్టర్డ్  స్టోర్  నుంచి మాత్రమే మీరు టూల్ కిట్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. అక్రమ వ్యాపారాలను మనం సహించకూడదు. అంతే కాదు, మీరు కొనే పరికరాలన్నీ ‘‘మేక్ ఇన్ ఇండియా’’వే అయి ఉండాలని నేను గట్టిగా కోరుతున్నాను.

నా కుటుంబ  సభ్యులారా,

మీరు వ్యాపారాలు విస్తరించుకోవాలనుకుంటే ఆర్థికంగా ఎలాంటి సమస్య ఎదుర్కొనకుండా  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. విశ్మకర్మ సహచరులందరూ దీని కింద రూ.3 లక్షల వరకు హామీ రహిత రుణాలు పొందవచ్చు. బ్యాంకులు మిమ్మల్ని హామీలు అడగకుండా ఉండేందుకు మీ రుణానికి మోదీయే గ్యారంటీ ఇస్తున్నాడు. ఆ రుణాలపై వడ్డీరేటు కూడా అతి తక్కువగా ఉండబోతోంది. మీరు శిక్షణ పూర్తి చేసుకుని తొలిసారిగా పరికరాలు కొనుగోలు చేసుకున్నప్పుడు మీకు తొలివిడతగా రూ.1 లక్ష రుణం అందుతుంది. మీరు ఆ రుణం చెల్లించి పని పురోగతిలో ఉందని నిరూపించుకోగలిగితే మరో రూ.2 లక్షలు రుణం పొందేందుకు మీరు అర్హులవుతారు.

నా కుటుంబ సభ్యులారా,

నిరాదరణకు గురవుతున్న వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం నేడు దేశంలో ఉంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపి) పథకం కింద ప్రతీ జిల్లాలోనూ ఒక ప్రత్యేక ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీధివ్యాపారులకు కూడా ప్రభుత్వం అండగా నిలిచి పిఎం స్వనిధి పథకం కింద బ్యాంకులను వారి ముంగిటికే తెచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం బంజారాలు, సంచార తెగల గురించి శ్రద్ధ తీసుకుంది.అలాగే దివ్యాంగ జనులకు ప్రతీ స్థాయిలోను, ప్రతీ ప్రాంతంలోను ప్రత్యేక సదుపాయాలను దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఏ ఒక్కరూ పట్టించుకోని వారి కోసం ఒక పేద కుటుంబంలోని కుమారుడు మోదీ ‘‘సేవకుడు’’గా ముందుకు వచ్చాడు. మోదీ గ్యారంటీయే ప్రతీ ఒక్కరికీ ఆత్మగౌరవం అందించాడు, అందరికీ సదుపాయాలు కల్పించాడు.

నా కుటుంబ సభ్యులారా,  

టెక్నాలజీ, సాంప్రదాయం కలిసికట్టుగా కదిలితే అద్భుతాలు సృష్టించగలుగుతాయి. జి-20 క్రాఫ్ట్  బజార్  లో ప్రపంచం యావత్తు దీన్ని వీక్షించింది. జి-20కి వచ్చిన విదేశీ అతిథులకు కూడా విశ్వకర్మ సహచరులు తయారుచేసిన వస్తువులనే బహుమతిగా అందచేశారు. ‘‘స్థానికం కోసం నినాదం’’ యావత్  దేశం కట్టుబాటు కావాలి. దాని గురించి నేను మాట్లాడితే మీరందరికీ అసౌకర్యంగా ఉంది? నేను ప్రశంసిస్తే మీరూ ప్రశంసిస్తారు,  మీరే చేయాల్సివస్తే మీరు వెనకాడతారు. మన కళాకారులు, మన ప్రజలు తయారుచేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్లకు చేరాలా, వద్దా మీరే చెప్పండి? ప్రపంచ మార్కెట్లలో వాటిని విక్రయించాలా, వద్దా? ఇది సాధించేందుకే తొలుత స్థానికం కోసం నినాదం చేయండి, ఆ తర్వాత స్థానికాన్ని అంతర్జాతీయం చేయండి.

మిత్రులారా,

నేడు గణేశ్  చతుర్థి, ధంతేరాస్, దీవాళి సహా ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఆ సమయంలో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయాలని నేను పౌరులందరినీ కోరుతున్నాను. నేను స్థానిక వస్తువలే కొనుగోలు చేయాలని పిలుపు ఇస్తే దీపావళి దీపాలే అని, ఇంకేవీ కావని కొందరనుకుంటున్నారు. నిపుణులైన మన పనివారు తయారుచేసిన వస్తువు చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ ఒక్కటీ భారత మట్టి వాసనను గుభాళింపచేస్తుంది. నిపుణులైన కళాకారుల స్వేద సారాన్ని తెలియచేస్తుంది.

నా కుటుంబ సభ్యులారా,

నేడు భారతదేశం అభివృద్ధి  చెందుతూనే ప్రతీ రంగంపై తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల భారత మండపంతో భారతదేశం యావత్  ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించిందో మనం చూశాం. నేడు ప్రారంభమవుతున్న అంతర్జాతీయ ఎగ్జిబిషన్  సెంటర్ - యశోభూమి - కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఈ భూమిపై నిర్వహించేది ఏదైనా అద్భుతంగా వెలుగులు విరజిమ్ముతుందన్నది యశోభూమి అందించే సందేశం.  భారతదేశం సముజ్వల భవిష్యత్తును అందరికీ ప్రదర్శించి చూపే అద్భుత కేంద్రంగా అది మారుతుంది.

మిత్రులారా,

భారతదేశం తన ఆర్థిక సామర్థ్యం పూర్తిగా ఉపయోగించుకుని ఒక ప్రధాన వాణిజ్య శక్తిగా మారాలంటే రాజధాని నగరంలో ఇలాంటి కేంద్రం ఎంతో అవసరం. అది బహుముఖీన అనుసంధానతను అందించడంతో పాటు పిఎం గతిశక్తి ప్రభావాన్ని చాటి చెబుతుంది. పైగా అది విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో పాటు నిరంతర మెట్రో అనుసంధానత కూడా కలిగి ఉంటుంది. నేడు ప్రారంభించిన మెట్రో స్టేషన్  నేరుగా ఈ కాంప్లెక్స్  తో అనుసంధానమై ఉంటుంది. ఈ మెట్రో సదుపాయం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉంటుంది. ఈ కాంప్లెక్స్  లో సందర్శకులకు నివాస వసతి, వినోదం, షాపింగ్, టూరిజం వసతులు కూడా లభిస్తాయి.

నా కుటుంబ సభ్యులారా,

మారుతున్న కాలానికి దీటుగా  అభివృద్ధి, ఉపాధికి అనువైన కొత్త రంగాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. 50-60 సంవత్సరాల క్రితం నేడు మనం వీక్షిస్తున్న భారీ స్థాయి ఐటి పరిశ్రమ కనీసం ఆలోచనల్లో అయినా వచ్చేది కాదు. అదే విధంగా 30-35 సంవత్సరాల క్రితం నేటి సోషల్  మీడియా కేవలం ఒక కాన్సెప్ట్  గానే ఉండేది. అపరిమిత సామర్థ్యంతో వర్థిల్లిన మరో కీలక రంగం కాన్ఫరెన్స్  టూరిజం. ప్రపంచ కాన్ఫరెన్స్  టూరిజం విలువ రూ.25 లక్షల కోట్ల పైమాటే. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 32,000 భారీ ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.  ఒక్క సారి ఆలోచించండి, కేవలం 25 కోట్ల జనాభా గల చిన్న దేశాలు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంటే 140 కోట్ల జనాభా గల సుసంపన్న భారతదేశం ఆ ప్రయోజనాన్ని తప్పనిసరిగా అందుకోగలుగుతుంది. ఇక్కడకు వచ్చే వారెవరైనా అద్భుతంగా ప్రయోజనం పొందుతారు. సాధారణ టూరిస్టులతో పోల్చితే కాన్ఫరెన్స్  టూరిస్టులు భారీగా ఖర్చు చేస్తారు. భారీ మార్కెట్  ఉండి కూడా భారతదేశం ఈ మార్కెట్లో కేవలం ఒక శాతం వాటా సాధించగలిగింది. అనేక పెద్ద కంపెనీలు ప్రతీ ఏడాది తమ కార్యక్రమాలను విదేశాల్లో నిర్వహించక తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. దేశీయంగాను, అంతర్జాతీయంగాను అంత భారీ మార్కెట్ మన ముందుందంటే మీరు నమ్మగలరా...? నవభారతం అలాంటి కాన్ఫరెన్స్  టూరిజంకు సంసిద్ధం అవుతోంది.

ఇంకా మిత్రులారా, సాహస కార్యకలాపాలకు అనువైన వనరులున్న ప్రాంతంలోనే అడ్వెంచర్  టూరిజం వర్థిల్లుతుందని మీ అందరికీ తెలుసు. అలాగే ఆధునిక వైద్య వసతులున్న ప్రాంతంలో మెడికల్  టూరిజం వేళ్లూనుకుంటుంది. మత, చారిత్రక, ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరిగే చోట ఆధ్యాత్మిక టూరిజం; చరిత్ర, ప్రాచీన వైభవ చిహ్నాలున్న ప్రాంతంలో హెరిటేజ్ టూరిజం వర్థిల్లుతాయి. అదే విధంగా సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు వనరులున్న ప్రాంతంలో కాన్ఫరెన్స్  టూరిజం విస్తరిస్తుంది. భారతమండపం, యశోభూమి ఢిల్లీని కాన్ఫరెన్స్  టూరిజంకు భారీ కేంద్రంగా నిలుపుతాయి. ఒక్క యశోభూమి కేంద్రంలోనే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కాన్ఫరెన్స్  లు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకునేందుకు భవిష్యత్తులో ప్రపంచ దేశాలు క్యూ కట్టే ప్రదేశంగా యశోభూమి నిలుస్తుంది.

నేడు ప్రపంచంలో ఎగ్జిబిషన్లు, ఈవెంట్  నిర్వహించే కంపెనీలను భారతదేశానికి, ఢిల్లీకి, ప్రత్యేకించి యశోభూమికి నేను ఆహ్వానిస్తున్నాను. తూర్పు-పశ్చిమ-ఉత్తర-దక్షిణ ప్రాంతాలకు చెందిన చలనచిత్ర, టివి పరిశ్రమను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీ అవార్డు కార్యక్రమాలు, ఫిలిం ఫెస్టివల్స్, మీ చిత్రాల తొలి ప్రదర్శనలు ఇక్కడ నిర్వహించుకోండి. అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే కంపెనీలు భారతదేశానికి వచ్చి భారతమండపం, యశోభూమిలో కలవాలని ఆహ్వానం పలుకుతున్నాను.

నా కుటుంబ సభ్యులారా,

భారత మండపం లేదా యశోభూమి ఏదైనా కావచ్చుభారత ఆతిథ్య రంగానికి, భారతదేశ వైభవానికి, భారీతనానికి  చిహ్నాలుగా నిలుస్తాయి. భారత సంస్కృతి, ఆధునిక సదుపాయాల మేలి కలయికగా నిలుస్తాయి. నేడు ఈ రెండు భారీ వ్యవస్థలు నవభారత ముఖచిత్రాన్ని ప్రపంచానికి చూపుతాయి. అత్యుత్తమ సదుపాయాలు సంతరించుకోవాలన్న నవభారతం ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి.

మిత్రులారా,

నా మాటలు రాసి పెట్టుకోండి. నేడు భారతదేశం విరామం తీసుకోకూడదు. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని మనం ముందుకు  సాగుతూనే ఉండాలి. ఈ లక్ష్యాలు సాధించిన తర్వాతే మరేదైనా కావాలి. మనందరి కఠోర శ్రమ, ప్రయత్నంతోనే ఇది సాధ్యం. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి  చెందిన దేశంగా ప్రపంచం ముందు నిలుపుతామనే సంకల్పంతో ముందడుగేయాలి. మనందరం ఐకమత్యంతో నిలవాల్సిన సమయం ఇది. మన విశ్వకర్మ సహోదరులు ‘‘మేక్ ఇన్ ఇండియా’’తో  పాటు భారతదేశ గర్వాన్ని ప్రపంచం ముందు నిలిపే మాధ్యమంగా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిలవడం పట్ల గర్వపడాలి. ముందు చూపుతో కూడిన ఈ చొరవ పట్ల విశ్వకర్మ సహచరులను నేను మరోసారి అభినందిస్తున్నాను. ఈ కొత్త కేంద్రం యశోభూమి భారతదేశ ప్రతిష్ఠకు, ఢిల్లీ ప్రతిష్ఠను మరింతగా పెంచేందుకు చిహ్నంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

నమస్కార్ !

గమనిక : ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే. 

***



(Release ID: 1958988) Visitor Counter : 91