ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
“దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం..
దీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం”;
“సంయుక్త సభా మందిరం కర్తవ్య నిర్వహణలో మనకు స్ఫూర్తినిస్తుంది”;
“భారతదేశం నవశక్తితో ఉప్పొంగుతోంది.. మనం శరవేగంగా పురోగమిస్తున్నాం”;
“కొత్త ఆకాంక్షల మధ్య కొత్త చట్టాల రూపకల్పన.. కాలంచెల్లిన
చట్టాల రద్దు పార్లమెంటు సభ్యుల అత్యున్నత బాధ్యతలు”;
“అమృత కాలంలో మనం స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించాలి”;
“ప్రతి పౌరుడి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మనం సంస్కరణలు చేపట్టాలి”;
“భారత కార్యక్షేత్రం సువిశాలం.. స్వల్ప చిక్కుల్లోపడే రోజులు గతించాయి”;
“జి-20 సమయంలో మనం దక్షిణార్థ గోళ గళంగా.. ‘విశ్వమిత్రుడు’గా మారాం”;
“స్వయం సమృద్ధ భారతం సంకల్పాన్ని మనం సాకారం చేయాలి”;
“రాజ్యాంగ పరిషత్‌లో భాగమైన మహనీయులను గుర్తుచేస్తూ
రాజ్యాంగ సభ మనకు సదా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది”;
Posted On:
19 SEP 2023 1:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ భవనం, సంయుక్త సభా మందిరం గురించి ప్రస్తావిస్తూ- దాని స్ఫూర్తిదాయక చరిత్రను గుర్తుచేశారు. పాత భవనంలోని ఈ భాగాన్ని తొలినాళ్లలో ఒకవిధమైన గ్రంథాలయంగా వినియోగించారని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించాక అధికార మార్పిడి, రాజ్యాంగం రూపుదిద్దుకున్న ప్రదేశం ఇదేనని వివరించారు. ఈ సంయుక్త సభా మందిరంలో భారత జాతీయ పతాకం, జాతీయ గీతం ఆమోదం పొందాయని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అటుపైన 1952 తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 41 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధిపతులు సంయుక్త సభా మందిరంలో భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారని ఆయన వెల్లడించారు. అలాగే దేశానికి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన పలువురు పెద్దలు ఇదే సెంట్రల్ హాల్‌లో 86 సార్లు ప్రసంగించారని చెప్పారు. గడచిన ఏడు దశాబ్దాల్లో లోక్‌సభ, రాజ్యసభ దాదాపు 4 వేల చట్టాలను ఆమోదించాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశాల ద్వారా ఆమోదముద్ర పడిన చట్టాలను కూడా ఆయన ప్రస్తావించారు. వరకట్న నిషేధ చట్టం, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, ఉగ్రవాదం నిర్మూలనకు ఉద్దేశించిన చట్టాలను ప్రస్తావించారు. అలాగే ముమ్మారు తలాఖ్ నిషేధ చట్టాన్ని, లింగమార్పిడి వ్యక్తులతోపాటు దివ్యాంగుల కోసం రూపొందించిన చట్టాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దులో ప్రజా ప్రతినిధుల కృషిని ఎత్తిచూపుతూ- మన పూర్వికులు ప్రసాదించిన మన రాజ్యాంగం నేడు జమ్ముకశ్మీర్‌లో అమలవుతోందని సగర్వంగా ప్రకటిస్తున్నానని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “జమ్ముకశ్మీర్‌లో నేడు శాంతి-ప్రగతి చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఇక అవకాశాలు తమ చేతినుంచి జారిపోవడాన్ని అక్కడి ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడరు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి తన ప్రసంగాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. మనకిప్పుడు సరైన సమయం వచ్చిందని, ఇక భారతదేశం నవ చైతన్యంతో, రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తుందని నొక్కిచెప్పారు. “భారతదేశం నేడు నవశక్తితో ఉప్పొంగుతోంది” అన్నారు. ఈ నవ్యోత్సాహంతో ప్రతి పౌరుడూ తమనుతాము అంకితం చేసుకుంటూ పట్టుదలతో తమ కలలను సాకారం చేసుకోగలదని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భారతదేశం తానెంచుకున్న మార్గంలో ప్రతిఫలం పొందడం తథ్యమని ప్రధాని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆ మేరకు వేగవంతమైన పురోగమనంతో సత్వర ఫలితాలు సిద్ధిస్తాయి” అని స్పష్టం చేశారు. ప్రపంచంలో అగ్రస్థానంలోని ఐదు ఆర్థిక వ్యవస్థలలో భారత్ స్థానం సంపాదించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ఇక త్వరలోనే మూడు స్థానానికి చేరడం ఖాయమన్నారు. భారత బ్యాంకింగ్ రంగం ఎంతో బలోపేతంగా ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు, యూపీఐ, డిజిటల్ ‘శ్టాక్’పై ప్రపంచం ఆసక్తిని ఆయన గుర్తుచేశారు. ఈ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా ఆకర్షించి, ఆమోదించేలా చేసిందని సగర్వంగా చెప్పారు.
గడచిన వెయ్యేళ్లతో పోలిస్తే భారతీయ ఆకాంక్షలు అత్యధికంగాగల ప్రస్తుత కాలపు ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. వేల ఏళ్లపాటు బంధనాల్లో చిక్కుకున్న ఆశయాలతో వెనుకంజవేసిన భారతదేశం ఇక వేచి ఉండేందుకు సిద్ధంగా లేదన్నారు. రగులుతున్న ఆకాంక్షలతో ముందుకెళ్తూ కొత్త లక్ష్యాలను సృష్టించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ఆకాంక్షలతో కొత్త చట్టాల రూపకల్పన, కాలం చెల్లిన చట్టాల రద్దు పార్లమెంటు సభ్యుల అత్యున్నత బాధ్యతలని ప్రధాని అన్నారు. పార్లమెంటు ఆమోదిత చట్టాలతోపాటు చర్చలు, సందేశాలు భారతీయ ఆకాంక్షలను సాకారం చేయాలని ప్రతి పౌరుడూ నిరీక్షిస్తున్నారని, ప్రతి పార్లమెంటు సభ్యుడి విశ్వాసం కూడా ఇదేనని ఆయన నొక్కిచెప్పారు. “పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతి సంస్కరణ భారతీయ ఆకాంక్షల మూలాలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.
చిన్న ఫలకంపై పెద్ద చిత్రం గీయడం సాధ్యమేనా? అని ప్రధాని ప్రశ్నించారు. మన ఆలోచనల కార్యక్షేత్రాన్ని విస్తరించకపోతే మనం కలలుగనే భారతదేశాన్ని సృష్టించలేమని ఆయన నొక్కిచెప్పారు. భారత సుసంపన్న వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, దీన్ని మన మేధతో ముడిపెడితే భవ్య భారత చిత్రపటాన్ని ప్రపంచం ముందు ఉంచగలమని ప్రధాని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. ఆ మేరకు “భారత కార్యక్షేత్రం సువిశాలం. అది స్వల్ప చిక్కుల్లోపడే రోజులు గతించాయి” అని శ్రీ మోదీ అన్నారు. స్వయం సమృద్ధ భారతం రూపకల్పన ప్రాధాన్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. బాలారిష్టాలను అధిగమిస్తూ- భారత్ అనుసరిస్తున్న స్వయం సమృద్ధ పథం నమూనా గురించి ప్రపంచం నేడు చర్చించుకుంటున్నదని ఆయన అన్నారు. రక్షణ, తయారీ, ఇంధనం, ఖాద్య తైలాల రంగాల్లో స్వావలంబన సాధించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరని, ఈ తపనలో పార్టీ రాజకీయాలు అవరోధం కారాదని అభిప్రాయపడ్డారు.
తయారీ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ‘లోపరహిత-ప్రతికూలత రహిత’ ఉత్పాదన నమూనా ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. భారతీయ ఉత్పత్తుల్లో ఎలాంటి లోపాలుగానీ, తయారీ ప్రక్రియలో పర్యావరణంపై ప్రతికూలతగానీ ఎంతమాత్రం లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ, డిజైనింగ్, సాఫ్ట్ వేర్, హస్తకళ తదితర రంగాల ఉత్పత్తుల విషయంలో భారత తయారీ రంగం సరికొత్త ప్రపంచ ప్రమాణాల సృష్టి లక్ష్యంగా ముందడుగు వేయాలని ఆయన నొక్కి చెప్పారు. “మన ఉత్పత్తులు మన గ్రామాల్లో మాత్రమే నాణ్యమైనవిగా ఉంటే చాలదు. పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలుసహా ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా ఉండాలి” అన్నారు.
కొత్త విద్యా విధానం సార్వత్రికతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ దీనికి విశ్వవ్యాప్త ఆమోదం లభించిందని చెప్పారు. జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రదర్శించిన ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ ఛాయాచిత్రం గురించి చెబుతూ- 1500 ఏళ్లకిందట ఈ సంస్థ భారతదేశంలో ఉన్నదని విదేశీ ప్రముఖులు గుర్తించడం నమ్మశక్యం కాని అంశమని ప్రధాని తెలిపారు. “మనం దీన్నుంచి స్ఫూర్తి పొందాలి.. నేటి మన లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. క్రీడారంగంలో మన యువత విజయాలను ప్రస్తావిస్తూ- దేశంలోని రెండో, మూడో అంచె నగరాల్లోనూ క్రీడా సంస్కృతి విస్తరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “ప్రతి క్రీడా వేదికపైనా మన త్రివర్ణం రెపరెపలాడిస్తామని దేశం ప్రతినబూనాల్సిన తరుణం ఇదే”నని శ్రీ మోదీ అన్నారు. మెరుగైన జీవనంపై సామాన్య పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మనం నాణ్యతపై మరింతగా దృష్టి పెట్టాలన్నారు.
యువ జనాభాగల దేశం కావడంలోని విశిష్టతనూ ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత యువతను సదా ముందంజలో ఉంచే స్థితిని సృష్టించాలని మేం భావిస్తున్నాం. ప్రపంచ స్థాయిలో నైపుణ్య అవసరాలను గుర్తించి, దేశ యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య నిపుణుల అవసరాలు తీర్చేదిశగా భారత యువతను సిద్ధం చేసేలా ఇటీవల 150 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించడాన్ని ఆయన గుర్తుచేశారు.
సరైన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ- “ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కారాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయ ప్రయోజనాలు-నష్టాలకు అతీతంగా ఉండాలన్నారు. దేశంలోని సౌరశక్తి రంగం గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ- ఇప్పుడిది ఇంధన సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించేలా భరోసా ఇస్తోందన్నారు. అంతేకాకుండా ఉజ్వల భవితకు బాటలు వేస్తున్న మిషన్ హైడ్రోజన్, సెమీకండక్టర్ మిషన్, జల్ జీవన్ మిషన్ వగైరాలను కూడా ఆయన గుర్తుచేశారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ స్థాయికి చేరడంతోపాటు పోటీతత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. తదనుగుణంగా ఖర్చులు తగ్గించడంతోపాటు ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా దేశీయ రవాణా రంగం అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని తెలిపారు. విజ్ఞానం-ఆవిష్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ... ఈ దిశగా పరిశోధన-ఆవిష్కరణల సంబంధిత చట్టాన్ని ఇటీవల ఆమోదించామని ప్రధాని గుర్తుచేశారు. చంద్రయాన్ విజయంతో ఉప్పొంగిన ఉత్సాహం, ఆకర్షణ వృథా కారాదన్నారు.
అయితే, “సామాజిక న్యాయం మన ప్రాథమిక కర్తవ్యం” అని ప్రధానమంత్రి అన్నారు. ఈ అంశంపై చర్చ చాలా పరిమితంగా ఉందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అన్నారు. సామాజిక న్యాయం చేయడమంటే- అనుసంధానం, సురక్షిత నీటి సరఫరా, విద్యుత్తు, వైద్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలు సమకూర్చడం ద్వారా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమేనని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో అసమతౌల్యం సామాజిక న్యాయానికీ విరుద్ధమంటూ దేశంలోని తూర్పు ప్రాంతం వెనుకబాటుతనాన్ని ప్రస్తావించారు. “మన తూర్పు భారతాన్ని బలోపేతం చేయడం ద్వారా సామాజిక న్యాయం చేయూతను అందించాలి” అని శ్రీ మోదీ అన్నారు. ఇందులో భాగంగా సమతుల అభివృద్ధికి ఊతమిచ్చిన ఆకాంక్షాత్మక జిల్లాల పథకాన్ని గుర్తుచేస్తూ- ఇప్పుడిది 500 సమితులకు విస్తరించిందని చెప్పారు.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్ తటస్థ దేశంగా పరిగణించబడేది. అయితే, ఇవాళ మన దేశాన్ని ‘విశ్వమిత్రుడు’గా పరిగణిస్తోంది. ఆ మేరకు “యావత్ ప్రపంచం నేడు భారత్‌వైపు చూస్తోంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇతర దేశాలను స్నేహసంబంధాలతో చేరువ చేసుకుంటున్న భారత్‌ను ఆ దేశాలన్నీ తమ మిత్రుడుగా చూస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రపంచ సరఫరా శ్రేణిలో భారత్ నిలకడైన భాగస్వామిగా నిలిచేలా రూపొందించిన విదేశాంగ విధానం నేడు సత్ఫలితాలు ఇస్తున్నదని ఆయన చెప్పారు. జి-20 శిఖరాగ్ర సదస్సు దక్షిణార్థ గోళ దేశాల అవసరాలను తీర్చగల ఒక మాధ్యమమని శ్రీ మోదీ అన్నారు. ఈ మహత్తర విజయాన్ని భవిష్యత్తరాలు ఎనలేని ప్రతిష్టగా భావిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. “జి-20 శిఖరాగ్ర సదస్సులో వేసిన బీజం ప్రపంచానికి విశ్వసనీయ మహావృక్షంగా మారుతుంది” అని శ్రీ మోదీ తెలిపారు. ఈ సదస్సులో జీవ ఇంధన కూటమిని అధికారికంగా ప్రారంభించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. భారత్ నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ జీవ ఇంధన ఉద్యమం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
కొత్త సౌధం గౌరవాన్ని, ప్రతిష్టను అన్ని విధాలుగా పరిరక్షించాలని, పాత పార్లమెంటు భవనం స్థాయికి దిగజారకుండా చూడాలని ఉప-రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకరును ప్రధాని అభ్యర్థించారు. ఈ భవనాన్ని ‘రాజ్యాంగ సభ’గా వ్యవహరిద్దామని ప్రతిపాదించడంతోపాటు “రాజ్యాంగ పరిషత్‌లో భాగమైన మహనీయులను గుర్తుచేస్తూ రాజ్యాంగ సభ మనకు సదా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది” అంటూ తన ప్రసంగం ముగించారు.
*****
DS/TS
(Release ID: 1958882)
Visitor Counter : 155
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam