హోం మంత్రిత్వ శాఖ

హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన దేశీయాంగ-సహకారశాఖల మంత్రి శ్రీ అమిత్ షా


“దేశమే ప్రథమం’ సూత్రం మేరకు హైదరాబాద్లో పోలీసు మోహరింపుతో
రక్తపాత రహితంగా నిజాం నవాబు సైన్యాన్ని లొంగదీసిన సర్దార్ పటేల్”;

“సర్దార్ పటేల్.. కె.ఎం.మున్షీ ద్వయం తెలంగాణ/కల్యాణ కర్ణాటక/
మరాఠ్వాడా సహా సువిశాల ప్రాంతం భారత్లో కలగలిసేలా కృషి చేశారు”;

“బ్రిటిష్ దాస్య విముక్తి తర్వాత కూడా క్రూర నిజాం 399 రోజులు పాలించగా..
ఈ కాలమంతా తెలంగాణ ప్రజలపై చిత్రహింస.. దాడులు కొనసాగాయి”;

“ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం..
మనం దీన్ని సేవా దినోత్సవంగా నిర్వహించుకుంటాం”;

“స్వాతంత్ర్య యోధుల ఆకాంక్ష మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నేతృత్వాన గత 9 సంవత్సరాలుగా నవ భారతం నిర్మితమవుతోంది”;

“గత 75 ఏళ్ల బుజ్జగింపు విధానాల ఫలితంగా ఈ గొప్ప రోజు గురించి
ఏ ప్రభుత్వమూ మన యువతరానికి తెలిపే ప్రయత్నం చేసింది లేదు”;

“తెలంగాణ విమోచనానికి 75 ఏళ్లు నిండిన సందర్భంగా 2022 సెప్టెంబర్ 17న
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన కొత్త సంప్రదాయం మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏటా ఆ
రోజున విమోచన దినోత్సవం నిర్వహిస్తూ నాటి అమరుల అసమాన పోరాటంపై యువతరానికి అవగాహన కల్పిస్తోంది”;

బుజ్జగింపు విధానంతో హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహణకు
వెనుకాడి.. పోరాట చరిత్రను విస్మరించినవారిని ప్రజలు తిరస్కరిస్తారు”;

ఉగ్రవాదం.. వాతావరణ మార్పు.. ఆర్థిక వ్యవస్థ వగైరాలపై
శ్రీ మోదీ దార్శనికతను దేశాధినేతలందరూ ఆమోదించారు..

ఢిల్లీ తీర్మానంతో ఇది ప్రపంచ కార్యాచరణ ప్రణాళికగా మారింది”;
శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత డిజిటల్ ప్రభుత్వ మౌలిక సౌకర్యాలు

“ప్రపంచ గుర్తింపు పొందగా- యూపీఐ.. బ్యాంకింగ్, ఆధార్.. మొబైల్
పరిజ్ఞానాలతో దేశంలో వచ్చిన విప్లవం ప్రపంచ నేతల ప్రశంసలు పొందింది”;

ఇబ్రహీంపట్నంలో ‘ఎస్ఎస్బి’ సిబ్బంది కోసం రూ.20 కోట్లతో నిర్మించే 48
టైప్-3 ఇళ్లకు హోం మంత్రి శ్రీ అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు

Posted On: 17 SEP 2023 3:29PM by PIB Hyderabad

   తెలంగాణ విమోచనానికి నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఆనాడు ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ సంకల్పం ఫలితంగానే ఇవాళ ఈ వేడుకలు చేసుకుంటున్నామని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘దేశమే ప్రథమం’ అనే సూత్రం మేరకు సర్దార్‌ పటేల్‌ హైదరాబాద్‌లో పోలీసు బలగాలను దింపడం ద్వారా రక్తపాత రహితంగా నిజాం రజాకార్ల సైన్యాలను లొంగదీశారని గుర్తుచేశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్‌తో పాటు కె.ఎం.మున్షీ విశేష కృషితో తెలంగాణతోపాటు కర్ణాటకలోని బీదర్‌, మహారాష్ట్రలోని మరాఠ్వాడాలతో కూడిన సువిశాల ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. తెలంగాణ విముక్తి కోసం స్వామి రామానంద తీర్థ, ఎం.చిన్నారెడ్డి, నరసింహారావు, షేక్ బందగీ, కె.వి.నరసింహారావు, విద్యాధర్ గురు, పండిట్ కేశవరావు కోరాట్కర్, అనభేరి ప్రభాకరీరావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, దిగంబరరావు బిందు, వామన్‌రావ్‌ నాయక్‌, వాఘ్మారే లాంటి మహామహులతోపాటు అసంఖ్యాక ప్రజానీకం సర్వస్వం త్యాగం చేశారని గుర్తుచేశారు.

 

 

 

   కాగా, అంతకుముందు ఇబ్రహీంపట్నంలో ‘ఎస్‌ఎస్‌బి’ సిబ్బంది కోసం రూ.20 కోట్లతో నిర్మించే 48 టైప్-III ఇళ్లకు వర్చువల్‌ మాధ్యమంద్వారా శ్రీ అమిత్‌ షా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, నిఘా సంస్థ డైరెక్టర్, సిఆర్‌పిఎఫ్‌ డైరెక్టర్ జనరల్, ఎస్‌ఎస్‌బి డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

 

   దేశం ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకోగా, తెలంగాణ ఇవాళ విమోచన దినోత్సవం చేసుకుంటున్నదని శ్రీ అమిత్‌ షా అన్నారు. దేశానికి బ్రిటిష్ దాస్యం నుంచి విముక్తి లభించిన తర్వాత కూడా క్రూరుడైన నిజాం నవాబు 399 రోజులు పాలించాడని ఆయన గుర్తుచేశారు. ఈ కాలమంతా తెలంగాణ ప్రజలపై అమానుష దాడులు కొనసాగాయి, జనం  చిత్రహింసలు అనుభవించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజల మనోభావాలను పసిగట్టిన సర్దార్ పటేల్ ఈ ప్రాంతాన్ని నియంత పాలన నుంచి విముక్తం చేశారని శ్రీ షా చెప్పారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి ఆర్యసమాజం, హిందూ మహాసభ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థలు సహకరించాయన్నారు. మరో్వైపు తెలంగాణ విమోచన ఉద్యమానికి తుదిరూపు ఇచ్చేందుకు బీదర్ ప్రాంత రైతులు, యువతతో పాటు మన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ కూడా ఎంతో కృషి చేశారఅన్నారు.

 

   దేశంలో బుజ్జగింపు విధానం అనుసరించిన కారణంగా 75పాటు ఈ విమోచన దినం ప్రాముఖ్యం గురించి ఏ ప్రభుత్వమూ మన యువతరానికి తెలిపే ప్రయత్నం చేసింది లేదని హోంశాఖ మంత్రి అన్న్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన కొత్త సంప్రదాయం మేరకు 2022 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఏటా ఈ తేదీన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వేడుకలు నిర్వహించడం ప్రారంభించిందని గుర్తుచేశారు. దీంతో విమోచన పోరులో అమరుల త్యాగాలకు యువతరం నివాళి అర్పించే పద్ధతి ప్రారంభమైందన్నారు. దీనివెనుక మూడు లక్ష్యాలున్నాయని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు మొదటగా- ఈ అసమాన పోరాటం గురించి అవగాహన కల్పించడం ద్వారా యువతరంలో దేశభక్తిని ప్రోది చేయవచ్చున్నారు. అలాగే విమోచన పోరులో అమరుల త్యాగాలను సంస్మరించుకుంటూ వారిని నివాళి అర్పించడం రెండో లక్ష్యమని చెప్పారు. నాటి యోధులు కలలుగన్న నవ భారతం సాకారమయ్యేలా ప్రతి ఒక్కరూ పునరంకితం కావడం మూడో లక్ష్యమని పేర్కొన్నారు.

 

 

   స్వాతంత్ర్యానంతరం కూడా 400 రోజులపాటు సాగిన నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు నరకవేదన అనుభవించారని హోం మంత్రి అన్నారు. హైదరాబాద్‌ బానిసత్వం భరతమాతకు కడుపుకోత పెట్టే కేన్సర్‌ వంటిదని ఆనాడు సర్దార్‌ పటేల్‌ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఈ కేన్సర్‌ నయంకావాలంటే శస్త్రచికిత్సే పరిష్కారమని, ఆ మేరకు హైదరాబాద్‌ విముక్తి కోసం పోలీసు బలగాలను మోహరించారని పేర్కొన్నారు. అయితే, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇంత ముఖ్యమైన రోజున తెలంగాణలో ఉత్సవాలు నిర్వహించడానికి మునుపటి ప్రభుత్వాలు వెనుకాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశ చరిత్రను విస్మరించినవారిని ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని శ్రీ అమిత్‌ షా స్పష్టం చేశారు. మన దేశ చరిత్ర, అమరుల బలిదానాలు, స్వాతంత్య్ర పోరాట చరిత్రపై గర్వించడం ద్వారానే మన దేశాన్ని, తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని శ్రీ షా అన్నారు. నిజాం క్రూర పాలన సంస్థాన-సంస్థానేతర తేడాను సృష్టించిందని, సర్దార్ పటేల్ దాన్ని తుత్తునియలు చేశారని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ ప్రాంత విముక్తికి సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. ఆ మేరకు హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడమే మార్గాంతరమని 1948 ఆగస్టు 10న సర్దార్ పటేల్ నిర్ణయించారని శ్రీ షా తెలిపారు. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోయిందని, రాబోయే తరాలు స్ఫూర్తి పొందేలా ఈ రోజును, మన పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. తదనుగుణంగా తెలంగాణ, కల్యాణ కర్ణాటక, మరాఠ్వాడా ప్రజలు దేశ ప్రగతితోపాటు స్వీయాభివృద్ధికి తమను తాము పునరంకింత చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

   దక్షిణ భారతం నుంచి సాయుధ సరిహద్దు దళం (ఎస్‌ఎస్‌బి)లో పనిచేస్తున్న సైనిక కుటుంబాల కోసం ఇబ్రహీంపట్నంలోని ఇళ్ల నిర్మాణానికి నేడు వర్చువల్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశామని, ఇదొక కొత్త ఆరంభమని శ్రీ అమిత్‌ షా అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, అమరవీరుడు షోయబుల్లా ఖాన్, రామ్‌జీ గోండ్‌ల స్మారకార్థం తపాలా బిళ్లలను కూడా ఇవాళ ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఇక ఇవాళ మన ప్రియతమ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం కూడా అని, ఈ రోజును సేవా దినోత్సవంగా నిర్వహించుకుంటామని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల ఆకాంక్ష మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన గడచిన 9 సంవత్సరాలుగా నవ భారత నిర్మాణం చురుగ్గా కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. మన దేశం 2014లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 9 ఏళ్ల వ్యవధిలోనే 5వ స్థానానికి దూసుకెళ్లిందని గుర్తుచేశారు. మరోవైపు చంద్రయాన్‌ ప్రయోగంతో ప్రపంచంలో చంద్రునిపై పాదం మోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించిందని పేర్కొన్నారు. జి-20 శిఖరాగ్ర సదస్సును విజయంతం చేయడం ద్వారా భారతీయ సంస్కృతి, కళలు, ఆహారం, దుస్తులు, భాషలు వంటివాటిని  ప్రపంచ ప్రసిద్ధం చేశారని శ్రీ అమిత్‌ షా ప్రశంసించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషితో ఆఫ్రికా సమాఖ్యకు జి-20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా ఈ కూటమిని జి-21గా మార్చామన్నారు.

   ఉగ్రవాదం.. వాతావరణ మార్పు.. ఆర్థిక వ్యవస్థ వగైరాలపై శ్రీ మోదీ దార్శనికతను ప్రపంచ దేశాల అధినేతలంతా ఆమోదించారని, ఢిల్లీ తీర్మానంద్వారా అది ప్రపంచ కార్యాచరణ ప్రణాళికగా మారిందని శ్రీ షా అన్నారు. ఒడిషాలోని కోణార్క్ ఆలయం, నలంద విశ్వవిద్యాలయం, మధుబని చిత్రకళ వంటి మన దేశ వారసత్వ సంపద వైశిష్ట్యాన్ని జి-20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచానికి చాటిందన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించగా-  యూపీఐ, బ్యాంకింగ్, ఆధార్, మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాలతో దేశంలో వచ్చిన విప్లవం యావత్‌ ప్రపంచ నేతల ప్రశంసలు పొందిందని ఆయన పేర్కొన్నారు.

 

 

****



(Release ID: 1958231) Visitor Counter : 136