ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 శిఖరాగ్ర సదస్సునిర్వహణ ప్రదేశాల్లో సన్నాహాలపై సెప్టెంబర్‌ 3న దిల్లీ లెఫ్టినెంట్‌గవర్నర్‌ తో ప్రధాన మంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రట్రి కలసి,  విస్తృత పరిశీలన ను చేపట్టారు

Posted On: 03 SEP 2023 10:15PM by PIB Hyderabad

జి-20 శిఖరాగ్ర సదస్సు, సంబంధిత కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో దిల్లీ నగరం లోని వివిధ ప్రదేశాలలో సాగుతున్న సన్నాహాలను ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ పి.కె.మిశ్రా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్న్‌ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా లు విస్తృతంగా పరిశీలించి, పనుల ప్రగతిని సమీక్షించారు.

 

ఈ సదస్సు సన్నాహాలకు సంబంధించిన సమన్వయ సంఘానికి ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మేరకు ఒక చిరస్మరణీ అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సన్నాహాలన్నీ ప్రణాళికబద్ధంగా సాగేలా డాక్టర్ పి.కె.మిశ్రా ఈ సమీక్ష కసరత్తు ప్రారంభించారు. సదస్సుకు హాజరయ్యే పలు దేశాల అధినేతలు, ఇతర అంతర్జాతీయ ప్రముఖులందరికీ ఈ పర్యటనలో భారత సుసంపన్న సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేయడం లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు.

 

ఇందులో భాగంగా సదస్సు నిర్వహణ ప్రాంగణమైన భారత మండపం సహా రాజ్‌ఘాట్, ‘సి షడ్భుజిలో భాగమైన- ఇండియా గేట్, విమానాశ్రయ టెర్మినల్-3తోపాటు అందులోని ప్రముఖుల రాక ప్రదేశం, ఏరోసిటీ ప్రాంతం, ప్రధాన రహదారుల ముఖ్య విభాగాలు, ఇతర ప్రాంతాల వంటి దాదాపు 20 ప్రదేశాలను ముఖ్య కార్యదర్శి సందర్శించి, సమీక్షించారు.

 

ఏర్పాట్లలో భాగంగా రాజ్‌ఘాట్ వెలుపలి ప్రాంతాలు, ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలు, రౌండ్‌ అబౌట్‌ మార్గాలలో సుందరీకరణ పనులు చేపట్టారు. భారత మండపంలో శివ- నటరాజవిగ్రహాన్ని ప్రతిష్టించారు. దాదాపు 27 అడుగుల పొడవు, 20 టన్నుల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని అష్ట లోహాలతో సంప్రదాయ పోత పద్ధతుల్లో రూపొందించారు. జి-20కి భారత అధ్యక్షత నేపథ్యంలో భారత మండపం ప్రవేశ మార్గంలో నాట్యాధి దేవుడైన ఈ సమున్నత నటరాజ కాంస్య విగ్రహం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

 

సదస్సు నేపథ్యంలో దానితో ముడిపడిన ప్రధాన రహదారులలో వాహన రాకపోకల నియంత్రణ పరిస్థితిపైనా ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల గురించి వివరిస్తూ సమగ్ర సమాచారం

అందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. దిల్లీ విమానాశ్రయంలో ముఖ్యంగా గౌరవనీయులైన దేశాధినేతలు, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను కూడా డాక్టర్‌ మిశ్రా సమీక్షించారు.

 

దేశాధినేతల విమానాల రాక, వాటిని నిలిపి ఉంచే ఏర్పాట్లకు సంబంధించి, పాలం విమానాశ్రయంలోని వైమానిక దళం స్టేషన్, అందులోని సాంకేతిక ప్రదేశాలను ముఖ్య కార్యదర్శి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దేశాధినేతల తాత్కాలిక విడిది, వేచి ఉండే ప్రదేశాలు, ఇతర సౌకర్యాల గురించి వైమానిక దళ సీనియర్ అధికారులు డాక్టర్ మిశ్రాకు వివరించారు. విమానాశ్రయ ప్రాంతంలో అత్యవసర వైద్య సదుపాయాలు కూడా కల్పించారు.

 

శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ఆహ్లాదకర వాతావరణం సృష్టించే దిశగా దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ భారీ స్థాయిలో సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నిరుపయోగ నిర్మాణాలను పునరుద్ధరించారు. పరిశుభ్రదత

కార్యక్రమాలతోపాటు సందర్శకులను ఆకట్టుకునే రీతిలో వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. విదేశీ అతిథులకు దేశ వైవిధ్యం కళ్లకు కట్టేలా నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన విగ్రహాలు, పోస్టర్లు ప్రయాణికులను, సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు జి-20 కూటమి దేశాల జాతీయ పతాకాలన్నీ ముఖ్యమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయబడయతాయి. అలాగే ఆయా దేశాల జాతీయ జంతువుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు చేయడంలో అధికారుల బృందం ప్రదర్శించిన శ్రద్ధాసక్తులను ముఖ్య కార్యదర్శి ప్రశంసించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రధాని ముఖ్య కార్యదర్శితోపాటు సీనియర్ అధికారులందరూ సాయంత్రం 5గంటల నుండి రాత్రి 8గంటల 30 నిమిషాల దాకా మినీ బస్సులో ప్రయాణిస్తూ పరిశీలన, సమీక్ష నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి వెంట ప్రధానమంత్రి సలహాదారులు శ్రీ అమిత్ ఖరే, శ్రీ తరుణ్ కపూర్‌లతోపాటు చీఫ్ సెక్రట్రి, పోలీసు కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సందర్శన-సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

***



(Release ID: 1954767) Visitor Counter : 141