ప్రధాన మంత్రి కార్యాలయం
2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
27 AUG 2023 11:45AM by PIB Hyderabad
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.
ఆకాశంలో తల ఎత్తి
మేఘాలను చీల్చుకుంటూ
వెలుగు కోసం ప్రతిజ్ఞ చేయండి
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు
దృఢ సంకల్పంతో అడుగేయండి
అన్ని సవాళ్లను అధిగమించండి
పెను చీకట్లను తరిమేందుకు
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు.
ఆకాశంలో తల ఎత్తి
మేఘాలను చీల్చుకుంటూ
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు
నా కుటుంబ సభ్యులారా! సంకల్ప సూర్యులు చంద్రుడిపై కూడా ఉదయిస్తారని ఆగష్టు 23వ తేదీన భారతదేశం, భారతదేశ చంద్రయాన్ ప్రయోగం నిరూపించాయి. ఏ పరిస్థితిలోనైనా గెలవాలనుకునే, విజయ సాధనపై అవగాహన ఉండే నవ భారత స్ఫూర్తికి మిషన్ చంద్రయాన్ చిహ్నంగా మారింది.
మిత్రులారా! ఈ మిషన్‌లో ఒక అంశం గురించి నేను ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో చర్చించాలనుకుంటున్నాను. మహిళా నాయకత్వ అభివృద్ధిని జాతీయ చరిత్ర రూపంలో పటిష్టం చేయాలని ఈసారి ఎర్రకోట నుండి నేను చెప్పిన విషయం ఈసారి మీకు గుర్తుండే ఉంటుంది. మహిళా శక్తి అనుసంధానమయ్యే చోట అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయవచ్చు. భారతదేశ మిషన్ చంద్రయాన్ కూడా మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. చాలా మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ మొత్తం మిషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వేర్వేరు విభాగాల్లో వారు ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్ మొదలైన అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. భారతదేశ అమ్మాయిలు ఇప్పుడు అనంతంగా భావించే అంతరిక్షాన్ని కూడా సవాలు చేస్తున్నారు. ఒక దేశ అమ్మాయిలు ఇలా ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందకుండా ఎవరు ఆపగలరు!
మిత్రులారా! ఈ రోజు మన కలలు పెద్దవి. మన ప్రయత్నాలు కూడా పెద్దవే. అందువల్లే మనం ఇంత ఉన్నత స్థాయిని చేరుకోగలిగాం. చంద్రయాన్-3 విజయంలో మన శాస్త్రవేత్తలతో పాటు ఇతర రంగాల వారు కూడా కీలక పాత్ర పోషించారు. అందరూ సహకరిస్తే విజయం సాధ్యం. ఇదే చంద్రయాన్-3 కి అన్నింటికంటే గొప్ప బలం. చాలా మంది దేశస్థులు అన్ని భాగాలు , సాంకేతిక అవసరాలను తీర్చడంలో సహకరించారు. అందరి కృషితో విజయం కూడా సాధించింది. భవిష్యత్తులో కూడా మన అంతరిక్ష రంగం అందరి కృషితో ఇలాంటి అసంఖ్యాక విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! సెప్టెంబరు నెల భారతదేశ సామర్థ్యానికి సాక్ష్యంగా నిలవబోతోంది. వచ్చే నెలలో జరిగే జి-20 నాయకుల శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం పూర్తిగా సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 40 దేశాల అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు రాజధాని ఢిల్లీకి వస్తున్నాయి. అత్యధికమంది పాల్గొనడం G-20 శిఖరాగ్ర సదస్సుల చరిత్రలోనే తొలిసారి. భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో G-20ని మరింత సమగ్ర వేదికగా మార్చింది. భారతదేశం ఆహ్వానంపై ఆఫ్రికన్ యూనియన్ కూడా G-20లో చేరింది. ఆఫ్రికా ప్రజల గొంతు ప్రపంచంలోని ఈ ముఖ్యమైన వేదికపైకి చేరుకుంది. మిత్రులారా! గత ఏడాది బాలిలో భారతదేశం G-20 అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి మనలో గర్వాన్ని నింపే అనేక సంఘటనలు జరిగాయి. ఢిల్లీలో భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దేశంలోని వివిధ నగరాలకు ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాం. దీనికి సంబంధించి దేశంలోని 60 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరిగాయి. జి-20 ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రతినిధులు మన దేశ వైవిధ్యాన్ని, మన శక్తిమంతమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయని కూడా వారు గ్రహించారు.
మిత్రులారా! మన జి-20 అధ్యక్ష స్థానం ప్రజల అధ్యక్ష స్థానమే. ఇందులో ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి అన్నింటికంటే ముఖ్యమైంది. జి-20కి చెందిన పదకొండు ఎంగేజ్‌మెంట్ గ్రూపులలో విద్యావేత్తలు, పౌర సమాజానికి చెందినవారు, యువత, మహిళలు, చట్ట సభల సభ్యులు, పారిశ్రామికవేత్తలు, పట్టణ పరిపాలనకు సంబంధించినవారు ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఏదో ఒక రూపంలో ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రజల భాగస్వామ్యం కోసం మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఒకటి మాత్రమే కాదు, రెండు ప్రపంచ రికార్డులు సృష్టించగలిగాం. వారణాసిలో జరిగిన జి-20 క్విజ్‌లో 800 పాఠశాలలకు చెందిన 1.25 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం ప్రపంచ రికార్డుగా నిలిచింది. అదే సమయంలో లంబానీ కళాకారులు కూడా అద్భుతాలు చేశారు. 450 మంది కళాకారులు దాదాపు 1800 ప్రత్యేక ప్యాచ్‌ల అద్భుతమైన సేకరణను రూపొందించడం ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జి-20కి వచ్చిన ప్రతి ప్రతినిధి మన దేశ కళాత్మక వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం సూరత్‌లో జరిగింది. అక్కడ జరిగిన ‘చీరల వాకథాన్'లో 15 రాష్ట్రాల నుంచి 15,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సూరత్‌లోని టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊతమిచ్చింది. వోకల్ ఫర్ లోకల్- స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం లభించింది. లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులు గ్లోబల్ స్థాయికి చేరేందుకు మార్గం సుగమమైంది. శ్రీనగర్‌లో జరిగిన జి-20 సమావేశం తర్వాత కశ్మీర్ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. జి-20 సదస్సును విజయవంతం చేసి, దేశ ప్రతిష్టను పెంచుదామని దేశప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లలో మనం తరచుగా మన యువతరం సామర్థ్యాన్ని చర్చిస్తాం. క్రీడారంగం మన యువత నిరంతరం కొత్త విజయాలను సాధిస్తున్నక్షేత్రం. ఇటీవల మన క్రీడాకారులు దేశ వైభవాన్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టిన టోర్నమెంట్ల గురించి ఈ రోజు 'మన్ కీ బాత్'లో మాట్లాడుతాను. కొద్ది రోజుల క్రితం చైనాలో ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాలు జరిగాయి. ఈసారి ఈ గేమ్‌లలో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన చూపింది. మన ఆటగాళ్లు మొత్తం 26 పతకాలు సాధించగా, అందులో 11 బంగారు పతకాలు ఉన్నాయి. 1959 నుండి జరిగిన అన్ని ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలలో మేము సాధించిన పతకాలన్నింటినీ కలిపినా, ఈ సంఖ్య 18కి మాత్రమే చేరుకుంటుంది. ఇన్ని దశాబ్దాలలో కేవలం 18 మాత్రమే పొందారు. కానీ ఈసారి మన క్రీడాకారులు 26 పతకాలు సాధించారు. అందుకే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో పతకాలు సాధించిన కొందరు యువ క్రీడాకారులు, విద్యార్థులు ప్రస్తుతం నాతో ఫోన్‌లైన్‌లో ఉన్నారు. ముందుగా వారి గురించి చెబుతాను. యూపీకి చెందిన ప్రగతి ఆర్చరీలో పతకం సాధించారు. అస్సాం నివాసి అమ్లాన్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించారు. యూపీకి చెందిన ప్రియాంక రేస్ వాక్‌లో పతకం సాధించారు. మహారాష్ట్రకు చెందిన అభిదన్య షూటింగ్‌లో పతకం సాధించారు.
మోదీ గారు: నా ప్రియమైన యువ క్రీడాకారులారా! నమస్కారం.
యువ ఆటగాళ్లు: నమస్కారం సార్
మోదీ గారు: మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోని యూనివర్శిటీల నుండి ఎంపికైన జట్టుల్లో ఉన్న మీరు భారతదేశానికి కీర్తిని తెచ్చారు. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. మీరు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో మీ ప్రదర్శన ద్వారా ప్రతి దేశవాసీ గర్వపడేలా చేశారు. కాబట్టి ముందుగా నేను మిమ్మల్ని చాలా చాలా అభినందిస్తున్నాను. ప్రగతీ.. నేను మీతో ఈ సంభాషణను ప్రారంభిస్తున్నాను. రెండు పతకాలు సాధించి ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు మీరేం అనుకున్నారో ముందుగా చెప్పండి. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన అనుభూతి ఎలా ఉంది?
ప్రగతి: సార్.. నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను నా దేశ జెండాను ఇంత ఉన్నత స్థాయిలో నిలిపినందుకు గర్వపడ్డాను. ఒకసారి బంగారు పతకం కోసం పోటీలో ఓడిపోయి, పశ్చాత్తాపపడ్డాను. కానీ రెండోసారి నా మనసులో అనిపించింది.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని. ఎట్టి పరిస్థితిలో ఉన్నత స్థాయిలో ఉండాలని. చివరిగా పోటీలో గెలిచినప్పుడు అదే పోడియంలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ క్షణం చాలా బాగుంది. ఆ విజయగర్వాన్ని లెక్కించలేనంత ఆనందంగా ఉన్నాను.
మోదీ గారు: ప్రగతీ.. మీరు శారీరకంగా పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. దాని నుండి బయటపడ్డారు. దేశంలోని యువతకు ఇదో గొప్ప స్ఫూర్తి. మీకు ఏం జరిగింది?
ప్రగతి : సార్.. 2020 మే 5వ తేదీన నాకు మెదడులో రక్తస్రావం జరిగింది. నేను వెంటిలేటర్‌పై ఉన్నాను. బతుకుతానా లేదా అనే విషయంలో సందిగ్ధత ఉంది. నేను ఏం చేస్తే బతకగలనో కూడా తెలియదు. కానీ లోపలి నుండి నాకు ధైర్యం వచ్చింది. అది ఎంతగా అంటే ఆర్చరీలో బాణం వేసేలా నేను గ్రౌండ్ పై తిరిగి నిలబడాలి అని. నా ప్రాణం దక్కిందంటే ప్రధాన కారణం దేవుని కృప. తరువాత డాక్టర్, ఆపై విలువిద్య.
మోదీ గారు: అమ్లాన్ కూడా మనతో ఉన్నారు. అమ్లాన్, మీరు అథ్లెటిక్స్‌పై ఇంత ఆసక్తిని ఎలా పెంచుకున్నారో చెప్పండి!
అమ్లాన్ :- నమస్కారం సార్.
మోదీ గారు: నమస్కారం.. నమస్కారం..
అమ్లాన్: సార్.. ఇంతకు ముందు అథ్లెటిక్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. మేం ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేవాళ్ళం. నా సోదరుడికి ఒక స్నేహితుడున్నాడు. “అమ్లాన్... నువ్వు అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లాలి” అని అతను చెప్పాడు. అంగీకరించాను. మొదటిసారి స్టేట్ మీట్ లో ఆడినప్పుడు ఓడిపోయాను. ఓటమి నాకు నచ్చలేదు. అలా చేస్తూచేస్తూ అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాను. ఆ తర్వాత మెల్లగా ఇలా... ఇప్పుడు సరదా మొదలైంది. అలా నాలో ఆసక్తి పెరిగింది.
మోదీ గారు: అమ్లాన్... మీరు ఎక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేశారో చెప్పండి!
అమ్లాన్ : నేను ఎక్కువగా హైదరాబాద్‌లో సాయిరెడ్డి సార్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత భువనేశ్వర్ కి మారాను. అక్కడి నుంచి ప్రొఫెషనల్‌గా స్టార్ట్ చేశాను సార్.
మోదీ గారు: సరే... ప్రియాంక కూడా మనతోనే ఉన్నారు. ప్రియాంకా! మీరు 20 కిలోమీటర్ల రేస్ వాక్ టీమ్‌లో ఉన్నారు. ఈ రోజు దేశం మొత్తం మీ మాట వింటోంది. వారు ఈ క్రీడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో మీరే చెప్పండి. మరి మీ కెరీర్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది?
ప్రియాంక: నేను పాల్గొన్న లాంటి ఈవెంట్ చాలా కష్టం. ఎందుకంటే ఐదుగురు జడ్జీలు నిలబడి ఉంటారు. మనం పరుగెత్తినా మనల్ని తొలగిస్తారు. లేదా మనం రోడ్డు మీద నుంచి కొంచెం దిగినా, ఎగిరినా తొలగిస్తారు. మనం మోకాళ్లు వంచినా వారు బహిష్కరిస్తారు. నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నా స్పీడ్‌ని ఎంతగానో నియంత్రించుకున్నాను. కనీసం ఇక్కడ జట్టు పతకమైనా సాధించాలనుకున్నా. ఎందుకంటే మేం దేశం కోసం అక్కడికి వెళ్ళాం. ఖాళీ చేతులతో తిరిగిరావడం ఇష్టం లేదు.
మోదీ గారు: నాన్న, అన్న... అందరూ బాగున్నారా?
ప్రియాంక : అవును సార్… అందరూ బాగానే ఉన్నారు. మీరు మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారని నేను అందరికీ చెబుతున్నాను. నిజంగా సార్.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో వరల్డ్ యూనివర్శిటీ వంటి ఆటలకు పెద్దగా డిమాండ్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ క్రీడల్లో మనకు చాలా సపోర్ట్ వస్తోంది. మేం ఇన్ని పతకాలు సాధించామని అందరూ ట్వీట్లు చేయడం కూడా చూస్తున్నాం. ఒలింపిక్స్ లాగా ఇది కూడా ప్రాచుర్యం పొందడం చాలా బాగుంది సార్.
మోదీ గారు: సరే ప్రియాంక.. నా వైపు నుండి అభినందనలు. మీరు పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అభిదన్యతో మాట్లాడుకుందాం.
అభిదన్య : నమస్కారం సార్.
మోదీ గారు: మీ గురించి చెప్పండి.
అభిదన్య : సార్! మా స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్. నేను షూటింగ్‌లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లు రెండింటినీ చేస్తాను. మా తల్లిదండ్రులిద్దరూ హైస్కూల్ టీచర్లు. నేను 2015లో షూటింగ్ ప్రారంభించాను. నేను షూటింగ్ ప్రారంభించినప్పుడు కొల్హాపూర్‌లో అంతగా సౌకర్యాలు లేవు. వడ్‌గావ్ నుంచి కొల్హాపూర్‌కి బస్‌లో వెళ్లడానికి గంటన్నర పట్టేది. తిరిగి రావడానికి గంటన్నర, నాలుగు గంటల శిక్షణ... ఇలా ఆరేడు గంటలు వెళ్ళి వచ్చేందుకు, ట్రెయినింగుకు పట్టేది. అలా నేనూ స్కూల్ మిస్ అయ్యేదాన్ని. దాంతో శని, ఆదివారాల్లో షూటింగ్ రేంజికి తీసుకెళ్తామని అమ్మానాన్న చెప్పారు. మిగతారోజుల్లో మిగతా గేమ్స్ అడుకొమ్మన్నారు. దాంతో చిన్నప్పుడు చాలా ఆటలు ఆడాను. ఎందుకంటే మా అమ్మానాన్నలిద్దరికీ క్రీడలంటే చాలా ఆసక్తి. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఆర్థిక సహాయం అంతగా లేదు. అవగాహన అంతగా లేదు. నేను దేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశం కోసం పతకం సాధించాలని అమ్మకు ఒక పెద్ద కల. ఆమె కలను నెరవేర్చడానికి నేను చిన్నప్పటి నుండి ఆటలంటే చాలా ఆసక్తిని కలిగి ఉండేదాన్ని. ఆపై నేను తైక్వాండోలో కూడా పాల్గొన్నాను. అందులో కూడా నాకు బ్లాక్ బెల్ట్ ఉంది. బాక్సింగ్, జూడో , ఫెన్సింగ్, డిస్కస్ త్రో వంటి అనేక ఆటలు ఆడాను. 2015 లో నేను షూటింగ్ కి వచ్చాను. అప్పుడు నేను 2-3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. నేను మొదటిసారి లో విశ్వవిద్యాలయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు కు మలేషియా సెలక్షన్ లో ఎంపికయ్యాను. అందులో నాకు కాంస్య పతకం వచ్చింది. నాకు అప్పటి నుండి ప్రోత్సాహం లభించింది. అప్పుడు మా స్కూల్ నా కోసం షూటింగ్ రేంజ్ తయారుచేసింది. నేను అక్కడ శిక్షణ పొందాను. ఆపై వారు నన్ను శిక్షణ కోసం పూణేకు పంపారు. ఇక్కడ గగన్ నారంగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఉంది. ఆఅ ఫౌండేషన్ లో నేను శిక్షణ పొందుతున్నాను. ఇప్పుడు గగన్ సార్ నన్ను చాలా ప్రోత్సహించారు. నాకు చాలా సపోర్ట్ చేశారు.
మోదీ గారు: సరే.. మీ నలుగురూ నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నేను వినాలనుకుంటున్నాను. ప్రగతి కానీ, అమ్లాన్ కానీ, ప్రియాంక కానీ, అభిదాన్య కానీ. మీ అందరికీ నాతో అనుబంధం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా వింటాను.
అమ్లాన్ : సార్.. నాదో ప్రశ్న ఉంది సార్.
మోదీ గారు: చెప్పండి.
ఆమ్లాన్ :- మీకు ఏ ఆట బాగా ఇష్టం సార్?
మోదీ గారు: భారతదేశం క్రీడా ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందాలి. అందుకే నేను వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాను. కానీ హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో.. ఇవి మన భూమికి సంబంధించిన ఆటలు. వీటిలో మనం వెనుకబడి ఉండకూడదు. మనవాళ్లు విలువిద్యలో బాగా రాణిస్తున్నారని నేను చూస్తున్నాను. వారు షూటింగ్‌లో బాగా రాణిస్తున్నారు. రెండవది.. మన యువతలో, మన కుటుంబాలలో కూడా క్రీడల పట్ల ఇంతకుముందు ఉన్న భావన లేకపోవడాన్ని నేను చూస్తున్నాను. ఇంతకుముందు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఆపేవారు. ఇప్పుడు కాలం మారింది. మీరు సాధిస్తున్న విజయాలు అన్ని కుటుంబాలను ఉత్సాహపరుస్తాయి. ప్రతి ఆటలో- మన పిల్లలు ఎక్కడికి వెళ్లినా- దేశం కోసం ఏదో ఒకటి చేసిన తర్వాత తిరిగి వస్తారు. ఈ వార్తలను నేడు దేశంలో ప్రముఖంగా చూపిస్తున్నారు. చెప్పుకుంటున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నాకు బాగా నచ్చాయి. మీ అందరికి నా వైపు నుండి చాలా చాలా అభినందనలు. చాలా శుభాకాంక్షలు.
యువ ఆటగాళ్లు : చాలా చాలా ధన్యవాదాలు! థాంక్యూ సార్. ధన్యవాదాలు.
మోదీ గారు: ధన్యవాదాలు! నమస్కారం..
నా కుటుంబ సభ్యులారా! ఈసారి ఆగస్టు 15న దేశం 'సబ్ కా ప్రయాస్' సామర్థ్యాన్ని చూసింది. దేశప్రజలందరి కృషి వల్లే 'హర్ ఘర్ తిరంగా అభియాన్' నిజానికి 'హర్ మన్ తిరంగా అభియాన్' అయింది. ఈ ప్రచారంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. దేశప్రజలు కోట్లలో త్రివర్ణ పతాకాలను కొన్నారు. ఒకటిన్నర లక్షల పోస్టాఫీసుల ద్వారా దాదాపు ఒకటిన్నర కోట్ల త్రివర్ణ పతాకాల విక్రయం జరిగింది. దీని వల్ల మన కార్మికులు, చేనేత కార్మికులు.. ముఖ్యంగా మహిళలు కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం పొందారు. ఈసారి త్రివర్ణ పతాకంతో సెల్ఫీ దిగి దేశప్రజలు సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు దాదాపు 5 కోట్ల మంది దేశస్థులు త్రివర్ణ పతాకంతో సెల్ఫీ పోస్ట్‌లు పెట్టారు. ఈ ఏడాది ఈ సంఖ్య కూడా 10 కోట్లు దాటింది.
మిత్రులారా! ప్రస్తుతం దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పే 'మేరీ మాటీ, మేరా దేశ్' అనే కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. సెప్టెంబరు నెలలో దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. దేశ పవిత్ర మట్టి వేల అమృత కలశాల్లో నిక్షిప్తమవుతుంది. అక్టోబర్ నెలాఖరులో అమృత కలశ యాత్రతో దేశ రాజధాని ఢిల్లీకి వేలాది మంది చేరుకుంటారు. ఈ మట్టితోనే ఢిల్లీలో అమృత వాటికను నిర్మిస్తారు. ప్రతి దేశస్థుని కృషి ఈ ప్రచారాన్ని విజయవంతం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! ఈసారి నాకు సంస్కృత భాషలో చాలా ఉత్తరాలు వచ్చాయి. దీనికి కారణం శ్రావణ మాస పౌర్ణమి. ఈ తిథిన ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారు.
సర్వేభ్య: విశ్వ సంస్కృత దివసస్య హార్దయః శుభకామనా:
ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి అని మనందరికీ తెలుసు. దీన్ని అనేక ఆధునిక భాషలకు తల్లిగా పేర్కొంటారు. ప్రాచీనతతో పాటు వైజ్ఞానికతకు, వ్యాకరణానికి కూడా సంస్కృతం ప్రసిద్ది చెందింది. భారతదేశానికి సంబంధించిన ప్రాచీన జ్ఞానాన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషలో భద్రపర్చారు. యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం వంటి విషయాలపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు మరింత ఎక్కువగా సంస్కృతం నేర్చుకుంటున్నారు. అనేక సంస్థలు కూడా ఈ దిశగా చాలా కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు యోగా కోసం సంస్కృతం, ఆయుర్వేదం కోసం సంస్కృతం, బౌద్ధమతం కోసం సంస్కృతం వంటి అనేక కోర్సులను సంస్కృత ప్రమోషన్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రజలకు సంస్కృతం నేర్పేందుకు 'సంస్కృత భారతి' ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో 10 రోజుల 'సంస్కృత సంభాషణ శిబిరం'లో మీరు పాల్గొనవచ్చు. నేడు ప్రజలలో సంస్కృతంపై అవగాహన, గర్వ భావన పెరిగినందుకు సంతోషిస్తున్నాను. దీని వెనుక గత సంవత్సరాల్లో దేశం చేసిన ప్రత్యేక కృషి కూడా ఉంది. ఉదాహరణకు 2020లో మూడు సంస్కృత డీమ్డ్ యూనివర్సిటీలను కేంద్రీయ విశ్వవిద్యాలయాలుగా మార్చారు. వివిధ నగరాల్లో సంస్కృత విశ్వవిద్యాలయాలకు చెందిన అనేక కళాశాలలు, సంస్థలు కూడా నడుస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి సంస్థల్లో సంస్కృత కేంద్రాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
మిత్రులారా! మీరు తరచుగా ఒక విషయాన్ని అనుభవించి ఉండాలి. మూలాలతో అనుసంధానమయ్యేందుకు, మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు మన సంప్రదాయంలోని చాలా శక్తివంతమైన మాధ్యమం మన మాతృభాష. మన మాతృభాషతో అనుసంధానం అయినప్పుడు సహజంగానే మన సంస్కృతితో ముడిపడి ఉంటాం.
మనం మన సంస్కారాలతో ముడిపడి ఉంటాం. మన సంప్రదాయంతో ముడిపడి ఉంటాం. మన ప్రాచీన వైభవంతో అనుసంధానం అవుతాం. అదేవిధంగా భారతదేశానికి మరో మాతృభాష - ప్రకాశవంతమైన తెలుగు భాష ఉంది. ఆగస్టు 29 వ తేదీని తెలుగు దినోత్సవంగా జరుపుకుంటారు.
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..
మీ అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషా సాహిత్యంలో, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగి ఉన్నాయి. ఈ తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
నా కుటుంబ సభ్యులారా! మనం 'మన్ కీ బాత్' అనేక ఎపిసోడ్‌లలో పర్యాటక రంగం గురించి మాట్లాడుకున్నాం. వస్తువులను లేదా ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడడం, వాటిని అర్థం చేసుకోవడం, వాటితో కొన్ని క్షణాలు గడపడం భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. ఎవరైనా సముద్రాన్ని ఎంత వర్ణించినా సముద్రాన్ని చూడకుండా దాని విశాలతను మనం అనుభవించలేం. హిమాలయాల గురించి ఎంత మాట్లాడినా హిమాలయాలను చూడకుండా వాటి అందాలను అంచనా వేయలేం. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా మన దేశ సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని చూసేందుకు తప్పకుండా వెళ్లాలని మీ అందరినీ నేను తరచుగా కోరుతూ ఉంటాను. మనం తరచుగా మరొక విషయాన్ని కూడా గమనిస్తాం. ప్రపంచంలోని ప్రతి మూలను శోధించినా మన సొంత నగరం లేదా రాష్ట్రంలోని అనేక ఉత్తమ స్థలాలు, వస్తువుల గురించి మనకు తెలియదు. ప్రజలు తమ సొంత నగరంలోని చారిత్రక ప్రదేశాల గురించి పెద్దగా తెలుసుకోకపోవడం చాలా సార్లు జరుగుతుంది. ధన్ పాల్ గారి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ధనపాల్ గారు బెంగళూరులోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేసేవారు. సుమారు 17 సంవత్సరాల కిందట ఆయన క్షేత్ర సందర్శన విభాగంలో బాధ్యత స్వీకరించారు. ఇప్పుడు బెంగుళూరు దర్శిని అనే పేరుతో ఆ విభాగం ప్రజలకు తెలుసు. ధన్ పాల్ గారు పర్యాటకులను నగరంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అలాంటి ఒక పర్యటనలో ఒక పర్యాటకుడు బెంగుళూరులోని ట్యాంక్‌ను సెంకి ట్యాంక్ అని ఎందుకు పిలుస్తారని అడిగారు. సమాధానం తనకు తెలియకపోవడం ఆయనకు రుచించలేదు. చాలా బాధపడ్డారు. అటువంటి పరిస్థితిలో ఆయన తన పరిజ్ఞానాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. తన వారసత్వాన్ని తెలుసుకోవాలనే మక్కువతో ఆయన అనేక శిలలు, శాసనాలు కనుగొన్నారు. ధన్ పాల్ గారి మనస్సు ఈ పనిలో మునిగిపోయింది. ఎంతలా అంటే ఆయన శాసనాలకు సంబంధించిన ఎపిగ్రఫీ అంశంలో డిప్లొమా కూడా చేశారు. ఇప్పుడు పదవీ విరమణ చేసినప్పటికీ బెంగళూరు చరిత్రను అన్వేషించాలనే ఆయన అభిరుచి ఇప్పటికీ సజీవంగా ఉంది.
మిత్రులారా! బ్రాయన్ డి. ఖార్ ప్రన్ గురించి చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మేఘాలయ నివాసి. ఆయనకు స్పెలియాలజీలో చాలా ఆసక్తి ఉంది. సాధారణ భాషలో దీని అర్థం గుహల అధ్యయనం. కొన్నాళ్ల కిందట చాలా కథల పుస్తకాలు చదివినప్పుడు ఆయనలో ఈ ఆసక్తి ఏర్పడింది. 1964 లో ఆయన పాఠశాల విద్యార్థిగా తన మొదటి అన్వేషణ చేశారు. 1990 లో తన స్నేహితుడితో కలిసి ఒక సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఆయన మేఘాలయలోని తెలియని గుహల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే చూస్తూ ఉండగానే తన బృందంతో కలిసి మేఘాలయలో 1700 కంటే ఎక్కువ గుహలను కనుగొన్నారు. అలా మేఘాలయ రాష్ట్రాన్ని ప్రపంచ గుహ పటంలోకి తేగలిగారు. భారతదేశంలోని కొన్ని పొడవైన, లోతైన గుహలు మేఘాలయలో ఉన్నాయి. బ్రాయన్ గారు, ఆయన బృందం కేవ్ ఫౌనా అంటే గుహ జంతుజాలంపై డాక్యుమెంటేషన్ చేశారు. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఈ మొత్తం బృందం చేసిన కృషిని, ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. అలాగే మేఘాలయ గుహలను సందర్శించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా కుటుంబ సభ్యులారా! మన దేశంలోని అత్యంత ముఖ్యమైన రంగాలలో డెయిరీ రంగం ఒకటని మీకందరికీ తెలుసు. మన తల్లులు, సోదరీమణుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. కొద్ది రోజుల కిందట గుజరాత్‌కు చెందిన బనాస్ డెయిరీ చేసిన ఆసక్తికరమైన చొరవ గురించి నాకు తెలిసింది. బనాస్ డెయిరీని ఆసియాలోనే అతిపెద్ద డెయిరీగా పరిగణిస్తారు. ఇక్కడ రోజుకు సగటున 75 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతారు. ఇతర రాష్ట్రాల్లో సకాలంలో పాల పంపిణీ కోసం ఇప్పటివరకు ట్యాంకర్లు లేదా పాల రైళ్ల సహకారం పొందారు. అయితే ఇందులో కూడా సవాళ్లు తక్కువేమీ కావు. మొదట లోడింగ్, అన్‌లోడింగ్ చేయడానికి చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు పాలు కూడా చెడిపోయేవి. ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రయోగం చేసింది. రైల్వే శాఖ పాలన్‌పూర్ నుండి న్యూ రేవాడి వరకు ట్రక్-ఆన్-ట్రాక్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో పాల ట్రక్కులను నేరుగా రైలులోకి ఎక్కిస్తారు. అంటే రవాణాకు సంబంధించిన ప్రధాన సమస్య దీని ద్వారా తొలగిపోయింది. ట్రక్-ఆన్-ట్రాక్ సదుపాయం ఫలితాలు చాలా సంతోషానిస్తున్నాయి. గతంలో రవాణాకు 30 గంటల సమయం పట్టే పాలు ఇప్పుడు సగం కంటే తక్కువ సమయంలో చేరుతున్నాయి. దీని వల్ల ఇంధనం వల్ల కలిగే కాలుష్యం పోయింది. ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతోంది. ట్రక్కుల డ్రైవర్లు కూడా దీని నుండి చాలా ప్రయోజనం పొందారు. వారి పని సులువైంది.
మిత్రులారా! సమష్టి కృషి వల్ల నేడు మన డెయిరీలు కూడా ఆధునిక ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. బనాస్ డెయిరీ పర్యావరణ పరిరక్షణ దిశగా ముందడుగు వేసిందనే విషయం సీడ్‌బాల్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం తెలియజేస్తుంది. మన పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వారణాసి మిల్క్ యూనియన్ ఎరువుల నిర్వహణపై కృషి చేస్తోంది. కేరళకు చెందిన మలబార్ మిల్క్ యూనియన్ డెయిరీ కృషి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇది జంతువుల వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేద ఔషధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది.
మిత్రులారా! ఈరోజు చాలా మంది పాడిపరిశ్రమ లో కృషి చేస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటాలో డైరీ ఫామ్‌ను నడుపుతున్న అమన్‌ప్రీత్ సింగ్ గురించి కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. ఆయన డెయిరీతో పాటు బయోగ్యాస్ పై కూడా దృష్టి పెట్టి రెండు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల విద్యుత్‌పై ఖర్చు దాదాపు 70 శాతం తగ్గింది. ఆయన చేసిన ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా పాడి రైతులకు స్ఫూర్తినిస్తుంది. నేడు అనేక పెద్ద డెయిరీలు బయోగ్యాస్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఈ రకమైన కమ్యూనిటీ ఆధారిత విలువ జోడింపు చాలా ఉత్తేజకరమైనది. ఇలాంటి ధోరణులు దేశవ్యాప్తంగా కొనసాగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! ఈ రోజు మన్ కీ బాత్‌లో ఇంతే. ఇప్పుడు పండుగల సీజన్ కూడా వచ్చేసింది. ముందుగా మీ అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు. వేడుకల సమయంలో మనం వోకల్ ఫర్ లోకల్- స్థానిక ఉత్పత్తులకు ప్రచారం మంత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ 'స్వయం సమృద్ధ భారతదేశ' ప్రచారం ప్రతి దేశస్థుని స్వంత ప్రచారం. పండుగ వాతావరణం ఉన్నప్పుడు మనం మన విశ్వాస స్థలాలను, వాటి చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలి. వచ్చేసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. దేశప్రజల కొత్త ప్రయత్నాలు, వాటి విజయాలపై మనం చర్చిద్దాం. అప్పటి వరకు నాకు సెలవివ్వండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
***
(Release ID: 1952641)
Visitor Counter : 304
Read this release in:
Bengali
,
Kannada
,
Urdu
,
Manipuri
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam