ప్రధాన మంత్రి కార్యాలయం

చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో బృందంలో చేరిన ప్రధాని


“ఇది 140 కోట్ల హృదయ స్పందనల సామర్థ్యానికి, భారతదేశ నూతన శక్తి పట్ల విశ్వాసానికి సంబంధించిన క్షణం”

'అమృత్ కాల్' తొలి వెలుగులో ఇది విజయ 'అమృత్ వర్ష'.

“మన శాస్త్రవేత్తల అంకితభావం, ప్రతిభతో ప్రపంచంలో ఏ దేశమూ చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుంది”

“పిల్లలు 'చందా మామా ఏక్ టూర్ కే' అంటే చంద్రుడు కేవలం ఒక ప్రయాణ దూరంలోనే ఉన్నాడు‘ అని చెప్పే సమయం ఎంతో దూరంలో లేదు.”

“మన చంద్రయానం (మూన్ మిషన్) మానవ కేంద్రీకృత విధానంపై ఆధారపడి ఉంది. కాబట్టి, ఈ విజయం మానవాళి మొత్తానికి చెందుతుంది.”

“మనం మన సౌర వ్యవస్థ పరిమితులను పరీక్షిస్తాము మానవులకు విశ్వానికి
చెందిన అనంత అవకాశాలను గ్రహించడానికి కృషి చేస్తాము"

“ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే రుజువు చేస్తోంది”

Posted On: 23 AUG 2023 7:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఇస్రో బృందంతో చేరారు. విజయవంతంగా ల్యాండింగ్ అయిన వెంటనే ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు వారిని అభినందించారు.

ఈ బృందాన్ని కుటుంబ సభ్యులుగా ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, ఇలాంటి చారిత్రాత్మక సంఘటనలు ఒక జాతికి శాశ్వత చైతన్యంగా మారుతాయని అన్నారు. 'ఈ క్షణం మరువలేనిది, అపూర్వమైనది. 'విక్శిత్ భారత్' నినాదానికి పిలుపునిచ్చిన క్షణం, భారత్ కు విజయ శంఖారావం. కష్టాల సముద్రాన్ని దాటి విజయ చంద్రపథ్ పై నడిచే క్షణం ఇది. ఇది 140 కోట్ల హృదయ స్పందనల సామర్థ్యానికి , భారతదేశ నూతన శక్తి ఆత్మవిశ్వాస  క్షణం. భారతదేశ పెరుగుతున్న అదృష్టాన్ని ఉత్తేజపరిచే క్షణం" అని ప్రధాన మంత్రి సంతోషం లో మునిగిన జాతిని ఉద్దేశించి అన్నారు. "'అమృత్ కాల్' మొదటి వెలుగులో ఇది విజయానికి 'అమృత్ వర్ష' అని ప్రధాన మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ 'భారత్ ఇప్పుడు చంద్రుడిపై ఉంది' అని ప్రధాని పేర్కొన్నారు. నవ భారతావని తొలి ప్రయాణాన్ని మనం ఇప్పుడే చూశామని ఆయన పేర్కొన్నారు.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు తాను ప్రస్తుతం జోహన్నెస్ బర్గ్ లో ఉన్నానని, అయితే ప్రతి ఒక్క పౌరుల మాదిరి తన మనసు కూడా చంద్రయాన్ 3 పై కేంద్రీకృతమైందని ప్రధాని తెలిపారు. ప్రతి భారతీయుడు సంబరాల్లో మునిగిపోయారని, ఇది ప్రతి కుటుంబానికి పండుగ రోజు అని, ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి పౌరుడితో ఉత్సాహంగా కనెక్ట్ అయ్యానని ఆయన అన్నారు. చంద్రయాన్ బృందాన్ని, ఇస్రోను, ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించిన దేశంలోని శాస్త్రవేత్తలందరినీ ప్రధాన మంత్రి అభినందించారు.  ఉత్సాహం, ఆనందం , భావోద్వేగాలతో నిండిన ఈ అద్భుతమైన క్షణం లో 140 కోట్ల మంది దేశ ప్రజలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. 

"మన శాస్త్రవేత్తల అంకితభావం, ప్రతిభతో ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇప్పటి వరకు చేరుకోలేని చంద్రుని దక్షిణ ధృవానికి భారతదేశం చేరుకుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

చంద్రుడికి సంబంధించిన పురాణాలు, కథలన్నీ ఇప్పుడు మారిపోతాయని, సామెతలు కొత్త తరానికి కొత్త అర్థాన్ని కనుగొంటాయని ఆయన చెప్పారు. భూమిని 'మా'గా, చంద్రుడిని 'మామా'గా భావించే భారతీయ జానపద కథలను ప్రస్తావిస్తూ, చంద్రుడిని కూడా చాలా దూరంగా భావిస్తారని, 'చందా మామా దూర్ కే' అని పిలుస్తారని, అయితే పిల్లలు 'చందా మామా ఏక్ టూర్ కే' అంటే చంద్రుడు కేవలం ఒక పర్యటన దూరంలో మాత్రమే ఉన్నారని చెప్పే సమయం ఇక ఎంతో దూరంలో లేదని ప్రధాని అన్నారు.

ప్రపంచ  ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, "భారత దేశ విజయ వంత మైన చంద్ర యాత్ర భారత్ కు మాత్రమే కాదు. భారతదేశ జి-20 అధ్యక్ష పదవిని ప్రపంచం చూస్తున్న సంవత్సరం ఇది. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే మన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మానవ కేంద్రీకృత విధానం విశ్వవ్యాప్తంగా స్వాగతించబడింది. మన చంద్ర మిషన్ కూడా అదే మానవ కేంద్రీకృత విధానంపై ఆధారపడి ఉంది. కాబట్టి, ఈ విజయం మానవాళి మొత్తానికి చెందుతుంది. భవిష్యత్తులో ఇతర దేశాలు చేపట్టే చంద్ర యాత్రలకు ఇది దోహద పడుతుంది”అన్నారు. ‘గ్లోబల్ సౌత్ తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు ఇలాంటి విజయాలు సాధించగలవని నేను విశ్వసిస్తున్నాను. మనమందరం చంద్రుని కోసం , అంతకు మించి ఆకాంక్షించవచ్చు." అని మోదీ పేర్కొన్నారు.

చంద్రయాన్ మహా అభియాన్ సాధించిన విజయాలు చంద్రుడి కక్ష్యలను దాటి భారతదేశ ప్రయాణాన్ని తీసుకెళ్తాయని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. “మనం మన సౌర వ్యవస్థ పరిమితులను పరీక్షిస్తాము.  మానవుల కోసం విశ్వం లోని అనంత అవకాశాలను గ్రహించడానికి కృషి చేస్తాము" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, సూర్యుడిపై సమగ్ర అధ్యయనం కోసం ఇస్రో త్వరలో 'ఆదిత్య ఎల్ -1' మిషన్ ను ప్రారంభించబోతోందని ప్రధాని తెలియజేశారు. ఇస్రో లక్ష్యాలలో శుక్రగ్రహం కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. "ఆకాశం హద్దు కాదని భారతదేశం పదేపదే రుజువు చేస్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు, మిషన్ గగన్ యాన్ ను ప్రస్తావిస్తూ, భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్రకు పూర్తి సన్నద్ధంగా ఉందని అన్నారు. 

దేశ ఉజ్వల భవిష్యత్తుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమే పునాది అని ప్రధాని ఉద్ఘాటించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనించడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుందని, సంకల్పాల  సాధనకు మార్గం చూపుతుందని ఆయన అన్నారు. "ఓటమి పాఠాల నుండి విజయం ఎలా సాధ్యమవుతుందో ఈ రోజు సూచిస్తుంది" అని ప్రధాన మంత్రి ముగించారు, శాస్త్రవేత్తలు వారి భవిష్యత్తు ప్రయత్నాలన్నింటిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

***



(Release ID: 1951976) Visitor Counter : 129