వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈ నెలలో దేశీయ కోటా కింద 2 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను అదనంగా కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం
Posted On:
22 AUG 2023 5:09PM by PIB Hyderabad
రాబోయే పండుగలు ఓనం, రక్షా బంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చక్కెరకు బలమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ నెలలో అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఆగస్టు నెల కోసం ఇప్పటికే 23.5 ఎల్‌ఎంటీలకు పైగా కేటాయింపు) చక్కెరను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే ఈ అదనపు చక్కెరతో దేశమంతటా సరైన ధరలు కొనసాగుతాయి.
గత ఏడాది కాలంలో అంతర్జాతీయ చక్కెర ధరలు 25% పెరిగినప్పటికీ, దేశంలో చక్కెర సగటు చిల్లర ధర కిలోకు ₹43.30గా ఉంది, పరిమిత పరిధిలోనే కొనసాగే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో, దేశంలో చక్కెర ధరల్లో వార్షిక ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉంది.
ప్రస్తుత చెరకు సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్) 2022-23లో, ఇథనాల్ ఉత్పత్తి కోసం దాదాపు 43 ఎల్‌ఎంటీలను మళ్లించగా, దేశంలో ఇంకా 330 ఎల్‌ఎంటీల ఉత్పత్తిని చేసినట్లు అంచనా వేశారు. దేశీయ వినియోగం దాదాపు 275 ఎల్‌ఎంటీలు ఉండవచ్చని అంచనా.
ప్రస్తుత చెరకు సీజన్ 2022-23లోని మిగిలిన నెలల్లో దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశంలో తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయి. ఈ సీజన్ ముగింపు నాటికి, అంటే 30.09.2023 నాటికి 60 ఎల్‌ఎంటీల (రెండున్నర నెలల పాటు చక్కెర వినియోగానికి సరిపోతుంది) ముగింపు నిల్వ అందుబాటులో ఉంటుంది.
ప్రతి సంవత్సరం జులై-సెప్టెంబరులో, తదుపరి సీజన్‌కు ముందు, చెరకు క్రషింగ్ ప్రారంభంలో ధరలు పెరుగుతాయి, ఆ తర్వాత తగ్గుతాయి. కాబట్టి ఇటీవల పెరిగిన చక్కెర ధరలు వెంటనే తగ్గే అవకాశం ఉంది. అందువల్ల, చక్కెర ధర నామమాత్రంగా పెరుగుతుంది, అది కూడా స్వల్ప కాలమే ఉంటుంది.
****
(Release ID: 1951246)
Visitor Counter : 122