ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ అధ్యక్షతన - జి20 సమావేశాలు
ఇండియా మెడ్ టెక్ ఎక్స్ పో 2023 ని ప్రారంభించిన - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
భారతదేశం "ప్రపంచానికి ఔషధశాల" గా గుర్తింపు పొందింది. వైద్య పరికరాల రంగంలో భారతదేశం ముందంజ వేయడానికి, సరసమైన, వినూత్నమైన, నాణ్యమైన వైద్య పరికరాల తయారీలో అగ్రగామిగా మారడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది : డాక్టర్ మాండవీయ
“భారతదేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చాలనే గౌరవప్రదమైన ప్రధానమంత్రి ఆలోచన నుంచి మెడ్ టెక్ ఎక్స్ పో 2023 ప్రేరణ పొందింది. భారతీయ వైద్య పరికరాల పర్యావరణ వ్యవస్థకు ఉన్న బలం, సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక ప్రత్యేకమైన, అన్నింటినీ కలుపుకుపోయే వేదిక కానుంది”
"వైద్య పరికరాల రంగంలో స్వావలంబనగా మారడం, మన ఆత్మనిర్భర్ భారత్, "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" వంటి దార్శనికత తో సంపూర్ణంగా సరిపోయే విధంగా దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడమే మన లక్ష్యం"
"వైద్య పరికరాల కోసం ఎగుమతి అభివృద్ధి మండలి , మెడికల్ డివైస్ క్లస్టర్ సహాయం కోసం ఒక పథకం వంటివి, భారత దేశంలోని వైద్య పరికరాల కోసం మౌలిక సదుపాయా
Posted On:
17 AUG 2023 4:36PM by PIB Hyderabad
“భారతదేశం "ప్రపంచానికి ఔషధశాల" గా గుర్తింపు పొందింది. వైద్య పరికరాల రంగంలో ముందంజ వేయడానికి, సరసమైన, వినూత్నమైన, నాణ్యమైన వైద్య పరికరాల తయారీలో భారతదేశం అగ్రగామి గా మారడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశం నేపథ్యంలో గుజరాత్ లోని గాంధీనగర్ లో నిర్వహించిన భారతదేశపు మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ ఎక్స్‌పో 'ఇండియా-మెడ్-టెక్-ఎక్స్‌పో-2023' ప్రారంభించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఈ విషయం చెప్పారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్; నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్; గుజరాత్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రుషికేష్ పటేల్ ప్రభృతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, “భారత దేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చాలన్న గౌరవనీయులు ప్రధానమంత్రి ఆశయానికి అనుగుణంగా మెడ్-టెక్-ఎక్స్-పో-2023 ప్రేరణ పొందింది. భారతీయ వైద్య పరికరాల పర్యావరణ వ్యవస్థ బలం, సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక విశిష్టమైన, అన్నింటినీ కలుపుకు పోయే వేదిక కానుంది.” అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య పరికరాల మార్కెట్ అని కూడా ఆయన నొక్కి చెప్పారు.
"వైద్య పరికరాల రంగంలో స్వావలంబన సాధించడం మన లక్ష్యం. మన ఆత్మనిర్భర్ భారత్, "మేక్-ఇన్-ఇండియా, మేక్--ఫర్-ది-వరల్డ్"తో సంపూర్ణంగా సరిపోయే విధంగా మనం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే మన లక్ష్యం. వైద్య పరికరాల తయారీకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం వరకు ఎఫ్.డి.ఐ. అనుమతించబడుతుంది." అని కేంద్ర మంత్రి చెప్పారు. "భారతదేశంలో వైద్య పరికరాల రంగం కోసం, గౌరవనీయులైన ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక నియమాలు, నిబంధనలను సడలించడం ద్వారా, వ్యాపారం చేయడం, సాంకేతిక పురోగతి, పెట్టుబడి విధానాలను సరళీకృతం చేయడం మొదలైన వాటిపై దృష్టి సారించడం వంటి అనేక చర్యలు చేపట్టింది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ రంగం కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమాల గురించి డాక్టర్ మాండవీయ ప్రత్యేకంగా పేర్కొంటూ, "జాతీయ వైద్య పరికరాల విధానం-2023 తో పాటు, ప్రభుత్వం ఇటీవల వైద్య పరికరాల కోసం ఎగుమతి అభివృధి మండలి ని ప్రారంభించింది. అదేవిధంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, దేశంలోని వైద్య పరికరాల కోసం పరీక్షా సౌకర్యాలను బలోపేతం చేయడానికి వైద్య పరికరాల క్లస్టర్ కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది." వివరించారు. వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, నాలుగు లక్ష్య విభాగాల వైద్య పరికరాల కోసం, ఉత్పత్తి అనుసంధానం ప్రోత్సాహక (పి.ఎల్.ఐ) పథకాన్ని 3,420 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించామని, ఆయన తెలియజేశారు. "సాధారణ మౌలిక సదుపాయాల కల్పనకు, తయారీకి ఊతమివ్వడానికి, ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధిని ప్రోత్సహించడానికి, 400 కోట్ల రూపాయల ఆర్ధిక వ్యయంతో, 'వైద్య పరికరాల పార్క్ అభివృద్ధి' పధకంతో కూడా మనం ముందుకు వచ్చాము.” అని కూడా ఆయన చెప్పారు. ఈ పథకం కింద ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికీ 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయానికి తుది ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు.
భారత దేశంలోని వైద్య పరికరాల రంగంలో అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ వైవిధ్యమైనది, శక్తివంతమైనదని, ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 250 కి పైగా సంస్థలు ఆవిష్కరణలలో నిమగ్నమై ఉన్నాయని డాక్టర్ మాండవీయ చెప్పారు. “కోవిడ్-19 ప్రారంభమైన 2-3 నెలల్లోనే, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లు, ఆర్.టి.-/పి.సి.ఆర్.కిట్లు, ఐ.ఆర్.థర్మామీటర్లు, పి.పి.ఈ.కిట్లు, ఎన్-95 మాస్క్ లను చాలా వేగంగా అందించడం ద్వారా ఇతర దేశాలకు భారతదేశం చేసిన సహాయాన్ని, మద్దతును ప్రపంచం చూసింది, గుర్తించింది." అని ఆయన చెప్పారు. మెరుగైన సాంకేతికత, అధునాతన వైద్య పరికరాల కోసం డిమాండ్ ను పెంచే మెరుగైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ప్రభుత్వం భారీ పెట్టుబడి పెడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియజేశారు.
"భారతీయ మెడ్-టెక్ రంగం దాని వృద్ధిని, శ్రేష్ఠతను వేగవంతం చేసింది. పరిమాణం, నాణ్యత, ప్రపంచవ్యాప్తంగా దాని చేరువ పరంగా ఘాతాంక వృద్ధి దిశలో పయనించడానికి ఇది ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ లో ఉంది" అని డాక్టర్ వి.కె.పాల్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చే దిశగా దేశంలో పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వ విధానాలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఔషధాల తయారీకి, వైద్య పరికరాల తయారీకి ఏ.పి.ఐ. (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) ల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పి.ఎల్.ఐ. (ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక) పథకం సహాయపడిందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశాన్ని వైద్య పరికరాలకు "గ్లోబల్ హబ్" గా మార్చే దిశగా పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంలోనే భవిష్యత్తు ఉందని ఆయన పేర్కొన్నారు. "కొనసాగుతున్న సాంకేతిక విప్లవాలు, పరికరాల సూక్ష్మీకరణ, ఐ.ఓ.టి., 3-డి ప్రింటింగ్ తోపాటు, వైద్య పరికరాల ఏకీకరణ ద్వారా వైద్య పరికరాల భవిష్యత్తు భారీ పరివర్తనలకు గురికావడానికి సిద్ధంగా ఉంది" అని కూడా ఆయన పేర్కొన్నారు.
శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశం ఆరోగ్య సంరక్షణలో భారీ ప్రగతిని సాధిస్తోంది" అని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. వచ్చే సంవత్సరాల్లో ఈ రంగం వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉందని ఆయన నొక్కిచెప్పారు.
దేశంలోని ప్రముఖ ఔషధాలు, వైద్య పరికరాల తయారీదారులకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తుందన్న విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, "గుజరాత్‌లోని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఔషధాల తయారీలో 33 శాతం వాటాతో పాటు, ఔషధ ఎగుమతుల్లో 28 శాతం వాటాతో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ మాట్లాడుతూ, "నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో వైద్య పరికరాల రంగం ఒకటి. ఈ రంగం యొక్క సామర్థ్యాన్ని గుర్తించి, కేంద్ర ప్రభుత్వం వైద్య పరికరాలను దేశీయంగా తయారుచేయడానికి పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా సి.టి. స్కాన్ మెషీన్ల వంటి అత్యాధునిక ఉత్పత్తులతో సహా నేడు దేశంలో 30 ప్రత్యేకమైన ఉత్పత్తులను తయారు చేయడంతో వైద్య పరికరాల తయారీలో దేశీయ సామర్ధ్యం పెరిగింది." అని తెలియజేశారు.
కేంద్ర ఫార్మా సెక్రటరీ మాట్లాడుతూ, "వైద్య పరికరాల తయారీ, డిమాండ్ వైపు రెండింటినీ తీర్చడానికి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు బహుముఖ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం కింద భారతదేశం ఇప్పుడు సిరంజి నుండి స్టెంట్ల వరకు మొత్తం వైద్య పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ మెడ్-టెక్-ఎక్స్-పో వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించే విధానంలో ఒక భాగం” అని పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీ కోసం దేశవ్యాప్తంగా నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులను నిర్మిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. వైద్య పరికరాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు జాతీయ వైద్య పరికరాల ఎగుమతి అభివృద్ధి మండలి ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. తమ ఉత్పత్తుల నాణ్యత, స్థోమత, రోగి కేంద్రీకరణను నిర్ధారించాలని ఆమె వైద్య పరికరాల తయారీదారులను మరింత ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ప్రముఖులు మెడ్-టెక్-ఎక్స్‌పో-కాంపెండియం పేరుతో భవిష్యత్తు, పరిశోధన, అభివృద్ధి పెవిలియన్ గురించి ఒక చిన్న పుస్తకంతో పాటు భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ సెక్టార్ పై మరొక చిన్న పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో - గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్; గుజరాత్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.జె. హైదర్; నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పి.పి.ఏ) చైర్మన్ శ్రీ కమలేష్ కుమార్ పంత్; ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.ఐ.సి.సి.ఐ) మెడికల్ డివైస్ కమిటీ చైర్మన్ శ్రీ తుషార్ శర్మ; ట్రాన్సాసియా బయో మెడికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సురేష్ వజిరాణి తో పాటు, ప్రభుత్వం, పరిశ్రమలు, మీడియా సంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
****
(Release ID: 1950205)
Visitor Counter : 196