ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ ప్ర‌పంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదగడానికి 140 కోట్ల మంది దేశ పౌరుల కృషే కారణం: ప్ర‌ధానమంత్రి


“రూ.20 లక్షల కోట్లతో స్వయం ఉపాధి ద్వారా 8 కోట్లమంది
యువతకు అండగా నిలిచిన ప్రభుత్వం: శ్రీ నరేంద్ర మోదీ;

కోవిడ్‌ మహమ్మారితో ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం దివాలా తీయకుండా
ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల రుణంతో దన్నుగా నిలిచింది: ప్ర‌ధానమంత్రి;

ప్రధానమంత్రి ముద్ర యోజన తోడ్పాటుతో 8 కోట్ల మంది పౌరులు
తమ కాళ్లపై నిలబడి.. కనీసం ఒకరిద్దరికి ఉపాధి కల్పించారు: శ్రీ మోదీ

ద్రవ్యోల్బణంపై పోరాటం కొనసాగిస్తామంటూ ప్రతినబూనిన ప్ర‌ధానమంత్రి

Posted On: 15 AUG 2023 2:52PM by PIB Hyderabad

   దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ స్థానానికి ఎదగడానికి 140 కోట్ల మంది ప్రజల కృషే కారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు బలమైన ఆర్థిక వ్యవస్థ సృష్టి, పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రజాధనాన్ని గరిష్ఠంగా ఖర్చు చేయడ ద్వారానే ఈ విజయం సాధ్యమైందన్నారు.

   ప్ర‌ధాని శ్రీ మోదీ తన ప్రసంగం కొనసాగిస్తూ- “దేశ ప్ర‌జ‌ల‌కు ఇవాళ నేనొక విషయం చెప్పాలని భావిస్తున్నాను. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే అది ఖజానాను సంపదతో నింపుతుందని అర్థం కాదు; తద్వారా దేశంతోపాటు ప్రజల సామర్థ్యం ఇనుమడిస్తుంది. ప్రజాధనంలో ప్రతి పైసానూ ప్రజా సంక్షేమం కోసమే వినియోగిస్తామని ప్రభుత్వం ప్రతినబూనితే సత్ఫలితాలు వాటంతట అవే సిద్ధిస్తాయి. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్ల మేర నిధులు అందిస్తూండేది. అయితే, గడచిన 9 ఏళ్లలో ఇది రూ.100 లక్షల కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలను బట్టి సామర్థ్యంలో పెద్ద పెరుగుదలవల్లనే  ఇంతటి భారీ పరివర్తన సాధ్యమైందని మీకు అవగతం అవుతుంది!” అన్నారు.

   స్వయం ఉపాధి విషయానికొస్తే- “దేశంలోని యువతరం తమకు అనువైన ఉపాధిని ఎంచుకునే దిశగా రూ.20 లక్షల కోట్లతో చేయూతనిచ్చాం. తద్వారా 8 కోట్ల మంది తమదైన వ్యాపార, ఉపాధి కార్యకలాపాలు ప్రారంభించారు. అంతేకాదు… కనీసం ఒకరిద్దరికి తామే ఉపాధి కూడా కల్పించారు. ఆ మేరకు ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా లబ్ధిపొందిన 8 కోట్ల మంది ద్వారా కనిష్ఠంగా 8 నుంచి 10 కోట్ల మందికి కొత్తవారికి ఉపాధి కల్పించగల సామర్థ్యం సాధించారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. కోవిడ్‌-19 గురించి ప్రస్తావిస్తూ- మహమ్మారి చీకట్లు కమ్ముకున్న వేళ ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం దివాలా తీయకుండా ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల రుణంతో దన్నుగా నిలిచింది” అని శ్రీ మోదీ గుర్తుచేశారు.

   దేశంలో వర్ధిల్లుతున్న సరికొత్త-ఔత్సాహిక మధ్యతరగతి గురించి మాట్లాడుతూ- “దేశంలో పేదరికం తగ్గినప్పుడు మధ్యతరగతి శక్తి ఎంతగానో ఇనుమడిస్తుంది. తదనుగుణంగా రాబోయే ఐదేళ్లలో మన దేశం ప్రపంచంలోని తొలి మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. దేశంలో ఇవాళ 13.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులై మధ్యతరగతి శక్తిగా మారారు. పేదల కొనుగోలు శక్తి పెరిగితే, మధ్యతరగతి వ్యాపార శక్తి కూడా పెరుగుతుంది. గ్రామం కొనుగోలు శక్తి పెరిగితే.. పట్టణం-నగర ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తుంది. ఇది మన పరస్పర అనుసంధానిత ఆర్థిక వలయం. దాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ముందడుగు వేసేలా  మేం కృషి చేస్తున్నాం” అని శ్రీ మోదీ చెప్పారు. అదేవిధంగా “ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి  రూ.7 లక్షలకు పెంచడం వల్ల వేతన జీవులకు.. ముఖ్యంగా మధ్యతరగతికి లబ్ధి చేకూరింది” అని ప్రధానమంత్రి వివరించారు.

   యావత్‌ ప్ర‌పంచం సమష్టిగా ఎదుర్కొంటున్న ఇటీవ‌లి సవాళ్లను ప్ర‌స్తావిస్తూ- “ప్ర‌పంచం ఇంకా కోవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడలేదు. యుద్ధం ఒక కొత్త సమస్యను సృష్టించింది. దీనికితోడు ద్రవ్యోల్బణ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ దిశగా భారతదేశంలో సాగుతున్న కృషిని వివరిస్తూ- “ద్రవ్యోల్బణం నియంత్రణకు భారత్‌ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. కానీ, మన దేశంలో పరిస్థితులు ప్రపంచంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని చెప్పలేం. ఈ నేపథ్యంలో నా దేశ పౌరులపై ద్రవ్యోల్బణ దుష్ప్రభావం పడకుండా నేను మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆ మేరకు నా వంతు కృషి కొనసాగిస్తాను” అని ప్రధానమంత్రి ప్రతినబూనారు.

 

*****


(Release ID: 1949060) Visitor Counter : 209