రాష్ట్రప‌తి స‌చివాల‌యం

77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం తెలుగు అనువాదం

Posted On: 14 AUG 2023 7:40PM by PIB Hyderabad

నా ప్రియమైన సహ పౌరులారా,

77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్పూర్తిగా నా శుభాకాంక్షలు. మన అందరికీ ఇది అత్యంత వైభవోపేతమైన, శుభప్రదమైన సందర్భం. మనదేశంలో ఈనాడు నెలకొన్న పండుగ వాతావరణం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. పిల్లలు యువజనులు వయోవృద్ధులు, నగరాల్లో గ్రామాల్లో, దేశంలో ప్రతి చోటా, ఈ స్వేచ్చా ఉత్సవాన్ని జరుపుకునేందుకు ఉత్తేజంతో సన్నద్ధ మవుతుంటే నాకు ఎంతో ఆనందం, గర్వం కలుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

స్వాతంత్ర దినోత్సవం అంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. మా గ్రామ పాఠశాలలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం అంటే మాకు అత్యంత ఉత్సాహం కలిగించే సందర్భం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు మాలో ఒక ఉజ్వలమైన శక్తి ఏదో నిండిపోయేది. దేశభక్తి, దేశం పట్ల గర్వంతో నిండిన మనసులతో మేము త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించేవాళ్ళం. మిఠాయిలు పంచేవారు. దేశభక్తి పాటలు పాడుకునేవాళ్ళం. ఆ తర్వాత అనేక రోజులపాటు ఆ పాటలు మా చెవుల్లో మారుమోగుతూ ఉండేవి. నేను స్కూల్ టీచర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు మళ్లీ ఈ వేడుకలన్నీ నాకు అనుభవంలోకి వచ్చే సువర్ణవకాశం లభించడం నా అదృష్టం.

మనం పెద్దవాళ్ళమైన తర్వాత పిల్లల మాదిరిగా అంత బాహాటంగా సంతోషాన్ని వ్యక్తం చేయకపోవచ్చు. కానీ జాతీయ పండుగలు జరుపుకోవడంలో ఉన్న దేశభక్తి భావన, ఉత్సాహం స్థాయి ఏమాత్రం తగ్గదు అని మాత్రం నాకు నమ్మకం ఉంది. స్వాతంత్ర దినోత్సవం మనం కేవలం వ్యక్తులం మాత్రమే కాదని ఒక గొప్ప సమాజంలో భాగమని గుర్తుచేస్తుంది. ఇది అతి పెద్ద, అత్యంత గొప్పదైన ఒక సమాజం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి చెందిన పౌరుల సమూహం.

స్వాతంత్ర దినోత్సవ నాడు మనం జరుపుకునే వేడుక మనం ఒక గొప్ప ప్రజాస్వామ్యంలో భాగమని తెలియచేస్తుంది. మనందరికీ కూడా అనేక రకాల గుర్తింపులు ఉన్నాయి. కులం మతం జాతి భాష ప్రాంతమే కాకుండా మన కుటుంబాలు మన వృత్తికి సంబంధించి కూడా మనకు అనేక గుర్తింపులు ఉన్నప్పటికీ అన్నిటికంటే అత్యున్నతమైన, అతి ముఖ్యమైన ఒక గుర్తింపు భారత పౌరులమనే గుర్తింపు. మనలో ప్రతి ఒక్కరూ సమానమైన పౌరులం. ఈ దేశంలో మనలో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు, సమాన హక్కులు, సమాన విధులు ఉన్నాయి.

కానీ ఒకప్పుడు ఈ పరిస్థితి ఇలా లేదు. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృదేశం. ప్రాచీన కాలం నుంచి అట్టడుగు స్థాయిలో మన దేశంలో ప్రజాస్వామిక సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ సుదీర్ఘ వలస పాలన కారణంగా ఆ వ్యవస్థలు నాశనమైనాయి. 1947 ఆగస్టు 15వ తేదీన ఒక కొత్త ఉదయానికి ఈ జాతి జాగృతమైంది. విదేశీ పాలన నుంచి విముక్తి పొందడమే కాక మన భవిష్యత్తును మన జాతకాన్ని తిరిగి రచించుకునే స్వేచ్ఛ మనకి లభించింది.

విదేశీ పాలకులు, వివిధ వలస దేశాల నుంచి ఉపసంహరించుకుని, వలసవాదానికి చరమగీతం పాడే శకం మన స్వాతంత్రంతోనే ప్రారంభమైంది. మన స్వాతంత్ర సంగ్రామం అనేది తన పోరాట లక్ష్యసాధనలో విజయం సాధించిందనడమే కాక అసలు ఆ పోరాటం జరిగిన పద్ధతి ప్రత్యేకంగా చెప్పుకోదగినది. మహాత్మాగాంధీ తో పాటు అనేకమంది అసాధారణమైన దార్శనికత కల నాయకుల నేతృత్వంలో మన జాతీయ ఉద్యమం, విశిష్టమైన విలక్షణమైన ఆదర్శాల ద్వారా సక్రియాత్మకంగా, ఆచరణాత్మకంగా మారింది. గాంధీజీ, ఇతరులు భారత్ ఆత్మను మరోసారి ప్రదీప్తం చేసి మన నాగరికత విలువలను మన జాతి తిరిగి తెలుసుకునేలాగా సహాయపడ్డారు. భారత్ ను ఉదాహరణగా తీసుకుని మన ప్రతిఘటనకు ప్రాతిపదికలైన సత్యం అహింస ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పోరాటాల్లో సార్థకమైన ఉపకరణాలుగా మారాయి.

రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను నా సహపౌరులతో కలిసి ప్రముఖ స్వాతంత్ర్య సేనానులు. అజ్ఞాత స్వాతంత్ర సమరయోధులందరికీ కృతజ్ఞతతో నివాళి అర్పిస్తున్నాను. వారి త్యాగాల కారణంగానే భారత్ ప్రపంచ దేశాల సమూహంలో తనదైన స్థానాన్ని తిరిగి సంపాదించుకోగలిగింది. మాతంగిని hazra, కనకలత బారువా వంటి గొప్ప మహిళా స్వాతంత్ర సమరయోధులు భారతమాత కోసం తమ ప్రాణాలను అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీతో ప్రతి అడుగులో కలిసి నడిచిన కస్తూరిబా గాంధీ సత్యాగ్రహ పథంలో అత్యంత క్లిష్టమైన ప్రయాణంలో ముందుకు సాగారు. సరోజినీ నాయిడు, అమ్ము స్వామినాథన్, రమాదేవి, అరుణా అసఫ్ అలీ, సుచేతా కృపలాని వంటి గొప్ప మహిళ నాయకులు భవిష్య తరాల మహిళలకు స్ఫూర్తిదాయకమైన ఆదర్శాలను నిర్వచించారు. ఆత్మవిశ్వాసంతో జాతికి, సమాజానికి సేవ చేసే లాగా స్పూర్తి గా నిలిచారు.

దేశంలో ప్రతి రంగంలో పురోభివృద్ధికి సేవకి మహిళలు ఈనాడు విస్తృతంగా తమ వంతు కృషి చేస్తున్నారు మన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం మహిళల భాగస్వామ్యాన్ని కనీసం ఊహించే ఆస్కారం కూడా లేని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మనదేశంలో మహిళల ఆర్థిక సాధికారత సాధన పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఆర్థిక సాధికారత ద్వారా మహిళలకు కుటుంబంలో, సమాజంలో ఉన్న స్థానం మరింత బలోపేతం అవుతుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను నా సహపౌరులందరినీ కోరుతున్నాను. మన అక్కచెల్లెళ్లు, మన బిడ్డలు ధైర్య సాహసాలతో సవాళ్లను అధిగమించి, జీవితంలో ముందుకు సాగాలి. మన స్వాతంత్ర సమరంలో కూడా మహిళా అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ఆదర్శాల్లో ఒకటి.

ప్రియమైన పౌరులారా,

మన చరిత్రతో మనని మనం తిరిగి జోడించుకునేందుకు స్వాతంత్ర దినోత్సవం ఒక సందర్భం. మన వర్తమానం గురించి అంచనా వేసుకుని భవిష్యదభిముఖంగా ఏ విధంగా సాగాలో ఆలోచించుకోవాల్సిన సందర్భం. వర్తమానాన్ని ఒక సారి బేరీజు వేసుకుంటే, భారత్ ప్రపంచ రంగస్థలం పైన తనదైన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్న విషయమే కాదు అంతర్జాతీయ వ్యవస్థలో తన ప్రతిష్టను మరోసారి పెంచుకున్న విషయం గోచరిస్తుంది. విదేశాల్లో పర్యటించినప్పుడు, భారతీయ సంతతికి చెందిన వారితో ముచ్చటించినప్పుడు నాకు భారత్ కథనం పట్ల కొత్త విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి, మానవతా లక్ష్యాలను పెంపొందించడంలో భారత్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ వేదికల పైన. ముఖ్యంగా జి 20 వంటి కూటమి అధ్యక్ష బాధ్యతతో, నాయకత్వ బాధ్యతలను కూడా భారత్ భుజాలకి ఎత్తుకుంది.

ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులకు ప్రాతినిధ్యం వహించే జి 20 కూటమి అధ్యక్షత సరైన దిశలో ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేందుకు మనకి ఒక విలక్షణమైన అవకాశం కల్పిస్తోంది. జి 20 అధ్యక్ష బాధ్యతతో భారత్ వాణిజ్యంలో, ఆర్థిక రంగంలో సమాన ప్రగతి దిశగా నిర్ణాయక ప్రక్రియలను మళ్ళించగలదు. వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలే కాక మానవ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఎజెండాలో భాగంగా ఉన్నాయి. మొత్తం మానవాళికి సంబంధించిన అనేక సమస్యలు, కేవలం భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాలేదు. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్ ఇప్పటికే తన నాయకత్వం పటిమను రుజువు చేసుకుంది. సభ్య దేశాలు కూడా భారత్ నాయకత్వంలో ఈ రంగాల్లో సమర్థవంతమైన కార్యాచరణను చేపట్టగలుగుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది.

భారత్ జి ఇరవై అధ్యక్షతలో చెప్పుకోదగ్గ విషయం ఈ దౌత్యపరమైన కార్యక్రమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లడం. మొట్టమొదటిసారిగా ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ప్రోత్సహించేందుకు ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదాహరణకి జి ఇరవై ఇతివృత్తాల పైన వివిధ పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించిన అనేక పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో హర్షం కలిగిస్తుంది. పౌరులందరూ కూడా జి 20 కి సంబంధించిన కార్యక్రమాల గురించి ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రియమైన సహ పౌరులారా,

ఈ ఉత్సాహంతో పాటు, తమకు సాధికారత లభించింది అన్న భావన అన్ని రంగాల్లో మన దేశం ముందుకు వేగంగా సాగడం వల్లనే సాధ్యమైంది. కష్టకాలంలో మనగలిగే శక్తి ఉందని మన అర్ధ వ్యవస్థ రుజువు చేసుకోవడమే కాక ఇతరులకు కూడా ఆశాకిరణంగా నిలిచింది. మహమ్మారి అనంతరం అనేక అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఒక అనిశ్చితి పెరగడంతో ప్రపంచ అర్థ వ్యవస్థ ఒక క్లిష్టమైన, సున్నితమైన దశకి చేరుకుంది. అయినప్పటికీ మన ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితిలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించగలిగింది. సవాళ్లను అవకాశాలుగా మలచుకుని అధిక స్థూల జాతీయోత్పత్తి వృద్ధి సాధించింది. అన్నదాతలైన మన రైతులు మన ఆర్థిక ఆభివృద్ధికి గణనీయంగా దోహదం చేశారు మన జాతి వారికి రుణపడి ఉంది.

ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. కానీ భారత్ లో ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగాయి. అధిక ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలను కాపాడడంతో పాటు ప్రభుత్వం మరింత విస్తృతమైన సామాజిక భద్రత కల్పించడంలో కూడా విజయవంతమైంది. ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శకత్వం కోసం ప్రపంచం భారత్ దిశగా చూస్తోంది.

మన ఆర్థిక ప్రగతి కొనసాగేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. ఒకపక్క వ్యాపారం చేయడాన్ని తేలిక చేసి వెసులుబాటు కల్పించి ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ద్వారా పారిశ్రామిక శక్తులను ఉత్తేజపరిచే ఒక సుస్థిరమైన చర్య తీసుకుంటుండగా, మరో పక్క అవసరంలో ఉన్న వారి కోసం వివిధ రంగాల్లో క్రియాశీలకమైన, విస్తృతమైన సంక్షేమ పథకాలు కూడా చేపడుతున్నాం. అణచివేతకు గురైన వారు, పేదరికంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన విధానాలకు, కార్యాచరణ ప్రణాళికలకు కేంద్ర బిందువు. దీని వల్ల గత దశాబ్ద కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయగలిగాము. అదే విధంగా గిరిజనుల స్థితిగతులను మెరుగుపరిచి వారు ప్రగతి ప్రయాణంలో సమానంగా కలిసి అడుగులు వేసేలాగా ప్రోత్సహిస్తున్నాము. మన గిరిజన సోదర సోదరీమణులు ఆధునికతను అనుసరిస్తూనే, తమ సంప్రదాయాలను మరింత సుసంపన్నం చేయాలని నేను కోరుతున్నాను.

ఆర్థిక అభివృద్ధితో పాటు మానవాభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం నాకు సంతోషం కలిగిస్తోంది. ఒక టీచర్ గా పని చేసినందు వల్ల నేను విద్య అనేది సామాజిక సాధికారతకు అతి పెద్ద ఉపకరణం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను. 2020 జాతీయ విద్యా విధానం కారణంగా మార్పు కనిపిస్తోంది. అభ్యాస ప్రక్రియ మరింత వెసులుబాటుతో మెరుగైంది అన్న విషయం వివిధ స్థాయిల్లో విద్యార్థులు విద్యావేత్తలతో చర్చించడం ద్వారా నాకు అర్థమైంది. అత్యంత దార్శనికతతో కూడుకున్న విద్యా విధానం, ప్రాచీన విలువలను ఆధునిక నైపుణ్యాలను కలబోసి రానున్న సంవత్సరాల్లో విద్యారంగంలో మునుపెన్నడూ లేని స్థాయిలో మార్పులు తీసుకువస్తుంది. మన జాతి పరివర్తనకు తోడ్పడుతుంది. భారత్ ఆర్థిక ప్రగతికి ప్రజల కలలు ఇంధనంగా పనిచేస్తాయి. ముఖ్యంగా యువతరానికి అపరిమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అంకుర పరిశ్రమల నుంచి క్రీడల వరకు మన యువజనుల అత్యుత్తమ, అత్యున్నత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

నూతన భారతావని ఆశయాలకు అంతులేని కోణాలు ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ, విశిష్టతకు కొత్త ప్రాతిపదికలు, కొలమానాలు ఎప్పటికప్పుడు నిర్దేశిస్తోంది. ఈ ఏడాది ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగంతో పాటు, విక్రమ్ అనే ల్యాండర్ prajnaan అనే రోవర్లు రానున్న కొద్దిరోజుల్లో చంద్రుడి మీద దిగనున్నాయి. మన అందరికీ ఒక సగర్వమైన ఆ క్షణం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. అయితే చంద్రుడి పైకి యాత్ర అనేది మన భవిష్య అంతరిక్ష కార్యక్రమాలకు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించనున్నాము.

అంతరిక్షంలో చేసిన కృషికి, భూతలం మీద అనేక విజయాలకు గాను మన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి ఎన్నో ప్రశంసలు తెచ్చిపెడుతున్నారు. పరిశోధన, సృజనాత్మకత, పారిశ్రామిక స్ఫూర్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనుసంధాన్ జాతీయ రిసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫౌండేషన్ మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లో, పరిశోధన, అభివృద్ధికి నిధులు అందించి సృజనాత్మక వృద్ధికి, ప్రోత్సాహానికి తోడ్పడుతుంది.

ప్రియమైన పొరులారా,

మనకి శాస్త్రీయత, విజ్ఞానం అనేవి తమలో తాము తుది లక్ష్యాలు కావు. ప్రజలందరికీ ఒక మెరుగుదల అందించేందుకు ఇవి సాధనాలు. శాస్త్రవేత్తలు విధాన నిర్ణేతలు ప్రపంచవ్యాప్తంగా అత్యవసరంగా దృష్టి సారించవలసిన ఒక అంశం వాతావరణంలో మార్పులు. ఇటీవల కాలంలో మనం ఎన్నో తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాం. భారత్ లో అనేక ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వరదలు వచ్చాయి. అదే సమయంలో తీవ్రమైన కరువు కాటకాలు కూడా కొన్నిచోట్ల నెలకొన్నాయి. ఈ పరిణామాల వల్ల భూగోళం వేడెక్కే సమస్య కూడా తీవ్రతరమైంది. అందువల్ల మనం పర్యావరణం కోసం స్థానిక జాతీయ భౌగోళిక స్థాయిలో కృషి చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో పునర్వినియోగ ఇంధన రంగంలో మనం పెన్నడూ లేని స్థాయిలో లక్ష్యసాధన జరపడం అనేది తప్పనిసరిగా గుర్తించవలసిన విషయం. అంతర్జాతీయ సౌర కూటమికి భారత్ న్యాయకత్వం అందిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న వాగ్దానాలను నెరవేర్చడంలోనూ మనం నాయకత్వం పాత్ర వహిస్తున్నాం. లైఫ్.. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ఒక మంత్రాన్ని మన భౌగోళిక సమాజానికి కానుకగా ఇచ్చాము.

ప్రియమైన సహ పౌరులారా,

ప్రకృతి వైపరీత్యాలు మన అందరికీ కూడా నష్టం కలిగిస్తాయి. అయితే పేదలు అణచివేతకు గురైన వారిపై వీటి ప్రభావం మరింత దుర్భరంగా ఉంటుంది. నగరాలను, పర్వత ప్రాంతాలను ముఖ్యంగా మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఉంది.

అత్యాశతో, దురాశతో నిండిన సంస్కృతి ప్రపంచాన్ని ప్రకృతికి దూరం చేస్తున్నదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. మన మూలాలకు మళ్లీ తిరిగి వెళ్ళవలసిన అతి కీలకమైన అవసరాన్ని మనం ఇప్పుడు గుర్తించాలి. ఇంకా అనేక గిరిజన సమాజాలు ప్రకృతికి చేరువగా, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తున్న విషయం నాకు తెలుసు. వారి ఆదర్శాలు వారి జీవనశైలి వాతావరణం లో మార్పులపై జరిపే పోరాటంలో విలువైన పాఠాలుగా మనకి పనికొస్తాయి.

అనేక యుగాలుగా గిరిజన సమాచారం తమ మనుగడ కాపాడుకోవడం వెనుక ఉన్న రహస్యం ఒక పదంలో చెప్పవచ్చు. ఆ పదం ‘సహానుభూతి’. ప్రకృతి మాత బిడ్డలందరికీ పట్ల వారికి సహానుభూతి ఉంది. అవి మొక్కలు పువ్వులైనా, జీవజాతులైన జంతువులు పక్షులయినా గిరిజన సమాజాలు ఒక సహానుభూతితో వ్యవహరిస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ సహానుభూతి కొరత ప్రపంచాన్ని బాధిస్తుందని అనిపిస్తుంది. కానీ ఇటువంటి దశలు కేవలం తాత్కాలికమని, కరుణ అనేది మన మౌలిక స్వభావమని చరిత్ర రుజువు చేసింది. మహిళలకు ముఖ్యంగా సహానుభూతి ఎంతో ఎక్కువగా ఉంటుందని, మానవాళి దారి తప్పుతున్న సమయంలో వారే మార్గదర్శనం చేస్తారన్నది నా అనుభవం.

కొత్త తీర్మానాలతో మన దేశం అమృతకాలంలోకి అడుగుపెట్టింది. భారత్ సమ్మిళితమైన అభివృద్ధి చెందిన దేశంగా 2047 సంవత్సరం నాటికి నిలిచే దిశగా మనం ముందుకు సాగుతున్నాం. వ్యక్తిగత సమిష్టి కార్యాచరణలో అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాల కోసం కృషి చేయాలన్న మన మౌలిక ధర్మాన్ని నిర్వర్తిస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. దీనివల్ల మన జాతి నిరంతరాయంగా అత్యున్నత విజయాలను సాధిస్తుంది.

ప్రియమైన సహ పౌరులారా,

రాజ్యాంగం మనకు మార్గదర్శక పత్రం. రాజ్యాంగ పీఠికలో మన స్వాతంత్ర సమరానికి ప్రాతిపదికలైన ఆదర్శాలను పొందుపరిచారు. మన జాతి నిర్మాణానికి కృషిచేసిన వారి కలలు సాకారం చేసేందుకు మనం సామరస్యంతో, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుదాం.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సరిహద్దులకు కావాలి కాస్తున్న మన సైనికులు. సాయుధ దళాల జవాన్లు, దేశంలో అంతర్గత భద్రతకు తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ప్రపంచంలో ప్రతి భాగంలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందినవారికి నా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు.

ధన్యవాదాలు

జై హింద్

జై భారత్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1948698) Visitor Counter : 2771