రక్షణ మంత్రిత్వ శాఖ
అస్సాంలోని కోక్రాఝార్‌లో 132వ డ్యూరాండ్ కప్‌ను ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
05 AUG 2023 2:53PM by PIB Hyderabad
డ్యూరాండ్ కప్ 132వ ఎడిషన్ అస్సాంలోని కోక్రాఝార్‌లో 05 ఆగస్టు 2023న ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ వార్షిక ఫుట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభమయ్యారు. ఇటువంటి పోటీలు అస్సామీ నగరంలో జరగడం ఇదే తొలిసారి. ఈ టోర్నమెంట్‌ను సాయుధ దళాలు నిర్వహిస్తుండగా, అందుకు అస్సాం ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోంది.
ఉత్సాహంతో పోటీలను వీక్షించేందుకు సాయ్ స్టిడియంకు వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కోక్రాఝర్‌లో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు సాయుధ దళాలు, బోడోలాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (బిటిసి) చేసిన కృషిని రక్షణ మంత్రి అభినందించారు. తత్ఫలితంగానే తొలిసారి నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమయిందన్నారు. ఫుట్‌బాల్ పట్ల ప్రేమను, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ఈశాన్య ప్రజలను ప్రశంసిస్తూ, ఇది ఒక క్రీడగా అందమైన ఆట మాత్రమే కాదని, అది ఒక ఉద్వేగమని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో అస్సాం అనేకమంది ఫుట్‌బాల్ ప్రతిభకల వారిని తయారు చేసిందని, ఈ క్రీడలో యువత నూతనోత్తేజంతో చేరేందుకు డ్యూరాండ్ కప్ ప్రోత్సహిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఆ ప్రాంతపు సుసంపన్న క్రీడా సంస్కృతి గురించి సుదీర్ఘంగా ప్రసంగించి, పాల్గొంటున్న జట్లన్నింటికీ అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను కోక్రాఝార్‌లో నిర్వహించినందుకు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇందుకు తోడ్పాటునందించేందుకు బిటిసి చేసిన కృషిని అభినందించారు.
ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర, ప్రాంతవ్యాప్తంగా ఉన్న దాదాపు 12,000మంది ఫుట్‌బాల్ ప్రేమికులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలుగా సుఖోయ్ -30 ఎంకెఐ విమానం, ఎంఐ -17 హెలికాప్టర్ ఫ్లైపాస్ట్ (విన్యాసాలు), యుద్ధ విన్యాసాల ప్రదర్శన, గట్కా, భాంగ్రాతో పాటుగా స్థానిక బృందంచే బోడో సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఉన్నాయి.
అస్సాం విద్యుత్, క్రీడ, యువజన సంక్షేమం, సహకారం & ఐటిఎఫ్‌సి (పురావస్తుశాఖ) మంత్రి శ్రీమతి నందితా గోర్లోసా, చేనేత & జౌళి, భూసార పరిరక్షణ & బోడోలాండ్ సంక్షేమ మంత్రి శ్రీ ఉర్ఖావ్ గ్వరా బ్రహ్మ, బిటిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు శ్రీ ప్రమోద్ బోరో, చీఫ్ ఆఫ్ ది ఆర్మీస్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, జిఒసి-ఇన్- సి తూర్పు కమాండ్ లెఫ్టనెంట్ జనరల్ ఆర్‌పి కలిత, ఎఒసి-ఇన్-సి, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్ ఎస్‌పి ధర్కర్, జనరల్ ఆఫీసర్ కమాండ్, గజ్‌రాజ్ కార్ప్స్ లెఫ్టెనెంట్ మనీష్ ఎర్రి, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, రెండ్ హార్న్స్ డివిజన్ మేజర్ జనరల్ ఎస్ మురుగేశన్, ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ చౌబే వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.
ప్రారంభ కార్యక్రమానంతరం టోర్నమెంట్‌కు సంబంధించిన ఓపెనింగ్ మ్యాచ్ బోడోలాండ్ ఎఫ్‌సి, రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సి మధ్య జరిగింది. కోక్రాఝర్ వాసులు ఎనిమిది గ్రూప్ మ్యాచ్‌లను, 24 ఆగస్టు 2023న జరుగనున్న ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. నేపాల్, బంగ్లదేశ్ నుంచి వచ్చిన రెండు విదేశీ టీమ్‌లు, భారత సాయుధ దళాలకు చెందిన మూడు టీమ్‌లు, బోడోలాండ్ ఎఫ్‌సికి చెందిన స్థానిక టీమ్ సహా మొత్తం 24 టీములు మొత్తం మూడు ప్రదేశాలు- కోల్‌కత, గువాహతి, కోక్రాఝార్‌లో టోర్నమెంట్ సందర్భంగా తలపడనున్నాయి.
***
(Release ID: 1946169)
Visitor Counter : 142