ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్రలోని పుణేలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం... శంకుస్థాపన


పుణే మెట్రోలో పూర్తయిన సెక్షన్ల ప్రారంభోత్సవంలో భాగంగా రైళ్లకు పచ్చ జెండా;

పీఎంఏవై కింద నిర్మించిన ఇళ్ల అప్పగింత.. మరికొన్నిటికి శంకుస్థాపన;

‘వర్థ్యం నుంచి విద్యుత్తు’ ఉత్పాదన ప్లాంటుకు ప్రారంభోత్సవం;

“దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే.. యువత
కలలు నెరవేర్చే శక్తిమంతమైన నగరం పుణే”;

“పౌరుల జీవన నాణ్యత మెరుగుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది”;

“ఆధునిక భారత నగరాలకు మెట్రో సరికొత్త జీవనాడిగా మారుతోంది”;

“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత పారిశ్రామికాభివృద్ధికి
మార్గం సుగమం చేసింది మహారాష్ట్ర పారిశ్రామిక ప్రగతే”;

“పేదలైనా.. మధ్యతరగతి వారైనా... ప్రతి కలనూ నెరవేర్చడమే మోదీ హామీ”

Posted On: 01 AUG 2023 3:11PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పుణే నగరంలో మెట్రో మార్గాల పరిధిలో పూర్తయిన సెక్షన్ల ప్రారంభోత్సవంలో భాగంగా పచ్చ జెండా ఊపి మెట్రో రైళ్లను కూడా ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద పింప్రి-చించ్‌వాడ్ పురపాలక సంస్థ  (పిసిఎంసి) నిర్మించిన 1,280 ఇళ్లతోపాటు పుణే నగరపాలక సంస్థ నిర్మించిన 2650 ఇళ్లను కూడా ఆయన లబ్ధిదారులకు అప్పగించారు. అంతేకాకుండా ‘పిఎంఎవై’  కింద ‘పిసిఎంసి’ నిర్మించే మరో 1,190 ఇళ్లతోపాటు పుణే నగరపాలిక ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ  నిర్మించబోయే 6,400 ఇళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మరోవైపు ‘పిసిఎంసి’ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటును కూడా ఆయన  ప్రారంభించారు.

   నంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- ఆగస్టు నెలను వేడుకలు, విప్లవాల మాసంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరంలో పుణె నగరం పోషించిన పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. బాల గంగాధర తిలక్‌సహా అనేక మంది స్వాతంత్ర్య పోరాట దిగ్గజాలను ఈ నగరం దేశానికి అందించిందని గుర్తుచేశారు. ఇవాళ ప్రముఖ సంఘ సంస్కర్త అన్న భావు సాఠే జయంతి అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో ఆయన జనోద్ధరణకు నడుం బిగించారని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సృష్టించిన సాహిత్యంపై విద్యార్థులే కాకుండా విద్యావేత్తలు కూడా పెద్ద సంఖ్యలో పరిశోధనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ మహనీయుని కృషి, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని ప్రధానమంత్రి అన్నారు. “పుణె నగరం దేశ ఆర్థిక వ్యవస్థ వేగానికి ఉత్తేజమివ్వడంతోపాటు యువతరం స్వప్న సాకారానికి తోడ్పడగల శక్తిమంతమైన నగరం. ఈ రోజున దాదాపు రూ.15 వేల కోట్లతో ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఈ గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు.

   ట్టణ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల మెరుగదలపై ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని నొక్కిచెప్పారు. ఐదేళ్ల కిందట పుణే నగరంలో మెట్రో ప‌నులు ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ, ఇందులో 24 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ ఇప్పటికే పని ప్రారంభించిందని వివరించారు. ప్రతి నగరాల్లో నివసించే ప్రజల జీవన నాణ్యత పెంచడంల భాగంగా ప్రజారవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగానే మెట్రో నెట్‌వర్కును విస్తరిస్తున్నామని, కొత్త ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని, ట్రాఫిక్ లైట్ల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించామని ప్రధాని వివరించారు. దేశంలో 2014కు ముందు కేవలం 250 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ మాత్రమే ఉండేదని, అందులో చాలా మార్గాలు ఢిల్లీ నగరానికి పరిమితమైనవేనని పేర్కొన్నారు. అయితే, నేడు ఈ మెట్రో నెట్‌వర్క్ 800 కిలోమీటర్ల స్థాయిని దాటగా, మరో 1000 కిలోమీటర్ల కొత్త మార్గాల పనులు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. అదేవిధంగా 2014కు ముందు దేశంలోని ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ ఉండేదని, ఇవాళ పుణే, నాగ్‌పూర్‌, ముంబైసహా 20 నగరాలకు విస్తరించిందని తెలిపారు. ఆ మేరకు “ఆధునిక భారతంలో నగరాలకు మెట్రో సరికొత్త జీవనాడిగా మారుతోంది” అని ప్రధాని చెప్పారు. పుణే వంటి నగరాల్లో వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనడంలో మెట్రో విస్తరణ కూడా అవసరమేనని వ్యాఖ్యానించారు.

   ట్టణ జీవన నాణ్యత మెరుగుదలలో పరిశుభ్రత పాత్రను శ్రీ మోదీ నొక్కి చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మరుగుదొడ్ల సదుపాయం కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా వ్యర్థాల నిర్వహణకూ పెద్దపీట వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కొండల్లా పేరుకున్న చెత్త నేడు ఉద్యమ తరహాలో తొలగించబడుతున్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పిసిఎంసి) ఆధ్వర్యాన ఏర్పాటైన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటు ఒనగూడే ప్రయోజనాలను ఆయన వివరించారు. “స్వాతంత్ర్యం వచ్చాక దేశ పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం చేసింది మహారాష్ట్ర పారిశ్రామిక ప్రగతే” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత ముందుకు సాగాల్సి ఉందని నొక్కిచెబుతూ- ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఎక్స్‌’ప్రెస్‌ మార్గాలు, రైలు మార్గాలు, విమానాశ్రయాల అభివృద్ధిని ఈ సందర్భంగా ఉదాహరించారు. రైల్వేల విస్తరణ వ్యయం 2014కు ముందునాటి పరిస్థితులలో పోలిస్తే నేడు 12 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. మహారాష్ట్రలోని వివిధ నగరాలు కూడా పొరుగు రాష్ట్రాల ఆర్థిక కేంద్రాలతో అనుసంధానమై ఉన్నాయన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర/గుజరాత్ రాష్ట్రాలు రెండింటికీ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రయోజనం చేకూర్చగలదన్నారు. అలాగే ఢిల్లీ-ముంబై ఆర్థిక కారిడార్ కూడా మధ్యప్రదేశ్‌ సహా ఉత్తర భారతం ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్రను సంధానిస్తుందని వివరించారు. ఇక మహారాష్ట్ర, ఉత్తర భారత రాష్ట్రాల మధ్య రైలుమార్గాల అనుసంధానాన్ని జాతీయ ప్రత్యేక రవాణా కారిడార్ పరివర్తనాత్మకం చేయగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇక విద్యుత్‌ ప్రసార నెట్‌వర్క్‌ కూడా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాలతో కలుపుతుందని చెప్పారు. తద్వారా పరిశ్రమలు, చమురు-సహజవాయువు పైప్‌లైన్లు, ఔరంగాబాద్‌ పారిశ్రామిక నగరం, నవీముంబై విమానాశ్రయం, షెండ్రా బిడ్కిన్‌ పారిశ్రామిక పార్కు వగైరాలకు ప్రయోజనకరం కాగలదని తెలిపారు. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్తేజం నింపగల సామర్థ్యం ఇలాంటి ప్రాజెక్టులకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

   రాష్ట్రాల ప్రగతితోనే దేశ సమగ్రాభివృద్ధి అనే తారకమంత్రంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు “మహారాష్ట్ర అభివృద్ధి చెందితే భారతదేశం కూడా అభివృద్ధి చెందినట్లే! అదేవిధంగా భారతదేశం ప్రగతి సాధిస్తే, ఆ ఫలాలు మహారాష్ట్రకూ అందుతాయి” అన్నారు. ఆవిష్కరణలు, అంకుర సంస్థల కూడలిగా రూపొందుతున్న దేశంగా భారత్‌ లభిస్తున్న గుర్తింపును ఆయన ప్రస్తావించారు. దేశంలో 9 ఏళ్ల కిందట అంకుర సంస్థలు వందల్లో మాత్రమే ఉండేవని, నేడు అవి 1 లక్ష సంఖ్యను అధిగమించాయని ప్రధాని తెలిపారు. ఈ విజయసాధన ఘనత డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకే దక్కుతుందని అభివర్ణించారు. ఆ మేరకు జాతీయ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు పునాది వేయడంలో పుణే ప్రముఖ పాత్ర పోషించిందనని ప్రశంసించారు. “చౌక డేటా.. సరసమైన ధరతో ఫోన్లు-ఇంటర్నెట్ సౌకర్యం వంటివి ప్రతి గ్రామానికి చేరువ కావడంతో ఈ రంగం బలోపేతమైంది. అలాగే 5జి సేవలను అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలిచింది” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సాంకేతికార్థిక, జీవ-ఆర్థిక, వ్యవసాయార్థిక రంగాల్లో యువత సాధించిన ప్రగతి పుణే నగరానికి మేలు చేస్తున్నదని ఆయన అన్నారు.

   రాజకీయ స్వార్థం పర్యవసానంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు బెంగళూరు నగరానికి వాటిల్లుతున్న నష్టంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకతోపాటు రాజస్థాన్‌ రాష్ట్రంలోనూ అభివృద్ధి స్తంభించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు “దేశాన్ని ముందుకు నడిపించాలంటే విధానాలు, ఉద్దేశాలు, నిబంధనలకు సమ ప్రాధాన్యం ఉండాలి” అని శ్రీ మోదీ అన్నారు. అభివృద్ధికి భరోసా ఇవ్వడంలో ఇవి ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కాగా, 2014కు ముందు పదేళ్లలో దేశవ్యాప్తంగా కేవలం రెండు పథకాల కింద 8 లక్షల పక్కా ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు ప్రధాని గుర్తుచేశారు. అయితే, నాసిరకం నిర్మాణం ఫలితంగా లబ్ధిదారులు వాటిలో 2 లక్షల ఇళ్లను తిరస్కరించారని, వీటిలో 50వేలు మహారాష్ట్రలోనే ఉన్నాయని పేర్కొన్నారు.  

   పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రభుత్వం 2014లో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత సదుద్దేశాలతో పనిచేస్తూ విధానాలను సమూల ప్రక్షాళన చేసిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. నాటినుంచి గత 9 సంవత్సరాలలో గ్రామీణ పేదల కోసం 4 కోట్లకుపైగా పక్కా ఇళ్లను నిర్మించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. అలాగే పట్టణ పేదల కోసం 75 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించబడినట్లు వివరించారు. అదే సమయంలో నిర్మాణ పనుల్లో పారదర్శకతసహా నాణ్యత మెరుగుదలకూ తాము ప్రాధాన్యం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా నేడు పక్కా ఇళ్లలో అత్యధిక శాతం మహిళల పేరిటే ఉంటున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఇళ్ల ఖరీదు రూ.లక్షల్లో ఉన్నందున గత 9 ఏళ్లలో దేశంలో కోట్లాది మహిళలు నేడు ‘లక్షాధికారులు’ అయ్యారని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఇళ్ల తాళాలు అందుకున్న లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి అభినందనలు,  శుభాకాంక్షలు తెలిపారు. “దేశంలోని పేదలైనా, మధ్యతరగతి వారైనా.. వారి ప్రతి కలనూ  నెరవేర్చగలమని మోదీ హామీ ఇస్తున్నాడు” అని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా కల సాకారం కావడమన్నది అనేక సంకల్పాలకు నాందిగా మారి, వారి జీవితానికి చోదకశక్తి కాగలదని ప్రధాని నొక్కిచెప్పారు. “ఈ దిశగా మీ పిల్లలు, మీ వర్తమానం, మీ భవిష్యత్తరాల విషయంలో మేం శ్రద్ధ వహిస్తాం” అని ప్రజలకు భరోసా ఇచ్చారు.

   చివరగా... ఒక మరాఠీ నానుడిని ఉటంకిస్తూ- వర్తమానాన్ని మాత్రమేగాక భవిష్యత్తును కూడా ఉజ్వలం చేయడానికే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని వివరించారు. వికసిత భారతం నిర్మించాలనే సంకల్పమే ఈ భావనకు నిదర్శనమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అనేక పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడిన తరహాలోనే అందరూ కలసికట్టుగా తమవంతు కృషి చేయాలని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. “మహారాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మెరుగైన రీతిలో కృషి సాగాలన్నదే లక్ష్యం. తదనుగుణంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలి” అని పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్‌తోపాటు ఇతర మంత్రులు, ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

నేపథ్యం

   పుణే మెట్రో ఫేజ్-I కిందగల రెండు కారిడార్లలో పనులు పూర్తయిన సెక్షన్ల పరిధిలో సేవల ప్రారంభానికి గుర్తుగా ప్రధాని పచ్చ జెండా ఊపి మెట్రో రైళ్లను సాగనంపారు. ఈ రెండు కారిడార్లలో ఒకటి ఫుగేవాడి స్టేషన్ నుంచి సివిల్ కోర్ట్ స్టేషన్ వరకు; మరొకటి గర్వారే కళాశాల స్టేషన్ నుంచి రూబీ హాల్ క్లినిక్ స్టేషన్ వరకూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి 2016లో శంకుస్థాపన చేశారు. ఇవి పుణే నగరంలోని శివాజీ నగర్, సివిల్ కోర్ట్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ఆర్టీవో, పుణే రైల్వే స్టేషన్ తదితర ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతాయి. దేశమంతటా ఆధునిక, పర్యావరణ హిత సామూహిక సత్వర పట్టణ రవాణా వ్యవస్థలను పౌరులకు కల్పించాలన్న ప్రధానమంత్రి దూరదృష్టిని సాకారం చేయడంలో ఈ ప్రారంభోత్సవం ఓ కీలక ముందడుగు. ఈ మార్గంలోని కొన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితో చేపట్టారు. ఆ మేరకు ఛత్రపతి శంభాజీ ఉద్యాన్ మెట్రో స్టేషన్‌తోపాటు దక్కన్ జింఖానా మెట్రో స్టేషన్‌ ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు ధరించే శిరస్త్రాణాన్ని పోలిన ప్రత్యేక డిజైన్‌తో రూపొందించబడ్డాయి. దీన్ని ‘మావలా పగడీ’ అని కూడా పిలుస్తారు. ఇక శివాజీ నగర్ భూగర్భ మెట్రో స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన కోటలను గుర్తుకుతెచ్చే విశిష్ట రూపంలో నిర్మితమైంది. సివిల్ కోర్ట్ మెట్రో స్టేషన్ 33.1 మీటర్ల లోతుతో దేశంలోనే అత్యంత లోతైన స్టేషన్‌ కాగా, ప్లాట్‌ఫామ్‌పై నేరుగా సూర్యరశ్మి పడే విధంగా దీని పైకప్పును రూపొందించడం విశేషం.

   దేశంలో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యసాధనలో భాగంగా  ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ‘పిసిఎంసి’ నిర్మించిన 1280 ఇళ్లతోపాటు పుణే నగరపాలక సంస్థ నిర్మించిన 2650 ఇళ్లను కూడా ప్రధానమంత్రి లబ్ధిదారులకు అప్పగించారు. అలాగే ‘పిఎంఎవై’  కింద ‘పిసిఎంసి’ నిర్మించే మరో 1,190 ఇళ్లతోపాటు పుణే నగరపాలిక ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మించబోయే 6,400 ఇళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మరోవైపు ‘పిసిఎంసి’ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటును కూడా ఆయన  ప్రారంభించారు. ఇందులో విద్యుదుత్పాదన కోసం ఏటా రమారమి 2.5 లక్షల టన్నుల వ్యర్థాలను ఉపయోగిస్తారు.

 

 

 

***

DS/TS



(Release ID: 1944780) Visitor Counter : 111