ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని గాంధీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా-2023’కి ప్రధాని ప్రారంభోత్సవం
“భారత్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?’ అనే ప్రశ్న ఏడాదిలోగా
‘భారత్లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు!’గా మారింది”;
“భారత్ సామర్థ్యాలపై నమ్మకంగల వారిని దేశం ఎన్నడూ నిరాశపరచదు”;
“ప్రజాస్వామ్యం.. జనాభా.. జనశక్తి లబ్ధి భారత్లో
వ్యాపారాలను ద్విగుణం.. త్రిగుణం చేస్తాయి”;
“ఆరోగ్యం.. వ్యవసాయం లేదా రవాణా ఏదైనా కావచ్చు..
భారత్ ఆధునిక సాంకేతికత వాడకంపై దృష్టి సారిస్తుంది”;
“ప్రపంచానికి విశ్వసనీయ సరఫరా గొలుసు అవసరం... ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకన్నా విశ్వసనీయ భాగస్వామి ఎవరుంటారు?”;
“సెమికండక్టర్ పెట్టుబడులకు భారత్ అద్భుత నిర్వాహకురాలు మారుతోంది”;
“భారత్ తన అంతర్జాతీయ బాధ్యతలను అర్థం చేసుకుంది..
మిత్ర దేశాలతో కలసి సమగ్ర ప్రణాళిక దిశగా కృషి చేస్తోంది”
Posted On:
28 JUL 2023 1:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ఉత్ప్రేరకంగా భారత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ’ అనే ఇతివృత్తంతో నిర్వహించే ‘సెమికాన్ఇండియా-2023’ను ప్రారంభించారు. ఇది భారత సెమీకండక్టర్ వ్యూహం, విధానాలను ప్రపంచానికి ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, సాంకేతిక అభివృద్ధికి భారతదేశాన్ని ప్రపంచ కూడలిగా మారుస్తుంది. ఈ సందర్భంగా ఈ పరిశ్రమలో అగ్రగామి సంస్థల అధినేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ మేరకు ‘సెమి శ్రీ’ సంస్థ ప్రెసిడెంట్-సీఈవో శ్రీ అజిత్ మినోచా మాట్లాడుతూ- భారతదేశ చరిత్రలో తొలిసారి భౌగోళిక-దేశీయ రాజకీయాలతోపాటు ప్రైవేట్ రంగ గుప్త సామర్థ్యాలు మన దేశం సెమీకండక్టర్ ఉత్పాదక కూడలిగా మారేందుకు అనుకూలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మైక్రాన్ సంస్థ పెట్టుబడులు భారత్‌లో చరిత్ర సృష్టిస్తున్నాయని, ఇతర కంపెనీలు కూడా ఇదే బాటను అనుసరించేలా తగిన వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోగల నాయకత్వం ఉన్నందునే ప్రస్తుత వ్యవస్థ విభిన్నంగా ఉందని ఆయన గుర్తుచేశారు. తదనుగుణంగా సెమీకండక్టర్ల విషయంలో భారతదేశం ఆసియాలో అగ్రగామిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష భవనంలో ‘ఎఎండి’ సీఈవోతో ప్రధానమంత్రి సమావేశం కావడాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్-చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఇవిపి/సిటిఒ) శ్రీ మార్క్ పేపర్‌మాస్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో ‘ఎఎండి’ భారతదేశంలో 400 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెడుతుందని ఆయన ప్రకటించారు. అలాగే తమ పరిశోధన-అభివృద్ధి సామర్థ్యాల మెరుగుసహా బెంగళూరులో అతిపెద్ద డిజైన్ సెంటర్ నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
‘సెమీకండక్టర్ ప్రాడక్ట్ గ్రూప్ అప్లైడ్ మెటీరియల్స్’ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు రాజా మాట్లాడుతూ- ప్రధాని మోదీ దృఢమైన దృక్పథంతో భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పాత్ర పోషణకు సిద్ధంగా ఉందన్నారు. “ఇది భారతదేశం ఉజ్వల కాంతులు వెదజల్లే సమయమని మా ప్రగాఢ విశ్వాసం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగంలో సవాళ్లను ఏదో ఒక కంపెనీ లేదా దేశం అధిగమించడం అసాధ్యమని స్పష్టం చేశారు. లేవు. ఆ మేరకు సహకార భాగస్వామ్యం అవసరమని, అందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు. ఈ కొత్త సహకార నమూనా సెమీకండక్టర్ల రంగంలో మనకు ఉత్ప్రేరకం కాగలదని నొక్కి చెప్పారు. “సెమీకండక్టర్ల దృక్కోణంలో భారత్ మమ్మల్ని విలువైన భాగస్వామిగా పరిగణించడంపై మీకు నా కృతజ్ఞతలు” అన్నారు.
అనంతరం ‘కాడెన్స్’ సంస్థ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ అనిరుధ్ దేవగణ్ మాట్లాడుతూ- భారతదేశం ఎట్టకేలకు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టడం హర్షణీయమన్నారు. అంతేకాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు ఈ పెట్టుబడులు విస్తరించడం ముదావహమని వ్యాఖ్యానించారు.
వేదాంత గ్రూప్ చైర్మన్ శ్రీ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ- ‘భారత సిలికాన్ వ్యాలీ’
రూపొందడానికి గుజరాత్ సముచిత ప్రదేశమని నిపుణులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ యువతరానికి కొత్త అవకాశాలు సృష్టించాలనే ప్రధానమంత్రి దార్శనికత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. “గడచిన దశాబ్ద కాలంలో భారత్ ఏ విధంగా రూపాంతరం చెందిందీ మేం ప్రత్యక్షంగా చూశాం. తదనుగుణంగా యువ భారతీయుల ఆకాంక్షలు నిజంగా ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నాయి” అని కొనియాడారు.
‘మైక్రాన్ టెక్నాలజీ’ సంస్థ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా మాట్లాడుతూ- భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ కూడలిగా మార్చడంపై ప్రధానమంత్రి అంతర్జాతీయ దృక్పథానికి ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌లో సెమీకండక్టర్ల కూర్పు, మెమొరీ పరీక్ష సదుపాయాలను ఏర్పాటు చేయడం తమకెంతో గర్వకారణమని శ్రీ మెహ్రోత్రా పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టుల రంగంలో 5,000 అదనపు ఉద్యోగాలతోపాటు దాదాపు 15,000 ఉద్యోగాలను సృష్టించగలదని చెప్పారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థిరమైన ఫలితాలు ఇవ్వగల నవ్యావిష్కరణలు, వ్యాపార వృద్ధి, సామాజిక ప్రగతితో కూడిన వాతావరణ సృష్టిని ప్రోత్సహించడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. “డిజిటల్ భారతం, భారత్‌లో తయారీ కార్యక్రమాలు పరివర్తనాత్మక శక్తిని ప్రోది చేస్తున్నాయి. సానుకూల ప్రగతికి ఇది చోదకం కాగలదనడంలో సందేహం లేదు” అని పేర్కొన్నారు.
ఫాక్స్‌కాన్ సంస్థ ఛైర్మన్ మిస్టర్ యంగ్ లియు మాట్లాడుతూ- తైవాన్ సెమీకండక్టర్ పరిశ్రమలో ‘సామూహిక స్ఫూర్తి’ (బఫెలో స్పిరిట్) గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఎలాంటి శషభిషలు లేకుండా కఠోరంగా శ్రమించగల సామర్థ్యానికి ప్రతీకగా దీన్ని పేర్కొనవచ్చునని చెప్పారు. ఇదే స్ఫూర్తిని భారతదేశానికీ వర్తింపజేయవచ్చునని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ ‘చెప్పడం-చేయడం’ నిష్పత్తిస్థాయి ఉన్నతంగా ఉండటాన్ని మిస్టర్ లియు ప్రస్తావించారు. ఆ మేరకు చాలా ఏళ్ల కిందట తైవాన్ అనుసరించినట్లుగా ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమించడం కోసం సమష్టి కృషికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటాన్ని నొక్కిచెప్పారు. సెమీకండక్టర్ పరిశ్రమకు నాయకత్వం వహించగలమనే భారత ప్రభుత్వ ఆత్మవిశ్వాసం, సంకల్పంపై నమ్మకం-ఆశావాదం వ్యక్తం చేశారు. “ఐ-టీ అంటే ఇండియా-తైవాన్” అని మిస్టర్ లియు అభివర్ణించారు. అలాగే ప్రధాని వ్యాఖ్యాలను ఉటంకిస్తూ- సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశానికి తైవాన్ అత్యంత విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- సెమికాన్ వంటి కార్యక్రమాలు సాఫ్ట్’వేర్ అప్‌డేట్ లాంటివని వ్యాఖ్యానించారు. వీటిలో నిపుణులు-పరిశ్రమలో అగ్రగాములు పరస్పరం కలుసుకుని, అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. “మన సంబంధాల సమన్వయీకరణకు ఇదెంతో కీలకం” అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శ్రీ మోదీ తిలకించారు. ఈ రంగం శక్తి సామర్థ్యాలను, ఆవిష్కరణలను గమనించి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనను యువత సందర్శించి నవీన సాంకేతిక పరిజ్ఞానం శక్తిసామర్థ్యాలను అవగతం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
పోయినేడాది సెమికాన్ తొలి సంచికలో తాను పాల్గొనడాన్ని గుర్తుచేసుకుంటూ- భారత సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులపై వినిపించిన ప్రశ్నలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, “భారత్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?’ అనే ప్రశ్న ఏడాదిలోగానే ‘భారత్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు!’గా మారింది” అని వివరించారు. “పరిశ్రమలో అగ్రగాముల కృషితోనే ఈ దిశగా మార్పు సాధ్యమైంది” అన్నారు. ఈ మేరకు భారతదేశంపై వారు నమ్మకం ఉంచడాన్ని శ్రీ మోదీ అభినందించారు. భారత ఆకాంక్షలు-సామర్థ్యాన్ని పరిశ్రమ అగ్రగాములు తమ స్వీయ భవిష్యత్తుతో-కలలతో పెనవేశారని ఆయన అభివర్ణించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ “వారి ఆశాభావాన్ని భారతదేశం ఏమాత్రం నిరుత్సాహపరచదు” అని వ్యాఖ్యానించారు. ఈ 21వ శతాబ్దపు భారతదేశంలో అవకాశాలు పుష్కలమని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. భారత ప్రజాస్వామ్యం, జనాభా, జనశక్తి లబ్ధితో దేశంలో వ్యాపారాలు ద్విగుణం-త్రిగుణంగా వృద్ధి చెందుతాయని ప్రకటించారు.
అసమాన వృద్ధిని సూచించే మూరే సిద్ధాంతం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- భారత డిజిటల్, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో అలాంటి అసమాన వృద్ధి నేడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భారత్ వాటా అనేక రెట్లు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు 2014లో ఈ రంగం 30 బిలియన్ డాలర్ల స్థాయికన్నా దిగువన ఉండగా, నేడు 100 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాల ఎగుమతులు గత రెండేళ్లలో రెట్టింపయ్యాయని తెలిపారు. భారతదేశంలో 2014 తర్వాతి సాంకేతిక పరిణామాలను ప్రస్తావిస్తూ- ఆనాడు (2014కు ముందు) దేశంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండేవని, నేడు వాటి సంఖ్య 200 దాటిందని ప్రధాని వివరించారు. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 80 కోట్లకు చేరగా, ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 25 కోట్ల నుంచి 85 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. ఈ గణాంకాలు భారత పురోగతిని సూచించడమేగాక వ్యాపారాల వృద్ధిని సూచిస్తున్నాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో సెమికాన్ పరిశ్రమ అసమాన వృద్ధి లక్ష్యంలో భారత్ కీలక పాత్రను శ్రీ మోదీ నొక్కిచెప్పారు.
“ప్రపంచంలో నేడు పరిశ్రమ 4.0 విప్లవం నడుస్తోంది” అని ప్రధాని వివరించారు. ప్రపంచంలో ఏ పారిశ్రామిక విప్లవానికైనా నిర్దిష్ట రంగంలోని ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదిక అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “గతంలో పారిశ్రామిక విప్లవాలకు, అమెరికా కలలకు అవినాభావ సంబంధం ఉండేది” అన్నారు. అయితే, ఇప్పుడు పరిశ్రమ 4.0 విప్లవం-భారతీయ ఆకాంక్షల మధ్య సారూప్యం ఏర్పడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు భారత దేశాభివృద్ధికి భారతీయుల ఆకాంక్షలే చోదక శక్తి అని ఆయన పేర్కొన్నారు. దేశంలో దారిద్ర్యం వేగంగా తగ్గుతున్నదని, ఇది నయా-మధ్యతరగతి ఆవిర్భావానికి దారితీస్తున్నదని ఇటీవల ఓ నివేదిక పేర్కొనడాన్ని ఆయన ఉటంకించారు. దేశ ప్రజల సాంకేతికత సానుకూల స్వభావం, సాంకేతికత స్వీకరణలో వారి ఆసక్తిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చౌక డేటా, నాణ్యమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్రామాలలో నిరంతర విద్యుత్ సరఫరా వంటివి డిజిటల్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. “ఆరోగ్యం, వ్యవసాయం లేదా రవాణా ఏదైనా కావచ్చు.. ఆధునిక సాంకేతికత వినియోగంపై భారత్ దృష్టి సారిస్తుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రాథమిక గృహోపకరణాన్ని కూడా ఉపయోగించని వ్యక్తులు భారతదేశంలో ఉన్నప్పటికీ, నేడు అంతర సంధానిత స్మార్ట్ పరికరాలను వారు వాడుకోనున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఒక నిర్దిష్ట విద్యార్థి సమూహం లోగడ కనీసం సైకిల్ కూడా వాడి ఉండకపోయినా, నేడు స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రధాని అన్నారు. “భారతదేశంలో పెరుగుతున్న నయా-మధ్యతరగతి భారతీయ ఆకాంక్షలకు శక్తి కేంద్రంగా మారింది” అని ప్రధానమంత్రి అన్నారు. చిప్ తయారీ పరిశ్రమ సమృద్ధ అవకాశాల మార్కెట్ అని ఆయన నొక్కిచెప్పారు. ఆ మేరకు ముందుగా అడుగుపెట్టినవారు ఇతరులకన్నా ముందంజలోగల ప్రయోజనాన్ని పొందగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివాటి దుష్ప్రభావాలను ప్రస్తావిస్తూ- ప్రపంచానికి విశ్వసనీయ సరఫరా గొలుసు అవసరమని ప్రధాని అన్నారు. ఇలాంటప్పుడు “ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంకన్నా విశ్వసనీయ భాగస్వామి ఎవరుంటారు?” అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “స్థిరమైన, బాధ్యతాయుత, సంస్కరణాత్మక ప్రభుత్వం ఉన్నందువల్లనే పెట్టుబడిదారులు భారతదేశాన్ని విశ్వసిస్తారు. ప్రతి రంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నందున పరిశ్రమ రంగానికి భారత్‌పై నమ్మకం పెరిగింది. అలాగే మనకు భారీ ప్రతిభా నిధి ఉన్నందున సెమీకండక్టర్ రంగం కూడా భారత్‌పై ఎనలేని విశ్వాసం ఉంచింది” అని ఆయన చెప్పారు. అదేవిధంగా “నిపుణులైన ఇంజనీర్లు, డిజైనర్లు మా బలం. ప్రపంచంలోగల అత్యంత శక్తిమంతమైన, ఏకీకృత మార్కెట్‌లో భాగం కావాలనుకునే ఏ దేశానికైనా భారత్‌పై నమ్మకం ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అని మేము మీతో అంటున్నామంటే- దేశం కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా తయారు చేయడమని అర్థం” అని ప్రధాని వివరించారు.
ప్రపంచంపట్ల భారతదేశం తన బాధ్యతలను అర్థం చేసుకుంటోందని, మిత్రదేశాలతో కలసి సమగ్ర మార్గ ప్రణాళిక కోసం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. అందుకే భారతదేశం శక్తిమంతమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘నేషనల్ క్వాంటం మిషన్’ ఆమోదించబడిందని, జాతీయ పరిశోధన ఫౌండేషన్ బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను రూపొందించగల ఇంజనీరింగ్ పాఠ్యప్రణాళిక నవీకరించబడుతున్నదని చెప్పారు. సెమీకండక్టర్ల కోర్సులందించే 300కుపైగా ప్రముఖ కళాశాలలను గుర్తించినట్లు ప్రధాని తెలిపారు. ఇక ‘చిప్స్ టు స్టార్టప్’ కార్యక్రమం ఇంజనీర్లకు చేయూతనిస్తుందని చెబుతూ- “వచ్చే ఐదేళ్లలో మన దేశంలో లక్ష మందికిపైగా డిజైన్ ఇంజనీర్లు తయారవుతారని అంచనా. దేశంలో వృద్ధి చెందుతున్న అంకుర పర్యావరణ వ్యవస్థ సెమీకండక్టర్ రంగాన్ని కూడా బలోపేతం చేయనుంది” అని ఆయన అన్నారు.
శక్తి ఇన్సులేటర్ల ద్వారా కాకుండా కండక్టర్ల ద్వారా ప్రవహించే తరహాలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు మంచి శక్తి వాహకంగా మారడానికి అనువైన ప్రతి అంశంలోనూ భారత్ ముందంజ వేస్తున్నదని ప్రధాని అన్నారు. ఈ రంగానికి విద్యుత్తు ఎంత కీలకమో వివరిస్తూ- గత దశాబ్దంలో భారత్ సౌరశక్తి స్థాపిత సామర్థ్యం 20 రెట్లకుపైగా పెరిగిందని గుర్తుచేశారు. దీంతోపాటు 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని ఈ దశాబ్ది చివరికల్లా సాధించాలని నిర్ణయించుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. అలాగే సౌర పి.వి.మాడ్యూల్స్, హరిత ఉదజని, ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తి దిశగా చేపట్టిన కీలక చర్యలను కూడా ఆయన వివరించారు. దేశంలో చేపట్టిన విధాన సంస్కరణలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణంపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన నొక్కిచెప్పారు. కొత్త ఉత్పాదక పరిశ్రమల కోసం అమలులోకి తెచ్చిన అనేక పన్ను మినహాయింపుల గురించి వెల్లడించారు. అలాగే భారత దేశంలో కార్పొరేట్ పన్ను అత్యంత స్వల్పమని తెలిపారు. ప్రత్యక్ష ప్రమేయంలేని పన్ను వసూలు విధానాలు, నిరంకుశ చట్టాల-విధానా రద్దు వంటివాటిని ఉదాహరించారు. వీటిద్వారా వాణిజ్య సౌలభ్యం కలగడంతోపాటు సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఈ నిర్ణయాలు, విధానాలు దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమకు ఎర్ర తివాచీ పరచిన వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. “భారతదేశం సంస్కరణల మార్గంలో ముందడుగు వేస్తున్నందున కొత్త అవకాశాల సృష్టితో సెమీకండక్టర్ పెట్టుబడులకు భారత్ అద్భుత కండక్టర్‌గా మారనుంది” అని ఆయన అన్నారు.
ప్రపంచ సరఫరా గొలుసు, ముడిసరుకు, సుశిక్షిత మానవ వనరులు, యంత్రాల అవసరాలను భారత్ అవగతం చేసుకుంటున్నదని ప్రధాని అన్నారు. “ప్రైవేట్ రంగ సంస్థలతో మా సంయుక్త కృషివల్ల ఆయా రంగాలు కొత్త ఎత్తులను తాకాయి. అది అంతరిక్ష రంగమైనా లేదా భౌగోళిక రంగమైనా, అన్నింటా మనకు అద్భుత ఫలితాలు వచ్చాయి” అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. వివిధ అంశాలపై అందిన అభిప్రాయాల ఆధారంగా తీసుకున్న కీలక నిర్ణయాలను కూడా ఆయన వెల్లడించారు. సెమికాన్ ఇండియా కార్యక్రమం కింద పెరిగిన ప్రోత్సాహకాల గురించి ఆయన వివరించారు. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం నేడు సాంకేతిక సంస్థలకు 50 శాతం ఆర్థిక సహాయం ఇవ్వబడుతున్నదని ఆయన తెలిపారు. “దేశంలో సెమీకండక్టర్ రంగం వృద్ధిని వేగిరపరచేందుకు మేం విధాన సంస్కరణలను నిరంతరం కొనసాగిస్తున్నాం” అని శ్రీ మోదీ చెప్పారు.
భారత జి-20 అధ్యక్షత ఇతివృత్తం ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ గురించి వివరిస్తూ- భారతదేశాన్ని సెమీకండక్టర్ల తయారీ కూడలిగా మార్చే లక్ష్యం వెనుకనున్న స్ఫూర్తి కూడా అదేనని ప్రధాని ఉద్ఘాటించారు. భారతదేశం తన నైపుణ్యం, శక్తిసామర్థ్యాల ద్వారా యావత్ ప్రపంచానికీ ప్రయోజనం కలగాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ఉద్ఘాటించారు. అంతర్జాతీయ శ్రేయస్సు, మెరుగైన ప్రపంచం కోసం భారత సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ కృషిలో భాగస్వామ్యం, సూచనలు, ఆలోచనలను ప్రధాని ఆహ్వానించారు. అలాగే భారత ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తుందని పరిశ్రమ అగ్రగాములకు హామీ ఇచ్చారు. చివరగా- ఎర్రకోట బురుజుల నుంచి తన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ- “ఇదే తగిన సమయం… భారతదేశానికి మాత్రమే కాదు… యావత్ ప్రపంచానికీ ఇంతకుమించిన తరుణం లేదు” అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్సహా ‘కాడెన్స్’ సీఈఓ శ్రీ అనిరుధ్ దేవగణ్, ‘ఫాక్స్‌కాన్’ చైర్మన్ శ్రీ యంగ్ లియు, ‘వేదాంత’ ఛైర్మన్ శ్రీ అనిల్ అగర్వాల్, ‘మైక్రాన్’ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా, ‘ఎంఎడి’ సీటీవో మార్క్ పేపర్‌మాస్టర్, సెమీకండక్టర్ ప్రొడక్ట్స్ గ్రూప్ ‘ఎఎంఎటి’ అధ్యక్షుడు శ్రీ ప్రభు రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ సదస్సుకు ‘ఉత్ప్రేరకంగా భారత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ’ ఇతివృత్తం కాగా, పరిశ్రమలు, విద్యా-పరిశోధన సంస్థల నుంచి ప్రపంచ అగ్రగాములను ఒకే వేదికపైకి చేర్చడం దీని లక్ష్యం. ఇది భారత సెమీకండక్టర్ వ్యూహం, విధానాలను ప్రపంచానికి ప్రదర్శిస్తుంది. ఈ సదస్సు సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, సాంకేతిక అభివృద్ధికి భారతదేశాన్ని ప్రపంచ కూడలిగా మారుస్తుంది. ‘సెమికాన్ఇండియా-2023’లో మైక్రాన్ టెక్నాలజీ, అప్లైడ్ మెటీరియల్స్, ఫాక్స్‌కాన్, ‘సెమి’ కాడెన్స్, ఎఎండి వంటి ప్రధాన కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
(Release ID: 1943864)
Visitor Counter : 186
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam