హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 'మాదక ద్రవ్యాల రవాణా మరియు జాతీయ భద్రత' అనే అంశంపై ప్రాంతీయ సదస్సు


దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1.40 లక్షల కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను కేంద్ర హోంమంత్రి సమక్షంలో ధ్వంసం చేశారు. ఇది ఒకే రోజు రికార్డు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సారథ్యంలో గత ఏడాది కాలంలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాలు ధ్వసం చేయబడ్డాయి.

ఏ ఒక్క యువకుడు కూడా డ్రగ్స్‌కు అలవాటు పడని భారతదేశాన్ని సృష్టించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం

మాదకద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మెరుగైన సమన్వయం కోసం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్‌సిఓఆర్‌డి సమావేశాల కొనసాగింపుపై దృష్టి పెట్టాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

మాదకద్రవ్యాలను గుర్తించడం, నెట్‌వర్క్‌ను నాశనం చేయడం, నేరస్థుల నిర్బంధం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పూర్తి నివారణకు బానిసల పునరావాసంపై మనం సమాన దృష్టితో ముందుకు సాగాలి.

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మన ప్రచారం భవిష్యత్ తరాలను రక్షించడానికి మరియు దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక పవిత్ర కార్యక్రమం. దీనికి మనందరం ప్రాధాన్యతనివ్వాలి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర

Posted On: 17 JUL 2023 6:13PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన 'మాదక ద్రవ్యాల రవాణా మరియు జాతీయ భద్రత' అనే అంశంపై ఈరోజు న్యూ ఢిల్లీలో  ప్రాంతీయ సదస్సు జరిగింది. కేంద్ర హోంమంత్రి సమక్షంలో  రూ.2,378కోట్ల విలువ చేసే 1.40 లక్షల కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఎఎన్‌టిఎఫ్‌) సమన్వయంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేసింది. ఇది ఒకే రోజు చేపట్టిన రికార్డు.

 

image.png


భారతదేశం వంటి దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వాటి వినియోగం భవిష్యత్ తరాలను నాశనం చేయడమే కాకుండా దేశ భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో  అన్నారు.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ సమావేశాల  ద్వారా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారాన్ని నిర్వహిస్తోందని, వాటిని సమీక్షించడానికి మరియు ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మన విధానాలలో సకాలంలో మార్పులు చేయడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

image.png


దేశానికి స్వాతంత్య్రం వచ్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి భారతదేశం మరియు యువత డ్రగ్స్ రహితంగా మారాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఒక్క యువకుడు కూడా డ్రగ్స్‌కు అలవాటు పడని భారతదేశాన్ని రూపొందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, దీనిని సాధించేందుకు రాష్ట్రాలు, కేంద్రం రెండూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు పరమవీర చక్ర అవార్డు గ్రహీత నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్ జయంతి అని శ్రీ షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పరమవీర చక్ర అవార్డు గ్రహీత నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్‌కు యావత్ దేశం మరియు భారత ప్రభుత్వం తరపున నివాళులర్పించారు.

 

image.png


ఎన్‌సిబి అమృత్ సర్ జోనల్ ఆఫీస్‌ కోసం రూ.12 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించినట్టు శ్రీ అమిత్ షా చెప్పారు. భువనేశ్వర్ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఢిల్లీలో కొత్త కార్యాలయానికి భూమి పూజ కూడా ఈ రోజు జరిగింది. ఎన్‌సిబి కార్యాలయాల కోసం భూమిని అందించడం ద్వారా ఎన్‌సిబి మరియు భారత ప్రభుత్వానికి సహకరించినందుకు ఒడిశా ప్రభుత్వానికి మరియు పంజాబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్‌పై పోరాటాన్ని ఎన్‌సిబి మరింత బలోపేతం చేస్తుందని శ్రీ షా చెప్పారు. మాదకద్రవ్యాల రహిత భారత్‌పై సంకలనాన్ని కూడా ఈరోజు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్‌పై అవగాహనకు సంబంధించిన మరింత సమాచారాన్ని జిల్లా పరిపాలన, పాఠశాలలు మరియు స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తే, డ్రగ్స్‌పై పోరాటం మరింత బలపడుతుందన్నారు. ఇది డ్రగ్స్‌ను అరికట్టడం లేదా సంపూర్ణ విజయం సాధించడం మాత్రమే కాదని అవగాహన కల్పించడమే ఈ పోరాటంలో అతిపెద్ద విజయం అని శ్రీ షా అన్నారు. దేశంలోని యువత, తల్లిదండ్రుల మనసుల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే వరకు ఈ పోరాటంలో విజయం సాధించలేమని శ్రీ షా అన్నారు.

ఈ రోజు మొత్తం 1,40,288 కిలోల డ్రగ్స్ ధ్వంసమయ్యాయని అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఎన్‌సిబి ఈ మేరకు ప్రశంసలకు అర్హులని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. ఈ ప్రచారంలో నేడు రూ.2,378 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేశామని ఒక్కరోజులో అత్యధికంగా డ్రగ్స్‌ను ధ్వంసం చేయడం రికార్డు అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత ఏడాది అమృత్ మహోత్సవ్‌లో రూ. 12,000 కోట్లకు పైగా విలువైన 10 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశామని ఇది కూడా ఒక రికార్డు అని శ్రీ షా అన్నారు.

మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు, డ్రగ్ డిటెక్షన్, నెట్‌వర్క్‌ను నాశనం చేయడం, నేరస్థుల నిర్బంధం మరియు బానిసల పునరావాసంపై సమాన దృష్టితో ముందుకు సాగాలని శ్రీ అమిత్ షా అన్నారు. డిటెక్షన్, డిస్ట్రక్షన్, డిటెన్షన్ విభాగాల్లో గొప్పగా పనిచేశామని చెప్పారు. అయితే పునరావాసంపై దృష్టి సారిస్తే తప్ప మన పోరాటం విజయవంతం కాదని చెప్పారు. 'హోల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌' విధానంతో ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ శాఖ, రసాయన, ఔషధాల శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, రాష్ట్ర హోంశాఖలు ఏకతాటిపైకి వచ్చి ఒకే వేదికపై పని చేయాల్సి ఉంటుందని అప్పుడే మాదకద్రవ్యాల రహిత భారతదేశం సాకారం అవుతుందని శ్రీ షా అన్నారు. ఇందుకోసం సహకారం, సమన్వయం, సహకారంతో పాటు అన్ని శాఖలు 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానంతో ముందుకు సాగాలన్నారు.

2006 నుంచి 2013 వరకు మొత్తం 1,250 కేసులు నమోదయ్యాయని, 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో 3,700 కేసులు నమోదయ్యాయని, ఇది 200 శాతం పెరిగిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. అంతకుముందు కాలంలో మొత్తం 1,360 అరెస్టులు జరిగాయి, ఇది ఇప్పుడు 5,650కి పెరిగింది. ఇది 300 శాతం పెరుగుదలను చూపుతుంది. ఇంతకుముందు 1.52 లక్షల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, ఇప్పుడు అది 160 శాతం పెరిగి 3.94 లక్షల కిలోలకు చేరుకుంది. 2006 నుంచి 2013 మధ్య రూ.5,900 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేశారని, 2014 నుంచి 2023 మధ్య రూ.18,100 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసి ధ్వంసం చేశారని, ఇది మన ప్రచార విజయాన్ని తెలియజేస్తోందన్నారు.

శ్రీ అమిత్ షా మాట్లాడుతూ " ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా "గోల్డెన్ ట్రయాంగిల్" మరియు "గోల్డెన్ క్రెసెంట్" అనే పదాలను "డెత్ ట్రయాంగిల్" మరియు "డెత్ క్రెసెంట్"గా మార్చాము. మాదక ద్రవ్యాల వ్యాపారులకు గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు వర్తిస్తుందని అయితే మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు అనుకూలంగా ఉండే వారికి డెత్ ట్రయాంగిల్, డెత్ క్రెసెంట్ అనే పదాలే సరైనవని ఆయన అన్నారు. ఈ విధానం కేవలం ప్రతీకాత్మకం మాత్రమే కాదని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మన పోరాటం యొక్క తీవ్రత మరియు దిశను సూచిస్తుందని శ్రీ షా తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన సమన్వయం కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగే ఎన్‌సిఓఆర్‌డి సమావేశాల కొనసాగింపుపై దృష్టి పెట్టాలి " ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం 2019లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సిఒఆర్‌డి)ని ఏర్పాటు చేసిందని ఇది నాలుగు వేర్వేరు స్థాయిలలో సమావేశాలను నిర్వహిస్తుందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. జిల్లా స్థాయి ఎన్‌సిఓఆర్‌డి సమావేశాలు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్థిక పరిశోధనలపై రాష్ట్రాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సహకరించాలని, కేసులను ఈడీకి సూచించాలని ఆయన ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులపై ఆర్థిక పరిశోధనలు జరిపి వారి ఆర్ధికమూలాలను విచ్ఛిన్నం చేసే వరకు మన ప్రచారం విజయవంతం కాదని శ్రీ షా అన్నారు. మాదక ద్రవ్యాలు సేవించేవారిని బాధితులుగా పరిగణించాలని వ్యాపారం చేసేవారిని దోషులుగా గుర్తించాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడే వారు బాధితులేనని, వారిని శాశ్వతంగా బానిసలుగా విడిచిపెట్టకుండా సరైన దారిలోకి తీసుకొచ్చేందుకు మన వ్యవస్థలు కృషి చేయాలని అన్నారు.

 

image.png


సీజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సిమ్స్) ఇ-పోర్టల్‌ను కూడా తాము రూపొందించామని దానిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ అమిత్ షా అన్నారు. కేంద్రీకృత ఎన్‌కార్డ్‌ పోర్టల్ గురించిన సమాచారాన్ని పోలీసు స్టేషన్‌లకు అందించాలని చెప్పారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ (ఎన్‌ఐడిఏఏఎన్‌) అనే యూనిఫైడ్ డేటాబేస్ ఉందని, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎన్‌ఏఎఫ్‌ఐఎస్‌)గా పిలిచే వేలిముద్రల కోసం మరో డేటాబేస్ ఉందని, వీటిని విస్తృతంగా ఉపయోగించాలని ఆయన అన్నారు. 35 రాష్ట్రాలు/యూటీలు అంకితమైన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌లను (ఎఎన్‌టిఎఫ్‌) ఏర్పాటు చేశాయని వాటిని అభినందించాల్సిందేనని శ్రీ షా అన్నారు. నేషనల్ నార్కోటిక్స్ కె9 పూల్‌ను కూడా ఏర్పాటు చేశామని, రాష్ట్రాలు ఈ చొరవను ముందుకు తీసుకువెళితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారికి శిక్షణ అందించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

రాష్ట్రాలు డ్రగ్స్‌పై ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని వాటి ప్రాసిక్యూషన్‌ను ఫాస్ట్‌ట్రాక్ మోడ్‌లో నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. కఠిన శిక్షలు మరింత బలమైన నిరోధకంగా పనిచేస్తాయని, అది బలమైన సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నమైన వారి ఆస్తుల జప్తును పెంచాలని శ్రీ షా తెలిపారు. ఈ వ్యక్తులను బహిరంగంగా అవమానించడం/బహిష్కరించడం ఈ వ్యాపారంలో చేరకుండా ఇతరులను నిరుత్సాహపరుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఆస్తుల జప్తు దిశగా నిర్దాక్షిణ్యంగా వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీ షా అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ (ఎఫ్‌ఎస్‌ఎల్)ను బలోపేతం చేసేంత వరకు ప్రాసిక్యూషన్ పురోగతి సాధించదని ఆయన అన్నారు. ఇది చొరవకు సంబంధించిన ప్రశ్న, వనరులు కాదని ఆయన నొక్కి చెప్పారు. అదేవిధంగా ఉత్తరాది ప్రాంతాల్లో అక్రమ సాగును నిర్మూలించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మన ప్రచారం దేశంలోని భవిష్యత్తు తరాలను రక్షించడానికి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక పవిత్రమైన మిషన్ అని, ఇది తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర హోం మంత్రి అన్నారు.

ఈ సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా కూడా పాల్గొన్నారు. పంజాబ్ గవర్నర్లు మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు అలాగే హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు ఈ సదస్సులో ఒడిశా హోం శాఖ సహాయ మంత్రి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ,ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్, వివిధ భద్రతా సంస్థలు మరియు భారత ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.


 

*****



(Release ID: 1940373) Visitor Counter : 157