గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

29 జూన్ 2023న “గణాంకాల దినోత్సవం” నిర్వహణ


ఇతివృత్తం: "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించడానికి జాతీయ సూచిక విధానాలతో రాష్ట్రాల సూచిక విధానాలను ఏకీకృతం చేయడం"

Posted On: 28 JUN 2023 10:18AM by PIB Hyderabad

గణాంకాలు, ఆర్థిక ప్రణాళిక రంగాల్లో స్వర్గీయ ప్రొ.ప్రశాంత చంద్ర మహలనోబిస్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీని "గణాంకాల దినోత్సవం"గా భారత ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ స్థాయిలో జరుపుకోవాల్సిన ప్రత్యేక దినోత్సవాల విభాగంలో "గణాంకాల దినోత్సవం"ను చేర్చింది. సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో గణాంకాల పాత్ర, ప్రాముఖ్యతను చాటి చెప్పిన ప్రొ.మహలనోబిస్‌ నుంచి ప్రేరణ పొందడం, ప్రత్యేకించి యువతలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.

ఈ సంవత్సరం గణాంకాల దినోత్సవాన్ని న్యూదిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో ఉన్న స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు. భారత గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావ్‌ ఇంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్‌ ప్రొ.రాజీవ లక్ష్మణ్ కరాండికర్, భారతదేశ ముఖ్య గణాంకాధికారి & మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.జి.పి.సమంత, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

జాతీయ స్థాయి ప్రాముఖ్యత ఉన్న ఒక ఇతివృత్తంతో ప్రతి సంవత్సరం గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గణాంకాల దినోత్సవం 2023 కోసం ఎంపిక చేసిన ఇతివృత్తం “సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించడానికి జాతీయ సూచిక విధానాలతో రాష్ట్రాల సూచిక విధానాలను ఏకీకృతం చేయడం”.

గణాంకాల దినోత్సవంలో భాగంగా జరిగే సాంకేతిక కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ అధికారులు సంక్షిప్త ప్రదర్శన ఇస్తారు. ఆ తర్వాత నిపుణుల ప్రసంగాలు ఉంటాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన "ఆన్ ది స్పాట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, 2023" విజేతలను కూడా ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.

 

****


(Release ID: 1935860) Visitor Counter : 223