యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2022' కోసం దరఖాస్తులు ఆహ్వానించిన భారత యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ


దరఖాస్తుల సమర్పణకు తుది గడువు 14 జులై 2023

Posted On: 26 JUN 2023 4:30PM by PIB Hyderabad

భారత యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, 'టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2022' (టీఎన్‌ఎన్‌ఏఏ) కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన విజయాలను గుర్తించడానికి మంత్రిత్వ శాఖ ఈ జాతీయ స్థాయి పురస్కారాలు అందజేస్తోంది. ఓర్పు, ప్రమాదాలకు ఎదురెళ్లడం, జట్టుకు సహకారం అందించడం, సవాళ్లు విసిరే పరిస్థితుల్లో త్వరగా స్పందించడం, సిద్ధంగా ఉండడం వంటి సాహస స్ఫూర్తిని యువత పెంపొందించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులను మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తోంది.

టీఎన్‌ఎన్‌ఏఏ 2022 కోసం దరఖాస్తులను 15 జూన్ 2023 నుంచి 14 జులై 2023 వరకు https://awards.gov.in పోర్టల్ ద్వారా సమర్పించాలి. పురస్కారాలకు సంబంధించిన మార్గదర్శకాలను https://yas.nic.in/youth-affairs/inviting-nominations-tenzing-norgay-national-adventure-award-2022-15th-june-2023-14th లింక్‌ ద్వారా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అద్భుతమైన పనితీరు, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు, సాహసోపేత క్రమశిక్షణ,  భూమి, వాయువు లేదా నీరు (సముద్రం) రంగాల్లో నిరంతర విజయాలను సాధించిన ఏ వ్యక్తి అయినా పైన సూచించిన పోర్టల్ ద్వారా పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

టీఎన్‌ఎన్‌ఏఏ 2022లో భాగంగా కాంస్య విగ్రహం, ధృవపత్రం, పట్టు టై/చీరతో కూడిన బ్లేజర్, 15 లక్షల నగదు అందిస్తారు. అర్జున పురస్కారాలతో పాటు విజేతలకు ఈ అవార్డులు అందజేస్తారు.

భూమి, సముద్రం, వాయు రంగాల్లో చేసిన సాహసాలకు లాండ్‌ అడ్వెంచర్‌, వాటర్‌ (సముద్రం) అడ్వెంచర్‌, ఎయిర్‌ అడ్వెంచర్‌, జీవితకాల సాఫల్య పురస్కారం పేరిట నాలుగు విభాగాల్లో అవార్డులు ఇస్తారు. భూమి, సముద్రం, వాయు విభాగాల్లో అందించే పురస్కారాల కోసం గత మూడేళ్లలో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటారు. జీవితకాల సాఫల్య పురస్కారం కోసం మొత్తం వృత్తి జీవితంలో సాధించిన ఘనతను పరిగణనలోకి తీసుకుంటారు.

*****



(Release ID: 1935545) Visitor Counter : 153