ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకుల తెలుగు అనువాదం
Posted On:
23 JUN 2023 6:46PM by PIB Hyderabad
గౌరవనీయ అధ్యక్షా...
ముందుగా మీకు… జిల్ బైడెన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాతోపాటు మా ప్రతినిధి బృందానికి మీరు సాదర స్వాగతం పలికినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేడు భారత సమాజాన్ని శ్వేతసౌధంలోకి అనుమతించినందుకూ నా కృతజ్ఞతలు. మీ హృదయపూర్వక స్వాగతం ఫలితంగా అమెరికా-భారత్ మధ్య భవిష్యత్ వ్యూహాత్మక సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసే అవకాశం వేలాది భారతీయులకు లభించింది.
మహాశయా!
మీరు సదా భారత శ్రేయోభిలాషులు… ఆ మేరకు మీకు ఎప్పుడు… ఎక్కడ అవకాశం లభించినా- భారత్-అమెరికా సంబంధాల ప్రాముఖ్యాన్ని ఎంతో గొప్పగా నొక్కిచెబుతుంటారు. ఆ మేరకు ఎనిమిదేళ్ల కిందట అమెరికా-భారత్ వాణిజ్య మండలిలో ప్రసంగిస్తూ మీరు వెల్లడించిన కీలకాంశం నాకు ఇంకా గుర్తుంది. ఆనాడు “భారతదేశంతో చక్కని స్నేహమే మా లక్ష్యం” అన్న మీ ఈ మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. భారత్ విషయంలో మీ వ్యక్తిగత నిబద్ధత అనేక సాహసోపేత-ప్రతిష్టాత్మక చర్యల దిశగా మాకు ప్రేరణనిస్తోంది. నేడు అమెరికా-భారత్ అంతరిక్షం నుంచి సముద్రపు లోతులదాకా; ప్రాచీన సంస్కృతి నుంచి కృత్రిమ మేధస్సు వరకూ ప్రతి రంగంలోనూ మన రెండు దేశాలూ భుజంకలిపి నడుస్తున్నాయి.
మన రెండు దేశాల మధ్య సంబంధాలను దౌత్య దృక్కోణంతో పరికిస్తే- అది సహజంగా అధికారిక ఉమ్మడి ప్రకటనలు, కార్యాచరణ బృందాలు, అవగాహన ఒప్పందాలకు పరిమితమై ఉంటుంది. నిజానికి, ఈ స్నేహానికి తనదైన ప్రాముఖ్యం ఉంది, భారత్-అమెరికాల మధ్య స్నేహ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే వాస్తవ చోదకం రెండు దేశాల ప్రజానీకం మధ్యగల సంబంధాలే. ఆ మేరకు శ్వేతసౌధం పచ్చికబయళ్ల వెలుపల ఈ చోదకశక్తి పెను గర్జన మాకు నేరుగా వినిపించింది.
మహాశయా!
మీ మాటలను పునరుద్ఘాటించాలని నేను భావిస్తున్నాను. ఆ మేరకు ప్రపంచం నేడు వేగంగా పరిణామం చెందుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికాలపైనే అన్ని దేశాలూ దృష్టి సారించాయి. ప్రపంచ శాంతి, స్థిరత్వంతో పాటు మానవాళి సంక్షేమానికి సంబంధించి ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే అన్ని శక్తులకూ మన వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమేగాక ప్రధానమైనదని కూడా నేను భావిస్తున్నాను. అలాగే యావత్ ప్రపంచ సామర్థ్య వికాసంలో మన విజయం తథ్యమన్నది నా దృఢ విశ్వాసం.
ఇవాళ్టి మన ద్వైపాక్షిక సమావేశంలో అనేక అంశాలపై మనం చర్చిద్దాం… తద్వారా మన వ్యూహాత్మక సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిద్దాం. మన స్నేహానికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
*****
(Release ID: 1934981)
Visitor Counter : 146
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam