యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రీడాకారులు, జట్టు అధికారుల భోజనం & బస రోజువారీ ఖర్చు పరిమితిని 66% పెంచిన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ

Posted On: 16 JUN 2023 3:43PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్‌), భారత క్రీడాకారులు, జట్టు అధికారుల భోజనం & బస రోజువారీ ఖర్చు పరిమితిని 66% పెంచింది.

మంత్రిత్వ శాఖ పథకమైన 'జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌లు) సాయం' కింద అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

నూతన సవరణల ప్రకారం, విదేశాల్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, సహాయక సిబ్బందిపై ఇప్పుడు రోజుకు 250 అమెరికన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయవచ్చు. ఇది, గతంలో ఉన్న 150 డాలర్ల నుంచి 66% పెరిగింది.

ఎన్‌ఎస్‌ఎఫ్‌ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ సవరణ చేశారు. లోకల్‌ ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్‌ఓసీ) నిర్ణయించిన భోజనం & బస ధరలు 'రోజుకు 150 డాలర్ల పరిమితి' కంటే ఎక్కువగా ఉన్నాయని తమ అభ్యర్థనల్లో వెల్లడించారు. ఈ రోజువారీ పరిమితిని 2015 నవంబర్‌లో నిర్ణయించారు, ఆ సవరణ జరిగి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది.

భోజనం & బస ఖర్చు పరిమితి పెరగడంతో, వివిధ అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులకు మెరుగైన వసతిని ఏర్పాటు చేసేందుకు ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అవకాశం ఏర్పడింది.

ఇంకా, ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల ప్రకారం, అంతర్జాతీయ పోటీల లోకల్‌ ఆర్గనైజింగ్ కమిటీలు కేవలం భోజనం & బసతో సరిపెట్టకుండా, పోటీల్లో పాల్గొనే జట్లకు పూర్తి ఆతిథ్య ప్యాకేజీని అందిస్తున్నాయి.

ఆ ప్యాకేజీలో భోజనం, బస, స్థానిక రవాణా, కొన్ని సందర్భాలలో ప్రవేశ రుసుము కూడా ఉంటాయి. ప్యాకేజీ మొత్తం ఖర్చు ఒక వ్యక్తికి ఒక రోజుకు 150 అమెరికన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, 2015లో నిర్ణయించిన భోజనం & బస రోజువారీ ఖర్చు నిబంధనలను సమీక్షించాల్సి వచ్చింది.

 

*****


(Release ID: 1932938)