వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాలను మించిన ప్రయోజనాలను దేశానికి అందించడానికి ప్రాంతీయాభివృద్ధి విధానంతో పీఎం గతి శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి: శ్రీ పీయూష్ గోయల్


డీపీఐఐటీ, 8 మంత్రిత్వ శాఖలు హాజరైన పీఎం గతి శక్తి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

పీఎం గతి శక్తి సమీకృత విధానాలను ఉపయోగించి సహకార సంస్థలు, అంకుర సంస్థల ద్వారా ఉమ్మడి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయించి, తద్వారా వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వాలి: పీయూష్ గోయల్

Posted On: 15 JUN 2023 1:17PM by PIB Hyderabad

దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని మించిన ప్రయోజనాలు కల్పించడానికి ప్రాంతీయాభివృద్ధి విధానంతో పీఎం గతి శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సూచించారు. నిన్న సాయంత్రం న్యూదిల్లీలో డీపీఐఐటీ, 8 మంత్రిత్వ శాఖలతో పీఎం గతి శక్తి పురోగతిపై జరిగిన సమీక్ష కార్యక్రమానికి శ్రీ గోయల్ అధ్యక్షత వహించారు. భారతదేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు పీఎం గతి శక్తి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖలకు గోయల్‌ సూచించారు.

పీఎం గతి శక్తి సమగ్ర  విధానాలు, నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఎంపీ) సమాచారంతో సహకార సంస్థలు, అంకుర సంస్థలు వ్యవసాయ భూముల్లో ఉమ్మడి మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వవచ్చని శ్రీ గోయల్ చెప్పారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాలతోనూ కలిసి పని చేయడానికి పీఎం గతి శక్తి ప్రాంతీయాభివృద్ధి విధానాన్ని ఉపయోగించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

పరిశ్రమలు & అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సీనియర్ అధికారులతో పాటు, రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ, నౌకాశ్రయాలు, నౌక రవాణా & జల మార్గాల శాఖ, పౌర విమానయాన శాఖ, విద్యుత్‌ శాఖ, పెట్రోలియం & సహజ వాయువు శాఖ, టెలీ కమ్యూనికేషన్ విభాగం (డాట్‌), నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ, భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్‌ఎంపీ సమాచారం నాణ్యతను మెరుగుపరచడం, ప్రామాణీకరించడం, మెరుగైన ప్రణాళిక కోసం నాణ్యత మెరుగదల ప్రణాళిక (క్యూఐపీ) వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో పీఎం గతి శక్తి పురోగతిని సమావేశానికి సమర్పించారు. దేశంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచే సామాజిక రంగ ప్రణాళిక కోసం ఎన్‌ఎంపీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఇప్పటికే సభ్యులుగా ఉన్న 14 సామాజిక రంగ విభాగాలు, మంత్రిత్వ శాఖలతో పాటు, మరో 5 కొత్త మంత్రిత్వ శాఖలను పీఎం గతి శక్తిలో చేర్చాలని ప్రతిపాదించారు. దేశీయ రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, ఎగ్జిమ్‌ లాజిస్టిక్స్‌ను మెరుగుపరుస్తూ డీపీఐఐటీ పని చేస్తోంది. సంబంధిత శాఖలు, మంత్రిత్వ శాఖలతో ఒక ఎగ్జిమ్‌ లాజిస్టిక్స్ బృందం కూడా ఏర్పాటైంది. ప్రపంచ బ్యాంక్ నివేదికలోని లాజిస్టిక్స్ పనితీరు సూచికలో (ఎల్‌పీఐ) పేర్కొన్న అర్హతలతో దేశం పని తీరును మెరుగుపరచడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందించి, అమలు చేస్తారు. జీఎస్‌టీఎన్‌ సమాచారంతో యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్‌ను (యులిప్‌) ఏకీకృతం చేయడం ద్వారా, సరకు రవాణాలో ఎండ్-టు-ఎండ్ మల్టీ-మోడల్ ట్రాకింగ్‌ తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తృత అవగాహన & అమలు కోసం, కేంద్ర శిక్షణ సంస్థల్లో పీఎం గతి శక్తిపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాడ్యూల్స్ ద్వారా రాష్ట్ర స్థాయిలో అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు.

దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే రంగంగా మౌలిక సదుపాయాలను పరిగణిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘సంపూర్ణ ప్రభుత్వ మద్దతు’ విధానం అవసరమని గుర్తించి, పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను 2021 అక్టోబర్‌లో ప్రారంభించారు.

***



(Release ID: 1932730) Visitor Counter : 155