జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఈ నెల 17న, 4వ జాతీయ జల పురస్కారాలు ప్రదానం చేయనున్న ఉప రాష్ట్రపతి


11 విభాగాల్లో 41 మంది విజేతలను ప్రకటించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ

ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన మధ్యప్రదేశ్‌, ఉత్తమ జిల్లాగా నిలిచిన గంజాం

Posted On: 15 JUN 2023 11:40AM by PIB Hyderabad

కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'జల వనరులు, నదుల అభివృద్ధి & గంగానది పునరుజ్జీవన విభాగం', ఈ నెల 17న ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో, భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌ 4వ జాతీయ జల పురస్కారాలను ప్రదానం చేస్తారు. న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ ప్లీనరీ హాల్‌లో అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 2022 కోసం, 11 విభాగాల్లో ఉమ్మడి విజేతలు సహా మొత్తం 41 మంది విజేతలను కేంద్ర విభాగం ప్రకటించింది. ప్రతి విజేతకు ప్రశంస పత్రం, జ్ఞాపిక, నగదు బహుమతిని అందజేస్తారు.

ఉత్తమ రాష్ట్రంగా ప్రథమ బహుమతిని మధ్యప్రదేశ్‌ గెలుచుకుంది. ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం జిల్లా నిలిచింది. ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాధపురం గ్రామ పంచాయతీకి ఇస్తారు. ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ అవార్డు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అందజేస్తారు. ఉత్తమ మీడియా పురస్కారం గురుగావ్‌కు చెందిన 'అడ్వాన్స్ వాటర్ డైజెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్'కు ప్రదానం చేస్తారు. ఉత్తమ పాఠశాలగా గుజరాత్‌లోని మెహసానాలోని జమియత్‌పురా ప్రాథమిక పాఠశాల నిలిచింది. ప్రాంగణ వినియోగంలో ఉత్తమ సంస్థ పురస్కారాన్ని జమ్ము&కశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం దక్కించుకుంది. బిహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని బొగ్గు విద్యుత్‌ ఉత్పుత్తి కేంద్రానికి ఉత్తమ పరిశ్రమ అవార్డు ప్రదానం చేస్తారు. ఉత్తమ ఎన్‌జీవోగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న అర్పన్ సేవా సంస్థాన్ నిలిచింది. ఉత్తమ నీటి వినియోగదార్ల సంఘం అవార్డును గుజరాత్‌ నర్మదలోని సంజీవని పియత్‌ సహకారి మాండ్లీ లిమిటెడ్‌కు ప్రదానం చేస్తారు. సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో ఉత్తమ పరిశ్రమగా ఉత్తరప్రదేశ్‌  నోయిడా కేంద్రంగా పని చేస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ నిలిచింది. 

4వ జాతీయ జల పురస్కారాలు, 2022 విజేతల జాబితా చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

'జల్ సమృద్ధ్ భారత్' లేదా 'జల సంపన్న భారత్' అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడానికి దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా, జలాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు & సంస్థలను గుర్తించి, వారి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి జాతీయ జల పురస్కారాలు ఇస్తున్నారు. ఇవి, నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఉత్తమ జల వినియోగ పద్ధతులు పాటించేలా ప్రేరేపిస్తాయి. బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి, జల వనరుల సంరక్షణ & నిర్వహణ పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఈ కార్యక్రమం అవకాశాన్ని అందిస్తుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, జాతీయ స్థాయిలో జల నిర్వహణ & సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి సమగ్ర ప్రచారాన్ని జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలో నీటి వనరుల నిర్వహణకు సమగ్ర విధానాన్ని అవలంబించేందుకు, వివిధ వర్గాలను ప్రోత్సహించే లక్ష్యంతో, సమీకృత జాతీయ జల పురస్కారాలను ప్రకటించడం అవసరమని భావించారు. ఈ ప్రకారం, 1వ జాతీయ జల పురస్కారాలను 2018లో ప్రారంభించారు. 2019, 2020 సంవత్సరాలకు 2వ, 3వ జాతీయ జల పురస్కారాలను అందించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా 2021 సంవత్సరంలో అవార్డులు ఇవ్వలేదు.

2022 సంవత్సరానికి, 4వ జాతీయ జల పురస్కారాల కోసం దరఖాస్తు ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో 2022 జులై 30న ప్రారంభించారు. చివరి తేదీ అయిన 2022 అక్టోబర్‌ 31 నాటికి 868 దరఖాస్తులు అందాయి. దరఖాస్తులను పరిశీలించి, వడపోశారు. వడపోత తర్వాత మిగిలిన దరఖాస్తులను కేంద్ర జల కమిషన్, కేంద్ర భూగర్భ జల బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. చివరగా, 11 విభాగాల్లో ఉమ్మడి విజేతలు సహా 41 మందిని పురస్కారాల కోసం ఎంపిక చేశారు.

 

*****



(Release ID: 1932678) Visitor Counter : 240