ప్రధాన మంత్రి కార్యాలయం

తొలి జాతీయ శిక్షణ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం


ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం ఉద్యోగులందరి బాధ్యత: ప్రధానమంత్రి;

శిక్షణ అన్నది అధికారుల సామర్థ్యం పెంపుతోపాటు సంపూర్ణ ప్రభుత్వ దృక్పథాన్ని.. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని పెంచేదిగా ఉండాలి: ప్రధానమంత్రి;

శిక్షణ సంస్థల్లో నియామకాన్ని శిక్షగా భావించే పాత ధోరణి మారుతోంది: ప్రధానమంత్రి
అడ్డం-నిలువు ఏకాకి ధోరణిని ప్రస్తావిస్తూ.. అనుభవజ్ఞుల అన్వేషణలో సోపాన సంకెళ్లను తెంచుకోవాలని ఉన్నతాధికార యంత్రాంగానికి ప్రధాని ఉద్బోధ;

ప్రభుత్వ సిబ్బంది ధోరణి.. మనస్తత్వం.. పద్ధతుల మెరుగుకు కర్మయోగి మిషన్ కృషి చేస్తుంది కాబట్టి వారు
సంతృప్తితో-సంతోషంగా మెలగుతారు.. ఫలితంగా పాలన యంత్రాంగ సహజ స్వభావం కూడా మెరుగుపడుతుంది: ప్రధానమంత్రి

Posted On: 11 JUN 2023 6:02PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రంలో తొట్టతొలి జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా తన అపార రాజకీయ-పాలనానుభవం ఆధారిత వృత్తాంతాలు, కథనాలతో ఆయన ప్రసంగం కొనసాగింది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరులో సేవా దృక్పథం, సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడంలో కర్తవ్య నిర్వహణ వంటి అంశాలపై పలు ఉదాహరణలను ఉటంకించారు. అంతేకాకుండా వ్యవస్థ నిర్వహణలో అధికార సోపాన క్రమాన్ని అధిగమించడంతోపాటు ప్రతి ఒక్కరి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే ప్రజా భాగస్వామ్యానికిగల ప్రాధాన్యం, వ్యవస్థను నిత్యనూతనంగా రూపొందిస్తూ నవోత్తేజం నింపడంలో ఉత్సాహం చూపడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ సిబ్బంది కర్తవ్య నిర్వహణలో ఈ అంశాలను అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

   ప్రస్తుతం ప్రధానమంత్రిగా, లోగడ ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ- అంకిత భావం, ప్రతిభగల అధికారుల కొరత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేదని గుర్తుచేశారు. భారత సాయుధ దళాల వ్యవస్థ ప్రజల్లో అనితరసాధ్యమైన విశ్వసనీయతను పొందడాన్ని శ్రీ మోదీ ఉదాహరించారు. అదే తరహాలో ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని ఇనుమడింపజేసే బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగిపైనా ఉందని స్పష్టం చేశారు. శిక్షణ అన్నది అధికారుల వ్యక్తిగత సామర్థ్యం పెంపుతోపాటు సంపూర్ణ ప్రభుత్వ దృక్పథాన్ని, ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని పెంచేదిగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అంతేకాకుండా శిక్షణ సంస్థల్లో నియామకాన్ని గతంలో ఒక శిక్షగా భావించే ధోరణి ఉండేదని, నేడు అది క్రమేణా మారుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగంగా దశాబ్దాలపాటు పనిచేసే సిబ్బందికి ఇలాంటి శిక్షణ సంస్థలు అత్యంత కీలకమైనవని ఆయన చెప్పారు.

   ధికార యంత్రాంగంలో అడ్డం-నిలువు ఏకాకి ధోరణిని ప్రస్తావిస్తూ- అనుభవజ్ఞుల అన్వేషణలో సోపాన సంకెళ్లను తెంచుకోవాలని ఉన్నతాధికార యంత్రాంగానికి ప్రధానమంత్రి  ఉద్బోధించారు. ప్రతి ఉద్యోగిలోనూ ప్రజా భాగస్వామ్య ప్రాధాన్యం నాటుకునే విధంగా శిక్షణ సాగాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ అంశాన్ని విశదీకరిస్తూ- స్వచ్ఛ భారత్‌, ఆకాంక్షాత్మక జిల్లాలు, అమృత సరోవరాల నిర్మాణం వంటి కార్యక్రమాల విజయంసహా ప్రపంచ డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ వాటా గణనీయంగా నమోదు కావడంలో ప్రజా భాగస్వామ్యం కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు.

   ప్రతి స్థాయిలో... ప్రతి ఒక్కరికీ శిక్షణ అవసరమని, ఈ దృక్కోణంలోనే ‘ఐగాట్‌’ కర్మయోగి వేదిక అందరికీ అటువంటి శిక్షణావకాశం కల్పిస్తూ సమానత భావనను ప్రోది చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ‘ఐగాట్‌’ కర్మయోగి వేదిక కింద శిక్షణ కోసం నమోదు చేసుకునేవారి సంఖ్య 10 లక్షల ప్రాథమిక స్థాయిని దాటిందని తెలిపారు. దీన్నిబట్టి వ్యవస్థలో దాదాపు ప్రతి ఒక్కరూ శిక్షణకు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సిబ్బంది ధోరణి, మనస్తత్వం, పని పద్ధతుల మెరుగుదలకు కర్మయోగి మిషన్ కృషి చేస్తుందని ప్రధాని చెప్పారు. అందువల్ల వారు సంతృప్తి, సంతోషంగా విధులు నిర్వహిస్తారని, ఫలితంగా పాలన యంత్రాంగ సహజ స్వభావం కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

   ఒకరోజుపాటు సాగే ఈ సదస్సులో భాగంగా చర్చల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో శిక్షణ మౌలిక సదుపాయాల మెరుగుకు ఆచరణాత్మక సూచనలు-సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సు నిర్వహణ క్రమబద్ధ వ్యవధులలో కొనసాగేలా సంస్థాగత యంత్రాంగాన్ని రూపొందించాలని కూడా ఆయన కోరారు.

 



(Release ID: 1931676) Visitor Counter : 129