యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.


ఉత్తరప్రదేశ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు,2022ను స్వాగతించడానికి లక్నో నగరం ముస్తాబైంది.

Posted On: 25 MAY 2023 10:51AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్  ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల ప్రారంభోత్సవానికి లక్నో నగరం సర్వాంగ సుందరంగా  ముస్తాబైంది. ఉన్నత విద్యా స్థాయిలో భారీ స్థాయిలో  బహుళ  క్రీడా పోటీలను నిర్వహించడం ఇది మూడవసారి.  

క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్,  భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు  , క్రీడలు మరియు సమాచార ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ,  క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిషిత్ ప్రామాణిక్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.

బి.బి.డి.  విశ్వవిద్యాలయ క్రికెట్ మైదానంలో 70 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.50 కి సైనికదళం వాయిద్య బృందం  జాతీయ గీతం ఆలాపనతో మొదలవుతుంది.   ఆ తరువాత కార్యక్రమంలో ప్రముఖుల ప్రసంగాలతో పాటు పాటలు, ప్రార్ధనలు, అభినయాలు, కాగడాలు/దివిటీలతో విన్యాసాలు,  రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులచే క్రీడా జ్యోతిని వెలిగించడం,  టపాకాయలు కాల్చడం మరియు ప్రమాణాలు ఉంటాయి.  

రాష్ట్ర జంతువు బారసింగ స్పూర్తితో రూపొందించిన క్రీడల చిహ్నం జీతూ ఉత్సవాలలో భారంగా  ఉంటుంది.  ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ప్రత్యేక ప్రదర్శనతో  ప్రారంభోత్సవం ముగుస్తుంది.
 
      ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ క్రీడలు మరియు యువజన వ్యవహారాల అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ నవనీత్ సెహగల్ ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.  ఉత్తరప్రదేశ్ క్రీడా చరిత్రలో ఇది అత్యంత శుభదినమని.  గౌరవనీయ ముఖ్యమంత్రి దార్శనిక మార్గదర్శకత్వంలో కార్యక్రమాన్ని జాగరూకతతో రూపొందించామని తెలిపారు.  తామందరం ప్రారంభోత్సవ వేడుకల కోసం ఆతృతతో  
 ఎదురు చూస్తున్నామని అన్నారు.   రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని,  ఆధునికత, అభివృద్ధి  దిశలో సాధించిన ప్రగతిని మమేకం చేస్తూ
ప్రపంచ శ్రేణి ఉత్సవానికి సన్నాహాలు చేసినట్లు ఆయన తెలిపారు.  ఈ ఉత్సవాలలో రాష్ట్ర ప్రజలందరూ కలసికట్టుగా పాలుపంచుకొని విజయవంతం చేయాలని,  తద్వారా ఈ ప్రాంతం క్రీడల్లో,  క్రీడాకారుల్లో విప్లవానికి దోహదం చేయగలదని అన్నారు.  

 పురుషులు, మహిళల కబడ్డీ లీగ్ స్థాయి పోటీలు బుధవారం నాడుగ్రేటర్ నోయిడా లోని షహీద్ విజయ్ సింగ్ పాటిక్ (ఎస్ వి ఎస్ పి) స్టేడియంలో జరిగాయి. మాల్ కాంబ్, వాలీ బాల్ ,  టేబుల్ టెన్నిస్, రగ్బీ, ఫుట్ బాల్ (బాలురు & బాలికలు) మరియు టెన్నిస్ పోటీలు లక్నోలో మూడు వేడుకలలో మొదలయ్యాయి.  వారణాసిలో జరిగే ముగింపు ఉత్సవంతో జూన్ మూడవ తేదీన పోటీలు ముగుస్తాయి.

 మూడవసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల పోటీలలో 200 యూనివర్సిటీలకు చెందిన 4000 మంది క్రీడాకారులు 21 ఆటలలో పోటీపడుతారు.  రాష్ట్రంలోని నాలుగు నగరాలు లక్నో, వారణాసి, గోరఖ్పూర్ మరియు నోయిడాలలో పోటీలు జరుగుతాయి. ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ వద్ద షూటింగ్ పోటీలు జరుగుతాయి.   గోరఖ్ పూర్ లోని రాంగఢ్ తాల్ వద్ద రోవింగ్ పోటీలు జరుగుతాయి. ఖేలో ఇండియా  యూనివర్సిటీ పోటీలలో జల క్రీడలు నిర్వహించడం ఇదే మొదటిసారి.

మనూ భాకర్, హృదయ్ హజారికా, మేహూలి ఘోష్, అర్జున్ బబుతా మరియు షిఫ్ట్ కౌర్ సామ్రా వంటి జాతీయస్థాయి షూటింగ్ క్రీడాకారులు,  టేబుల్ టెన్నిస్ లో  దియా చితాలే మరియు అనన్య బాసక్, ఫుట్ బాల్ లో ఎస్ కె. సాహిల్,  ఈతలో అనీష్ గౌడ, బ్యాడ్మింటన్ లో మాళవిక బంసాద్ ,  జూడో లో యాష్ ఘంగాస్,  మల్ల యోధులు ప్రియా మాలిక్ మరియు సాగర్ జగ్లాన్ తదితరులు పోటీ పడతారు.

*** 



(Release ID: 1927275) Visitor Counter : 133