జల శక్తి మంత్రిత్వ శాఖ

వచ్చే నెల 17న జాతీయ జల పురస్కారాలు ప్రదానం


11 విభాగాల్లో 41 మంది విజేతలను ఎంపిక చేసిన జలశక్తి మంత్రిత్వ శాఖ

విజేతలకు ప్రశంస పత్రం, జ్ఞాపిక, నగదు బహుమతి ప్రదానం

Posted On: 23 MAY 2023 2:23PM by PIB Hyderabad


కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని జలవనరుల విభాగం, 4వ జాతీయ జల పురస్కారాల ప్రదానం వేడుకను వచ్చే నెల 17న దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌ను ఆహ్వానించారు. ఉమ్మడి విజేతలు సహా 41 మంది 4వ జాతీయ జల పురస్కారాలు-2022కు ఎంపికయ్యారు. 'ఉత్తమ రాష్ట్రం', 'ఉత్తమ జిల్లా', 'ఉత్తమ గ్రామ పంచాయతీ', 'ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ', 'ఉత్తమ పాఠశాల', 'ఉత్తమ మాధ్యమం', 'ఉత్తమ ప్రాంగణ వినియోగ సంస్థ', 'ఉత్తమ నీటి వినియోగదార్ల సంఘం', 'ఉత్తమ పరిశ్రమ', 'సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల్లో ఉత్తమ పరిశ్రమ', 'ఉత్తమ ఎన్‌జీవో' వంటి 11 విభాగాల్లో అవార్డులు అందిస్తారు. విజేతలకు ప్రశంస పత్రం, జ్ఞాపిక, నగదు బహుమతి అందజేస్తారు. 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచినవారికి వరుసగా రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతి అందజేస్తారు.

water_awards

జల వనరుల విభాగం కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ అధ్యక్షతన, పురస్కారాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. విజేతలు, ఆహ్వానితులు, వివిధ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలంగా మార్చడానికి ఈ వేడుక ఒక సందర్భంగా మారుతుందని ఆయన చెప్పారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ కార్యకలాపాల్లో ప్రజల చొరవను ప్రోత్సహిస్తుందన్నారు.

పురస్కార గ్రహీతలు, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ సంస్థలు/ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రముఖులు/అధికారులు సహా సుమారు 1,500 మంది ఈ వేడుకలో పాల్గొంటారని భావిస్తున్నారు. అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలను https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1848661 లింక్‌ ద్వారా చూడవచ్చు.

జలశక్తి మంత్రిత్వ శాఖ, నీటిని జాతీయ వనరుగా అభివృద్ధి చేయడం, పరిరక్షించడం, నిర్వహణ కోసం మార్గదర్శకాలు, కార్యక్రమాలను రూపొందించే బాధ్యత కలిగిన నోడల్ మంత్రిత్వ శాఖ. రాష్ట్రాలు, జిల్లాలు, పాఠశాలలు, ప్రభుత్వేతర సంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, నీటి వినియోగదార్ల సంఘాలు, సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సహా వివిధ వాటాదార్ల మద్దతు, చురుకైన భాగస్వామ్యం జల వనరుల సమర్ధవంత నిర్వహణకు కీలకం. 'జల్ సమృద్ధ్ భారత్'ను సాధించడం కోసం, దేశంలోని రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, ప్రజలు మొదలైన వారు చేసిన ఆదర్శప్రాయమైన పనిని, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించడానికి జాతీయ జల పురస్కారాలను (ఎన్‌డబ్ల్యూఏ) ప్రారంభించారు.

2018 సంవత్సరంలో, మొదటి విడత జాతీయ జల పురస్కారాలు ప్రకటించారు. 14 విభాగాల్లో 82 మంది విజేతలకు 2019 ఫిబ్రవరి 25న దిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఆ తర్వాత, 2019లో 2వ జాతీయ జల పురస్కారాలను ప్రకటించారు. 2020 నవంబర్‌ 11-12 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో, 16 విభాగాల్లో 98 మంది విజేతలను భారత ఉపరాష్ట్రపతి సత్కరించారు. 3వ జాతీయ జల పురస్కారాల ప్రదానం కార్యక్రమం 2022 మార్చి 29న నిర్వహించారు. 11 విభాగాల్లో 57 మంది విజేతలకు అవార్డులు అందించి భారత రాష్ట్రపతి సత్కరించారు. వచ్చే నెల 17న విజ్ఞాన్ భవన్‌లో ప్రదానం చేయబోయేవి 4వ జాతీయ జల పురస్కారాలు.

 

*****



(Release ID: 1926677) Visitor Counter : 184