వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్యం,పెట్టుబడులపై 6 వ ఇండియా-కెనడా మంత్రుల స్థాయి చర్చల  సంయుక్త ప్రకటన

Posted On: 10 MAY 2023 9:00AM by PIB Hyderabad

మే 8, 2023 న ఒట్టావాలో వాణిజ్యం పెట్టుబడులపై ఆరవ ఇండియా-కెనడా మంత్రుల స్థాయి (మినిస్టీరియల్) డైలాగ్ (ఎండిటిఐ) జరిగింది, దీనికి కేంద్ర వాణిజ్య ,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం, ప్రజా పంపిణీ, టెక్స్ టైల్స్ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ , కెనడా అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతి ప్రోత్సాహం, చిన్న వ్యాపారం ఆర్థిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జి సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

భారతదేశం - కెనడాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలకు గల బలమైన పునాదిని మంత్రులిద్దరూ ఉద్ఘాటిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి గల ముఖ్యమైన అవకాశాన్ని గుర్తించారు.

భారత జి-20అధ్యక్షత కింద ఈ ఏడాది భారత్ లో జరుగుతున్న వివిధ సమావేశాల్లో జరుగుతున్న ముఖ్యమైన చర్చలను మంత్రులు ప్రస్తావించారు.

ఈ సందర్భంగా భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ పాత్రను ప్రస్తావించిన కెనడా మంత్రి ఎన్జీ, భారత్ లో జరిగిన జీ-20 సదస్సులలో ఇప్పటివరకు సాధించిన విజయాలపై భారత ప్రభుత్వానికి, భారత వ్యాపార సంస్థలకు అభినందనలు తెలిపారు. జి 20 చైర్ గా భారతదేశానికి, జి 20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ వర్కింగ్ గ్రూప్ లో భారతదేశం అనుసరిస్తున్న

ప్రాధాన్యతలకు ఆమె తన మద్దతును, ప్రకటించారు. 2023 ఆగస్టులో భారత్ లో జరగబోయే జీ-20 వాణిజ్య, పెట్టుబడుల మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి ఎన్జీ పేర్కొన్నారు.

 

కెనడా అభివృద్ధి, భద్రత, పర్యావరణ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం పరంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమైన ప్రాముఖ్యతను గుర్తించిన మంత్రి ఎన్ జి, కెనడా ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా ఈ ప్రాంతంలో భారతదేశ ప్రాముఖ్యత ను కూడా గుర్తించినట్టు . తెలిపారు.

 

  1. మహమ్మారి సవాళ్లు, ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో 2022లో ద్వైపాక్షిక వాణిజ్యం పునరుద్ధరణను మంత్రులు ప్రస్తావించారు. 2022లో కెనడా-భారత్ మధ్య ద్వైపాక్షిక సరుకు వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 57% గణనీయ పెరుగుదల. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో సేవల రంగం సహకారాన్ని కూడా మంత్రులు నొక్కిచెప్పారు. ద్వైపాక్షిక సేవల వాణిజ్యాన్ని పెంచడానికి గణనీయమైన గల సామర్థ్యాన్ని గుర్తించారు, ఇది 2022 లో 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

రెండు వైపులా ద్వైపాక్షిక పెట్టుబడుల గణనీయమైన వృద్ధిని, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో వారి సహకారాన్ని మంత్రులు గుర్తించారు, వ్యాపార వృద్ధిని సులభతరం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇరు దేశాలు తమ ప్రయత్నాలలో చేసిన మెరుగుదలలను ప్రశంసించారు.

 

భారతదేశం/ కెనడా మధ్య వాణిజ్య సంబంధిత బలాలు పరిపూరకరమైనవని, సంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న రంగాలలో వస్తువులు , సేవల వాణిజ్యం గణనీయంగా విస్తరించడానికి ఖచ్చితమైన నిజమైన అవకాశం ఉందని మంత్రులు పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ వస్తువులు, రసాయనాలు, గ్రీన్ టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, ఆటోమోటివ్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఖనిజాలు, లోహాలు వంటి రంగాల్లో అనుబంధాలను సద్వినియోగం చేసుకునేందుకు భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక ప్రాముఖ్యత కలిగిన వాణిజ్య పరిష్కార అంశాలపై క్రమం తప్పకుండా చర్చించాలని మంత్రులు తమ అధికారులను కోరారు.

 

ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను పెంపొందించడానికి, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎండిటిఐ పోషించగల కీలక సంస్థాగత పాత్రను మంత్రులు వివరించారు. భారతదేశం - కెనడా మధ్య వాణిజ్యం , పెట్టుబడుల ప్రవాహాలను పెంచే దిశగా విస్తృతమైన కొత్త అవకాశాలను సృష్టించడానికి సమగ్ర వాణిజ్య ఒప్పందం అవసరాన్ని గుర్తించిన మంత్రులు, 2022 నాటి భారతదేశం-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) చర్చలను లాంఛనంగా పునప్రారంభించారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా సీఈపీఏ దిశగా మార్పు చర్యగా ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈపీటీఏ) దిశగా ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మూల నియమాలు, పారిశుధ్య , ఫైటోశానిటరీ చర్యలు, వాణిజ్యానికి సాంకేతిక అవరోధాలు, వివాద పరిష్కారం వంటి ఉన్నత స్థాయి కట్టుబాట్లను ఇపిటిఎ కవర్ చేస్తుంది ఇంకా పరస్పర అంగీకారం కుదిరిన ఇతర అంశాలు కూడా కవర్ చేస్తుంది. సమీప భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సమన్వయ పెట్టుబడుల ప్రోత్సాహం, సమాచార మార్పిడి, పరస్పర మద్దతు వంటి చర్యల ద్వారా మెరుగైన సహకారాన్ని అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. భారత్, కెనడాల మధ్య ఈ సహకారాన్ని 2023లో అవగాహన ఒప్పందం (ఎం ఒయూ) ద్వారా ఖరారు చేయనున్నారు.

 

కోవిడ్-19 మహమ్మారి పతనం, అలాగే ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావాల నుండి ప్రపంచ సరఫరా గొలుసులు అంతరాయం ఎదుర్కొనే ముప్పులో ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లో అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం, సరఫరా గొలుసు స్థితిస్థాపకతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి క్లీన్ టెక్నాలజీలు, కీలకమైన ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనం/హైడ్రోజన్, కృత్రిమ మేధ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు, హరిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల ప్రాముఖ్యతను గుర్తించిన మంత్రులు, కీలకమైన ఖనిజ సరఫరా గొలుసు స్థితిస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సమన్వయం అవసరాన్ని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య కీలకమైన ఖనిజాలపై పరస్పర వ్యాపార భాగస్వామ్యానికి అవకాశాలను అన్వేషించడానికి మంత్రులు అంగీకరించారు. పరస్పర ప్రయోజనాల సమస్యలపై చర్చించడానికి టొరంటోలో ప్రాస్పెక్టర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ మార్జిన్స్ పై అధికారుల స్థాయిలో తగిన ఒప్పంద అంశాల మధ్య వార్షిక చర్చలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.

 

జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కమిటీ (జె ఎస్ టి ఎస్ సి) లో కొనసాగుతున్న కృషిని పెంపొందించడం ద్వారా ప్రాధాన్య రంగాల్లో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, స్టార్టప్ లు, , ఇన్నోవేషన్ భాగస్వామ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు పక్షాలు చర్చించాయి. సుస్థిర ఆర్థిక పునరుద్ధరణకు, పౌరుల శ్రేయస్సుకు మద్దతుగా తమ పరిశోధన, వ్యాపార వర్గాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, అటువంటి సహకారాన్ని బలోపేతం చేయడానికి గణనీయమైన అవకాశం ఉందని మంత్రులు అంగీకరించారు.

 

ఎస్ ఎం ఇలు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల ద్వారా భారత్-కెనడా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని విలువను మంత్రులు అంగీకరించారు.

 

బి 2 బి నిమగ్నతను పెంచిన 6 వ ఎండిటిఐ సందర్భంగా భారత వ్యాపార ప్రతినిధి బృందం పర్యటనను మంత్రి మేరీ ఎన్ జి అభినందించారు. బి 2 బి నిమగ్నత వేగాన్ని కొనసాగించడానికి, పునరుద్ధరిత దృష్టి, కొత్త ప్రాధాన్యతలతో కెనడా-ఇండియా సి ఇ ఒ ఫోరమ్ ను పునఃప్రారంభించాలని మంత్రులిద్దరూ నిర్ణయించారు. సిఇఒ ఫోరమ్ ను పరస్పరం అంగీకరించిన ప్రారంభ తేదీలో ప్రకటించవచ్చు. అక్టోబర్ 2023 లో భారతదేశానికి కెనడా వాణిజ్య మిషన్ కు నాయకత్వం వహించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మంత్రి మేరీ ఎన్ జి ప్రకటించారు, దీనిని మంత్రి గోయల్ స్వాగతించారు.

 

రెండు దేశాల మధ్య వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులు, వ్యాపార వేత్తల గణనీయమైన పరస్పర పర్యటనలు , ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో వాటి అపారమైన సహకారాన్ని మంత్రులు ప్రస్తావించారు. ఈ సందర్భంలో, వలసలు , చలనశీలత రంగంలో మరింతగా చర్చలు జరగాలని ఆకాంక్షించారు. తగిన నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం ద్వారా ద్వైపాక్షిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను లోతుగా, బలోపేతం చేసే మార్గాలపై చర్చలు కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అదనంగా, కెనడా అమలు చేస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహానికి అనుగుణంగా, పారిశ్రామిక పరిశోధన ,అభివృద్ధి భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడానికి మరిన్ని పెట్టుబడులు సమకూరుస్తారు. భారత్ లో విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి భారతదేశ జాతీయ విద్యా విధానం- 2020 లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, భారతదేశం అగ్రశ్రేణి కెనడియన్ విశ్వవిద్యాలయాలను భారతదేశంలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేయడానికి ఆహ్వానించింది.

 

2022లో ఇరు దేశాల విమానయాన సంస్థలు వాణిజ్య విమానాలను పెంచడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే విమాన సేవల విస్తరణ ఒప్పందానికి భారత్, కెనడా అంగీకరించాయని మంత్రులు పేర్కొన్నారు.

 

ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నియమాల ఆధారిత, పారదర్శక, వివక్షారహిత, బహిరంగ, సమ్మిళిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తమ నిబద్ధతను మంత్రులు పునరుద్ఘాటించారు . దీనిని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించారు.

 

అనుసంధానాలను ఏర్పాటు చేయడానికి, అన్ని రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి క్రమ పద్ధతి లో నివేదించబడే వార్షిక కార్యాచరణ ప్రణాళిక ను కలిగి ఉండడంతో సహా భారతదేశం - కెనడా మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో స్థిరమైన వేగాన్ని అందించడానికి నిమగ్నం కావాలని మంత్రులు అంగీకరించారు.

 

 

***

 

 



(Release ID: 1923028) Visitor Counter : 143