వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
21వ శతాబ్దంలో అమెరికా - భారతదేశం మధ్య సంబంధాలు కీలకంగా ఉంటాయి.. శ్రీ గోయల్
రెండు దేశాల పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం అమెరికా - భారతదేశం మధ్య సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడి రంగాలకు విస్తరించాలి. శ్రీ గోయల్
గత రెండు సంవత్సరాలుగా అత్యధికంగా అమెరికా - భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది ..శ్రీ గోయల్
భారతదేశం కేంద్రంగా అమెరికా సంస్థలు పనిచేసి ఆఫ్రికా, ఆగ్నేయాసియా మార్కెట్లపై దృష్టి సారించాలి.. శ్రీ గోయల్ సూచన
సాంకేతిక, యాజమాన్య రంగాల్లో అపారమైన ప్రతిభ కలిగి ఉన్న భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధాలు మరింత పటిష్ట పరుచుకుంటుంది.. శ్రీ గోయల్
భౌగోళిక పరిస్థితులు అమృత కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకరిస్తున్నాయి.. శ్రీ గోయల్
గత 9 సంవత్సరాల కాలంలో అమలు జరిగిన సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేశాయి.. శ్రీ గోయల్
Posted On:
04 MAY 2023 4:45PM by PIB Hyderabad
21వ శతాబ్దంలో అమెరికా - భారతదేశం మధ్య సంబంధాలు కీలకంగా ఉంటాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, జౌళి , వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. రెండు దేశాలు పరస్పర సహకారం విధానంలో పనిచేసి మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలన్నారు 31వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ' అభివృద్ధి చెందుతున్న భారతదేశం- అమెరికా భాగస్వామ్యం' అనే అంశంపై ఈరోజు అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా ఈరోజు న్యూ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న శ్రీ గోయల్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశం- అమెరికా దేశాల మధ్య సంబంధాలు, సంబంధాలు మరింత పటిష్టం కావడానికి గల అవకాశాలు తదితర అంశాలను శ్రీ గోయల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పరస్పర అవగాహనతో పని చేస్తూ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట రాజకీయ, భౌగోళిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. సమర్ధత, సాంకేతిక,సంప్రదాయం, వాణిజ్యం, నమ్మకం ఆధారంగా భారతదేశం- అమెరికా దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని శ్రీ నరేంద్ర మోదీ బలంగా విశ్వసిస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా అత్యధిక స్థాయిలో అమెరికా - భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని తెలిపిన శ్రీ గోయల్ రానున్న కాలంలో వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి $ 2 ట్రిలియన్ డాల్లర్ల ఎగుమతులు సాగించాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు. భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు అమెరికా లాంటి దేశాలతో కుదిరిన అవగాహన, సహకారం వల్ల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను శ్రీ గోయల్ వ్యక్తం చేశారు.
భారతదేశం, అమెరికా దేశాల్లో పనిచేస్తున్న సంస్థలు రెండు దేశాల ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం చేస్తున్నాయన్నారు.సమీప భవిష్యత్తులో అమెరికా సంస్థలు భారతదేశానికి చెందిన సంస్థలతో మరింత కలిసి పనిచేస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
ఆఫ్రికా, ఆగ్నేయాసియా మార్కెట్ల వంటి కొత్త ప్రాంతాలకు తమ కార్యకలాపాలు విస్తరించడానికి భారతదేశం కేంద్రంగా అమెరికాకు చెందిన సంస్థలు పనిచేయాలని శ్రీ గోయల్ సూచించారు. ఇటీవల భారతదేశం అమలు చేసిన సంస్కరణలు అమెరికా సంస్థలకు ప్రయోజనం కల్గిస్తాయన్నారు. ప్రాథమిక స్థూల ఆర్థిక పారామితులు, స్థిరమైన అభివృద్ధి, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం వంటి వాటిపై దృష్టి సారించి అమలు చేసిన విధాన సంస్కరణలతో పాటు తక్కువ ధరకు లభించే కార్మిక వనరులతో ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు.
రక్షణ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, వస్త్రాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు , ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన అనేక రంగాల్లో ప్రగతి సాధించడానికి రెండు దేశాలు కాళీ పని చేయడానికి అవకాశాలు అందిస్తాయని శ్రీ గోయల్ అన్నారు. అదేవిధంగా ఐటీ, అకౌంటింగ్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్, పరిశోధన అభివృద్ధి, పర్యాటక రంగం లాంటి సేవా రంగాల్లో కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి సాధించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు సాంకేతిక, నిర్వాహక ప్రతిభ అందిస్తున్న భారతదేశం ప్రపంచ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. అనేక అంతర్జాతీయ సంస్థలకు . భారతీయ లేదా భారతీయ సంతతికి చెందిన వారు సీఈఓ లుగా ఉండడం దీనికి నిదర్శనం అని మంత్రి వ్యాఖ్యానించారు.
భారతదేశం భవిష్యత్తును ప్రస్తుత అమృత కాలం నిర్దేశిస్తుందని శ్రీ గోయల్ తెలిపారు. భౌగోళిక పరంగా సానుకూలంగా ఉన్న పరిస్థితులు భారతదేశం అభివృద్ధికి సహకరిస్తున్నాయని శ్రీ గోయల్ తెలిపారు. గత 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణల వల్ల ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు. రవాణా, ఇంధనం వంటి రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల దేశాభివృద్ధికి యువత తమ వంతు సహకారం అందించడానికి అవకాశం కలిగిందన్నారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికిన శ్రీ గోయల్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా అభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు ప్రయత్నించాలని అన్నారు.
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ), అమెరికా .-ఇండియా సీఈఓ ఫోరమ్, క్వాడ్ మొదలైన వివిధ వేదికలలో భారతదేశం, అమెరికా దేశాలు కలిసి పనిచేస్తున్నాయని శ్రీ గోయల్ వివరించారు. భారతదేశం అమెరికా దేశాల మధ్య సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఆయన అన్నారు. చట్ట పాలన పట్ల నిబద్ధత, పారదర్శకత, వ్యాపార స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మొదలైన వాటిపై భాగస్వామ్య విలువలు ఆధారపడి ఉంటాయన్నారు. భారతదేశం-అమెరికా మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి అన్నారు. రెండు దేశాలు తీసుకునే హేతుబద్ధమైన నిర్ణయాల వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత అభివృద్ధి చెందడానికి సహకరిస్తాయన్నారు.
ఇటీవల భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో పర్యటించిన అంశాన్ని శ్రీ గోయల్ ప్రస్తావించారు. గినా రైమోండో పర్యటన వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు,సహకారం మరింత బలపడుతాయన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో చర్చలు జరిపిన గినా రైమోండో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం, సమర్థవంతమైన విధాన సూత్రీకరణలు ద్వారా పేదరిక నిర్మూలన, భారత దేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రసంసించారన్నారు.
వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరాటానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన శ్రీ గోయల్ వాతావరణ ప్రణాళిక అమలులో మొదటి 5 దేశాలలో భారతదేశం ఒకటిగా ఉందన్నారు. లక్ష్యాలకు మించి పర్యావరణ పరిరక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు. పారిస్ ఒప్పందం పై సంతకం చేయడానికి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న,అభివృద్ధి చెందిన దేశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏకతాటి పైకి తీసుకు వచ్చారు అని శ్రీ గోయల్ తెలిపారు.
భారతదేశం-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడటానికి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా అందించిన ప్రోత్సాహాన్ని మంత్రి ప్రశంసించారు. పరస్పర వృద్ధి , అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. 1. ఇండియా ఎడ్జ్ - యుఎస్ పరిశ్రమలు వృద్ధి పదానికి ప్రోత్సాహం, 2. అర్బన్ మొబిలిటీ భవిష్యత్తు - ప్లాట్‌ఫారమ్‌ల ఇంటిగ్రేషన్ అనే అంశాలపై రూపొందిన రెండు నివేదికలను మంత్రి సమావేశంలో విడుదల చేశారు.
***
(Release ID: 1922219)