ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వ్యక్తిగతంగా చేయడం: ప్రవర్తన మార్పు వాతావరణ మార్పులను ఎలా పరిష్కరించగలదు’అనే అంశంపై ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన - ప్రధానమంత్రి


"మన గ్రహం కోసం సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు మన గ్రహం కోసం చేసే యుద్ధం లో కీలకం. ఇది మిషన్ లైఫ్ యొక్క ప్రధాన అంశం"


“వాతావరణ మార్పును కేవలం సమావేశాల ద్వారా మాత్రమే ఎదుర్కోలేము. ప్రతి ఇంట్లో భోజనాల బల్ల దగ్గరనుంచి ఈ యుద్ధం ప్రారంభం కావాలి"


"వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని, మిషన్ లైఫ్ ప్రజాస్వామ్యీకరిస్తుంది"


"సామూహిక ఉద్యమాలు, పరివర్తన విషయంలో భారతదేశ ప్రజలు గత కొన్ని సంవత్సరాలలో చాలా చేసారు"


"ప్రవర్తనా కార్యక్రమాలకు కూడా ఆర్థిక వనరుల కోసం తగిన పద్ధతులు రూపొందించాలి.


మిషన్ లైఫ్ వంటి ప్రవర్తనా కార్యక్రమాల పట్ల ప్రపంచ బ్యాంకు మద్దతు ఇస్తే దాని ప్రభావం మరింతగా పెరుగుతుంది”

Posted On: 15 APR 2023 9:41AM by PIB Hyderabad

‘వ్యక్తిగతంగా చేయడం: ప్రవర్తన మార్పు వాతావరణ మార్పులను ఎలా పరిష్కరించగలదు’ అనే శీర్షికతో ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  ఈ ఇతివృత్తంతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి పేర్కొంటూ, ఇది ఒక ప్రపంచ ఉద్యమంగా మారుతున్నందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

చాణక్యుని ఉటంకిస్తూ, చిన్న చిన్న పనుల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.   "ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ భూమండలం కోసం చేసే ఏ మంచి పని అయినా, చాలా తక్కువగా అనిపించవచ్చు.  కానీ అదే పని, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది కలిసి చేసినప్పుడు, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.  మన భూ గ్రహం కోసం సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే, మన గ్రహం కోసం చేసే పోరాటంలో కీలకమని మనం నమ్ముతున్నాము.  ఇదే మన మిషన్ లైఫ్ పథకంలో ప్రధాన అంశం." అని ప్రధానమంత్రి వివరించారు. 

లైఫ్ ఉద్యమం యొక్క ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, 2015 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో తాను ప్రవర్తనా మార్పు ఆవశ్యకత గురించి మాట్లాడానని, అక్టోబర్ 2022 లో  ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో కలిసి తాను మిషన్ లైఫ్‌ పధకాన్ని ప్రారంభించానని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.  సి.ఓ.పి-27 యొక్క ఫలితపత్రం యొక్క ఉపోద్ఘాతం కూడా స్థిరమైన జీవనశైలి, వినియోగం గురించి మాట్లాడుతుందని ఆయన పేర్కొన్నారు.  ఇది కేవలం ప్రభుత్వ చర్యగా భావించకుండా, ప్రజలు కూడా సహకరించగలరని, ప్రజలు అర్థం చేసుకుంటే, వారి ఆందోళన, చర్యగా మారుతుందని ప్రధానమంత్రి సూచించారు.  "వాతావరణ మార్పును సమావేశాలు నిర్వహించడం ద్వారా మాత్రమే ఎదుర్కోలేము.  అయితే, ప్రతి ఇంట్లో భోజన సమయంలో సమావేశాల ద్వారా ఎదుర్కోవచ్చు.  ఒక ఆలోచన చర్చా సమావేశాల నుండి భోజన సమయంలో సమావేశాలకు మారినప్పుడు, అది ప్రజా ఉద్యమంగా మారుతుంది.  ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి వారి చర్యలు భూగ్రహం స్థాయి, వేగాన్ని అందించడంలో సహాయపడతాయని తెలియజేయాలి.  మిషన్ లైఫ్ పధకం అనేది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సార్వజనీనం చేయడం కోసమే అని గుర్తించాలి.  ప్రజలు తమ దైనందిన జీవితంలో సాధారణ చర్యలు శక్తివంతమైనవని గుర్తించినప్పుడు, పర్యావరణం పై పూర్తి సానుకూల ప్రభావం ఉంటుంది." అని ప్రధానమంత్రి వివరించారు. 

భారతదేశం నుండి వచ్చిన ఉదాహరణలతో శ్రీ మోదీ తన ఆలోచనలు వివరిస్తూ, "సామూహిక ఉద్యమాలు, ప్రవర్తన పరివర్తన విషయంలో, గత కొన్ని సంవత్సరాల్లో భారత దేశ ప్రజలు చాలా చేశారు." అని పేర్కొన్నారు.  మెరుగైన లింగ నిష్పత్తి, భారీ పరిశుభ్రత ప్రచారం, ఎల్.ఈ.డి. బల్బుల స్వీకరణ వంటి చర్యలను ఆయన ఉదాహరణగా చెప్పారు.  ప్రతి సంవత్సరం దాదాపు 39 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించడంలో ఈ చర్యలు సహాయపడుతున్నాయని, ఆయన తెలియజేశారు.  సూక్ష్మ నీటి పారుదల విధానం ద్వారా దాదాపు ఏడు లక్షల హెక్టార్ల సాగు భూమిలో నీటిని ఆదా చేయడం జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. 

మిషన్ లైఫ్ పథకం కింద, స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా చేయడం, నీటిని పొదుపు చేయడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ఈ-వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, సహజ వ్యవసాయాన్ని అనుసరించడం, తృణ ధాన్యాలను ప్రోత్సహించడం వంటి అనేక విధాలుగా, ప్రభుత్వ ప్రయత్నాలు విస్తరించి ఉన్నాయని శ్రీ మోదీ తెలియజేశారు.

ఈ ప్రయత్నాలు ఇరవై రెండు బిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్తును ఆదా చేస్తాయని, తొమ్మిది ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తాయని, మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ టన్నుల వ్యర్థాలను తగ్గించడంతో పాటు, 2020 నాటికి, దాదాపు ఒక మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా, దాదాపు నూట డెబ్బై మిలియన్ డాలర్ల అదనపు ఖర్చు ఆదా చేయవచ్చునని, ఆయన తెలియజేశారు.   “వీటితోపాటు, పదిహేను బిలియన్ టన్నుల ఆహార వృధాను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.  ఇది ఎంత పెద్దదో తెలుసుకోవడానికి నేను మీకు ఒక పోలిక చెబుతాను.  ఎఫ్.ఏ.ఓ. ప్రకారం 2020 లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధమిక పంట ఉత్పత్తి సుమారు తొమ్మిది బిలియన్ టన్నులు” అని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ప్రోత్సహించడంలో ప్రపంచ సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.  మొత్తం ఫైనాన్సింగ్‌ లో భాగంగా, క్లైమేట్ ఫైనాన్స్‌ 26% నుండి 35% కి పెంచాలన్న ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ,  ఈ క్లైమేట్ ఫైనాన్స్ దృష్టి సాధారణంగా సాంప్రదాయిక అంశాలపై ఉంటుందని ఆయన తెలియజేశారు.  ప్రధానమంత్రి చివరగా తన ప్రసంగాన్ని ముగిస్తూ, "ప్రవర్తనా కార్యక్రమాలకు కూడా తగిన ఫైనాన్సింగ్ పద్ధతులను రూపొందించాలి.  మిషన్ లైఫ్ వంటి ప్రవర్తనా కార్యక్రమాల పట్ల ప్రపంచ బ్యాంకు మద్దతునిస్తే దాని ప్రభావం మరింతగా పెరుగుతుంది." అని చెప్పారు. 

 

 

***

DS


(Release ID: 1917076) Visitor Counter : 172