సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియా.. వినోద.. ప్రజావగాహన రంగంలో ‘అమెజాన్ ఇండియా’తో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ భాగస్వామ్య ఒప్పందం
ఈ ఒప్పందంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే ప్రతిభావంతులకు
అవకాశాల అన్వేషణ వ్యవధి తగ్గుతుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్;
భారత్ వైవిధ్యభరిత దేశం కాబట్టి ఓటీటీలు సమష్ఠి తత్వాన్ని..
సృజనాత్మక వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి: మంత్రి స్పష్టీకరణ;
భారతీయ కంటెంట్ ఇకపై అపార ప్రేక్షకులకు చేరువ అవుతుంది..
మరుగునపడిన ప్రతిభ ఇకపై ప్రపంచవ్యాప్తం కాగలదు: శ్రీ వరుణ్ ధావన్
Posted On:
05 APR 2023 5:15PM by PIB Hyderabad
మీడియా, వినోదం, ప్రజావగాహన రంగాల్లో ‘అమెజాన్ ఇండియా’తో తమ శాఖ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నదని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటించారు. ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ప్రాచీన నాగరకతకు నిలయమైన భారతదేశంలో నేటికీ లక్షలాది గాథలను ప్రజలకు చేర్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కథల స్వరూప, స్వభావాలు కాలాతీతమైనవని మంత్రి అన్నారు. ఈ మేరకు ఆధ్యాత్మికత నుంచి సాఫ్ట్‌వేర్ దాకా; సంప్రదాయాల నుంచి పోకడల వరకూ; జానపద గాథల నుంచి పండుగలదాకా; గ్రామీణ భారతం నుంచి వికసిస్తున్న భారతం వరకూ విస్తృత పరిధిని కలిగి ఉన్నాయని శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు. భారతీయ కథా సారాంశం (కంటెంట్) ఇటీవల అంతర్జాతీయ వేదికలపైనా విజయ దుందుభి మోగించిందని, విదేశీ ప్రేక్షకులలోనూ భారత నటీనటులకు విశేష ఆదరణ లభించిందని మంత్రి గుర్తుచేశారు.
భారత శాండ్‌లో వినోద పరిశ్రమకు సానుకూల వాతావరణ సృష్టి దిశగా తమ మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యల గురించి మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. భారత వినోద పరిశ్రమకుగల బలాలు- అవకాశాలను ప్రభుత్వం గుర్తిస్తుందని, ముఖ్యంగా- ఓటీటీల వంటి వేదికలకు గుర్తింపునిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు దృశ్య-శ్రవణ సేవలను కీలకమైన సేవారంగంగా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవలే ఓటీటీ కథాకథన నిర్వహణలో స్వీయ-నియంత్రణ చట్రాన్ని రూపొందించిందని గుర్తుచేశారు.
అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం అనేక విధాలుగా ఎంతో ప్రత్యేకమైదని శ్రీ ఠాకూర్ అన్నారు ఈ మేరకు సృజనాత్మక పరిశ్రమలోని వివిధ అంశాలకు ఈ ఒప్పందం పత్రం విస్తృత స్థాయిలో వర్తిస్తుందని పేర్కొన్నారు. ‘ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌టిటిఐ), ‘సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలలో కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలు, శిక్షణార్థి ఉద్యోగావకాశాలు, నిపుణులతో ప్రత్యేక బోధన, ఇతరత్రా అవకాశాలకు సంబంధించి నిబంధనల రూపకల్పన ద్వారా పరిశ్రమ-విద్యారంగాలను బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి కోర్సులు పూర్తిచేసుకుని వచ్చే ప్రతిభావంతులైన కళాకారులకు అవకాశాల అన్వేషణ వ్యవధి తగ్గడానికీ ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు.
ఓటీటీ వేదికలలో కథాకథన చిత్రీకరణ నాణ్యతపై మంత్రి ఆందోళన వెలిబుచ్చారు. సృజనాత్మకత ముసుగులో అశ్లీలానికి, అసభ్య భాషకు తావివ్వరాదని మంత్రి సూచించారు. ఈ బాధ్యత పూర్తిగా ఆయా వేదికలదేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని వైవిధ్యభరిత సమష్టి తత్వాన్ని, ప్రజా చైతన్యాన్ని ఆ వేదికల కథాకథనాలు ప్రతిబింబించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరుణ్ ధావన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. స్ట్రీమింగ్ సేవలు ప్రజానీకంలోకి చొచ్చుకుపోతుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ సేవల ద్వారా కథాకథన వైవిధ్యంతో నేడు భారతీయ సినిమా అనూహ్య స్థాయిలో ప్రపంచవ్యాప్తం అవుతున్నదని గుర్తుచేశారు. ఇన్నాళ్లూ మరుగునపడిన కళాకారుల ప్రతిభ ఇకపై అంతర్జాతీయ స్థాయికి చేరి, అవకాశాల సమతూకానికి తోడ్పడుతుందని శ్రీ ధావన్ నొక్కిచెప్పారు. “ఇప్పటిదాకా అవకాశాలు కరువైన కొత్త నటీనటులు, సృజనాత్మక ప్రతిభావంతులు ఇకపై అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ కాగలరు” అని ఆయన వివరించారు.
భాగస్వామ్య ఒప్పందం గురించి శ్రీ ధావన్ మాట్లాడుతూ- “మన పరిశ్రమతోపాటు ప్రతిభను ప్రోత్సహించే, చేయూతనిచ్చే ఈ ఒప్పందం నాలో ఆశలు నింపింది. ప్రపంచ వినోద వేదికపై భారతీయుడిగా సగర్వంతో నిలవాలనే ఆశయానికి పునర్నిర్వచనం ఇవ్వడంలో మనమంతా సమష్టిగా కృషి చేయడానికి ఇది తోడ్పడుతుంది” అని వ్యాఖ్యానించారు.
కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ- అమెజాన్ ఇండియాతో ఒప్పందం వల్ల భారతీయ కళాకారుల ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో అవకాశాలతోపాటు విశేష గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఆసియా పసిఫిక్ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ- “పరిశ్రమ వృద్ధికి ఉత్తేజమివ్వడంలో భాగంగా ప్రతి సజీవ వేదికను, సమగ్రత సంబంధిత అన్ని మార్గాలను ఈ భాగస్వామ్యం సద్వినియోగం చేసుకోగలదని ఆశాభావంతో ఉన్నాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా ప్రజావిధాన విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీ చేతన్ కృష్ణస్వామి, సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విక్రమ్ సహాయ్, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
భాగస్వామ్యం ఒప్పందం స్వరూప-స్వభావాలు
అమెజాన్ సంస్థలోని వివిధ అనుబంధ విభాగాలు, మంత్రిత్వశాఖలోని పలు సంస్థల మధ్య బహుకోణీయ సహకారానికి ఈ భాగస్వామ్య ఒప్పంద పత్రం (ఎల్ఓఇ) తోడ్పడుతుంది. ఈ మేరకు ప్రభుత్వం వైపునుంచి- నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి); ప్రసార భారతి; ప్రచురణ విభాగం; ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ), సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ)ల పరిధిలోని వివిధ మాధ్యమాల శిక్షణ సంస్థలు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. అలాగే అమెజాన్ తరఫున- అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా, అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ఇ-మార్కెట్ ప్లేస్, ‘ఐఎండిబి’ దీని పరిధిలో ఉంటాయి.
ప్రజావగాహన – భారత సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యం
అలాగే అమెజాన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో భారతదేశ సంస్కృతి సంబంధిత ప్రచురణ విభాగం పుస్తకాల ప్రత్యేక జాబితా ద్వారా భారతీయ వారసత్వంతోపాటు అమెజాన్ మ్యూజిక్, అలెక్సాలో భారతీయ సంగీతానికి ప్రోత్సాహమివ్వడం కూడా ఈ ఒప్పందంలో భాగం చేయబడ్డాయి. అంతేకాకుండా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రసంగాలు, జాతీయ ప్రాధాన్యంగల కీలకాంశాలు ప్రజాహిత కార్యక్రమాల సమాచారం, రోజువారీ వార్తల బులెటిన్లు కూడా అలెక్సా, అమెజాన్ మ్యూజిక్ ద్వారా ప్రజలకు అందించబడతాయి.
భారతీయ ప్రతిభావంతులకు ప్రోత్సాహం
ప్రతిభకు పదును పెట్టడానికి సంబంధించి, అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏపీవీ) ఉపకార వేతనాల ప్రాయోజిత సంస్థగా వ్యవహరిస్తుంది. శిక్షణార్థి ఉద్యోగి కార్యక్రమాలను రూపొందిస్తుంది. దీంతోపాటు ‘ఎఫ్‌టిఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ’ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ‘ఎన్‌ఎఫ్‌డిసి’ భాగస్వామ్యంతో ‘ఎపీవీ’ నైపుణ్య కార్యక్రమాలను చేపడుతుంది. మీడియా, వినోద పరిశ్రమ కోసం విద్యా సంస్థలలో జాతీయ, అంతర్జాతీయ చలనచిత్ర ప్రముఖులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. అలాగే ‘75 మంది భవిష్యత్ సృజనాత్మక మేధావులు’ కింద విజేతల ప్రతిభకు మెరుగులు దిద్దే కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. మరోవైపు భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపును పెంచే దిశగా సృజనాత్మక పరిశ్రమ కోసం అంతర్జాతీయ డేటాబేస్ అయిన ‘ఐఎండిబి’లో భారతీయ కళాకారుల సమాచార విస్తృత లభ్యత కోసం ‘ఎన్‌ఎఫ్‌డిసి’తో కలసి అమెజాన్ కృషిచేస్తుంది.
ప్రపంచ వేదికపై భారతీయ కథాకథన చిత్రీకరణకు ప్రాచుర్యం
మంత్రిత్వశాఖతో ఈ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా- భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) అవార్డు పొందిన చలనచిత్రాలతోపాటు భారత్‌తో అంతర్జాతీయ సహ-నిర్మాణ ఒప్పందాల కింద నిర్మించిన చలనచిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియోద్వారా ప్రపంచ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారు. భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి తెలిపే చలనచిత్రాలు, వెబ్-సిరీస్‌లు రూపొందించే అవకాశాలను కూడా ‘ఏపీవీ’ అన్వేషిస్తుంది. ప్రసార భారతి, ‘ఎన్‌ఎఫ్‌డిసి’ల సుసంపన్న భాండాగారం నుంచి కథాకథనాలను ప్రపంచవ్యాప్త యువతకు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను ‘ఏపీవీ, మినిటీవీ’ నిర్వర్తిస్తాయి. ప్రతిష్టాత్మక భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో, ప్రాంతీయ చలనచిత్రోత్సవాల్లో, కథాకథనాల సమర్పణ, సాంకేతిక ప్రదర్శనలు, సృజనాత్మకతపై కార్యశాలలు, పరస్పర ప్రతిభా ప్రదర్శన వగైరాల కోసం ‘ఎన్‌ఎఫ్‌డిసి’తో అమెజాన్ సహకారం కొనసాగుతుంది.
*****
(Release ID: 1914092)
Visitor Counter : 245