ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్టాండప్‌ ఇండియా’ పథకం కింద గత 7 సంవత్సరాల్లో 1,80,630 రుణ ఖాతాలకు రూ.40,700 కోట్లకుపైగా మంజూరు చేయబడింది


మహిళలు, ఎస్సీ, ఎస్టీలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ‘స్టాండప్‌ ఇండియా’ పథకం ఓ కీలక మైలురాయి:
ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌

వ్యవస్థాపకులు.. వారి ఉద్యోగులు-కుటుంబ జీవన ప్రమాణాల మెరుగుదలలో ‘స్టాండప్ ఇండియా’ పథకం కీలకపాత్ర పోషిస్తోంది:
ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్

Posted On: 05 APR 2023 7:30AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో ఆర్థిక సాధికారత, ఉద్యోగ సృష్టి కోసం వ్యవస్థాపకతను ప్రోత్సహించే ధ్యేయంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పుడు 2025దాకా పొడిగించబడింది. 


   శక్తిమంతులు, ఉత్సాహవంతులైన ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు తమ కలను సాకారం చేసుకోవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆ వర్గాలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. తయారీ, సేవలు లేదా వ్యాపార, వ్యవసాయరంగ అనుబంధ కార్యకలాపాలలో సరికొత్త (హరిత క్షేత్ర) సంస్థలను ప్రారంభించేలా ఈ పథకం వారికి చేయూతనిస్తుంది. ‘స్టాండప్ ఇండియా’ పథకం ఇవాళ్టితో ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ- “దేశవ్యాప్తంగా 1.8 లక్షల మందికి పైగా మహిళలు, ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కోటికిపైగా రుణ ఖాతాల కింద రూ.40,600 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేయడం నాకెంతో గర్వంగానూ, సంతృప్తిగానూ ఉంది” అని సంతోషం వ్యక్తం చేశారు.


   “ఈ పథకం ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను సృష్టించింది. తద్వారా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖల నుంచి రుణాలు పొంది, హరిత క్షేత్ర ప్రాజెక్టులు ప్రారంభించేలా సహాయక వాతావరణం ఏర్పరచి నేటికీ కొనసాగిస్తోంది. ఆ విధంగా స్టాండప్ ఇండియా పథకం ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక కీలక మైలురాయిగా తననుతాను రుజువు చేసుకుంది” అని ఆర్థికశాఖ మంత్రి పేర్కొన్నారు. ఇప్పటిదాకా అవకాశాలు అందని, అణగారిన వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అవరోధాల్లేని, సులభ రుణపరపతి కల్పించడం ద్వారా ఈ పథకం అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపిందని శ్రీమతి సీతారామన్ అన్నారు. ఈ మేరకు వారు వ్యవస్థాపక ప్రతిభను, నైపుణ్యాన్ని చాటుకునేలా వారి ఆశలకు రెక్కలు తొడిగిందని వివరించారు. అంతేకాకుండా ఆర్థిక వృద్ధిని నడిపించగలవారుగా, ఉద్యోగ సృష్టికర్తలుగా బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేవారుగా ఆ వ్యవస్థాపకులను తీర్చిదిద్దిందని ఆర్థిక మంత్రి అన్నారు.


   ‘స్టాండప్‌ ఇండియా’పథకం 7వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవత్‌ కిషన్‌రావు కరద్‌ మాట్లాడుతూ- “జాతీయ ఆర్థిక సార్వజనీనత మిషన్‌కు మూడో స్తంభంగాగల “నిధులందని వారికి నిధులు” ప్రాతిపదికగా   స్టాండప్ ఇండియా పథకం రూపొందింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యవస్థాపకులకు షెడ్యూల్డ  వాణిజ్య బ్యాంకుల శాఖలనుంచి నిరంతర రుణపరపతికి ఇది హామీ ఇస్తుంది. వ్యవస్థాపకులు, వారి ఉద్యోగులు-కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలలో ఈ పథకం ఎంతో కీలకమైనది” అని పేర్కొన్నారు. అలాగే “ఈ పథకం కింద గడచిన ఏడేళ్లలో 1.8 లక్షలమందికిపైగా వ్యవస్థాపకులు లబ్ధిపొందారు” అంతేకాదు… ఈ రుణాల్లో 80 శాతానికిపైగా మహిళలకు లభించడం నాకు ఎనలేని సంతృప్తిని కలిగించింది” అని డాక్టర్‌ కరద్‌ హర్షం వ్యక్తం చేశారు.


   స్టాండప్ ఇండియా పథకం (ఎస్‌యుపిఐ) ఏడో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇందులోని ప్రధానాంశాలు.. సాధించిన విజయాలను ఓసారి పరిశీలిద్దాం:-

 

స్టాండప్‌ ఇండియా ప్రధానోద్దేశాలు:

 

  • వ్యవస్థాపనలో మహిళలు సహా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రోత్సాహం;
  • తయారీ, సేవలు లేదా వ్యాపార, వ్యవసాయ రంగ అనుబంధ కార్యకలాపాలలో సరికొత్త (హరిత క్షేత్ర) సంస్థలను ప్రారంభించేలా వారికి రుణాలు అందించడం;
  • షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ, మహిళా వర్గాల్లో కనీసం ఒక రుణగ్రహీత వంతున షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ప్రతి బ్యాంకు శాఖలో రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి  మధ్య రుణ సౌలభ్యం కల్పించడం

స్టాండప్‌ ఇండియా ఎవరికోసం?


   మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు కొత్త సంస్థలు స్థాపించడంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేదిగా స్టాండప్‌ ఇండియా పథకం రూపొందించబడింది. అంతేగాక రుణాలు పొందడం సహా వ్యాపారంలో వారు విజయం సాధించేలా ఎప్పటికప్పుడు చేయూతనిస్తుంది.  తద్వారా లక్ష్యాలకు అనువైన ఒక పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు ఈ పథకం కృషి చేస్తుంది. వ్యాపార నిర్వహణలో లక్షిత వర్గాలకు సహాయపడే వాతావరణం కల్పిస్తూ ముందుకు నడుపుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాల రుణ గ్రహీతలు తమ సొంత హరిత క్షేత్ర సంస్థను   ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడేలా అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం కూడా ఈ పథకం లక్ష్యం. ఇలాంటి సహాయ-సహకారాలు కోరేవారు ఈ పథకం కింద కిందివిధంగా దరఖాస్తు చేసుకోవచ్చు:
నేరుగా బ్యాంకు శాఖలో సమర్పించవచ్చు.. లేదా;
స్టాండప్‌ ఇండియా పోర్టల్‌ (www.standupmitra.in) ద్వారా.. లేదా;
లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ (ఎల్‌డిఎం) ద్వారా దాఖలు చేసుకోవచ్చు.


రుణం పొందడానికి అర్హతలేమిటి?
 

  • దేశంలోని 18 ఏళ్లు పైబడిన మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలవారు;
  • ఈ పథకం కింద సరికొత్త (హరిత క్షేత్ర) ప్రాజెక్టులకు మాత్రమే రుణం లభిస్తుంది. హరిత క్షేత్రం ప్రాజెక్టులంటే- తయారీ, సేవలు లేదా వాణిజ్య రంగాలతోపాటు వ్యవసాయ రంగ అనుబంధ కార్యకలాపాల్లో లబ్ధిదారు తొలిసారి ప్రారంభించేదిగా ఉండాలి;
  • ఒకవేళ వ్యక్తిగతంగా కాకుండా కొత్త సంస్థను ప్రారంభించేట్లయితే 51 శాతం వాటాతోపాటు నియంత్రణాధికారం ఎస్సీ/ఎస్టీ లేదా మహిళా వ్యవస్థాపకుల చేతిలో ఉండటం తప్పనిసరి;
  • రుణగ్రహీతలు ఏదైనా బ్యాంకు/ఆర్థిక సహాయ సంస్థకు ఎగవేతదారులై ఉండరాదు;
  • అర్హతగల కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పథకాల పథకాల సమన్వయంతో లబ్ధిదారులు 15 శాతం దాకా తమవంతు మూలధనం సమకూర్చుకోవాలి. ఏదిఏమైనా ప్రాజెక్టు వ్యయంలో కనీసం 10 శాతం రుణగ్రహీత సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

అన్నిరకాల అండదండలతో చేయూత
 

 రుణాల మంజూరు దిశగా రుణగ్రహీతలను బ్యాంకులతో అనుసంధానించడంలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘స్టాండప్‌మిత్ర.ఇన్‌’  (www.standupmitra.in) తోడ్పడుతుంది. స్టాండప్ ఇండియా పథకం కోసం భారత చిన్నతరహా పరిశ్రమాభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ఈ పోర్టల్‌ను రూపొందించింది. వ్యాపార సంస్థల స్థాపన కృషిలో భవిష్యత్‌ వ్యవస్థాపకులకు ఇది మార్గదర్శనం చేస్తుంది. ఈ మేరకు శిక్షణ ఇవ్వడం నుంచి బ్యాంకు నిబంధనలకు తగినట్లు రుణ దరఖాస్తులు పూరించేదాకా చేయూతనిస్తుంది. ఈ కార్యకలాపాల కోసం 8,000కుపైగా మద్దతు సంస్థల నెట్‌వర్క్ ద్వారా భవిష్యత్‌ రుణగ్రహీతలను నిర్దిష్ట నైపుణ్యం గలవారుగా తీర్చిదిద్దడంలో ఈ పోర్టల్‌ అంచెలావారీగా కీలకపాత్ర పోషిస్తుంది. తదనుగుణంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు, మార్గదర్శక మద్దతు, వ్యవస్థాపన అభివృద్ధి కార్యక్రమ కేంద్రాలు, జిల్లా పరిశ్రమల కేంద్రం వగైరా సంస్థల చిరునామాలు, సంప్రదింపు ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది.
 

ఈ పథకం కింద 21.03.2023నాటికి సాధించిన విజయాలు:
 

‘స్టాండప్‌ ఇండియా’ పథకం ప్రారంభించినప్పటి నుంచి 21.03.2023దాకా 1,80,636 రుణ ఖాతాల కింద రూ.40,710 కోట్లు మంజూరు చేయబడ్డాయి.


‘స్టాండప్‌ ఇండియా’ పథకం కింద 21.03.2023దాకా ఎస్సీ/ఎస్టీ, మహిళా లబ్ధిదారుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

ఎస్సీ

ఎస్టీ

మహిళలు

మొత్తం

ఖాతాలు

మంజూరు

(రూ.కోట్లు)

ఖాతాలు

మంజూరు

(రూ.కోట్లు)

ఖాతాలు

మంజూరు

(రూ.కోట్లు)

ఖాతాలు

మంజూరు

(రూ.కోట్లు)

26,889

5,625.50

8,960

1,932.50

1,44,787

33,152.43

1,80,636

40,710.43


****


(Release ID: 1913708) Visitor Counter : 447