ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మహిళల ఆర్థిక సాధికారత’ మీద బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 10 MAR 2023 11:19AM by PIB Hyderabad

నమస్కారం!  
చాలా సంతోషకరమైన విషయమేమిటంటే, ఈ సంవత్సరం బడ్జెట్ యావత్ దేశం 2047 నాటికల్లా ‘అభివృద్ధి చెందిన  భారతదేశం’  అనే లక్ష్యానికి అనుగుణంగా ఉందని  యావత్ దేశం భావిస్తోంది. అందరూ ఈ బడ్జెట్  భవిష్యత్ అమృత కాలానికి అనుగుణంగా ఉందన్న దృక్పథంతో చూడటం  గమనార్హం. దేశ పౌరులు రానున్న 25 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నారనటానికి ఇది ఉదాహరణ.

మిత్రులారా,

గడిచిన తొమ్మిదేళ్లలో దేశం మహిళల సారధ్యంలో అభివృద్ధి సాగాలన్న దృక్పథంతో ముందడుగు వేసింది.  గడిచిన  కాలపు అనుభవాల దృష్ట్యా చూస్తే  మహిళాభివృద్ధి నుంచి మహిళాల సారధ్యంలో అభివృద్ధి దిశగా అడుగులేసినట్టు కచ్చితంగా కనబడుతుంది. అంతర్జాతీయ రంగంలో కూఫా భారత్ ఇదే ధోరణిని ప్రదర్శించింది. భారత అధ్యక్షతన సాగుతున్న జి-20 లో కూడా ఈ విషయానికి ప్రాధాన్యం లభించింది. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా మహిళల ఆధ్వర్యంలో సాగే అభివృద్ధి మీదనే దృష్టి సారించింది. అందులో మీరంతా కీలకపాత్ర పోషించబోతున్నారు. అందుకే  ఈ బడ్జెట్ వెబినార్ కు మీకందరికీ స్వాగతం.

మిత్రులారా,
మహిళలకు అంకితభావం ఎక్కువ. వాళ్ళ పట్టుదల, ఊహాత్మకశక్తి, నిర్ణయాత్మక శక్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఓర్పు, లక్ష్యసాధనలో దీక్ష  కూడా చాలా ఎక్కువ. వారి కష్టానికి తగిన ఫలితం కోసం ఓర్పుతో ఎదురు చూడటం కూడా కనిపిస్తుంది. మహిళల సారధ్యంలో అభివృద్ధి అంటున్నామంటే  వారికున్న ఈ శక్తిసామర్థ్యాలే ప్రాతిపదిక. భారత మాత ఉజ్జ్వల  భవిష్యత్తుకోసం ఈ మహిళాశక్తి  అమూల్యమైనది. ఈ మహిళాశక్తి ఈ శతాబ్దపు భారత అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.

మిత్రులారా,
ఈనాడు మనం భారతదేశ సామాజిక జీవనంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు చూస్తున్నాం. గడచిన కొద్ది సంవత్సరాలలో మహిళా సాధికారత  దిశగా భారతదేశం చేసిన కృషిని గమనిస్తే  దాని ఫలితాలు నేడు స్పష్టంగా కనబడతాయి.  పురుషులతో పోల్చుకుంటే మహిళాల సంఖ్య పెరుగుతోంది.  హైస్కూలు, లేదా అంతకు పైబడ్డ చదువుల్లో బాలికల సంఖ్య గత 8-9 సంవత్సరాలలో మూడు రెట్లకు పైగా పెరిగింది. సైన్స్, టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాలలో మహిళల వాటా  ఇప్పుడు 43 శాతానికి చేరింది. ఇది అమెరికా, యుకె, జర్మనీ లాంటి  అభివృద్ధి చెందిన, ధనిక దేశాలలో కంటే అత్యధికం. అదే విధంగా వైద్యం, క్రీడలు, వ్యాపార, రాజకీయ కార్యకలాపాలలో భారత మహిళల భాగస్వామ్యం పెరగటమే కాకుండా, వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు.  ఈరోజు భారతదేశంలో అనేక రంగాలలో మహిళల శక్తి సామర్థ్యాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ముద్రా రుణాలు అందుకున్న కోట్లాది మందిలో 70 శాతం మంది లబ్ధి దారులు మహిళలే కావటం విశేషం. ఇలాంటి కోట్లాదిమంది మహిళలు తమ కుటుంబ ఆదాయాన్ని పెంచటమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నారు. పిఎం స్వనిధి పథకం ద్వారా హామీలేని ఆర్థిక సహాయం, పశుగణాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. వీటి గరిష్ఠ ప్రయోజనాలు, అత్యుత్తమ ఫలితాలు మహిళలనుంచే వస్తున్నాయి. దేశ జనాభాలో సగం మంది ఉన్న మహిళలక శక్తిని వాడుకుంటూ  దేశాన్ని ముందుకు నడిపించటం మీదనే ఈ సంవత్సరం బడ్జెట్ దృష్టిపెట్టింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం ద్వారా మహిళలకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. పిఎం ఆవాస్ యోజనకు ఈ బడ్జెట్ లో దాదాపు 80 వేలకోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో దేశంలోని లక్షలాదిమంది మహిళలకు ఇళ్ళు నిర్మించి ఇస్తారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో నిర్మించిన 3 కోట్లకు పైగా ఇళ్ళు మహిళాల పేర్లమీదనే ఉన్నాయి. ఒకప్పుడి మహిళల పేర్లమీద పొలాలు గాని దుకాణాలు గాని ఇళ్ళుగాని ఉండేవి కావు. కానీ ఈరోజు వాళ్ళకు అండగా నిలబడే వ్యవస్థ వచ్చింది. ఇంట్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, గొంతుక మహిళలకు వచ్చిందంటే అందుకు కారణం పిఎం ఆవాస్ యోజన.

మిత్రులారా,

మనం ఇప్పుడు అంకుర సంస్థల విషయంలో యూని కార్న్  సంస్థల గురించి వింటున్నాం. అయితే, స్వయం సహాయక బృందాల్లోనూ మనం యూని కార్న్ సంస్థలను చూడగలమా? ఈ కలను కూడా సాకారం చేయటానికి అండగా నిలవటానికి ఈ బడ్జెట్ ముందుకొచ్చింది. గడిచిన కొద్ది సంవత్సరాల ఎదుగుదల గాథను గమనిస్తే అది అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఐదు వ్యవసాయేతర వ్యాపారాలలో ఒకటి మహిళాల ఆధ్వర్యంలోనే సాగుతోంది. గడిచిన తొమ్మిదేళ్లలో 7 కోట్లమండికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాలలో చేరారు. వాళ్ళు వివిధ రంగాలలో కృషి చేస్తున్నారు. ఈ కోట్లాదిమంది మహిళలు ఎంత విలువ సృష్టిస్తున్నారో చూడండి. 9 ఏళ్లలో స్వయం  సహాయక బృందాలు తీసుకున్న రుణం 6.25 లక్షల కోట్లు. ఈ మహిళలు కేవలం చిన్న వ్యాపారులే కాదు, క్షేత్ర స్థాయిలో వారు రిసోర్స్ పర్సన్స్ గా కూడా పనిచేస్తున్నారు. బాంక్ సఖి, కృషి సఖి, పశు సఖి రూపాలలో ఈ మహిళలు గ్రామాల్లో అభివృద్ధికి కొత్త రూపమిస్తున్నారు  

మిత్రులారా,
సహకార రంగంలో ఎప్పుడూ మహిళలది  కీలకమైన పాత్రే. ఈరోజు సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం 2 లక్షలకు పైగా బహుళ ప్రయోజన సహకార సంఘాలున్నాయి. అందులో పాల సహకార సంఘాలు,  మత్స్య సహకార సంఘాలు కూడా త్వరలో రూపుదిద్దుకోబోతున్నాయి. కోటి కుటుంబాలను సేంద్రియ వ్యవసాయంతో అనుసంధానం చేసే లక్ష్యం పెట్టుకున్నాం. మహిళారైతులు, ఉత్పత్తిదారుల బృందాలు అందులో కీలకపాత్ర పోషించబోతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే  చిరు ధాన్యాలు లేదా ’శ్రీ అన్న’  పట్ల అవగాహన పెరుగుతోంది.  వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఇది భారతదేశానికి చాలా పెద్ద అవకాశం.  ఇందులో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర పెంచటానికి కృషి జరగాలి. కోటిమంది గిరిజన మహిళలు ఇప్పుడు స్వయం సహాయక బృందాలలో ఉన్నారు. వాళ్ళకు సంప్రదాయ చిరు ధాన్యాల ఉత్పత్తిలో అనుభవముంది. వాళ్ళు  ఇప్పుడు చిరుధాన్యాల మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

మిత్రులారా, ,

ఈ కృషి సఫలీకృతం కావటంలో మన అమ్మాయిల నైపుణ్యాభివృద్ధి చాలా కీలకం. ఈ విషయంలో విశ్వకర్మ యోజన ఒక అనుసంధాన పాత్ర పోషిస్తుంది. విశ్వకర్మ యోజనలో మహిళలకు ఉన్న ప్రత్యేక అవకాశాలను మనం గుర్తించాలి. . మహిళాల వ్యాపారాన్ని విస్తరించటంలో జెమ్ పోర్టల్, ఈ-కామర్స్ వేదికలను కూడా బాగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు ప్రతి రంగమూ కొత్త టెక్నాలజీలను తమకు అనుగుణంగా వాడుకుంటోంది. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే శిక్షణలోనే మనం టెక్నాలజే పాత్ర గురించి అవగాహన పెంచాలి.

 

మిత్రులారా,

ఈరోజు దేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ‘ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. మనమ్మాయిలు సైన్యంలో చేరి దేశాన్ని రక్షిస్తున్నప్పుడు, రఫెల్ యుద్ధ విమానాలు నడుపుతున్నప్పుడు, వాళ్ళ పట్ల గౌరవ మర్యాదల్లో   మన దృక్పథం మారుతుంది. మహిళలు వ్యాపారాలు నడుపుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, రిస్క్ తీసుకుంటున్నప్పుడు, వాళ్ళ పట్ల దృక్పథం మారుతుంది.  కొద్ది రోజుల కిందటే మొట్ట మొదటిసారిగా నాగాలాండ్ లో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. వాళ్ళలో ఒకరు మంత్రి కూడా అయ్యారు. మహిళల పట్ల గౌరవం పెరిగినప్పుడే భారతదేశం వేగంగా ముందడుగు వేస్తుంది. అప్పుడే సమానత్వపు స్ఫూర్తి కలుగుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేదేమంటే, మహిళలకు ఎదురయ్యే ప్రతి అవరోధాన్నీ తొలగించుకుంటూ పోవాలి.

మిత్రులారా,

ఏటా మార్చి 8 న మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మహిళా సాధికారత మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారు ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. రాష్ట్రపతి ముర్మూ గారు తన వ్యాసాన్ని ఎలాంటి స్ఫూర్తితో ముగించారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆ వ్యాసం నుంచి ఉటంకిస్తున్నా – “ఈ పురోగతిని వేగవంతం చేయటం  మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత”. అందువలన మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో, మీ పరిసరాల్లో మీరు  పనిచేసే చోట  మార్పు కోసం  మీకు మీరు అంకితం కండి. అది మీ కూతురి ముఖం  మీద చిరునవ్వు చూడగలిగే మార్పు కావచ్చు, ఆమె తన జీవితంలో మరింత ముందడుగు వేసేందుకు మీరు చేసే పని కావచ్చు. ఇది నా మనసు అంతరాల్లో నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. ఈ మాటలతో నా ప్రసంగం ముగిస్తాను, మీ అందరికీ శుభాభినందనలు. ధన్యవాదాలు!

గమనిక : ఇది ప్రసంగానికి దగ్గరి అనువాదం. అసలు ప్రసంగం హిందీలో ఉంది.

***


(Release ID: 1905929) Visitor Counter : 194