ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చార్‌ ధామ్‌ యాత్రికుల ఆరోగ్యం, భద్రత కోసం మూడు-అంచెల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలి: డా.మన్‌సుఖ్‌ మాండవీయ


ప్రాణ రక్షణ, అత్యవసర తరలింపు కోసం చార్‌ ధామ్ హైవేపై అంబులెన్స్‌లు సిద్ధం

యాత్ర సమయంలో యాత్రికుల ఆరోగ్య సంరక్షణ కోసం పీజీ విద్యార్థుల నియామకం

ఎయిమ్స్‌ రిషికేశ్, డూన్, శ్రీనగర్ వైద్య కళాశాలల సహకారంతో యాత్రికుల కోసం డ్రోన్‌ల ద్వారా అత్యవసర ఔషధాల రవాణా

Posted On: 06 MAR 2023 1:22PM by PIB Hyderabad

“దేశవ్యాప్తంగా చార్‌ ధామ్ యాత్ర కోసం తరలివెళ్లే యాత్రికుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో బలమైన ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవల మౌలిక సదుపాయాలను సృష్టించబోతోంది. వైద్య పరంగా, యాత్రికుల ప్రయాణ సమయంలో వారికి మూడు అంచెల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది”. ఉత్తరాఖండ్‌ ఆరోగ్య మంత్రి డా.ధన్‌సింగ్‌ రావత్‌తో సమావేశం తర్వాత, ఇవాళ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్‌సుఖ్‌ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర మంత్రితో సమావేశమైన డా.ధన్‌సింగ్‌ రావత్‌, ప్రతి సంవత్సరం చార్ ధామ్ యాత్రను చేపట్టే లక్షలాది మంది యాత్రికుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యవసర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని అభ్యర్థించారు. కష్టతరమైన మార్గంలో యాత్రికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను, గుండె పోటు వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా గత కొన్ని నెలలుగా చనిపోయిన యాత్రికుల సంఖ్యను ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రికి తెలిపారు. ఇలా మరణించిన వారిలో చాలామందిలో ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నాయని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందిస్తామని డా.మాండవీయ హామీ ఇచ్చారు. "యాత్రికుల కోసం సాధ్యమైనంత ఉత్తమ ఆరోగ్య సంరక్షణ, అత్యవసర వైద్య సేవల మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి" అని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే గుండెపోటు చికిత్స సహా ఇతర చికిత్సలు ప్రారంభమయ్యేలా చూడడానికి అధునాతన అంబులెన్స్‌లు, స్ట్రోక్ వ్యాన్‌లతో బలమైన నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంబులెన్స్‌లను యాత్ర మార్గంలోని వివిధ ప్రదేశాల్లో ఉంచుతామని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల నుంచి పీజీ విద్యార్థులను క్షేత్ర స్థాయిలో నియమించాలని కూడా ప్రతిపాదించారు. "పీజీ విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమంగానూ ఈ అనుభనం ఉపయోగపడుతుంది" అని డా.మాండవీయ వెల్లడించారు.

యాత్ర సాగే ఎత్తయిన ప్రదేశాల్లో అత్యవసర మందులను అందించడానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తారు. ఈశాన్య ప్రాంతంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ల రవాణా కోసం డ్రోన్‌లను విజయవంతంగా ఉపయోగించారు. చార్‌ ధామ్‌ క్షేత్రాలయిన కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి గర్వాల్‌ హిమాలయాల్లో 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇటీవల, ఔషధాల పంపిణీ కోసం ఎయిమ్స్‌ రిషికేష్‌ డ్రోన్ సేవను ప్రారంభించింది. “ఎయిమ్స్ రిషికేశ్, డూన్ వైద్య కళాశాల, శ్రీనగర్ వైద్య కళాశాలు ప్రాంతీయ కేంద్రాలుగా నైపుణ్య వైద్య సేవలను అందిస్తాయి. యాత్రికుల ఆరోగ్యానికి సంపూర్ణ వైద్య భరోసా లభిస్తుంది" అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య సౌకర్యాలున్న ప్రదేశం, కాల్ సెంటర్ నంబర్లు, యాత్రకు ముందు వైద్య పరీక్షలు, అత్యవసర వైద్య సాయం మొదలైన వాటిని గురించి యాత్రికులకు తెలియజేసే వెబ్‌సైట్‌లు/పోర్టళ్ల వంటి పౌర-స్నేహపూర్వక సమాచార పంపిణీ, అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ ప్రణాళికలను అమలు చేస్తారు.

 

****


(Release ID: 1904580) Visitor Counter : 181