ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ ఉపాధి మేళాలో ప్రధానమంత్రి ప్రసంగం


“నేటి నియామకాలతో 9 వేల కుటుంబాల్లో హర్షం..
ఇది ఉత్తరప్రదేశ్‌లో భద్రత భావనను పెంచుతుంది”;

“ఉపాధి.. భద్రతల సంయుక్త శక్తితో ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం”;

“యూపీ పోలీసు వ్యవస్థలో 2017 నుంచి 1.5 లక్షలకుపైగా
కొత్త నియామకాలతో ఉపాధి.. భద్రత రెండూ మెరుగయ్యాయి”;

“పోలీసు ఉద్యోగంలో చేరాక మీ చేతికో ‘లాఠీ’ వస్తుంది.. కానీ, దేవుడు మీకొక హృదయం కూడా ఇచ్చాడు.. వివేచనతో మెలగండి.. వ్యవస్థలో వివేచన నింపండి”;

“ప్రజలకు బలం... సేవకు మీరే ప్రతీకలు కాగలరు”

Posted On: 26 FEB 2023 12:54PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి మేళా సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ ఉపాధి మేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసు శాఖలో సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, దానితో సమాన హోదాగల నాగరిక్‌ పోలీస్‌, ప్లటూన్‌ కమాండర్స్‌, అగ్నిమాపక విభాగం సెకండ్‌ ఆఫీసర్ల పోస్టులకు ప్రత్యక్ష విధానంలో ఎంపికైనవారికి నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి మేళాను ఉద్దేశించి దాదాపు ప్రతివారం ప్రసంగించే అవకాశం లభిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థల్లో సామర్థ్యానికి, నవ్య ఆలోచన విధానానికి తగిన ప్రతిభావంతులైన యువత దేశానికి నిరంతరం లభించడంపై తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

   త్తరప్రదేశ్‌లో ఇవాళ్టి ఉపాధి మేళా ప్రత్యేకతను వివరిస్తూ- ఈ నియామకాలతో 9 వేల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతం అవుతుందని, తద్వారా ప్రజల్లో భద్రత భావన పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో 2017 నుంచి 1.5 లక్షలకుపైగా కొత్త నియామకాల వల్ల ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉపాధి, భద్రత రెండూ మెరుగయ్యాయని ప్రధాని అన్నారు. దేశంలో శాంతిభద్రతలకు, అభివృద్ధి ధోరణికి ప్రతీకగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు పొందిందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ఆ మేరకు శాంతిభద్రతల విధ్వంసం, మాఫియా విజృంభణకు ఆలవాలమైన పూర్వ దుస్థితి అంతమైందని ఉద్ఘాటించారు. దీంతో ఉపాధి, వ్యాపారం, పెట్టుబడులు వంటి కొత్త అవకాశాలకు బాటలు పడ్డాయని చెప్పారు.

   రాష్ట్రంలో ద్వంద్వ చోదక ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- కొత్త విమానాశ్రయాలు, ప్రత్యేక రవాణా కారిడార్, కొత్త రక్షణరంగ కారిడార్, కొత్త మొబైల్ తయారీ యూనిట్లు, ఆధునిక జలమార్గాలు, అపూర్వ ఉపాధి అవకాశాలు సృష్టించగల కొత్త మౌలిక సదుపాయాల జాబితాను ప్రధాని ఏకరవుపెట్టారు. అత్యధిక ఎక్స్‌’ప్రెస్‌’వేలుగల ఉత్తరప్రదేశ్‌లో రహదారులు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వీటివల్ల ఉపాధి సృష్టితోపాటు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊతమివ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఉత్సాహభరిత స్పందన గురించి చెబుతూ- అది రాష్ట్రంలో ఉపాధికి ఏ విధంగా ఉత్తేజమిస్తుందో కూడా శ్రీ మోదీ వివరించారు.

   “ఉపాధి, భద్రతల సంయుక్త శక్తి ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఇస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ముద్ర పథకం కింద రూ.10 లక్షలదాకా పూచీకత్తులేని రుణాలు, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకం, ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం నిరంతర విస్తరణ, శక్తిమంతమైన అంకుర సంస్థల పర్యావరణ ‌వ్యవస్థ వగైరాను ఈ సందర్భంగా ఉదాహరించారు.

   నేటి ఉపాధి మేళాలో నియామక లేఖలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- కొత్త బాధ్యతలతోపాటు వారికి ఎదురుకాగల కొత్త సవాళ్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా కొత్తదేదైనా నేర్చుకోవాలనే జిజ్ఞాసను సజీవంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం, ప్రగతి దిశగా నిరంతర కృషి చేయాల్సిందిగా ఉద్బోధించారు. “మీరు పోలీసు ఉద్యోగంలో చేరాక మీ చేతికో ‘లాఠీ’ వస్తుంది. కానీ, దేవుడు మీకొక హృదయం కూడా ఇచ్చాడని మరువకండి. కాబట్టి, వివేచనతో మెలగుతూ వ్యవస్థలోనూ వివేచన నింపండి” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వివేచన వికాసంలో శిక్షణ పాత్రను కూడా ఆయన ఉటంకించారు. నేటి ఆధునిక ప్రపంచంలో సైబర్‌ నేరాలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ వంటివాటిపై అవగాహన స్మార్ట్‌ పోలీస్‌ విధులకు దోహదం చేస్తుందని సూచించారు. సమాజానికి భద్రత కల్పించడంతోపాటు కొత్త దిశ నిర్దేశించి బాధ్యత కూడా కొత్తగా నియమితులైనవారికి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కాబట్టి, “ప్రజలకు బలం, సేవాప్రదానంలో మీరే ప్రతీకలు కాగలరు” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

 

***

DS


(Release ID: 1902568) Visitor Counter : 191