ఆర్థిక మంత్రిత్వ శాఖ

2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనా 5.9 శాతం


2023-24 ఆర్థిక సంవత్సరంలో రాబడి లోటు అంచనా 2.9 శాతం;

ద్రవ్యలోటు 2025-26నాటికి గాడినపడి 4.5 శాతంకన్నా దిగువకువస్తుంది;

2021-22 కన్నా 2022-23లో స్థూల పన్ను ఆదాయం వార్షిక వృద్ధి 15.5 శాతం;

2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో ప్రత్యక్ష పన్నుల్లో వృద్ధి 23.5 శాతం;

ఇదే కాల వ్యవధిలో పరోక్ష పన్నుల్లోవృద్ధి 8.6 శాతం;రాష్ట్రాల జీఎస్‌డీపీలో 3.5 శాతంవరకూ ద్రవ్యలోటుకు అనుమతి;

రాష్ట్రాలకు 50 ఏళ్ల వ్యవధితో వడ్డీరహిత రుణ సౌలభ్యం

Posted On: 01 FEB 2023 12:59PM by PIB Hyderabad

ద్రవ్య స్థిరీకరణ పథాన్ని కొనసాగిస్తూ 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతంకన్నా దిగువకు తేవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పార్లమెంటులో ఇవాళ కేంద్ర బడ్జెట్‌ 2023-24ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటించారు. కాగా, 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతంగా పేర్కొన్నట్లు కూడా ఆర్థికమంత్రి తెలిపారు. ఈ మేరకు 2023-24 ద్రవ్యలోటు భర్తీకి మొత్తంమీద రూ.15.4 లక్షల కోట్ల స్థూల మార్కెట్‌ రుణ సమీకరణ అవసరమని అంచనా. కాగా, ఇందులో దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లద్వారా రూ.11.8 లక్షల కోట్లదాకా సమీకరించవచ్చునని, మిగిలిన లోటును చిన్న పొదుపు మొత్తాలు, ఇతర వనరుల ద్వారా సమీకరించాల్సి ఉంటుందని అంచనాలు పేర్కొంటున్నాయి.

రుణ సమీకరణ కాకుండా అంచనా వసూళ్లు రూ.27.2 లక్షల కోట్లుకాగా, అంచనా వ్యయం రూ.45 లక్షల కోట్లుగా ఉంటుందని 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. మరోవైపు నికర పన్ను వసూళ్లు రూ.23.3 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అయితే, 2023-24 సవరించిన అంచనాల ప్రకారం రుణసమీకరణ కాకుండా మొత్తం వసూళ్లు రూ.24.32 లక్షల కోట్లు కాగా, ఇందులో నికర పన్ను వసూళ్లు రూ.20.9 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక సవరించిన అంచనాల ప్రకారం మొత్తం వ్యయం రూ.41.9 లక్షల కోట్లు కాగా, ఇందులో సుమారు 7.3 లక్షల కోట్లు మూలధన వ్యయం. అలాగే 2022-23 నాటి బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే సవరించిన అంచనాలు కూడా ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతంగా పేర్కొన్నట్లు తెలిపారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ATEO.jpg

రాబడి లోటు

ఇక 2022-23లో రెవెన్యూ లోటు 4.1 శాతం కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త వరుస ఎదురుగాలులు, ఆర్థిక అనిశ్చితి తరచూ దేశీయ ఆర్థిక విధాన పగ్గాల ప్రత్యక్ష నియంత్రణకు సాధ్యంకాని పరిమితులను విధిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొత్త అభివృద్ధి, సంక్షేమ సంబంధ వ్యయ కట్టుబాట్లు, పన్ను వసూళ్లలో ఉత్సాహం, సంవత్సర వ్యవధిలో లక్షిత వ్యయం హేతుబద్ధీకరణ వంటి చర్యలు సమ్మిళిత అభివృద్ధి వేగానికి ఊపునివ్వడంలో తోడ్పడ్డాయి.

గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆహార, ఇంధన భద్రతకు విఘాతం కలిగించే భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ఆకస్మికంగా తలెత్తిన నేపథ్యంలో దుర్బలవర్గాలకు అండగా నిలిచేందుకు స్థూల ఆర్థిక స్థిరీకరణ కొనసాగింపునకు ఆహార-ఎరువుల సబ్సిడీ అవసరం పెరిగిందని ఆర్థిక విధాన ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతంకన్నా దిగువకు తెచ్చేవిధంగా విస్తృత ఆర్థిక స్థిరీకరణ మార్గం అనుసరించడంపై ప్రభుత్వ నిబద్ధతను శ్రీమతి సీతారామన్ పునరుద్ఘాటించారు. సుస్థిర, విస్తృత పునాదిగల ఆర్థిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక క్రమబద్ధీకరణ మార్గానికి కట్టుబడుతూనే జన జీవనాన్ని/జీవనోపాధిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

 

సవరించిన అంచనాలు (2022-23)

బడ్జెట్‌ అంచనాలు (2023-24)

ద్రవ్యలోటు

6.4

5.9

రాబడి లోటు

4.1

2.9

పన్ను రాబడులు

స్థూల పన్ను రాబడులలో వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లలో వృద్ధి 10.5 శాతం, 10.4 శాతం వంతున నమోదు కాగలదని అంచనా. మొత్తంమీద స్థూల పన్ను రాబడులలో ప్రత్యక్ష-పరోక్ష పన్నుల వాటా 54.4 శాతం, 45.6 శాతంగా ఉంటుందని ఆర్థిక విధాన ప్రకటన పేర్కొంది. కాగా, పన్ను-జీడీపీల నిష్పత్తి 11.1 శాతంగా అంచనా వేయబడింది. పన్ను విధానంలో పన్నుశాతాల హేతుబద్ధీకరణ, పన్ను పునాది విస్తరణపైనే మధ్యకాలికంగా దృష్టి కేంద్రీకరించబడుతుంది. పన్ను నిర్మాణంలో చోటుచేసుకున్న లోటుపాట్ల తొలగింపు, మినహాయింపుల కోతద్వారా ఈ ప్ర్రక్రియ పూర్తవుతుంది. దీనికితోడు పన్ను పునాది విస్తరణ, పన్ను చెల్లింపుదారులకు అనుసరణ సౌలభ్యం, సరఫరా శ్రేణి వ్యవస్థీకరణ, వ్యాపార సౌలభ్య కల్పన దిశగా చర్యలు తీసుకోబడతాయి.

రెవెన్యూ వసూళ్లు – వ్యయాల మధ్య సమతూకం

కేంద్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ వసూళ్లు, వ్యయాలను రూ.26.32 లక్షల కోట్లు, రూ.35.02 లక్షల కోట్లుగా 2023-24 బడ్జెట్‌ అంచనాలు పేర్కొంటున్నాయి. దీని ఆధారంగా, 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో రాబడులు-వ్యయాల నిష్పత్తి 75.2 శాతంగా పేర్కొనబడింది. ఆ మేరకు 2022-23తోపాటు 202-22 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు ఈ నిష్పత్తిని 67.9 శాతం, 67.8 శాతంగా పేర్కొనగా, వాటితో పోలిస్తే తాజా అంచనాల్లో మెరుగుపడింది. జీడీపీలో పన్ను నిష్పత్తి 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో 10.7 శాతం కాగా, 2022-23 సవరించిన, 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో మెరుగుపడి 11.1 శాతంగా నమోదైంది.

పన్నేతర వసూళ్లు

రాబడి వసూళ్లలో పన్నేతర వసూళ్లు 11.5 శాతం కాగా, రూ.3.02 లక్షల కోట్లమేర వస్తాయని అంచనా వేయబడింది. ఇది 2022-23 సవరించిన అంచనాల్లో పేర్కొన్న రూ.2.62 లక్షల కోట్లతో పోలిస్తే 15.2 శాతం అధికం.

రుణేతర మూలధన వసూళ్లు

రుణేతర మూలధన వసూళ్లు (ఎన్‌డీసీఆర్‌) 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో రూ.84,000 కోట్లుగా అంచనా వేయబడింది, ఇందులో రుణాలు-అడ్వాన్సుల రికవరీ కింద (రూ.23,000 కోట్లు), రోడ్ల నగదీకరణ (రూ.10,000 కోట్లు) ద్వారా వచ్చిన వసూళ్లు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ వాటాకు నిర్ణయించిన అంచనా విలువ తదితరాలపై రుణేతర మూలధన వసూళ్లు గణనీయంగా ఆధారపడి ఉంటాయి.

మూలధన వ్యయం – ద్రవ్యలోటు నిష్పత్తి

ద్రవ్యలోటుతో మూలధన వ్యయం నిష్పత్తి (కాపెక్స్‌—ఫ్‌డి)ని 2023-24 బడ్జెట్‌ అంచనాలు 56.0 శాతంగా అంచనా వేశాయి. అయితే, 2022-23 సవరించిన అంచనాలు దీన్ని 41.5 శాతంగానూ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంచనాలు 37.4 శాతంగానూ పేర్కొన్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00215NV.jpg

రాష్ట్రాల ద్రవ్యలోటు

రాష్ట్రాల ‘జిఎస్‌డిపి’లో 3.5 శాతం ద్రవ్యలోటును అనుమతించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే, ఇందులో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రాలకు యాభై ఏళ్ల వ్యవధితో వడ్డీలేని రుణం కూడా అందజేస్తారు. అయితే ఈ రుణం మొత్తాన్నీ 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా కేవలం మూలధన వ్యయం కోసం మాత్రమే వెచ్చించాలి. ఈ సొమ్మును వెచ్చించడంలో రాష్ట్రాలకు విచక్షణాధికారం ఉన్నా, కొంత భాగం విషయంలో మాత్రం రాష్ట్రాలు తమ వాస్తవ మూలధన వ్యయాన్ని పెంచాలనే షరతు విధించబడింది. ఖర్చు వితరణను కింద పేర్కొన్న అంశాల కోసం కేటాయింపు లేదా అనుసంధానం చేయబడుతుంది:

  • పాత ప్రభుత్వ వాహనాలను తుక్కుకు పంపడం
  • పట్టణ ప్రణాళిక సంస్కరణలు-కార్యాచరణ
  • పురపాలక బాండ్లకు రుణ యోగ్యతను కల్పన కోసం పట్టణ స్థానిక సంస్థల్లో ఫైనాన్సింగ్ సంస్కరణలు
  • పోలీసు స్టేషన్‌ భవనాల పైభాగంలో లేదా అంతర్భాగంగా పోలీసు సిబ్బందికి గృహవసతి
  • యూనిటీ మాళ్ల నిర్మాణం
  • బాలలు, యుక్తవయస్కుల గ్రంథాలయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు
  • కేంద్ర పథకాల మూలధన వ్యయంలో రాష్ట్ర వాటా

 

******(Release ID: 1895673) Visitor Counter : 508