ఆర్థిక మంత్రిత్వ శాఖ

అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది


FY22లో పాఠశాలల్లో 26.5 కోట్ల మంది విద్యార్థుల పేర్లు నమోదు

FY22లో ప్రాథమిక-ఉన్నత విద్య స్థాయి వరకు అదనంగా 19.4 లక్షల మంది పేర్లు నమోదు

బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో అన్ని స్థాయుల్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది

ప్రత్యేక అవసరాలు (CWSN) ఉన్న పిల్లల నమోదులో FY22లో 22.7 లక్షల పెరుగుదల, FY21లోని 21.9 లక్షలతో పోలిస్తే 3.3% వృద్ధి
విద్యార్థి-ఉపాధ్యాయుల నిష్పత్తి FY13 నుంచి FY22 వరకు క్రమంగా అన్ని స్థాయుల్లో మెరుగుపడింది

పీఎం శ్రీ కింద 14,500 పైగా పాఠశాలలు ఆదర్శప్రాయ పాఠశాలలుగా అభివృద్ధి, 20 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం

2014లో 9గా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీల (ఐఐఐటీలు) సంఖ్య 2022లో 25కి పెరిగింది

ఉన్నత విద్యలో పేర్ల నమోదు సంఖ్య FY20లో 3.9 కోట్లుగా ఉంటే, FY21లో దాదాపు 4.1 కోట్లకు పెరిగింది

ఉన్నత విద్య నమోదుల్లో FY15 నుంచి 21 శాతం పెరుగుదల

ఉన్నత విద్యలో విద్యార్థినుల నమోదు FY20లోని 1.9 కోట్ల నుంచి FY21లో 2 కోట్లకు పెరిగింది

దూరవిద్యలో నమోదు 2020 సంవత్సరంలో సుమారు 7 శాతం, FY15 నుంచి 20 శాతం పెరిగింది

ఉన్నత

Posted On: 31 JAN 2023 1:39PM by PIB Hyderabad

నాణ్యమైన విద్యను అందించడం యూఎన్‌ ఎస్‌డీజీల (ఎస్‌డీజీ4) 4వ లక్ష్యంగా ఉందని, ఇది 2030 నాటికి “సమిష్టి, సమాన, నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితకాల చదువు అవకాశాలను ప్రోత్సహించడం” లక్ష్యం పెట్టుకుందని ఆర్థిక సర్వే 2022-23 పేర్కొంది. ఇందుకోసం, 21వ శతాబ్దపు మొదటి విద్యా విధానంగా జాతీయ విద్యా విధానం-2020ను తీసుకొచ్చినట్లు సర్వే వెల్లడించింది. దేశంలో అనేక అభివృద్ధి అవసరాలను పరిష్కరించే లక్ష్యంతో ఇది వచ్చింది. విద్యా వ్యవస్థ నిర్మాణంలోని అన్ని అంశాలను సరి చేయడం, పునర్నిర్మించడం కోసం ఈ విధానం వచ్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థిక సర్వే 2022-23ని ప్రవేశపెట్టారు.

పాఠశాల్లో విద్యార్థుల పేర్ల నమోదు:

FY22లో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌), లింగ సమానత్వం మెరుగుపడ్డాయి. 6 నుంచి 10 సంవత్సరాల వయస్సులో, I నుంచి V తరగతుల ప్రాథమిక పాఠశాలల్లో పేర్ల నమోదు జీఈఆర్‌ అటు బాలికలు, ఇటు బాలల విషయంలో FY22లో మెరుగుపడింది. FY17-FY19 మధ్య క్షీణతను ఈ మెరుగుదల తిప్పికొట్టింది. ప్రాథమికోన్నత పాఠశాల్లో జీఈఆర్‌ (11-13 సంవత్సరాల వయస్సులో VI నుంచి VIII తరగతుల కోసం నమోదు) FY17-FY19 మధ్య స్తబ్దుగా ఉంది, FY22లో మెరుగుపడింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయుల్లోని సంబంధిత వయస్సుల్లో బాలల కంటే బాలికల జీఈఆర్‌ మెరుగ్గా ఉంది.

పాఠశాల్లో స్థూల నమోదు నిష్పత్తులు

FY22లో, పాఠశాల్లో చేరిన వారి సంఖ్య 26.5 కోట్లకు చేరింది. ప్రాథమిక-ఉన్నత విద్య స్థాయి వరకు 19.4 లక్షల మంది పిల్లలు అదనంగా చేరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) నమోదు FY22లో 22.7గా ఉంది, FY21లోని 21.9 పోలిస్తే ఇది 3.3 శాతం పెరిగింది. పూర్వ-ప్రాథమిక స్థాయి మినహా ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ, హయ్యర్ సెకండరీ అన్ని స్థాయుల్లో విద్యార్థుల నమోదులు పెరిగాయి.పూర్వ-ప్రాథమిక స్థాయిలో నమోదు FY21లోని 1.1 కోట్ల నుంచి FY22లో 1.0 కోట్లకు తగ్గింది. ఆ సంవత్సరంలో, పూర్వ-ప్రాథమిక స్థాయిలో 1.0 కోట్ల మంది, ప్రాథమికలో 12.2 కోట్లు, ప్రాథమికోన్నతలో 6.7 కోట్లు, సెకండరీలో 3.9 కోట్లు, హయ్యర్ సెకండరీలో 2.9 కోట్ల మంది పిల్లలు చేరారు.

బడి మానేస్తున్న విద్యార్థులు

బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో అన్ని స్థాయులలో స్థిరంగా తగ్గుముఖం పట్టింది. అటు బాలికలు, ఇటు బాలుర సంఖ్యలో ఈ క్షీణత ఉంది. సమగ్ర శిక్ష, ఆర్‌టీఈ చట్టం, పాఠశాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాల మెరుగుదల, రెసిడెన్షియల్ హాస్టల్ భవనాలు, ఉపాధ్యాయుల లభ్యత, ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, ఉచిత పాఠ్య పుస్తకాలు, పిల్లలకు ఏకరూప దస్తులు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, పీఎం పోషణ్‌ వంటి పథకాలు పాఠశాలల్లో పిల్లల నమోదు, నిలుపుదలను పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

బడి మానేస్తున్న విద్యార్థుల శాతాలు

 

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

పాఠశాలల్లో బోధనా విధానంపై దృష్టి సారించడంతో పాటు పాఠశాలలు, సౌకర్యాలు, డిజిటలీకరణ రూపంలో విద్యా మౌలిక సదుపాయాలు క్రమంగా ప్రోత్సహించడం జరిగింది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రతిబింబించే గుర్తింపు పొందిన పాఠశాలల సంఖ్య, ఉపాధ్యాయుల లభ్యత రెండింటిలోనూ FY22లో మెరుగుదల కనిపించింది.

గత సంవత్సరాల కంటే FY22లో పాఠశాలల్లో కనీస సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మరుగుదొడ్లు (అమ్మాయిలకు, అబ్బాయిలకు), తాగునీరు, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి ఇప్పుడు చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. సమగ్ర శిక్ష పథకం కింద పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాలలకు అవసరమైన వనరులను అందించడంలో, ఈ తరహా ఆస్తులను కల్పించడంలో అలాగే, స్వచ్ఛ భారత్ మిషన్ కీలకపాత్ర పోషిస్తోంది. సమగ్ర శిక్ష పథకంలోని సమాచార & ప్రసారాల సాంకేతికత (ఐసీటీ) అంశం కింద, హార్డ్‌వేర్, విద్యా సంబంధిత సాఫ్ట్‌వేర్, బోధన కోసం ఈ-కంటెంట్‌ సహా పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులు, ఐసీటీ ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.

పాఠశాలల మౌలిక సదుపాయాల్లో మెరుగుదల

 

విద్యార్థి-ఉపాధ్యాయుల నిష్పత్తి FY13 నుంచి FY22 వరకు నిరంతరంగా అన్ని స్థాయుల్లో మెరుగుపడింది: ప్రాథమిక విద్య స్థాయిలో 34.0 నుంచి 26.2కు, ప్రాథమికోన్నతలో 23.0 నుంచి 19.6కు, సెకండరీలో 30.0 నుంచి 17.6కు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 39.0 నుంచి 27.1కు ఇది మెరుగుపడింది. పాఠశాలల సంఖ్య, ఉపాధ్యాయుల లభ్యత, సౌకర్యాల మెరుగుదల వల్ల, పాఠశాలల్లో పేర్ల నమోదును మెరుగుపడుతుందని, బడి మానేస్తున్న పిల్లల సంఖ్యను తగ్గిస్తుందని భావిస్తున్నారు.

పాఠశాల విద్య కోసం FY23లో ప్రారంభించిన వివిధ కార్యక్రమాలు, పథకాలు కింది పేరాల్లో ఉన్నాయి.

  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా: 2022 సెప్టెంబర్ 7న, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పేరిట ఒక కేంద్ర ప్రాయోజిత పథకాన్ని (సీఎస్‌ఎస్‌) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/యూటీ ప్రభుత్వం/స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా, FY23 నుంచి FY27 కాలంలో ఈ పథకం కింద 14,500 పైగా పీఎం శ్రీ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. ఈ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి, ఎన్‌ఈపీ అమలవుతుంది. ఇతర పాఠశాలలకు నాయకత్వాన్ని అందిస్తూ, క్రమంగా ఆదర్శప్రాయ పాఠశాలలుగా మారతాయి. ఈ పథకం ద్వారా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రత్యక్ష లబ్ధి పొందుతారని అంచనా.
  • ది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్‌) ఫర్‌ ఫౌండేషన్ స్టేజ్: ప్రాథమిక స్థాయి కోసం, కొత్తగా 5+3+3+4 విద్యా నిర్మాణం రూపంలో ఎన్‌సీఎఫ్‌ ప్రారంభమైంది. ఇది, 3 నుంచి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సంరక్షణ, విద్యను సమీకృతం చేస్తుంది..
  • బాల్వాతిక పైలట్ ప్రాజెక్ట్: 3+, 4+, 5+ సంవత్సరాల వయస్సున్న విద్యార్థుల్లో ఆలోచన, మానసిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, ప్రాథమిక అక్షరాస్యత & అంకెల జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ బాల్వాతికను 2022 అక్టోబర్‌లో 49 కేంద్రీయ విద్యాలయాల్లో ప్రారంభించించారు. 
  • బొమ్మల ఆధారిత బోధన కోసం చేతి పుస్తకం
  • నిర్దిష్ట అభ్యాస వైకల్యాల కోసం గణాంక సాధనాలు (మొబైల్ యాప్)
  • నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్
  • రాష్ట్రాల్లో బోధన-అభ్యసన, ఫలితాల బలోపేతం (స్టార్స్‌) :
  • విద్యాంజలి (విద్యా కార్యకర్త కార్యక్రమం): దేశవ్యాప్తంగా 11,34,218 మంది విద్యార్థులపై ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రభావం చూపింది.
  • సమగ్ర శిక్ష పథకం: పూర్వ-పాఠశాల స్థాయి నుంచి XII తరగతి వరకు అవసంబించే విద్య కార్యక్రమం. సమగ్ర శిక్ష పథకాన్ని ఎన్‌ఈపీ 2020తో సమాంతరం చేసి FY22 నుంచి FY26 వరకు పొడిగించారు.

ఉన్నత విద్య

2022లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) 23, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు) 20 ఉన్నాయి. 2014లో ఇవి వరుసగా 16, 13గా ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు) 2022లో 25 ఉండగా, 2014లో 9 ఉన్నాయి.

ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు FY20లోని 3.9 కోట్ల నుంచి FY21లో దాదాపు 4.1 కోట్లకు పెరిగింది. FY15 నుంచి ఈ సంఖ్యలో దాదాపు 72 లక్షల పెరుగుదల (21 శాతం) కనిపించింది. FY20లో 1.9 కోట్లుగా ఉన్న విద్యార్థినుల నమోదు FY21లో 2.0 కోట్లకు పెరిగింది.

 

ఉన్నత విద్యలో మొత్తం విద్యార్థుల నమోదు                                                                                        ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు

 

దూరవిద్యలో విద్యార్థుల నమోదు 45.7 లక్షలుగా (20.9 లక్షల మంది విద్యార్థినులతో కలిపి) ఉంది. FY20 నుంచి ఇది దాదాపు 7 శాతం, FY15 నుంచి 20 శాతం పెరిగింది. 2011 జనాభా అంచనాల (సవరించిన) ప్రాతిపదికన, ఉన్నత విద్యలో జీఈఆర్‌ FY21లో 27.3 శాతంగా నమోదైంది, FY20లోని 25.6 నుంచి ఇది పెరిగింది. పురుష జీఈఆర్‌ FY20లోని 24.8 నుంచి FY21లో 26.7కు పెరిగింది, అదే సమయంలో మహిళా విద్యార్థుల జీఈఆర్‌ 26.4 నుంచి 27.9కి మెరుగుపడింది.

ఉన్నత విద్యలో మొత్తం అధ్యాపకులు/ఉపాధ్యాయుల సంఖ్య 15,51,070. వీరిలో 57.1 శాతం మంది పురుషులు, 42.9 శాతం మంది మహిళలు ఉన్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన & అభివృద్ధి విభాగం (ఆర్‌డీసీ), ఏకకాలంలో రెండు కోర్సులు చదివేందుకు మార్గదర్శకాలు, విద్యా రుణాలపై వడ్డీ రాయితీలతో సహా ఉన్నత విద్య కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆర్థిక సర్వే ప్రశంసించింది.

2022 జులై 7-9 తేదీల్లో, యూసీజీ & బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సహకారంతో కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ వారణాసిలో నిర్వహించిన మూడు రోజుల అఖిల భారతీయ శిక్ష సమాగం గురించి కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల నుంచి 300 మంది ఉప కులపతులు, డైరెక్టర్లు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు, ఎన్‌ఈపీ 2020ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయవచ్చన్న అంశంపై చర్చించారు. మేధావుల ఆలోచనాత్మక చర్చలకు ఈ సదస్సు ఒక వేదికగా మారింది. విధాన నిర్ణయాలు, అమలు వ్యూహాలను వెల్లడించడానికి, విజ్ఞాన మార్పిడిని పెంపొందించడానికి, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి ఈ సదస్సు సహాయపడింది.

 

******



(Release ID: 1895106) Visitor Counter : 284