రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసే ప్రసంగం

Posted On: 25 JAN 2023 7:42PM by PIB Hyderabad

ప్రియమైన దేశ ప్రజలారా!

నమస్కారం!!

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ – విదేశాల్లో వున్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు మన ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇది అనేక ఇతర దేశాలకు స్ఫూర్తినీ ఇచ్చింది. భారత గౌరవ గాధపై గర్వపడేందుకు ప్రతీ పౌరుడికి ఒక అనుభవం వుంటుంది. మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నపుడు – ఒక దేశంగా మనం కలిసిమెలిసి సాధించిన వాటిని ఉత్సవంగా జరుపుకుంటాం.

భారత్ – ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటి. భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి” అంటారు. అయితే మన ఆధునిక గణతంత్రం యువదశలోనే వుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో మనం అసంఖ్యాకమైన సవాళ్ళను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. సుదీర్ఘ విదేశీ పాలనలోని ఎన్నో దుష్పరిణామాలలో పేదరికం, నిరక్షరాస్యత రెండు మాత్రమే! అయినప్పటికీ భారతదేశం అచంచలంగా నిలిచింది. ఆశ, విశ్వాసంతో మనం – మానవజాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రయోగాన్ని ప్రారంభించాం. ఇంత భారీ సంఖ్యలో, విభిన్నతతో కూడిన జనసముదాయం ప్రజాస్వామ్యం రూపంలో ఒక జాతిగా కలిసి రావడం అపూర్వం. మనమంతా ఒకటేననీ, మనమందరం భారతీయులమనే నమ్మకంతో అలా చేసాం. అనేక మతాలు, అనేక భాషలు – మనల్ని విడదీయలేదు. అవి మనల్ని ఏకం చేశాయి. కాబట్టి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా – మనం విజయం సాధించాం. ఇదే భారతదేశం ప్రత్యేకత. 

ఈ ప్రత్యేకత రాజ్యాంగం అంతరంగంలో వుంది, ఇది కాల పరీక్షను తట్టుకుని నిల్చింది. గణతంత్ర మనుగడను పాలించడం ప్రారంభించిన రాజ్యాంగం – స్వాతంత్ర్య పోరాట ఫలితమే. మహాత్మాగాంధీ నేతృత్వంలోని జాతీయ ఉద్యమం ఉద్దేశం – స్వాతంత్ర్యాన్ని సాధించడంతోపాటూ, భారతీయ ఆదర్శాలను తిరిగి నెలకొల్పడం కూడా! ఆ దశాబ్దాల పోరాటం, త్యాగం, వలస పాలన నుంచి విముక్తే కాకుండా విధించిన ఆంక్షలు, సంకుచిత ఆలోచనల నుంచి కూడా స్వేచ్ఛను పొందడంలో మనకు సహాయపడింది. శాంతి –సౌభ్రాతృత్వం, సమానత్వం గురించిన మన పురాతన విలువల గురించి తెలుసుకోవడానికి విప్లవకారులు, సంస్కర్తలు – దార్శనికులను, ఆదర్శవాదులనూ కలుపుకుపోయారు. ఆధునిక భారతీయ ఆలోచనలకు రూపునిచ్చిన వారు, ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ఆలోచనలను కూడా ఆహ్వానించారు –

ఆ నో భద్రా: క్రతవోయన్తు విశ్వత్:

అనగా : ఉదాత్తమైన ఆలోచనలు మనకు అన్ని దిశల నుంచి రావాలి అనే వేదోపదేశానుసారం విదేశాల నుంచి వచ్చిన ప్రగతిశీల ఆలోచనలను కూడా స్వాగతించారు. సుదీర్ఘమైన, లోతైన ఆలోచనా ప్రక్రియ మన రాజ్యాంగంలో ఇమిడిపోయింది.

“మన స్థాపక పత్రం” – ప్రపంచంలోని ప్రాచీన జీవన నాగరికతకు చెందిన మానవీయ తత్వశాస్త్రంతోపాటూ ఇటీవలి చరిత్రలో ఆవిర్భవించిన సరికొత్త ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొందింది. మన దేశం - రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ బి.ర్.అంబేద్కర్ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి వుంటుంది. దానికి తుది రూపాన్నివ్వడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఈనాడు మనం - ప్రారంభ ముసాయిదాను సిద్ధం చేసిన విద్యావేత్త బి.ఎన్.రావుతో పాటు ఇతర నిపుణులను, అధికారులను - రాజ్యాంగ రూపకల్పనలో వారు చేసిన సహాయాన్నీ గుర్తుంచుకోవాలి. ఆ రాజ్యాంగ సభలోని సభ్యులు – దేశంలోని అన్ని ప్రాంతాలూ, సంఘాలకు ప్రాతినిధ్యం వహించడం మనకు గర్వకారణం. వీరిలో 15 మంది మహిళలు కూడా వున్నారు.

రాజ్యాంగంలో పొందుపరచబడిన వారి దార్శనికత – మన గణతంత్రానికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తోంది. ఆ సమయంలో భారత్ – అతిపేద, నిరక్షరాస్యత దేశం నుంచి ప్రస్తుతం ప్రపంచ వేదికపై విశ్వాసం నిండి వున్న దేశంగా రూపాంతరం చెంది ముందుకు వెళుతోంది. మన మార్గాన్ని నిర్దేశం చేసే రాజ్యాంగ నిర్మాతల సమిష్టి విజ్ఞత వల్లే ఇది సాధ్యం అయ్యింది. 

బాబా సాహెబ్ అంబేద్కర్ తో సహా ఇతరులు మనకు – మార్గనిర్దేశాన్ని, నైతిక చట్రాన్ని అందించారు. ఆ మార్గంలో నడవడం – మనందరి బాధ్యత. మనం వారి అంచనాలను చాలావరకు నిజం చేశాం. గాంధీజీ గారి ఆదర్శమైన “సర్వోదయ” అందరి అభ్యున్నతి సాకారమయ్యేందుకు – ఇంకా చాలా చెయ్యాల్సి వుంది. అయినా, మనం అన్ని రంగాల్లో ఉత్సాహకర పురోగతి సాధించాం.

ప్రియమైన ప్రజలారా....

ఈ “సర్వోదయ” లక్ష్యంలో ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి అత్యంత ప్రోత్సాహకరమైంది. గత ఏడాది భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ విజయం సాధించినట్టు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. కోవిడ్-19 మహమ్మారి నాల్గవ సంవత్సరంలోకి ప్రవేశించింది. అది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపింది. ప్రారంభ దశలో కోవిడ్-19 భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ, మన సమర్ధవంతమైన నాయకత్వం – మార్గనిర్దేశంలో వీలైనంత త్వరలో మాంద్యం నుంచి బయటపడి, అభివృద్ధి దిశగా కొనసాగాము. ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు – ఈ మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న – ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. ప్రభుత్వం సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టడం వల్ల ఇది సాధ్యమైంది. ముఖ్యంగా “ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమం ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన తీసుకు వచ్చింది. వీటిలో నిర్ధిష్ట ప్రోత్సాహక పథకాలు కూడా వున్నాయి.

అట్టడుగు వారిని కూడా - ఈ పథకాలు, కార్యక్రమాల్లో చేర్చి, వారి కష్టాలు తీర్చడంలో వారికి సహాయపడటం చాలా సంతృప్తి కలిగించే విషయం. 2020 మార్చిలో ప్రకటించిన “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన” పథకాన్ని అమలు చేయడం ద్వారా కోవిడ్-19 మహమ్మారి విస్తృత వ్యాప్తి వల్ల, దేశం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో – ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కలిగించింది. దీంతో ఏ ఒక్కరూ కూడా ఆకలి బాధలు ఎదుర్కొనే అవసరం రాలేదు. పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఈ పథకం సమయాన్ని మరింత కొనసాగించడం ద్వారా దాదాపు 81 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరింది. ఈ సహాయాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో కూడా లబ్దిదారులు తమ నెలవారీ రేషన్ ను ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఈ చారిత్రాత్మక చర్య వల్ల కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలను ఆదుకునే బాధ్యత చేపట్టింది. దీంతో వారు ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు. 

పటిష్టమైన పునాదులపై ఆర్థిక వ్యవస్థ నిలబడటంతో మనం పలు ప్రశంసనీయమైన కార్యక్రమాలను ప్రారంభించి, పురోగమించ గలుగుతున్నాము. ప్రజలంతా వ్యక్తిగతంగానూ, సమిష్టిగానూ, తమ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకుని, అభివృద్ధి చెందగలిగే వాతావరణాన్ని కల్పించడమే అంతిమ లక్ష్యంగా వుండాలి. ఈ ప్రయోజనాల కోసం విద్య సరైన పునాదులు నిర్మిస్తుంది. ఇందుకుగాను నూతన జాతీయ విద్యా విధానం ప్రతిష్టాత్మక మార్పులు తీసుకువచ్చింది. జాతీయ విద్యా విధానం రెట్టింపు విద్యా లక్ష్యాలను ఖచ్చితంగా సూచిస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత, సత్యాన్ని అన్వేషించే సాధనంగానూ ఇవి వున్నాయి. ఈ విధానం మన నాగరికత పాఠాలను సమకాలీన జీవితానికి సరిపడే విధంగా చేస్తుంది. అలాగే 21వ శతాబ్దపు సవాళ్ళకు అభ్యాస ప్రక్రియను తయారు చేస్తుంది. అభ్యాస ప్రక్రియను విస్తరించడం, కూలంకష అధ్యయనం చేయడంలో సాంకేతిక పాత్రను జాతీయ విద్యావిధానం అభినందించింది.

కోవిడ్ – 19 ప్రారంభమైనప్పటి నుంచి మనం చూసినట్లయితే సాంకేతిక పరిజ్ఞానం – జీవితాలను మార్చే అవకాశాలను కల్పిస్తుంది. “డిజిటల్ ఇండియా మిషన్” – గ్రామీణ పట్టణ దూరాన్ని కుదించడం ద్వారా సమాచార – కమ్యూనికేషన్ టెక్నాలజీని కలుపుకుపోయేందుకు కృషి చేస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు ఇంటర్నెట్ ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నందువల్ల ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సేవలు కూడా పొందుతున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిధిలో మనం సాధించిన విజయాల గురించి గర్వపడేందుకు కారణాలున్నాయి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అగ్రగామిగా వుంది. ఈ రంగంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న సంస్కరణలు అమల్లో వున్నందువల్ల ఇపుడు అందులో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యానికి ఆహ్వానించారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే “గగన్యాన్” కార్యక్రమం పురోగతిలో వుంది. ఇది భారతదేశపు మొట్ట మొదటి మానవ అంతరిక్ష నౌక. అయితే మనం నక్షత్రాలను చేరుకున్నప్పటికీ, మన పాదాలను నేలపైనే వుంచుతాము. 

భారతదేశ మార్స్ మిషన్ – అసాధారణ మహిళల బృందంతో కూడి వుంది. మన సోదరీమణులు, కుమార్తెలు – ఇతర రంగాల్లో సైతం వెనుకబడిలేరు. మహిళా సాధికారత, లింగ సమానత్వం - ఇక ముందు కేవలం నినాదాలుగా వుండవు – ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో మనం ఈ ఆదర్శాల దిశగా ఎంతో పురోగతి సాధించాం. బేటి బచావో – బేటి పడావో ప్రచారంలో ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతోంది. నేను వివిధ రాష్ట్రాలు, విద్యా సంస్థలు సందర్శించినపుడు, పలు నిపుణుల ప్రతినిధుల బృందాలను కలిసినపుడు అక్కడి యువతుల్లో విశ్వాసం – నన్ను ఆశ్చర్యపరిచింది. రేపటి భారతదేశాన్ని రూపొందించడంలో వారే అధిక కృషి చేస్తారనడంలో సందేహం లేదు. సగం జనాభా – తమ శక్తి మేరకు దేశ నిర్మాణానికి సహకరించేలా ప్రోత్సహించినట్లయితే ఎలాంటి అద్భుతాలు సాధించలేరు?

ఇదే సాధికారత దృక్పథం – షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలతో సహా బడుగు వర్గాల పట్ల ప్రభుత్వ వైఖరికి మార్గనిర్దేశం చేస్తుంది. వాస్తవానికి అడ్డంకులను తొలగించి, అభివృద్ధిలో వారికి సహాయం చేయడమే లక్ష్యం కాదు, వారి నుంచి నేర్చుకోవడం కూడా వుంటుంది. గిరిజన సంఘాలు, ప్రత్యేకించి పర్యావరణాన్ని పరిరక్షించడం నుంచి సమాజాన్ని మరింత సంఘటితం చేయడం వరకు అనేక రంగాల్లో గొప్ప పాఠాలను అందించాయి. 

ప్రియమైన ప్రజలారా...

పరిపాలనలో అన్ని అంశాలను మార్చేందుకు, ప్రజల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన వరుస కార్యక్రమాల ఫలితంగా, ప్రపంచం భారతదేశాన్ని కొత్త గౌరవ భావంతో చూడడం ప్రారంభించింది. వివిధ ప్రపంచ వేదికలలో మన దేశ జోక్యం – సానుకూల మార్పులు సృష్టించడం ప్రారంభించింది. ప్రపంచ వేదికపై భారతదేశం సంపాదించిన గౌరవం – కొత్త అవకాశాలు పొందడంతో పాటుగా, బాధ్యతలను కూడా కలిగి వుంది. ఈ ఏడాది మీకు తెలిసినట్లుగానే, భారతదేశం – గ్రూప్ ఆఫ్ 20 దేశాల అధ్యక్ష పదవి కలిగి వుంది. సార్వత్రిక సోదర భావం అనే నినాదంతో మనం – అందరి శాంతి, శ్రేయస్సు కోసం నిలబడదాం. జి-20 అధ్యక్ష పదవి ప్రజాస్వామ్యాన్నీ, బహు పాక్షికతను ప్రోత్సహించడానికి ఒక అవకాశం. అలాగే మెరుగైన ప్రపంచాన్నీ, మంచి భవిష్యత్తును రూపొందించడానికి సరైన వేదిక కూడా. భారత్ నాయకత్వంలో జి-20 మరింత సమానమైన, స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు తన ప్రయత్నాలను మరింత మెరుగు పరచగలదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.

జి-20 ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP) లో 85 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నందున – ప్రపంచ సవాళ్ళను చర్చంచడానికీ, పరిష్కారాలు కనుగొనడానికీ – ఇదొక చక్కని వేదిక. నా అభిప్రాయం ప్రకారం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, వాటిలో అత్యంత ముఖ్యమైనవి. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మనం సమస్యను ఎదుర్కొంటున్నాము. ఎక్కువ మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి మనకు ఆర్థిక వృద్ధి అవసరం. ఆ వృద్ధి శిలాజ ఇంధనం నుంచి కూడా వస్తుంది. దురదృష్టవశాత్తు, గ్లోబల్ వార్మింగ్ భారాన్ని – పేదలు ఎక్కువుగా భరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం, ప్రాచుర్యం కల్పించడం అనేవి – పరిష్కార మార్గాల్లో ఒకటి. సౌర శక్తి ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలకు – విధాన నిర్ణయం జోడించడం భారత్ వైపు నుంచి పటిష్టమైన ఒక ముందడుగు. అయితే, ప్రపంచ స్థాయిలో, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు – సాంకేతిక బదిలీ, ఆర్థిక మద్దతు రూపంలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి అవసరం వుంది. 

అభివృద్ధి – పర్యావరణం మధ్య సమతుల్యత కాపాడుకునేందుకు మనం ప్రాచీన సంప్రదాయాలను కొత్త కోణంలో చూడాలి. మన ప్రాథమిక ప్రాధాన్యతలను పున: సమీక్షించుకోవాలి. సాంప్రదాయ జీవన విలువల – శాస్త్రీయ అంశాలను అర్థం చేసుకోవాలి. విశాల విశ్వం ముందు మరోసారి ప్రకృతి పట్ల గౌరవాన్నీ, వినయాన్నీ పునరుజ్జీవింపచేయాలి. విచక్షణారహితమైన పారిశ్రామికీకరణ వల్ల కలిగే అనర్థాలను ముందుగానే ఊహించి, ప్రపంచాన్ని – దాని మార్గాలను సరి చేసుకోవాలని హెచ్చరించిన మహాత్మాగాంధీ ప్రస్తుత కాలానికి “నిజమైన ప్రవక్త” అని తెలియజేస్తున్నాను. 

ఈ భూ గ్రహంపై మన పిల్లలు సంతోషంగా జీవించాలంటే మనం – మన జీవనశైలిని సవరించుకోవాలి. సూచించిన మార్పుల్లో ఒకటి ఆహారానికి సంబంధించినది. ఐక్యరాజ్యసమితి భారత్ నుంచి వచ్చిన సూచనను అంగీకరించి, 2023ను “అంతర్జాతీయ – చిరుధాన్యాల సంవత్సరంగా” ప్రకటించినందుకు – నేను సంతోషిస్తున్నాను. చిరుధాన్యాలు – గతంలో మన ఆహారంలో ముఖ్య పదార్థాలుగా వుండేవి. మిల్లెట్ వంటి ముతక ధాన్యాలు –పర్యావరణ అనుకూలమైనవి. అవి పెరగడానికి తక్కువ నీరు అవసరమవుతుంది. అయినప్పటికీ అవి అధికస్థాయి –పోషకాహారాన్ని అందిస్తాయి. ఎక్కువ మంది ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపితే, అది జీవావరణ శాస్త్రాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. 

గణతంత్రానికి మరో సంవత్సరం గడిచిపోయి, ఇంకొక సంవత్సరం – ప్రారంభమవుతుంది. ఇది అపూర్వమైన మార్పుల సమయం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం కొద్ది రోజుల్లోనే మారిపోయింది. గడిచిన మూడేళ్ళలో– మనం – కోవిడ్ వైరస్ ను అణచి వేశాం అనిపించినా, అది తిరిగి విజృంభిస్తుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నాయకత్వం, మన శాస్త్రవేత్తలు, వైద్యులు, నిర్వాహకులు, కరోనా వారియర్స్ – ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తారని – మనం తెలుసుకున్నాం. అదే సమయంలో మనలో ప్రతి ఒక్కరూ మన రక్షణ పట్ల అప్రమత్తంగా వుండటం కూడా నేర్చుకున్నాం. 

ప్రియమైన ప్రజలారా!

మన దేశ అభివృద్ధి కథలో ఇప్పటివరకు వివిధ రంగాల్లో పని చేస్తున్న వ్యక్తుల అమూల్యమైన సహకారానికి గాను – వారు తరతరాలు ప్రశంసించబడాలి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ స్ఫూర్తికి - అనుగుణంగా మన దేశం మనుగడ సాగించడానికి వీలు కల్పించిన రైతులు, కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను నేను అభినందిస్తున్నాను. దేశ ప్రగతికి సహకరించే ప్రతి పౌరుడినీ – అభినందిస్తున్నాను. భారతదేశ సంస్కృతి, నాగరికతకు – గొప్ప రాయబారులైన మన ప్రవాస భారతీయులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా – మన దేశ సరిహద్దులను కాపాడుతున్న, దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా వున్న మన జవాన్లకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తమ తోటి పౌరులకు అంతర్గత భద్రత కల్పించే అనుబంధ సైనిక బలగాలు, పోలీసు బలగాలకు చెందిన వీర సైనికులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన మన సాయుధ బలగాలు, పారా మిలటరీ బలగాలు, సాహస పోలీసు బలగాలందరికీ నేను వందనం చేస్తున్నాను. ప్రియమైన పిల్లలందరికీ, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరోసారి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.

 

జైహింద్, జై భారత్

 

 

 


(Release ID: 1893752) Visitor Counter : 763