ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ అత్యవసర వైద్య బృందాల వ్యవస్థ అభివృద్ధిపై జరిగిన సంప్రదింపుల వర్క్‌షాప్‌లోపాల్గొన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


విపత్తు/అత్యవసర ప్రతిస్పందన కోసం వైవిధ్యభరితమైన భూభాగాలు, భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న భారతదేశం ఇతర దేశాలు అనుకరించే విధంగా వ్యవస్థ కలిగి ఉండాలి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాల ఆధారంగా విపత్తులను ఎదుర్కోవడానికి సమర్ధ, పరిస్థితికి తగిన విపత్తు/అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అభివృద్ధి చెందాలి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 24 JAN 2023 1:23PM by PIB Hyderabad

విపత్తు/అత్యవసర ప్రతిస్పందన కోసం దేశంలో సమర్ధ, పరిస్థితికి తగిన విపత్తు/అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అభివృద్ధి చెందాలని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.  

" వైవిధ్యభరితమైన భూభాగాలు, భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న భారతదేశం ఇతర దేశాలు అనుకరించే విధంగా సొంత వ్యవస్థ కలిగి ఉండాలి ." అని డాక్టర్ మాండవీయ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ (NEMT) ఇండియా సంప్రదింపుల వర్క్‌షాప్‌లో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు.

 

వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలు,పద్దతులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ మాండవీయ అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో అత్యవసర,  విపత్తుల సమయంలో అమలు చేసిన ప్రతిస్పందన చర్యలకు,అంతర్జాతీయ ఉత్తమ విధానాలను మేళవించి అత్యుత్తమ వ్యవస్థ రూపకల్పన జరగాలని  డాక్టర్ మాండవీయ అన్నారు. జాతీయ అత్యవసర ప్రతిస్పందన, నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వివిధ అంశాల్లో శిక్షణ , సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు వివిధ స్థాయిల్లో అమలు జరగాలని అన్నారు.

"క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎదుర్కొని తగిన విధంగా చర్యలు అమలు చేసే విధంగా దేశంలో ప్రమాణాల మేరకు వ్యవస్థ అభివృద్ధి చెందాలి. పరిస్థితికి అనువుగా దీనిలో మార్పు చేయడానికి వీలు కల్పించాలి" అని డాక్టర్ మాండవీయ అన్నారు. అత్యవసర పరిస్థితిలో స్పందించి నివారణ చర్యలు అమలు చేస్తున్న అన్ని వర్గాలను ఒక వేదిక పైకి తెచ్చి విధానం, వ్యూహం,చర్యలు, బాధ్యతలు చర్చించడానికి రెండు రోజుల వర్క్‌షాప్‌ ఏర్పాటయింది. ప్రామాణిక విపత్తు ప్రతిస్పందన కుఅంశాల ఆధారంగా దేశంలో ప్రత్యేకంగా పటిష్టంగా వ్యవస్థ అమలు చేయడానికి దీనిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.

జీ-20 ఆరోగ్య  ప్రాధాన్యతా రంగాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన  అంశం ఒకటిగా ఉంది. కేరళలోని తిరువనంతపురంలో (18-20 జనవరి 2023) జీ-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసిన వెంటనే ఇది మొదటి సమావేశం.

ఎన్‌డిఎంఎ, ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర సంస్థలు, అత్యవసర సేవలు అందిస్తున్న సంస్థలు, చికిత్సా కేంద్రాల మధ్య సమన్వయం సాధించి జాతీయ  అత్యవసర వైద్య బృందాల వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవస్థల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పని చేస్తున్నాయని అన్నారు. అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం సాధించినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు  స్పష్టం చేశారు. వ్యవస్థలో అన్ని రంగాల మధ్య సమన్వయం సాధించడానికి చర్యలు అమలు జరగాలని పేర్కొన్నారు. 

విపత్తులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రస్తుతం సాంప్రదాయిక పద్ధతిలో అమలు జరుగుతున్న ప్రతిస్పందన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనినేషనల్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ నిర్ణయించింది.  విపత్తులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఒక బృందంగా ఏర్పడి బాధిత ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలు వినియోగించుకుని వైద్యపరమైన ప్రతిస్పందన చర్యలు చేపడతారు. అత్యవసర పరిస్థితి /విపత్తు,ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అమలు చేయాల్సిన చర్యలు, తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సహాయ చర్యలు అమలు చేయడానికి వచ్చిన బృందాలు సమర్ధంగా పనిచేయడానికి బృందం సభ్యులకు వైద్యపరమైన నైపుణ్యాలతో పాటు క్షేత్ర స్థాయిలో సహాయ చర్యలు అమలు చేస్తున్న ఇతర వ్యవస్థలతో సమన్వయం అవసరముంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం వ్యవస్థలో మార్పులు తెచ్చి ప్రతిస్పందన వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించింది.దీనికోసం రంగాల మధ్య సమన్వయం సాధించడానికి, సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రపంచం వివిధ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న విధానాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు.

రెండు రోజుల వర్క్‌షాప్‌లో (i) వ్యవస్థ (ii) సిబ్బంది (iii) సామాగ్రి  (iv) విధానం సహా అత్యవసర వైద్య బృందాలకు సంబంధించిన నాలుగు కీలకమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ. లవ్ అగర్వాల్,  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ హితేష్ కుమార్ ఎస్ . మక్వానా, ఎన్‌డిఎంఎ సంయుక్త కార్యదర్శి శ్రీ కునాల్ సత్యార్థి,  డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్, సీజీహెచ్ఎస్  డైరెక్టర్ డాక్టర్ అంజనా రాజ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్   రాష్ట్రాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ఎయిమ్స్  గౌహతి, ఎయిమ్స్  పాట్నా, ఎయిమ్స్  జోధ్‌పూర్, ఎయిమ్స్  గోరఖ్‌పూర్, ఎయిమ్స్  నాగ్‌పూర్, ఎయిమ్స్  కళ్యాణి, ఎయిమ్స్  భోపాల్, ఎయిమ్స్  భువనేశ్వర్,  ఎయిమ్స్ ఉత్తరాఖండ్ డైరెక్టర్లు , భారతీయ సాయుధ దళాల సభ్యులు, జిప్మార్,  నిమ్హాన్స్, పీజీఐఎంఈఆర్ లాంటి జాతీయ సంస్థల  ప్రతినిధులు, డైరెక్టర్లు. , ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్ కూడా హాజరయ్యారు.

 

****



(Release ID: 1893332) Visitor Counter : 130