బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు గనులలో ప్రముఖ మైనింగ్ డెవలపర్లు, ఆపరేటర్ల నియామకం


- తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసిన కోల్ ఇండియా లిమిటెడ్

- ఆఫర్‌లో 169 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న మొత్తం పదిహేను ప్రాజెక్ట్‌లు

Posted On: 10 JAN 2023 11:54AM by PIB Hyderabad

దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచి, దిగుమతిపై ఆధారపడటాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓపెన్ గ్లోబల్ టెండర్ల ద్వారా బొగ్గు గనులలో పేరు గాంచిన మైనింగ్ డెవలపర్స్ కమ్ ఆపరేటర్లను (ఎండీఓలను) నియమించుకోవాలని నిర్ణయించింది. 25 సంవత్సరాలు లేదా మైన్ జీవిత కాలం (ఉత్పత్తి కార్యకలాపాలు జరిగేంత కాలం) ఏది తక్కువైతే అది వర్తించేలా ఈ నియమకం జరపుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు గనుల సంస్థలో 15 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ల ఉన్నాయి. ఎండీఓల ద్వారా ఉత్పత్తి గరిష్ఠీకరణ చర్యలు అమలు చేయడం కోసం దాదాపు రూ.20600 కోట్ల పెట్టుబడిని వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. ఇందులో అత్యధిక మొత్తాన్ని భూసేకరణ, పునరావాసం, పునరావాస సమస్యల నివారణ మరియు కొన్ని సందర్భాల్లో రైల్వే సైడింగ్‌ వంటి అంశాలకు వెచ్చించనున్నారు. దాదాపు 169 మిలియన్ టన్నుల (ఎంటీల) మొత్తం రేటింగ్ సామర్థ్యం కలిగిన ఈ పదిహేను ప్రాజెక్ట్‌లలో పదకొండు ఓపెన్‌కాస్ట్ మరియు నాలుగు భూగర్భ గనులు ఉన్నాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల సామర్థ్యం దాదాపు 165 మిలియన్ టన్నులు కాగా, మిగిలిన మొత్తం భూగర్భ  ప్రాజెక్టులకు సంబంధించినది.

ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా కార్యకలాపాలు..

ఎండీఓలు ఆమోదించిన మైనింగ్ ప్లాన్‌కు అనుగుణంగా తవ్వకాలు జరిపి బొగ్గు కంపెనీలకు సరఫరా చేస్తారు. ఎండీఓలు పరస్పరం ప్రయోజనకరమైన సాంకేతికతను అందుబాటులోకి తేవడం, ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. ఈ సంస్థలకు అందించే కాంట్రాక్టులు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉన్నందున, గని ప్రాజెక్టుల వద్ద అనుబంధ మౌలిక సదుపాయాలను కూడా ఈ ప్రైవేట్ కంపెనీలచే అభివృద్ధి చేయబడతాయి. ఈ సంస్థలు పరిశోధన, అభివృద్ధి సమస్యలు, భూసేకరణ, పర్యావరణ క్లియరెన్స్‌లు, రాష్ట్ర మరియు కేంద్ర కాలుష్య బోర్డులతో సమన్వయాన్ని సులభతరం చేస్తాయి. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తొమ్మిది బొగ్గు ప్రాజెక్టులకు మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్ మోడ్ ఎంగేజ్‌మెంట్ అంగీకార పత్రాలను జారీ చేసింది. మొత్తంగా, ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి దాదాపు 127 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మిగిలిన ఆరు ప్రాజెక్టులు టెండర్ల ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయి.

****



(Release ID: 1890044) Visitor Counter : 102