భారత ఎన్నికల సంఘం
ప్రయోగాత్మకంగా ‘సుదూర ఓటు’; భారత ఎన్నికల సంఘం సంసిద్ధత... దేశీయ వలసదారులు తమ రాష్ట్రం వెళ్లనక్కర్లేదు!
బహుళ నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ నమూనా యంత్రం
(ఆర్‌వీఎం) రూపొందించిన ఈసీఐ... ప్రదర్శన కోసం పార్టీలకు ఆహ్వానం;
ఒకే సుదూర పోలింగ్ కేంద్రం నుంచి పలు నియోజకవర్గాల
ఓటింగ్ నిర్వహణ సామర్థ్యంగల నమూనా యంత్రం;
చట్టపరంగానే కాకుండా పాలన.. ఆచరణ.. సాంకేతిక సవాళ్లపై
రాజకీయ పార్టీలకు సంక్షిప్త వివరణతో అభిప్రాయాలకు ఆహ్వానం
Posted On:
29 DEC 2022 1:32PM by PIB Hyderabad
సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ దూసుకుపోతున్న ఈ యుగంలో వలస కారణంతో ఏదైనా హక్కు నిరాకరణ వాస్తవానికి సమంజసం కాదు. దేశంలో 2019నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 67.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అలాగే 30 కోట్లమందికిపైగా ఓటర్లు తమ హక్కును వాడుకోకపోవడం, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం భిన్న స్థాయులలో నమోదు కావడంపైనా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆందోళన చెందుతోంది. కొత్త నివాస ప్రాంతంలో భిన్న కారణాలతో ఓటర్లుగా పేరు నమోదు చేసుకోనందువల్ల స్వస్థలంలో ఓటు హక్కు వాడుకోవడం సాధ్యం కాదు. ఆ మేరకు అంతర్గత (దేశీయంగా మరో ప్రాంతంలో నివసించే) వలసదారుల ఓటింగ్ సమస్యను పరిష్కరించడం ద్వారా భాగస్వామ్య ఎన్నికల నిర్వహణసహా ఓటింగ్ శాతం మెరుగవుతుంది. దేశీయ వలసలకు సంబంధించి కేంద్రీయ సమాచార నిధి లేనప్పటికీ, వలసలకు ప్రధాన కారణాలైన ఉపాధి, వివాహం, విద్యపరంగా ప్రభుత్వ రికార్డులలో సమాచారం విశ్లేషణకు అందుబాటులోనే ఉంటుంది. మొత్తం దేశీయ వలసలలో ఇతర ప్రాంతాలకు వెళ్లే గ్రామీణ జనాభాయే అత్యధికం. అంతేకాకుండా వలసలలో దాదాపు 85 శాతం ఆయా రాష్ట్రాల మధ్య పరిమితమైంది.
ఈ నేపథ్యంలో శ్రీ రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించగానే తొలుత చమోలి జిల్లాలో దుర్గమ ప్రయాణంద్వారా దుమాక్ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామానికి వెళ్లడంలో ఎదురైన ఇబ్బందుల అనుభవంతో దేశీయ వలస ఓటర్లు తాము ఉంటున్న ప్రాంతం నుంచే ఓటు హక్కు వాడుకునేలా చూడటంపై ఆయన దృష్టి సారించారు. అయితే, ఈ సాధికారత కల్పన ప్రక్రియలో చట్టపరమైనవే కాకుండా, పాలన, సాంకేతిక, నిబంధనల సంబంధిత సవాళ్లు కూడా ఉంటాయని ఈసీఐ గ్రహించింది. ఆ మేరకు అన్ని వలసదారులలోని సామాజిక-ఆర్థిక స్థాయుల ఓటర్లు ఎన్నికలలో భాగస్వాములు కాగల పరిష్కారాన్వేషణ దిశగా ఈసీఐ బృందం విస్తృతంగా చర్చించింది. తదనుగుణంగా పోస్టల్ బాలెట్లను పంపడం-తిరిగి తేవడం, ప్రాతినిధ్య ఓటింగ్, ప్రత్యేక ముందస్తు కేంద్రాలద్వారా ముందస్తు ఓటింగ్, ఎలక్ట్రానిక్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ల బట్వాడా-స్వీకరణ (ఈటీపీబీఎస్), ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్ వంటి వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించింది.
ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలన్నింటికీ విశ్వసనీయ, సౌలభ్య, ఆమోదయోగ్య సాంకేతిక పరిష్కారాన్వేషణ లక్ష్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అనుప్ చంద్ర పాండే, శ్రీ అరుణ్ గోయెల్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు సుదూర పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభం కోసం సమర్థంగా పనిచేస్తున్న్ ‘ఎం3’ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) సవరించిన నమూనాలను ప్రయోగాత్మకంగా వినియోగించాలని సంకల్పించారు. అంటే- స్వదేశీ వలసదారుల కోసం సొంత నియోజకవర్గం వెలుపలగల పోలింగ్ కేంద్రాలుగా ఇవి ఉపయోగపడతాయి. ఆ మేరకు వలస వచ్చిన ఓటరు తన ఓటు హక్కు వినియోగం కోసం తమ స్వస్థలాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఈ ప్రయోగానికి సంబంధించిన సంక్షిప్త భావనాత్మక ప్రకటనను అన్ని రాజకీయ పార్టీలకూ పంపింది. (https://eci.gov.in/files/file/14714-letter-to-political-parties-on-discussion-on-improving-voter-participation-of-domestic-migrant-using-remote-voting/) దీనికి సంబంధించి ఎదురయ్యే వివిధ సవాళ్లను అందులో ప్రస్తావించింది. ఈ మేరకు “దేశీయ వలసదారుల నిర్వచనం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, రహస్య ఓటింగ్‌కు భరోసా, ఓటర్ల గుర్తింపు నిమిత్తం పోలింగ్ ఏజెంట్ల సౌలభ్యం, సుదూర ఓటింగ్ ప్రక్రియ-విధానం, సదరు ఓట్ల లెక్కింపు” తదితరాల గురించి అందులో పేర్కొంది. అవి కింది విధంగా ఉన్నాయి.
పాలనపరంగా సవాళ్లు
|
చట్టపరంగా సవాళ్లు
|
సాంకేతిక సవాళ్లు
|
- ఓటర్ల లెక్కింపు - స్వీయ నిర్ధారణ
- నియంత్రిత వాతావరణం కల్పన – దూరప్రాంతాల్లో రహస్య ఓటింగ్‌కు భరోసా
- సుదూర ఓటింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్ల సౌలభ్యం - నకిలీల నివారణ దిశగా ఓటర్ల గుర్తింపుపై భరోసా
- ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల సంఖ్య
- సుదూర కేంద్రాల్లో పోలింగ్‌సిబ్బంది నియామకం, పర్యవేక్షణ వగైరా..
- సుదూర ప్రాంతం (ఇతర రాష్ట్రం)లో నియమావళి (ఎంసీసీ) అమలు.
|
సవరించాల్సిన నిబంధనలు-చట్టాలు
- ఆర్.పి. యాక్ట్- 1950, 51
- ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961
- ఓటర్ల నమోదు నిబంధనలు-1960
వలస ఓటరు నిర్వచనం
- పోలింగ్ రోజు గైర్హాజరీ శాశ్వత మార్పిడి
- ‘శాశ్వత ఆవాసం’లో ఓటరు గుర్తింపు కొనసాగిస్తూ, తాత్కాలిక గైర్హాజరీకి చట్టబద్ధత
సుదూర ఓటు నిర్వచనం
- ప్రాదేశిక నియోజకవర్గ భావన నిర్వహణ
- ‘సుదూరత’ నిర్వచనం- నియోజకవర్గం వెలుపల, జిల్లా వెలుపల లేదా రాష్ట్ర వెలుపల
|
- సుదూర ఓటింగ్ విధానం
- ఓటర్లకు ఓటింగ్ పద్ధతుల పరిచయం/బహుళ నియోజకవర్గ సుదూర ఈవీఎం లేదా ఏదైనా ఇతర సాంకేతిక పరిజ్ఞానం
- సుదూర పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు- ఇతర రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారికి బదిలీ.
|
దేశీయ వలసదారులు తాముంటున్న సుదూర ప్రాంతాల నుంచి- అంటే.. విద్య, ఉపాధి తదితరాల కోసం ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశాలనుంచే స్వస్థలంలోని నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థతో సంయుక్తంగా ‘బహుళ నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ నమూనా యంత్రం’ (ఆర్‌వీఎం) రూపొందించడమేగాక ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఈ సవరించిన ఈవీఎం ఒకే సుదూర పోలింగ్ కేంద్రం నుంచి 72 బహుళ నియోజకవర్గాల ఓటింగ్‌నిర్వహించగలదు. ఇది పూర్తిస్థాయిలో అమలైతే, వలసదారుల సామాజిక పరివర్తనకు దోహదం చేస్తుంది. తరచూ నివాసాలు మార్చడం, ఆ ప్రాంతాలతో తగిన సామాజిక-భావోద్వేగ సంబంధం లేకపోవడం, శాశ్వత ఆవాసాల్లో నివాసం/ఆస్తి ఉండటం, సొంత నియోజకవర్గంలో పేరు తొలగింపు ఇష్టం లేకపోవడం వంటి కారణాలవల్ల పని ప్రదేశంలో ఓటరుగా నమోదు కావడానికి ఇష్టపడని వారు తమ మూలాలతో సంధానంలో ఉండవచ్చు.
‘బహుళ నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ నమూనా యంత్రం’ పనితీరును 16.1.2023న ప్రదర్శించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం గుర్తింపు పొందిన 8 జాతీయ, 57 ప్రాంతీయ (రాష్ట్ర) రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అనంతరం చట్టాలు, పాలన ప్రక్రియలు, ఓటింగ్ పద్ధతి/ఆర్‌వీఎం/సాంకేతికతల్లో తేవాల్సిన మార్పులు, దేశీయ వలసదారుల సంబంధిత అంశాలు వగైరాలపై 31.01.2023 నాటికి తమ అభిప్రాయాలను, సూచనలను పంపాలని కోరింది. ఆ మేరకు నమూనా యంత్రం పనితీరు ప్రదర్శనపై భాగస్వామ్య పక్షాలన్నిటినుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అందిన తర్వాత ‘సుదూర ఓటింగ్’ పద్ధతిని తగువిధంగా అమలుచేసేందుకు సిద్ధమవుతుంది.
******
(Release ID: 1887398)
Visitor Counter : 467