సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 భారత ప్రభుత్వ అధికారిక కాలెండర్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


ప్రభుత్వ సాధనలు, భవిష్యత్ హామీలు ప్రస్తావిస్తూ ‘కొత్త సంవత్సరం, కొత్త సంకల్పం’ భావనతో కాలెండర్ రూపకల్పన

11 లక్షల కాలెండర్ ప్రతుల ముద్రణ, ప్రాంతీయ భాషల్లో 2.5 లక్షలు

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయితీలకు పంపిణీ చేసేలా 13 భాషల్లో ముద్రణ

Posted On: 28 DEC 2022 5:59PM by PIB Hyderabad

2023 సంవత్సరపు భారత ప్రభుత్వ అధికారిక కాలెండర్ ను కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ కాలెండర్ ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసించే ‘ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ను ప్రతిబింబిస్తుందన్నారు.  చురుగ్గా పురోగతి చెందుతున్న భారతదేశాన్ని ప్రతిబింబించే 12 ఆకట్టుకునే చిత్రాలు కాలెండర్ లో ఉన్నాయన్నారు. 12 నెలలకు తీసుకున్న 12 భావనలు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అద్దం పడతాయన్నారు.

 

గత రెండేళ్లలోనూ కేవలం డిజిటల్ రూపంలోనే కాలెండర్ ముద్రించగా, మళ్ళీ ఇప్పుడు  కాగితం మీద భౌతికంగా ముద్రించామన్నారు. ప్రభుత్వం రూపొందించిన అద్భుతమైన డిజైన్లలో ఇదొకటని మంత్రి అభివర్ణించారు. ఈ కాలెండర్ ను భౌతికంగానూ, డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే మాధ్యమంగా ఇది అందరి ప్రసంశలందుకుంటుందన్నారు. అన్నీ గ్రామ పంచాయితీలకూ చేరటం ద్వారా మారుమూల ప్రజలకు సైతం కాలెండర్ లోని సందేశం అందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటిదాకా సాధించిన విషయాలను ప్రస్తావించటంతోబాటు భవిష్యత్తు వాగ్దానాలను సైతం ఈ కాలెండర్ చెబుతుందని,  అందుకే దీన్ని ‘కొత్త సంవత్సరం, కొత్త సంకల్పం’ అని పిలుస్తున్నట్టు తెలియజేశారు.  దీన్ని హిందీ, ఇంగ్లిష్ తోబాటు 13 భాషలలో అందుబాటులో ఉంచుతామన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని  ప్రభుత్వ కార్యాలయాలకూ, పంచాయితీ రాజ్ సంస్థలకూ, ఆరోగ్య కేంద్రాలకూ, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకూ, జిల్లా కలెక్టర్ల కార్యాలయాలకూ అందజేసి అక్కడే అమ్మకాలు సాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 11 లక్షల కాపీలు ముద్రించి అందులో 2.5 లక్షల ప్రాంతీయ భాష కాలెండర్లు పంచాయితీలకు పంపిణీ చేస్తారు.

మంత్రి శ్రీ ఠాకూర్ తమ మంత్రిత్వశాఖలోని వివిధ విభాగాలు సాధించిన ప్రగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 50 వ్యూహాత్మక ప్రదేశాలలో మినహా ప్రసార భారతి అన్ని అనలాగ్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిటర్లనూ దశల వారీగా తొలగించింది. 2022 ప్రారంభం నాటికే డీడీ ఫ్రీడిష్  4 కోట్ల 30 లక్షల ఇళ్లకు చేరగా, ప్రసార భారతికి చెందిన వేరు వేరు చానల్స్ మొత్తం 2 కోట్ల చందాదారులను సంపాదించగలిగాయన్నారు. ఈ ఏడాది దేశంలో అదనంగా 75 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించగా వాటి మొత్తం  సంఖ్య 397 కు చేరుకున్నదని చెప్పారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆటోమేషన్ ప్రక్రియ పూర్తయిందని, రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆటోమేషన్ పురోగతిలో ఉన్నదని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మంత్రిత్వశాఖ 290 మంది జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం కింద రూ.13.12 కోట్లు పంపిణీ చేసిందన్నారు. 

 

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనీష్ దేశాయ్ మాట్లాడుతూ  కాలెండర్ థీమ్  ‘కొత్త సంవత్సరం, కొత్త సంకల్పం’ భారత ప్రభుత్వ పథకాలు, విధానాలకు, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు  అద్దం పడుతున్నదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకూ కాలెండర్ పంపిణీ చేస్తామన్నారు.  అదే సమయంలో సీబీసీ కి చెందిన మెయిలింగ్ విభాగం తపాలా శాఖతో కలసి 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు ప్రాంతీయ భాషలలో ముద్రించిన కాలెండర్లను పంపిణీ చేస్తుందనిశ్రీ దేశాయ్  చెప్పారు

కాలెండర్ గురించి

సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలన్న భారత ప్రభుత్వ ఆలోచనకు ఈ 2003 కాలెండర్ అద్దం పడుతుంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకునే చొరవలు నెలనెలా ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఆశయాలు ప్రస్తావిస్తూ, బలమైన భారతదేశాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఇందులో కనబడుతుంది. 

జనవరి

భారతదేశం అమృత కాలంలో ప్రవేశించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ పథ్ పేరును 2022 సెప్టెంబర్ లో కర్తవ్య పథ్ గా మార్చారు. సామ్రాజ్యవాద ఆలోచనాధోరణిని ఛేదించి మన దేశం పట్ల ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేస్తూ ముందుకు నడపటం కనిపిస్తుంది.

ఫిబ్రవరి

ఫిబ్రవరిని రైతు కళ్యాణానికి, అంటే రైతు సంక్షేమానికి అంకితం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ  స్పష్టంగా చెప్పింది ఏంటంటే,  రైతులు మన జాతికి గర్వకారణం. రైతుల సాధికారత ద్వారా సుసంపన్నమైన భారత్ నిర్మాణానికి ప్రభుత్వం అనేక పథకాలు వారికోసం అమలు చేస్తోందని.

మార్చి

భారత మహిళల స్ఫూర్తిని గౌరవించే మాసం – మార్చి. అదే నారీశక్తి  స్ఫూర్తి.  ప్రతి ఇంటా మహిళకు ధన్యవాదాలు చెబుతూ మనం మార్చి 8 న అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకుంటున్నాం. హద్దులు తుడిపేసి వాళ్ళకు వాళ్ళు  ఎదుగుతూ సాటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలందరినీ అభినందించాల్సిన మాసం ఇది.   ఏటా మహిళా సాధకులను భారత ప్రభుత్వం ‘నారీశక్తి పురస్కారం’ తో సత్కరిస్తుంది.

ఏప్రిల్

విద్యా సంస్కరణాలమీద దృష్టిపెట్టటం ప్రభుత్వ కీలక ఏజెండాలో భాగం. ‘పఢే భారత్ బఢే  భారత్’ అనేది ప్రధాని నినాదం. అందుకే ఏప్రిల్ నెల అంశం  ’నేర్చుకున్న భారత్’.  నూతన విద్యా విధానం లాంటి సంస్కరణలతో ప్రాధమిక, సెకండరీ, ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తెచ్చింది. విద్యలో  ఎదురుచూస్తున్న మార్పులు  సాగుతున్నాయి.

మే

నైపుణ్య భారత్ కార్యక్రమానికి అంకితమైన మాసం మే.  జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్  వివిధ నైపుణ్యాలలో 30 కోట్ల మందికి సంస్థాగతంగా  శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ యువతలో ఏ ఒక్కరూ సరైన నైపుణ్యం లేని కారణంగా తన శక్తి సామర్థ్యాలు వాడుకోలేని పరిస్థితి ఉండకూడదన్నదే ఈ మిషన్ లక్ష్యం. 

జూన్

ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నారు. దేశంలో అన్ని వయోవర్గాల వారు చురుకైన జీవనశైలి కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందుకే ఇంటింటికీ  ఫిట్ నెస్ తీసుకెళుతూ జూన్ నెల అంశం ‘ఫిట్ ఇండియా-హిట్ ఇండియా’ అయింది. 

జులై

పర్యావరణ ఆరోగ్య ప్రస్తావన లేకుండా ఆరోగ్యం మీద ఏ చర్చా పూర్తి కాదు. వాతావరణ అనుకూల,  ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను భారత్ ఎంచుకోవటంలో భారత్ ముందున్నది. “తగ్గించండి, తిరిగి వాడండి, రీసైకిల్ చేయండి “ నినాదాన్ని  ప్రజలు తమ జీవన విధానంగా మార్చుకోవటానికి తగిన కార్యక్రమాలను ప్రభుత్వం రూపకల్పన చేసింది. -

ఆగస్ట్

కేవలం ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లోనే కాకుండా దివ్యాంగుల అంతర్జాతీయ క్రీడలలో సైతం భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన అందరినీ గర్వించేలా చేసింది. అందుకే ఆగస్టు థీమ్ ‘ఖేలో ఇండియా’. క్షేత్రస్థాయిలో భారత క్రీడాకారులకు అండగా నిలబడటం మొదలు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల దాకా కల్పించి అనని క్రీడల్లోనూ భారత్ ను పోడియం మీద నిలబెట్టటానికి ఖేలో ఇండియా వాగ్దానం చేస్తోంది.  

సెప్టెంబర్

వసుధైవ కుటుంబకమ్, లేదా  "ప్రపంచమే ఒక కుటుంబం” అనేది సెప్టెంబర్ థీమ్. భారతదేశపు జీ-20 అధ్యక్ష  బాధ్యతకు ప్రాతిపదిక కూడా  "ఒకే భూమి, ఒకే కుటుంబం , ఒకే భవిష్యత్తు”  ఈ పురాతన భారతదేశపు సూత్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ఏ ప్రయోజనమైనా, ఏ సమస్య అయినా అందరినీ, ఒకే విధంగా ప్రభావితం చేస్తుందని దీనర్థం. అందుకే భూమి మీద అందరి జీవన నాణ్యతను మెరుగు పరచటానికి మనం కృషి చేయాలి  

అక్టోబర్

అద్భుత విజయాలకోసం  అర్రులు చాస్తున్నప్పుడే మనం దేశపు ప్రాథమిక అవసరాలను నెరవేర్చటం మీద దృష్టిపెట్టాలి.  జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా ప్రభుత్వం భారతీయులందరికీ ఆహార హక్కు ఇచ్చినట్టయింది.  అందుకే అక్టోబర్ నెల థీమ్”ఆహార భద్రత”  

నవంబర్

భారతదేశాన్ని ఆత్మ నిర్భర్  చేయాలన్న ప్రధాని ఆకాంక్షలకు ప్రతిస్పందనగా నవంబర్  నెల థీమ్ “స్వయం సమృద్ధ భారత్” అయింది.   2022 సెప్టెంబర్ 2 న ఐ ఎన్ ఎస్ విక్రాంత్ ప్రారంభంతో ఈ కల సాకారమైంది. కొచ్చి షిప్ యార్డ్ లో నిర్మితమైన ఈ నౌక భారత్ లో నిర్మించిన తొలి విమాన వాహక నౌక.   

డిసెంబర్

ఈశాన్య భారతదేశపు నిక్షిప్త  ప్రతిభను, సంపదను వెలికితీసి అక్కడి జీవితాన్ని వెలుగుల మయం చేయటం మీద దృష్టి సారిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా అభివర్ణించారు. భారత సుసంపన్నతలో  ఈ ఎనిమిది రాష్ట్రాల వర్తకం, వాణిజ్యం, సహజ వనరులు వైవిధ్యమైన సంస్కృతికి ఉన్న ప్రాధాన్యాన్ని అది చాటి చెబుతుంది. సమ్మిళిత భారత్ లో ఒక ముందడుగుగా సూచిస్తుంది.

****


(Release ID: 1887175) Visitor Counter : 191