భారత ఎన్నికల సంఘం
ఆర్.పి. చట్టం-1950లోని సెక్షన్ 8ఎ ప్రకారం అసోంలో శాసనసభ & పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభించిన ఈసీఐ
2001 జనాభా లెక్కల ప్రకారం అసోం రాష్ట్రంలో ఏసీలు, పీసీల పునర్విభజన
రాష్ట్రంలో కొత్త పరిపాలన యూనిట్ల ఏర్పాటుపై జనవరి 1, 2023 నుంచి నిషేధం
Posted On:
27 DEC 2022 2:47PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ చట్ట & న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 8ఎ ప్రకారం అసోం రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన ప్రక్రియను ప్రారంభించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అనుప్ చంద్ర పాండే, శ్రీ అరుణ్ గోయెల్ నేతృత్వంలోని కమిషన్, అసోం ప్రధాన ఎన్నికల అధికారితో మాట్లాడింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి పునర్విభజన కసరత్తు పూర్తయ్యే వరకు అసోం రాష్ట్రంలో కొత్త పరిపాలన యూనిట్ల ఏర్పాటుపై పూర్తి నిషేధం విధించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని అసోం ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, అసోం రాష్ట్రంలోని పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2001 జనాభా లెక్కలను ఉపయోగిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 & 332 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ ఉంటుంది.
నియోజకవర్గాల విభజన కోసం కమిషన్ సొంతంగా మార్గదర్శకాలు & పద్దతులను రూపొందించి, ఖరారు చేస్తుంది. పునర్విభజన కసరత్తు సమయంలో, భౌతిక అంశాలు, పరిపాలన యూనిట్ల ప్రస్తుత సరిహద్దులు, అనుసంధానత, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది. సాధ్యమైనంత వరకు, నియోజకవర్గాలు భౌగోళికంగా సౌకర్యవంతంగా ఉండేలా చూస్తుంది.
అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్విభజన కోసం ముసాయిదా ప్రతిపాదనను కమిషన్ ఖరారు చేసిన తర్వాత, ప్రజల నుంచి సూచనలు/అభ్యంతరాలను ఆహ్వానించడం కోసం కేంద్ర & రాష్ట్ర గెజిట్లలో దానిని ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి, రాష్ట్రంలో నిర్వహించే బహిరంగ సభల తేదీ, వేదికను వెల్లడిస్తూ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ వార్తాపత్రికల్లో కూడా ఒక ప్రకటన ఇస్తుంది.
అసోం రాష్ట్రంలో పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ, 2022 నవంబర్ 15 నాటి లెటర్ నంబర్ H-11019/06/2022-Leg.II ద్వారా కేంద్ర చట్ట & న్యాయ మంత్రిత్వ శాఖ భారత ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. 1972 నాటి పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం, 1976 పునర్విభజన కమిషన్ ద్వారా, 1971 జనాభా లెక్కల ఆధారంగా అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలకు పునర్విభజించారు. మళ్లీ ఇంతవరకు పునర్విభజన జరగలేదు.
****
(Release ID: 1886943)
Visitor Counter : 208