మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అన్ని పాఠశాలల్లో చేతులు కడుక్కోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలనీ, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కోసం ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలనీ రాష్ట్రాలను కోరిన - కేంద్ర ప్రభుత్వం


పాఠశాలల్లోని అన్ని సౌచాలయాలు సరిగా పనిచేసేలా నిర్ధారించుకోవాలి : రాష్ట్రాలకు సూచించిన కేంద్రం


గ్రామాల్లోని పాఠశాలల్లో బయోడీగ్రేడబుల్ వ్యర్థాలు, గ్రే వాటర్ నిర్వహణకు ఏర్పాట్లు ఉండేలా చూడాలి


స్వతంత్ర పైపుల ద్వారా నీటి సరఫరాతో పాటు, సాధారణ, స్థిరమైన సౌర విద్యుత్ పరిష్కారాలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను తక్షణమే కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన - కేంద్ర ప్రభుత్వం

Posted On: 22 DEC 2022 9:27AM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

*     ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలురక్షిత మంచినీటిని అందించడంతో పాటుమొత్తం పరిశుభ్రతను నిర్వహించడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు.

*     మంచి పరిశుభ్రత పద్ధతులను పెంపొందించడం కోసంప్రాథమిక స్థాయిలో అనుబంధ పాఠ్యాంశంగా స్వచ్ఛతపై ఒక అధ్యాయాన్ని చేర్చడం జరిగింది. 

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలనీ, విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడానికి వీలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలనీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.  స్వతంత్ర పైపుల ద్వారా నీటి సరఫరాతో పాటు, సాధారణ, స్థిరమైన సౌర విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను వేగవంతం చేయాలనీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. 

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన మంచినీటిని అందించడం, మొత్తం పరిశుభ్రతను నిర్వహించడం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల పునరుద్ధరణ చాలా కాలంగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతగా పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ; నీతి ఆయోగ్; గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా జారీ చేసిన అడ్వైజరీ లో పేర్కొనడం జరిగింది.   స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్.బి.ఎం-జి); జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) వంటి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో చాలా ముందుకు సాగుతున్నాయి.  స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకం పారిశుద్ధ్యం కోసం జన ఆందోళనగా రూపాంతరం చెందడంతో గ్రామీణ భారతదేశం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.  స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండో దశ కింద, బహిరంగ మలవిసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) స్థిరత్వం తో పాటు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది.  సంతృప్త విధానాన్ని అనుసరించి, పాఠశాలలతో సహా అభివృద్ధి చెందడంలో ఎవరూ వెనుక పడకుండా చూడాలన్నదే లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 

ఒ.డి.ఎఫ్. ప్లస్ కింద, గ్రామాల్లోని అన్ని పాఠశాలల్లో బయో డిగ్రేడబుల్ వ్యర్ధాలతో పాటు, గ్రే వాటర్ నిర్వహణకు ఏర్పాట్లు ఉండేలా చూడాలని కూడా పేర్కొన్నారు.  పాఠశాలల్లోని మరుగుదొడ్లు అన్నీ సక్రమంగా పనిచేసేలా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.  అయినప్పటికీ, వాటిలో కొన్ని సింగిల్ పిట్ నుండి ట్విన్ పిట్‌ లను తిరిగి అమర్చవలసి ఉంటుంది.  సింగిల్ పిట్ నుండి ట్విన్ పిట్‌లకు తిరిగి అమర్చాలనే ప్రచారంలో భాగంగా ఇది చేయవచ్చు.

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యు.డి.ఐ.ఎస్.ఈ) నివేదిక 2021-22 ప్రకారం మరుగుదొడ్లు, చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.   సంతృప్త విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ సౌకర్యాలను కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.  అదే విధంగా, అన్ని పాఠశాలల్లో సబ్బు సదుపాయంతో చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు సృష్టించవచ్చు.  పరిశుభ్రతకు సంబంధించిన అన్ని అంశాలపై పిల్లలకు పరిశుభ్రత విద్యను అందించడం కూడా చాలా అవసరం.  ఈ ప్రయోజనం కోసం, ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశుభ్రత విద్యలో శిక్షణ పొందాలి, వారు పరిశుభ్రత ప్రవర్తనను నొక్కిచెప్పే ఆసక్తికరమైన కార్యకలాపాలతో పాటు, కమ్యూనిటీ ప్రాజెక్టుల ద్వారా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.  పాఠశాలల్లో మంచి పరిశుభ్రత పద్ధతులను పెంపొందించడానికి, ఎన్.సి.ఈ.ఆర్.టి. అభివృద్ధి చేసిన ప్రాథమిక స్థాయిలో అనుబంధ విషయాలలో స్వచ్ఛతపై ఒక అధ్యాయం చేర్చబడింది.

జల్ జీవన్ మిషన్ కింద, పాఠశాలలు, అంగన్‌ వాడీ కేంద్రాలు, ఆశ్రమ శాలల్లో కుళాయి ద్వారా సురక్షితమైన నీటి సరఫరాను అందించడంతో పాటు, మన పిల్లల మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా ఆ అడ్వైజరీ లో పేర్కొన్నారు.  ముఖ్యంగా మహమ్మారి సమయంలో సురక్షితమైన తాగునీటిని ఖచ్చితంగా సరఫరా చేయడం ద్వారా చిన్న పిల్లల ప్రజారోగ్యం లక్ష్యంగా, ఈ క్లిష్టమైన కార్యక్రమాన్ని 2020 అక్టోబర్, 2వ తేదీన ప్రారంభించడం జరిగింది.  ఇప్పటివరకు, యు.డి.ఐ.ఎస్.ఈ.+ 2021-22 సమాచారం ప్రకారం, దాదాపు 10.22 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో, 9.83 లక్షలు అంటే సుమారు 96 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తాగునీటి సదుపాయం కల్పించడం జరిగింది. 

పాఠశాలల కోసం ఆయా గ్రామాల నీటి సరఫరా మౌలిక సదుపాయాలు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా,  స్వతంత్ర పైపుల ద్వారా నీటి సరఫరాతో పాటు, సాధారణ, స్థిరమైన సౌర విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను కూడా పరిశీలించవచ్చునని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసిన అడ్వైజరీ లో పేర్కొనడం జరిగింది.

మన పిల్లల సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సురక్షితమైన నీటి సరఫరా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్., జిల్లా మినరల్ ఫండ్స్ తో పాటు మరేదైనా ఇతర వనరుల కింద విడుదలయ్యే నిధుల నుండి మరుగుదొడ్ల మరమ్మతులు లేదా నిర్మాణం, చేతులు కడుక్కోవడానికి లేదా త్రాగునీటికి అవసరమైన నిధులను ఈ పథకాల ప్రస్తుత మార్గదర్శకాలను అనుసరించి వినియోగించుకోవచ్చు.

 

 

*****



(Release ID: 1885994) Visitor Counter : 158