సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామర్థ్యాల నిర్మాణంపై మాల్దీవులు, బంగ్లా అధికారులకు తర్ఫీదు!


రెండు వారాల కార్యక్రమాలు, ముస్సోరీలోని
ఎన్.సి.జి.జి. ఆధ్వర్యంలో నిర్వహణ..

మాల్దీవులనుంచి27మందికి,
బంగ్లాదేశ్‌నుంచి 39 మందికి శిక్షణ..

‘వసుదైవ కుటుంబకం’, ‘పొరుగు దేశాలకే ప్రాధాన్యం’
అనే ప్రధాని దార్శనికతతో కార్యక్రమ నిర్వహణ..

ప్రజల జీవనప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా
సుపరిపాలనా విధానాలు చేపట్టాలంటూ
ఉన్నతాధికారులకు ఎన్.సి.జి.జి. డైరెక్టర్ జనరల్
భరత్ లాల్ పిలుపు...
సవాళ్లను ఎదుర్కొనేందులా అధికారుల సామర్థ్యాల పెంపుదలకుగాను పొరుగుదేశాలకు భారత్ సహాయం..
ఇప్పటివరకూ 15దేశాల పౌర అధికారులకు
ఎన్.సి.జి.జి. ఆధ్వర్యంలో శిక్షణ...

మరింత ఎక్కువ సంఖ్యలో పౌర అధికారులకు
శిక్షణ సదుపాయం కల్పించే లక్ష్యంతో
ఎన్.సి.జి.జి. విస్తరణ ప్రక్రియ మొదలు..

Posted On: 13 DEC 2022 1:41PM by PIB Hyderabad

   మాల్దీవులకు, బంగ్లాదేశ్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల కోసం రెండు వారాల చొప్పున సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు ముస్సోరీలోని జాతీయ సుపరిపాలనా కేంద్రం (ఎన్.సి.జి.జి.) ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. మాల్దీవుల నుంచి 27 మంది అధికారులు, బంగ్లాదేశ్ నుంచి 39 మంది అధికారులు ఈ రెండు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

 'వసుధైవ కుటుంబకం', 'పొరుగు ప్రాంతాలకే తొలి ప్రాధాన్యం' వంటి భావనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్న కలలకు అనుగుణంగా ఈ సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించారు. పాలనలో తారసపడే సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రజా సేవకు భరోసాను ఇచ్చేందుకు, అందుకు తగినట్టుగా తమ ఉన్నతాధికారుల సామర్థ్యాలను పెంపొందించడానికిగాను పొరుగుదేశాలకు భారతదేశం సహాయపడుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సేవల బట్వాడాను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వ విధానాలు, వాటి అమలు మధ్య అంతరాలను పూరించడానికి చిత్తశుద్ధితో కృషి చేసేలా ఈ సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వ అధికారులకు ఎంతో తోడ్పడుతుంది. ప్రజలకు పటిష్టంగా, నిరాటంకంగా సేవలను అందించడానికి వీలుగా ఈ కార్యక్రమాలను శాస్త్రీయంగా రూపకల్పన చేశారు.

 

    ‘పౌరులకే మొదటి స్థానం’ కల్పించడం ద్వారా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రవచించిన  ‘ప్రజా సానుకూలమైన’ సుపరిపాలన మంత్రానికి అనుగుణంగా ఈ సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించారు. సమాచార మార్పిడిని ప్రోత్సహించడం, విజ్ఞాన సమాచారాన్ని పంచుకోవడం, కొత్త ఆలోచనలు, ఉత్తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం, సున్నితత్వం, ప్రతిస్పందనను మెరుగుపరచడం, భాగస్వామ్య దేశాల ఉన్నతాధికారులలో సామర్థ్యాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

   ఉమ్మడిగా నిర్వహించిన ప్రారంభ సమావేశానికి ఎన్.సి.జి.జి. డైరెక్టర్ జనరల్ భరత్ లాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సమర్థవంతమైన రీతిలో ప్రజలకు సేవలు అందించడం చాలా అవసరమన్నారు. ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందుతూ నాణ్యమైన ప్రజా సేవలను పొందగల వాతావరణాన్ని సృష్టించేందుకు ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది తమతమ పాత్రలను నిర్వహించాలన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలను నిర్ధారించడానికి సుపరిపాలన పద్ధతులను అనుసరించాలని ఆయన అధికారులను కోరారు. సుపరిపాలనకు అనుగుణంగా భారతదేశం అమలు చేస్తున్న ఉజ్వల యోజన వంటి  పథకాల నమూనాలను ఉదాహరణలుగా ఆయన ప్రస్తావించారు. ఈ పథకం 10కోట్లకు పైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిందని, వారు స్వచ్ఛమైన వంట గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉన్నారని, ఈ పథకం అమలుతో వంటచెరుకును సేకరించడం, పొగను పీల్చడం వంటి కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించినట్టు ఆయన చెప్పారు. వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యు.ఆర్.ఐ.) నివేదిక ప్రకారం, ఉజ్వల యోజన అమలుతో, ప్రతి సంవత్సరం లక్షన్నర మందికి పైగా ప్రజల జీవితాలు మెరుగవుతున్నాయని, ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, మరణాల నుంచి స్త్రీలకు రక్షణ లభించిందని అన్నారు.

   గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన కుళాయి నీటిని అందించడానికి చేపట్టిన జల్ జీవన్ మిషన్‌ పథకాన్ని గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అమెరికాలోని  చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ క్రామెర్ చేసిన మరో అధ్యయనం ప్రకారం, ప్రతి సంవత్సరం లక్షా 36వేలకుపైగా శిశుమరణాలను దేశంలో నివారించగలుగుతున్నారని అన్నారు.  తద్వారా వారు పూర్తి జీవితాన్ని గడపడానికి, సమాజాభివృద్ధికి దోహద పడగలుగుతున్నారని అన్నారు.

  పౌరసేవ అంటే ఏ వ్యక్తి నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం లేని సానుకూల వాతావరణాన్ని సృష్టించడం, అందుకు తగిన పరివర్తన ప్రభావాన్ని తీసుకురావడమేనని ఆయన వివరించారు.  ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అంశాలను సానుకూలంగా ఉపయోగించుకోవాలని,  తమతమ దేశాల్లో అమలు చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలను, పద్ధతులను రూపొందించుకోవాలని ఆయన కోరారు.

 

            

 

 భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019లో మాల్దీవుల్లో జరిపిన పర్యటన సందర్భంగా ఎన్.సి.జి.జి. మాల్దీవులతో ఒక అవగాహనా ఒప్పందం (ఎం.ఒ.యు.) కుదుర్చుకుంది. 2024వ సంవత్సరం నాటికి 1,000 మంది మాల్దీవుల ఉన్నతాధికారుల సామర్థ్యాల పెంపుదలకు సంబంధించి మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో వైపు,  2024 నాటికి 1,800 మంది ఉన్నతాధికారుల సామర్థ్యం పెంపునకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూడా ఎన్.సి.జి.జి. ఒప్పందం కుదుర్చుకుంది.

   సుపరిపాలన, విధాన సంస్కరణలు, శిక్షణ, దేశంలోనే కాక, వర్ధమాన దేశాల్లోని ఉన్నతాధికారుల సామర్థ్యం పెంపుదల వంటి అంశాలపై పని చేసే సంకల్పంతో జాతీయ సుపరిపాలనా కేంద్రాన్ని (ఎన్.సి.జి.జి.ని) జాతీయ స్థాయిలో ఒక అత్యున్నత సంస్థగా భారత ప్రభుత్వం 2014లో ఏర్పాటు చేసింది. పథకాల రూపకల్పనలో మేధావి వర్గంగా కూడా ఇది పనిచేస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అనేక వర్ధమాన దేశాల ఉన్నతాధికారుల సామర్థ్య నిర్మాణ ప్రక్రియలను ఎన్.సి.జి.జి. చేపట్టింది. ఇప్పటివరకు, ఇది 15 దేశాల ఉన్నతాధికారులకు శిక్షణ కల్పించింది. బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్, కంబోడియా వంటి దేశాల ఉన్నతాధికారులు ఈ కేంద్రంద్వారా శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల అధికారులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ కార్యక్రమాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. వీటికి ఎప్పకప్పుడు డిమాండ్ పెరుగుతున్నందున మరిన్ని దేశాలకు చెందిన ఉన్నతాధికారుల శిక్షణకు వసతి సదుపాయాలను కల్పించడానికి వీలుగా ఎన్.సి.జి.జి. సామర్థ్య విస్తరణను చేపట్టింది.

   సార్థ్యాల పెంపుదల ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వ పాలన, సంపూర్ణ నాణ్యతా నిర్వహణ, అభివృద్ధి, భారతదేశంలో వికేంద్రీకరణ, ప్రభుత్వ విధానం, అమలు ప్రక్రియ, నాయకత్వం, కమ్యూనికేషన్, ఆరోగ్య రక్షణ, నీటి సరఫరా-పారిశుద్ధ్యం, ఇ-గవర్నెన్స్-డిజిటల్ ఇండియా రంగాలలో వివరణాత్మక సమాచార భాగస్వామ్యం వంటి  ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

   కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి వివిధ అభివృద్ధి పథకాలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. స్మార్ట్ సిటీ, ఇందిరా పర్యావరణ్ భవన్: జీరో ఎనర్జీ బిల్డింగ్, భారత పార్లమెంటు, న్యూఢిల్లీ పురపాలక మండలి, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను, సంస్థలను సందర్శించేందుకు వారిని తీసుకువెళతారు.

  ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ పూనం సింగ్, డాక్టర్ అశుతోష్ సింగ్, డాక్టర్ సంజీవ్ శర్మ నిర్వహణా బాధ్యతలను నిర్వహించారు. ఎన్.సి.జి.జి. నిర్వహణలో వివిధ కార్యక్రమాలను నడిపించడంలో వారు కీలకపాత్ర వహించారు. సుపరిపాలనపై ప్రసంగించారు.

 

<><><>


(Release ID: 1883282) Visitor Counter : 94