భారత ఎన్నికల సంఘం
భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన - జర్మనీ విదేశాంగ మంత్రి గౌరవనీయులు శ్రీమతి అన్నలెనా బేర్‌బాక్
ఈ.వి.ఎం-వి.వి.పాట్ వినియోగంలో ఈ.సి.ఐ. అమలుచేస్తున్న కఠినమైన ప్రోటోకాల్, భద్రతా విధానాలను నిశితంగా గమనించిన - జర్మన్ ప్రతినిధి బృందం
Posted On:
06 DEC 2022 1:04PM by PIB Hyderabad
జర్మనీ విదేశాంగ మంత్రి గౌరవనీయులు శ్రీమతి అన్నలెనా బేర్‌బాక్ నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందం ఈ రోజు న్యూ ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అరుణ్ గోయెల్, శ్రీ అనుప్ చంద్ర పాండేలను కలిశారు. జర్మన్ విదేశాంగ మంత్రితో పాటు నలుగురు పార్లమెంటు సభ్యులు శ్రీమతి అగ్నిస్కా బ్రుగర్, శ్రీ థామస్ ఎర్న్ డ్ల్, శ్రీ ఉల్రిచ్ లెచ్టే, శ్రీ ఆండ్రియాస్ లారెమ్, భారతదేశంలోని జర్మన్ రాయబారి గౌరవనీయులు డాక్టర్ ఫిలిప్ అకెర్మన్, ఆమె విదేశాంగ కార్యాలయానికి చెందిన ఇతర అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా సి.ఈ.సి. శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య భావన అనేది, భారతదేశ చరిత్ర, సంప్రదాయాలలో పూర్తిగా మమేకమై ఉందని పేర్కొన్నారు. భారత ఎన్నికల పరిమాణాన్ని గురించి, ఆయన వివరిస్తూ, 950 మిలియన్లకు పైగా ఓటర్ల కోసం, 1.1 మిలియన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, 11 మిలియన్ల మంది పోలింగ్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడంతో పాటు, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పటిష్టమైన ఎన్నికల ప్రక్రియను, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరినీ కలుపుకుని పోయే విధంగా, నిర్వహించడానికి, ఈ.సి.ఐ. తగిన ఏర్పాట్లు చేస్తోందని, జర్మనీ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతి దశలో రాజకీయ పార్టీలకు ఎన్నికల ఏర్పాట్ల వివరాలు తెలియజేస్తూ, వారి భాగస్వామ్యాన్ని ఈ.సి.ఐ. నిర్ధారిస్తుందని, ఆయన నొక్కి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల పై, ఓట్లు లెక్కించేటప్పుడు ఎదురయ్యే సవాళ్ల తో పాటు, నకిలీ సోషల్ మీడియా కథనాలు కలిగించే ప్రభావం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలపై చాలా ఎక్కువగా ఉంటుందనీ, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సంస్థలకు ఇది ఒక సాధారణ సవాలుగా మారిపోయిందని, శ్రీ రాజీవ్ కుమార్ తెలియజేశారు.
జర్మనీ విదేశాంగ మంత్రి కమిషన్ తో సంభాషిస్తూ, భారతదేశంలోని విభిన్న భౌగోళిక, సాంస్కృతిక, ఓటర్ల సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ.సి.ఐ. ద్వారా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న విస్తృత కసరత్తును ప్రశంసించారు. ఓటర్ల భాగస్వామ్యం, రాజకీయ పార్టీలు / అభ్యర్థులు, ఎన్నికల యంత్రాల రవాణా అనే మూడు ప్రధాన ప్రక్రియల కింద, ఎన్నికల నిర్వహణలో ఈ.సి.ఐ. విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి మంత్రికి వివరించారు. ప్రతినిధి బృందం కోసం ఈ.సి.ఐ. నిర్వహించిన ఈ.వి.ఎం-వి.వి.పాట్ పనితీరు ప్రదర్శనలో ఆమె వ్యక్తిగతంగా ఈ.వి.ఎం. ద్వారా ఓటు వేశారు. ఈ.వీ.ఎం. లతో కూడిన ఎన్నికల ప్రక్రియల్లో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీల నిర్వహణ, కదలిక, నిల్వ, కార్యకలాపాలు, భాగస్వామ్య ప్రక్రియపై కఠినమైన పరిపాలనా ప్రోటోకాల్స్ తో పాటు స్వతంత్ర ఈ.వీ.ఎం. ల యొక్క బలమైన భద్రతా లక్షణాలను ఎం.పీ. లతో కలిసి ఆమె ఆసక్తిగా గమనించారు.
భారత, జర్మనీ దేశాలు రెండూ, స్టాక్‌హోమ్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఐ.డి.ఈ.ఏ), వార్సా లోని కమ్యూనిటీ ఆఫ్ డెమోక్రసీస్ అనే సంస్థల్లో సభ్యులుగా ఉన్నాయి. ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించడం, ప్రజాస్వామ్యం కోసం విద్య తో సహా పౌర విద్య, అక్షరాస్యతలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలను బలోపేతం చేయడంతోపాటు, విదేశాల్లో ఎన్నికల అధికారులతో సన్నిహిత ఎన్నికల సహకారాన్ని పెంపొందించడానికి, ఈ.సి.ఐ. నిరంతర ప్రయత్నం కొనసాగిస్తోంది. "సమ్మిట్ ఫర్ డెమోక్రసీ" ఆధ్వర్యంలో ఈ.సి.ఐ. 2023 జనవరి లో జాతీయ ఓటర్ల దినోత్సవం 2023 కి ముందు 'సాంకేతికత, ఎన్నికల సమగ్రత' పై రెండవ అంతర్జాతీయ సమావేశాన్ని కూడా నిర్వహించనుంది.
జర్మనీ విదేశాంగ కార్యాలయం, న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయాలతో పాటు, భారత ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1881262)
Visitor Counter : 263