ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రసూతి మరణాల నిష్పత్తి (మెటర్నల్ మెర్టాలిటి రేట్-ఎంఎంఆర్) 2014-16 లో ప్రతి లక్ష సజీవ జననాలకు 130 ఉండగా 2018-20లో ఆ సంఖ్య గణనీయంగా 97కి తగ్గింది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
ఎంఎంఆర్ లక్ష్యాన్ని సాధించిన భారతదేశం జాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పి)
ఎంఎంఆర్‌లో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డిజి) లక్ష్యాన్ని సాధించిన 8 రాష్ట్రాలు
Posted On:
30 NOV 2022 11:53AM by PIB Hyderabad
దేశం మరో కొత్త మైలురాయిని అందుకుంది. దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గింది. ఈ విజయానికి దేశాన్ని అభినందిస్తూ కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్)ని సమర్థవంతంగా తగ్గించడంలో అద్భుతమైన పురోగతిని ప్రశంసించారు. ఓ ట్వీట్‌లో ఆ విషయాన్ని పేర్కొన్నారు:
ప్రసూతి మరణాల నిష్పత్తి 2014-16లో ప్రతి లక్ష సజీవ జననాలకు 130 ఉండగా 2018-20లో అది గణనీయంగా 97కి తగ్గింది. నాణ్యమైన ప్రసూతి మరియు పునరుత్పత్తి సంరక్షణను నిర్ధారించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఎంఎంఆర్‌ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడ్డాయి.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జిఐ) ఎంఎంఆర్‌పై విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) 6 పాయింట్లతో అద్భుతంగా మెరుగుపడింది. ఇప్పుడు అది లక్ష సజీవ జననాలకు 97కు చేరుకుంది. ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) అనేది 100,000 సజీవ జననాలకు ఒక నిర్దిష్ట వ్యవధిలో ప్రసూతి మరణాల సంఖ్యగా నిర్వచించబడింది.
నమూనా నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్) నుండి పొందిన గణాంకాల ప్రకారం: 2014-2016లో 130, 2015-17లో 122, 2016-18లో 113, 2017-19లో 103 మరియు ఈ కింద చూపిన విధంగా 2018-20లో 97గా నమోదయింది.
చిత్రం 1: 2013 -2020 నుండి ఎంఎంఆర్ నిష్పత్తిలో ప్రగతిశీల క్షీణత:
దీనిని సాధించడం ద్వారా భారతదేశం లక్ష సజీవ జననాల్లో 100 కంటే తక్కువ ఎంఎంఆర్‌ను సాధించాలన్నజాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పి) లక్ష్యాన్ని చేరుకుంది. 2030 నాటికి 70కంటే తక్కువ ఎంఎంఆర్ సాధించాలన్న ఎస్‌డిజి లక్ష్యాన్ని సాధించడానికి సరైన మార్గంలో ఉంది.
సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డిజి) లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల సంఖ్య ఆరు నుండి ఎనిమిదికి పెరిగింది. ఇందులో కేరళ (19)తో అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (33), తెలంగాణ (43) ఆంధ్రప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57) మరియు కర్ణాటక (69) ఉన్నాయి.
2014 నుండి, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద అందుబాటులో ఉండే నాణ్యమైన మాతా మరియు నవజాత ఆరోగ్య సేవలను అందించడానికి మరియు నివారించగల ప్రసూతి మరణాలను తగ్గించడానికి భారత దేశం ఒక సమగ్ర ప్రయత్నం చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ప్రత్యేకించి పేర్కొన్న ఎంఎంఆర్ లక్ష్యాలను సాధించడానికి ప్రసూతి ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. “జననీ శిశు సురక్ష కార్యక్రమం” మరియు “జననీ సురక్ష యోజన” వంటి ప్రభుత్వ పథకాలు సవరించబడ్డాయి. సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ (సుమన్) వంటి మరింత భరోసా మరియు గౌరవప్రదమైన సేవా కార్యక్రమాలకు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. అధిక ప్రమాదకర గర్భాలను గుర్తించడం మరియు వారి సరైన నిర్వహణను సులభతరం చేయడంపై ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పిఎంఎస్‌ఎంఎ) దృష్టి సారించినందున ప్రత్యేకంగా ప్రశంసించబడింది. నివారించదగిన మరణాలను తగ్గించడంలో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపింది. లక్ష్య మరియు మిడ్‌వైఫరీ కార్యక్రమాలు గౌరవప్రదమైన పద్ధతిలో నాణ్యమైన సంరక్షణను ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరిస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలందరికీ ప్రసవ ఎంపికను నిర్ధారిస్తుంది.
ఎంఎంఆర్ నిష్పత్తిని విజయవంతంగా తగ్గించడంలో భారతదేశ అత్యుత్తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిర్ణీత 2030 నాటికి 70 కంటే తక్కువ ఎంఎంఆర్ ఎస్‌డిజి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గౌరవప్రదమైన మాతృ సంరక్షణను అందించే దేశంగా ప్రసిద్ధి చెందడంపై ఇది ఆశావాద దృక్పథాన్ని అందిస్తుంది.
***
(Release ID: 1880164)
Visitor Counter : 706
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam