ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 71,000 మందికి నియామక లేఖల పంపిణీ కోసం నిర్వహించిన ఉపాధి మేళాలో ప్రధాని ప్రసంగ తెలుగు పాఠం

Posted On: 22 NOV 2022 1:00PM by PIB Hyderabad

నమస్కారం!

ఉపాధి సమ్మేళనానికి హాజరైన నా యువ మిత్రులారా…

   మీకందరికీ అనేక అభినందనలు… ఇవాళ దేశంలోని 45 నగరాల్లో 71,000 మందికిపైగా యువతకు నియామక లేఖలు ప్రదానం చేయబడుతున్నాయి. నేడు వేలాది ఇళ్లలో నవ సౌభాగ్య శకం ప్రారంభమైంది. గతనెలలో ధన్‌తేరస్‌ రోజున కేంద్ర ప్రభుత్వం 75,000 మంది యువతకు నియామక లేఖల ప్రదానం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఈ ‘ఉపాధి సమ్మేళనమే’ నిదర్శనం.

మిత్రులారా!

   త నెలలో ‘ఉపాధి సమ్మేళనం’ ప్రారంభించిన సందర్భంగా వివిధ ఎన్‌డిఎ/బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ సమ్మేళనం నిర్వహిస్తాయని నేను మీ సమక్షంలో ప్రకటించాను. ఆ మేరకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది యువతకు గతనెలలో నియామక లేఖలు అందజేయడం సంతోషంగా ఉంది. కొద్ది రోజుల కిందటే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా చాలామంది యువకులకు నియామక లేఖలు పంపిణీ చేసింది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, దాద్రా-నగర్‌ హవేలీ, డామన్‌ డియ్యూ, చండీగఢ్‌లలో కూడా గత నెలలోనే వేలాది యువత ఉపాధి సమ్మేళనాల ద్వారా ఉద్యోగ నియామక లేఖలు అందుకున్నారు. అలాగే రేపు, ఆ మరునాడు అంటే నవంబర్ 24న గోవా ప్రభుత్వం కూడా ఇదే తరహాలో సమ్మేళనం నిర్వహించబోతున్నట్లు చెప్పాను. అలాగే త్రిపుర ప్రభుత్వం కూడా నవంబర్ 28న ఉపాధి సమ్మేళనం నిర్వహిస్తోంది. ఇది రెండు ఇంజన్ల ప్రభుత్వం.. దీనితో రెట్టింపు ప్రయోజనం దక్కుతుంది. ‘ఉపాధి సమ్మేళనం’ ద్వారా దేశ యువతరానికి నియామక లేఖల ప్రదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది.

మిత్రులారా!

   భారత్‌ వంటి యువ దేశంలో మన కోట్లాది యువతరమే ఈ జాతికి అతిపెద్ద బలం. ఆ మేరకు దేశ నిర్మాణంలో మన యువత శక్తిని, ప్రతిభను గరిష్ఠంగా వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టినుంచీ దేశ నిర్మాణంలో భాగస్వాములు కానున్న 71,000 మంది యువతను స్వాగతిస్తున్నాను. ఇక మీ కృషితో, కఠినమైన పోటీలో విజయం సాధించి మీరు ఈ నియామక స్థానాలను సాధించారు. అందువల్ల మీతోపాటు మీ కుటుంబ సభ్యులు కూడా అభినందనకు అర్హులే.

నా యువ మిత్రులారా!

   మీరు ఒక ప్రత్యేక సమయంలో ఈ కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దేశం ఇప్పుడు ‘అమృత్ కాలం’ (స్వర్ణయుగం)లో ప్రవేశించింది. దేశ ప్రజలు ఈ ‘స్వర్ణ యుగం’లో ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞబూనారు. దీన్ని నెరవేర్చడంలో మీరంతా దేశానికి రథసారథలు కానున్నారు. మీరు చేపట్టబోయే కొత్త బాధ్యతలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులవుతున్నారు. కాబట్టి, మీ విధి నిర్వహణలో మీ పాత్రను చక్కగా అర్థం చేసుకోవడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగిగా మీ సేవలు అందించడంలో సామర్థ్యం పెంపుపై మీరు నిరంతరం దృష్టి సారించాలి. నేడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సాంకేతిక పరిజ్ఞానంసహా మెరుగైన శిక్షణ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇటీవల ప్రారంభించిన సాంకేతిక వేదిక ‘కర్మయోగి భారత్’లో అనేక ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీలాంటి కొత్త ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇవాళ ఓ ప్రత్యేక కోర్సు కూడా ప్రారంభం కానుంది. దీనికి ‘కర్మయోగి ప్రారంభ్‌’గా నామకరణం చేశాం. ‘కర్మయోగి భారత్’ వేదికపై అందుబాటులోగల ఆన్‌లైన్ కోర్సుల నుంచి మీరు గరిష్ఠ ప్రయోజనం పొందాలి. ఎందుకంటే ఇది మీ నైపుణ్యాల ఉన్నతీకరణకే కాకుండా భవిష్యత్తులో మీ ఎదుగుదలకూ ఉపయోగపడుతుంది.

మిత్రులారా!

   ప్రపంచ మహమ్మారితోపాటు కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త యువత ముందు ఇవాళ సంక్షోభం నడుమ కొత్త అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ భారీ సంక్షోభం తప్పదని చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారతదేశం తన ఆర్థిక సామర్థ్యం ప్రదర్శించడానికి, కొత్త అవకాశాల తలుపులు తెరవడానికి ఒక ప్రత్యేక వెసులుబాటు ఉందని ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా చెబుతున్నారు. సేవల పరంగా ఎగుమతులలో భారతదేశం నేడు ప్రపంచంలోనే ప్రధాన శక్తిగా అవతరించింది. దీంతో ఇప్పుడు భారతదేశం కూడా ప్రపంచ తయారీ కేంద్రంగా మారనుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా మేము అమలు చేస్తున్న సరికొత్త ‘ఉత్పాదకాధారిత ప్రోత్సాహక పథకం’ (పీఎల్‌ఐ), ఇతరత్రా పథకాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. తదనుగుణంగా భారత నిపుణ మానవశక్తి, యువతరం దీనికి కేంద్రకంగా ఉంటాయి. ‘పీఎల్‌ఐ’ ద్వారానే దేశంలో దాదాపు 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్థానికం కోసం స్వగళం’ లేదా ‘స్థానికం నుంచి ప్రపంచం’ వంటి కార్యక్రమాలేవైనా దేశంలో ఉపాధి, స్వయం ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అంటే- ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో కొత్త ఉద్యోగాలకు అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా.. యువతకు వారి సొంత నగరాలు, గ్రామాల్లో ఇవి సృష్టించబడుతున్నాయి. దీంతో వారు ఇతర నగరాలకు వలస వెళ్లే అవసరం ఉండదు కాబట్టి, తమ స్వస్థలాల అభివృద్ధికీ తోడ్పడగలుగుతున్నారు.

   నేడు భారతదేశంలో యువతకు అంకుర సంస్థల నుంచి స్వయం ఉపాధి వరకూ, అంతరిక్షం నుంచి డ్రోన్లదాకా అనేకవిధాలైన కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి. ఆ మేరకు ఇవాళ దేశంలోని 80,000కుపైగా అంకుర సంస్థలు వివిధ రంగాల్లో తమ సామర్థ్యం నిరూపించుకునే దిశగా యువతకు అవకాశాలిస్తున్నాయి. ఇక దేశంలో మందుల సరఫరా, పురుగుమందుల పిచికారీ, స్వామిత్వ పథకంలో భూముల మ్యాపింగ్, రక్షణ రంగం సహా అన్నింటా డ్రోన్ల వినియోగం నిరంతరం పెరుగుతోంది. డ్రోన్ల వాడకం పెరగడంతో యువతకు కొత్త ఉద్యోగాలు అందివస్తున్నాయి. అంతరిక్ష రంగంలో అందరికీ అవకాశాల దిశగా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యువతకూ ఎంతో మేలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగం తన తొలి రాకెట్‌ ప్రయోగంలో ఎలా విజయం సాధించిందో 2-3 రోజుల కిందటే మనమంతా చూశాం.

   క తమదైన వ్యాపారం ప్రారంభించాలని కలలుగనేవారికీ ఇవాళ ముద్ర రుణాల రూపంలో ఎనలేని సాయం లభిస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా దేశంలో 35 కోట్లకుపైగా ముద్రా రుణాలు మంజూరు చేయబడ్డాయి. దేశంలో ఆవిష్కరణలు-పరిశోధనలకు ప్రోత్సాహం కూడా ఉపాధి అవకాశాలను పెంచుతోంది. దేశవ్యాప్తంగా యువత ఈ కొత్త అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ఇవాళ నియామక లేఖలు అందుకున్న 71,000 మందికిపైగా యువతకు మరోసారి నా అభినందనలు, శుభాకాంక్షలు. మీ సామర్థ్యం పెంచుకోవడంలో మీరు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టబోరని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేటి నియామక లేఖ మీకు ప్రవేశ ద్వారం. అంటే- ఇప్పుడు మీ ఎదుట ఓ కొత్త ప్రగతి ప్రపంచం ఆవిష్కృతమైంది. ఆ మేరకు ఒకవైపు పనిచేస్తూనే మరొకవైపు నైపుణ్యార్జన ద్వారా మిమ్మల్ని మీరు మరింత యోగ్యులుగా మార్చుకోండి, మీ సీనియర్ల నుంచి మంచి అంశాలను అనుసరించడం ద్వారా మీ సామర్థ్యం పెంచుకోండి.

మిత్రులారా!

   మీ తరహాలోనే నేను కూడా నిరంతరం నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాలోని విద్యార్థిని జీవితాంతం ప్రోత్సహిస్తూను ఉంటాను. నేను అందరినుంచీ నేర్చుకుంటాను.. ప్రతి చిన్న విషయం నుంచీ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఫలితంగా ఏకకాలంలో అనేక పనులు చేయడానికి నేనెప్పుడూ వెనుకాడకపోవడమేగాక.. అలా చేయగలుగుతున్నాను. మీరు కూడా ఇలా చేయొచ్చు… కాబట్టి ‘కర్మయోగి భారత్’తో మీరంతా సంధానితులు కావాలని కోరుకుంటున్నాను. మీ ఆన్‌లైన్ శిక్షణానుభవం గురించి ఓ నెల తర్వాత మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరా? ఆ మేరకు లోపాలేవైనా ఉంటే వాటి గురించి.. శిక్షణను మరింత మెరుగుపరచడం గురించీ మీ సూచనలివ్వండి. మీ స్పందన కోసం నేను ఎదురుచూస్తుంటాను. చూడండి.. మనమంతా భాగస్వాములం, సహచరులం, సహ ప్రయాణికులం. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమంతా ఒక రుజుమార్గంలో అడుగు వేస్తున్నాం. తదనుగుణంగా మనమంతా సమష్టిగా ముందడుగు వేయడానికి సంకల్పం పూనుదాం. మీకు అనేకానేక శుభాకాంక్షలు!

అనేకానేక ధన్యవాదాలు.

ప్రమేయ నిరాకరణ: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం.. అసలు ప్రసంగం హిందీలో ఇవ్వబడింది.

 

******



(Release ID: 1879676) Visitor Counter : 128