ప్రధాన మంత్రి కార్యాలయం
ఉగ్రవాదానికి ఆర్థికసాయం నిరోధం దిశగా న్యూఢిల్లీలో ‘ఉగ్రవాదానికి నిధుల నిషేధం’పై 3వ మంత్రాంగ సమావేశంలో పాల్గొన్న పధానమంత్రి
“ఒక్క దాడినైనా అనేకమైనవిగా భావిస్తాం.. ఒక్క ప్రాణం పోయినా అనేకంతో సమానమే.. కాబట్టి ఉగ్రవాదం అంతు చూసేదాకా మేం విశ్రమించేది లేదు”;
“ఉగ్రవాదంలో మంచిచెడులనే తేడాలేదు... దానికి హద్దులేవీ
ఉండవు.. అది మానవత్వం.. స్వేచ్ఛ.. నాగరికతలపై దాడి”;
“ఏకరూప.. సమష్టి.. అత్యంత కఠిన విధానాలతోనే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం”;
“ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాల నుంచి నష్టపరిహారం రాబట్టాలి”;
“సరికొత్త ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలపై సమష్టి అవగాహన అవసరం”;
“విద్వేషం నూరిపోతకు మద్దతిచ్చే ఎవరికైనా.. ఏ దేశంలోనూ చోటు ఉండరాదు”
Posted On:
18 NOV 2022 11:09AM by PIB Hyderabad
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో ఎలాంటి సందిగ్ధాలకూ తావుండరాదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదం ఎగదోతను విదేశాంగ విధానానికి ఉపకరణంగా వాడుకునే దేశాలను దూరం పెట్టాల్సి ఉందని కూడా హెచ్చరించారు. ఈ మేరకు ఉగ్రవాదానికి ఆర్థికసాయం నిరోధం దిశగా న్యూఢిల్లీలో ‘ఉగ్రవాదానికి నిధుల నిషేధం’ (ఎన్‌ఎంఎఫ్‌టి)పై ఇవాళ నిర్వహించిన 3వ మంత్రాంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఈ సమావేశం నిర్వహణకుగల ప్రాధాన్యాన్ని ప్రధాని వివరించారు.
ఉగ్రవాద తీవ్రతను ప్రపంచం పరిగణనలోకి తీసుకోవడానికి ముందే భారతదేశం దాని వికృతరూపాన్ని చూడగలిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. “ఉగ్రవాదం బహు రూపాల్లో, అనేక పేర్లతో భారత్‌ను దెబ్బతీయడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది” అని స్పష్టం చేశారు. అమూల్యమైన వేలాది ప్రాణాలను కోల్పోయినప్పటికీ ఉగ్రవాదంపై భారత్ సాహసోపేతంగా పోరాడుతున్నదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దృఢంగా వ్యవహరిస్తున్న భారతదేశంతో, ప్రజలతో సంభాషించేందుకు ఈ సమావేశ ప్రతినిధులందరికీ ఇదొక అందివచ్చిన అవకాశమని ప్రధాని నొక్కిచెప్పారు. “ఒక్క దాడినైనా అనేకమైనవిగా భావిస్తాం. ఒక్క ప్రాణం పోయినా మాకు అనేక మందిని కోల్పోవడంతో సమానం. కాబట్టి ఉగ్రవాదం అంతు చూసేదాకా మేం విశ్రమించేది లేదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సమావేశం ప్రాముఖ్యాన్ని పునరుఉద్ఘాటిస్తూ- ఉగ్రవాదం మానవాళి మొత్తంపైనా దుష్ప్రభావం చూపుతున్నందున ఈ భేటీని మంత్రాంగ సమావేశంగా మాత్రమే చూడరాదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద దీర్ఘకాలిక ప్రభావం పేదలపైనా, స్థానిక ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రస్థాయిలో ఉంటుందనని ఆయన చెప్పారు. “పర్యాటకం లేదా వాణిజ్యం- రంగం ఏదైనా కావచ్చు.. నిరంతర ముప్పుగల ఉన్న ప్రాంతాల సందర్శనకు ఎవరూ ఇచ్చగించరు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఉగ్రవాద ఆర్థిక మూలాలపై చావుదెబ్బ కొట్టడం అత్యంత అవసరమని ఆయన సూచించారు.
ఉగ్రవాదంపై పోరులో సందిగ్ధాలకు ఏమాత్రం తావుండరాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై అసంబంద్ధ భావనలున్నాయంటూ- “విభిన్న ఉగ్రవాద దాడులపై స్పందనలో తీవ్రత అవి జరిగిన ప్రదేశం ఆధారంగా విభిన్నంగా ఉండరాదు. అన్నిరకాల ఉగ్రదాడులపై ఒకేవిధంగా స్పందించాలి... చర్యలు చేపట్టాలి” అన్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదంపై చర్యల నిరోధం దిశగా దానికి మద్దతిస్తూ పరోక్ష వాదనలు కూడా వినిపిస్తుంటాయని చెప్పారు. అందువల్ల అంతర్జాతీయంగా ముప్పున్న ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి సందిగ్ధానికీ చోటు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు “ఉగ్రవాదంలో మంచిచెడులనే తేడాలేదు. దానికి హద్దులేవీ ఉండవు.. దాన్ని మానవత్వం.. స్వేచ్ఛ.. నాగరికతలపై దాడిగానే పరిగణించాలి” అంటూ- “ఏకరూప, సమష్టి, అత్యంత కఠిన విధానాలతోనే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం” అని ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టారు.
ఉగ్రవాది, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో వ్యత్యాసాన్ని వివరిస్తూ- ఒక ఉగ్రవాదిని ఆయుధంతో, తక్షణ వ్యూహాత్మక స్పందనతో మట్టుపెట్టవచ్చు. కానీ, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయగల విస్తృత వ్యూహం లేనప్పుడు తక్షణ వ్యూహ ప్రయోజనాలు నిరర్ధకమైపోతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఉగ్రవాద కేవలం ఒక వ్యక్తి.. కానీ, ఉగ్రవాదం అనేకమంది వ్యక్తులతో కూడిన ఒక విషవలయం” అని ఆయన స్పష్టం చేశారు. ఎదురుదాడి అత్యుత్తమ స్వీయ రక్షణ రూపం. అదే సమయంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగించడాననికి భారీ, చురుకైన వ్యూహాత్మక స్పందన అవశ్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. మన పౌరుల భద్రత దిశగా మనం ఉగ్రవాదులను వెంటాడాలి.. వారికి మద్దతిచ్చే నెట్‌వర్కుల వెన్ను విరవాలి.. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్దాలి.. అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.
కొన్ని దేశాలనుంచి ఉగ్రవాదానికి లభిస్తున్న మద్దతే దానికి ప్రధాన రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక వనరుగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయా దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాయని చెప్పారు. ప్రచ్ఛన్న యుద్ధాల పట్ల అంతర్జాతీయ సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. “ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాల నుంచి నష్టపరిహారం రాబట్టాలి. ఉగ్రవాదులపై సానుభూతి దిశగా పనిచేసే సంస్థలు, వ్యక్తులను ఏకాకులను చేయాలి. ఇటువంటి విషయాల్లో ఏ మాత్రం తటపటాయింపు ఉండరాదు. ఉగ్రవాదానికి అన్నిరకాల బహిరంగ-రహస్య మద్దతును అంతం చేసేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
వ్యవస్థీకృత నేరాలు కూడా ఉగ్రవాదానికి నిధులందే వనరుగా ఉండటాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. నేరముఠాలు, ఉగ్రవాద సంస్థలకు లోతైన సంబంధాలున్నాయని ఆయన నొక్కిచెప్పారు. “ఉగ్రవాదంపై యుద్ధంలో వ్యవస్థీకృత నేరాల మీద కఠినచర్యలు చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అక్రమార్జన చలామణీ, ఆర్థిక నేరాలవంటి కార్యకలాపాలు కూడా ఉగ్రవాద నిధులకు మూలాలుగా ఉంటాయి. దీనిపై పోరాటంలో ప్రపంచ దేశాలమధ్య సహకారం అవసరం” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సంక్లిష్ట వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- అక్రమ నిధుల ప్రవాహ నిరోధం, గుర్తింపు, విచారణలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఆర్థిక కార్యాచరణ బృందం, ద్రవ్య నిఘా సంస్థలు, మరియు ఎగ్మాంట్ కూటమి మధ్య సహకారం పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఈ చట్రం రెండు దశాబ్దాల నుంచి అనేక విధాలుగా సాయపడుతున్నదని ప్రధానమంత్రి వివరించారు. “ఉగ్రవాదానికి నిధుల ముప్పుపై అవగాహనలోనూ తోడ్పడుతుంది” అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ముందంజ వేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాద చర్యల రూపురేఖలు కూడా మారుతుండటాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “ఉగ్రవాదానికి నిధులు, కొత్త సభ్యుల నియామకంలో కొత్తరకం పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ‘డార్క్ నెట్’, ప్రైవేట్ కరెన్సీసహా మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలపై సమష్టి అవగాహన అవసరం ఈ కృషిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతన సాంకేతికతను ఒక భూతంగా చూడరాదని హితవు చెబుతూ- ఉగ్రవాదం జాడ తీసి, గుర్తించి, నిర్మూలించడానికి మనం కూడా అదే సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రత్యక్ష, సాదృశ సహకారం ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సైబర్ ఉగ్రవాదం, ఆన్‌లైన్ విద్వేష బోధకు ఉపయోగించే మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో కొన్ని ముష్కర సంస్థలు మారుమూల ప్రాంతాల నుంచే ఆయుధాల సరఫరాసహా ఆన్‌లైన్ వనరులతో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాయని గుర్తుచేశారు. “కమ్యూనికేషన్స్, ప్రయాణం, లాజిస్టిక్స్ - వివిధ దేశాలలో ఈ గొలుసుకు అనేక లంకెలున్నాయి” అని వెల్లడించారు. ప్రతి దేశం తమ పరిధిలోగల ఈ గొలుసు అంతర్భాగాలను విచ్ఛిన్నం చేయాలని ప్రధానమంత్రి సూచించారు.
వివిధ దేశాల్లో చట్టాలపరమైన సూత్రాలు, విధానాలు, ప్రక్రియల్లోని వ్యత్యాసాలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేయకుండా చూడాలని ప్రధానమంత్రి హెచ్చరించారు. “ప్రభుత్వాల మధ్య లోతైన సమన్వయం, అవగాహనతో ఈ ముప్పును నివారించవచ్చు. సంయుక్త కార్యకలాపాలు, నిఘా సమన్వయం, ఉగ్రవాదుల అప్పగింత వగైరాలు ఉగ్రవాదంపై యుద్ధంలో ఎంతగానో తోడ్పడతాయి” అని ఆయన స్పష్టం చేశారు. విద్వేష బోధ, ఉగ్రవాద బెడదను సంయుక్తంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. “విద్వేషం నూరిపోతకు మద్దతిచ్చే ఎవరికైనా ఏ దేశంలోనూ స్థానం ఉండరాదు” అని ఆయన అన్నారు.
చివరగా... ఉగ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సహకారం పెంపు దిశగా భారత్ ఇటీవల చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రతినిధులకు వివరించారు. భద్రత సంబంధిత వివిధ కోణాలపై పలు సమావేశాల గురించి వివరిస్తూ- ముంబైలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రత్యేక భేటీ, న్యూఢిల్లీలో ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశం తదితరాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ‘ఉగ్రవాదానికి నిధుల నిషేధం’ ఇతివృత్తంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశం ద్వారా ఉగ్రవాదానికి ఆర్థిక వనరుల నిరోధంపై అంతర్జాతీయ అప్రమత్తత పెంపునకు భారత్ తోడ్పాటునిస్తోందని ఆయన అన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ దినకర్ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ సమావేశం నవంబరు 18వ తేదీన ప్రారంభం కాగా 19 తేదీవరకూ కొనసాగుతుంది. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం నిరోధంలో ప్రస్తుత అంతర్జాతీయ యంత్రాంగం సామర్థ్యం, కొత్తగా తలెత్తే సవాళ్ల పరిష్కార మార్గాలపై చర్చకు ఈ ఇదొక విశిష్ట వేదికగా నిలుస్తుంది. అలాగే లోగడ జరిగిన రెండు సమావేశాల (పారిస్- ఏప్రిల్ 2018; మెల్‌బోర్న్, నవంబర్ 2019) ద్వారా ఒనగూడిన ప్రయోజనాలు, పర్యవసానాలపై ప్రస్తుత సమావేశం చర్చిస్తుంది. అలాగే ఉగ్రవాదులకు ఆర్థిక సహాయ నిరోధం, ఆ దిశగా కార్యకలాపాలకు ఆమోద పరిధుల లభ్యతపై ప్రపంచ సహకారం పెంపు దిశగా కృషి చేస్తుంది. మంత్రులు, బహుపాక్షిక సంస్థల అధిపతులు, ద్రవ్య కార్యాచారణ బృందం (ఎఫ్‌ఏటీఎఫ్) ప్రతినిధులు సహా ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా- ‘ఉగ్రవాదం-ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతలో అంతర్జాతీయ ధోరణులు’, ‘ఉగ్రవాదం కోసం అధికారిక-అనధికారిక నిధుల వినియోగం’, ‘ఆధునిక సాంకేతికతలు-ఉగ్రవాదానికి నిధులు’ సహా ‘ఉగ్రవాదానికి నిధుల నిరోధంపై పోరులో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారంపై దృష్టి’ ప్రధానాంశాలుగా నాలుగు రకాల చర్చాగోష్ఠి జరుగుతుంది.
******
(Release ID: 1877702)
Visitor Counter : 295
Read this release in:
Hindi
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam