ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజి లాకర్ వినియోగదారులు ఇప్పుడు తమ ఆరోగ్య రికార్డులను డిజిటల్ గా నిల్వ చేసుకుని, వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా (ఏ.బి.హెచ్.ఏ) తో లింక్ చేయవచ్చు.
Posted On:
10 NOV 2022 12:04PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రామాణికమైన పత్రాల మార్పిడి వేదిక - డిజిలాకర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏ.బి.డి.ఎం) తో దాని ద్వితీయ-స్థాయి ఏకీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. సురక్షిత క్లౌడ్ ఆధారిత నిల్వ వేదిక - డిజి లాకర్ ను, ఇప్పుడు టీకా రికార్డులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీలు మొదలైన ఆరోగ్య రికార్డులను నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు చూసుకోడానికి హెల్త్ లాకర్ గా ఉపయోగించుకోవచ్చు.
డిజిలాకర్ ఇంతకుముందు ఏ.బి.డి.ఎం. తో మొదటి స్థాయి అనుసంధానం పూర్తి చేసింది. దీనిలో దాని 13 కోట్ల మంది వినియోగదారుల కోసం ఏ.బి.హెచ్.ఏ. లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా సృష్టి సౌకర్యాన్ని జోడించడం జరిగింది. తాజా అనుసంధానం ఇప్పుడు డిజి లాకర్ ను వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల (పి.హెచ్.ఆర్) యాప్ గా ఉపయోగించుకునేలా వినియోగదారులను అనుమతిస్తుంది. దీనికి అదనంగా, ఏ.బి.హెచ్.ఏ. ఖాతా కలిగిన వారు తమ ఆరోగ్య రికార్డులను వివిధ ఏ.బి.డి.ఎం. నమోదిత ఆసుపత్రులు, ల్యాబ్ ల నుండి అనుసంధానం చేసుకోవచ్చు, వాటిని డిజి లాకర్ ద్వారా అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. వినియోగదారులు తమ పాత ఆరోగ్య రికార్డులను యాప్ లో స్కాన్ చేసి అప్ లోడ్ చేయవచ్చు. ఆ తర్వాత, వారు ఎంచుకున్న రికార్డులను ఏ.బి.డి.ఎం. నమోదిత ఆరోగ్య సంరక్షణ నిపుణులతో పంచుకోవచ్చు.
జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ (ఎన్.హెచ్.ఏ) సి.ఈ.ఓ. డాక్టర్ ఆర్.ఎస్. శర్మ, ఈ అనుసంధానం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనం గురించి ప్రముఖంగా తెలియజేస్తూ, “ఏ.బి.డి.ఎం. కింద, మేము పరస్పరం పనిచేసే ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. ఏ.బి.డి.ఎం తో అనుసంధానించబడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వాములకు చెందిన వివిధ యాప్ లు మరింత మంది వినియోగదారులకు ఈ పథకం పరిధిని విస్తరించడంలో, మరిన్ని కార్యాచరణలను జోడించడంలో సహాయపడుతున్నాయి. డిజి లాకర్ అనేది ప్రామాణికమైన పత్రాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోడానికి వీలుగా భద్రపరచుకునే విశ్వసనీయమైన ప్రసిద్ధ యాప్. అందువల్ల, వినియోగదారులు ఇప్పుడు దీనిని పి.హెచ్.ఆర్. యాప్ గా ఉపయోగించడంతో పాటు కాగితం రహితంగా రికార్దులను భద్రపరచుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందడం వలన ఇది ఒక ముఖ్యమైన పరిణామం." అని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అభిషేక్ సింగ్, అనుసంధానం గురించి మాట్లాడుతూ, “మా 130 మిలియన్ల మంది నమోదిత వినియోగదారులందరికీ ఏ.బి.డి.ఎం. ప్రయోజనాలను విస్తరించడం మాకు గర్వకారణం. ఈ వేదిక ఇప్పటికే దాదాపు 85 వేల ఏ.బి.హెచ్.ఏ. నంబర్లను రూపొందించడంలో సహాయపడింది. హెల్త్ లాకర్ అనుసంధానంతో, ఎక్కువ మంది వ్యక్తులు తమ ఆరోగ్య రికార్డులను డిజిటల్ గా సులభంగా లింక్ చేయగలరని, నిర్వహించగలరని మేము భావిస్తున్నాము. ఏ.బి.హెచ్.ఏ. వినియోగదారులకు ప్రాధాన్య ఆరోగ్య లాకర్ గా ఉండాలనే లక్ష్యంతో డిజి లాకర్ రూపొందించడం జరిగింది." అని వివరించారు.
డిజి లాకర్ నమోదిత వినియోగదారులందరికీ ఇప్పుడు హెల్త్ లాకర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
*****
(Release ID: 1875045)
Visitor Counter : 213